
‘సర్’ వివాదాన్ని తీవ్రతరం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందా?
సీఈసీ, మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్
దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక విస్తృత సవరణపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. నిన్న సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమటీ(సీడబ్ల్యూసీ), ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ ను తక్షణమే వైదొలగాలని డిమాండ్ చేసింది. అలాగే ప్రధాని, హోంమంత్రి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
"మోదీ, అమిత్ షాల తరఫున సీఈసీ ఓట్ల దొంగతనాన్ని నిర్వహించారు" అని కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానంతో బుధవారం జరగనున్న ఇండి కూటమి సమావేశానికి దిశా నిర్దేశం చేసింది. 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' ఇటీవల వెల్లడించిన విషయాల నేపథ్యంలో, కేంద్రానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఐక్య ఇండి కూటమి ప్రచారాన్ని రూపొందించేందుకు, జూన్ 8 తర్వాత ప్రతిపక్ష కూటమి అగ్ర నాయకత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఎస్ఐఆర్ పై వివాదం...
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్ పై సీఈసీ తీసుకున్న నిర్ణయాలను ఇతర ఎన్నికల కమిషనర్లు అయిన వివేక్ జోషి, సంధూ దాదాపు 14 సార్లు వ్యతిరేకించారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రచురించింది. దీనితో సీఈసీ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కమిషన్ కోట్లాది ఓట్లను తొలగిస్తుందని, వెంటనే సర్ ను నిలిపివేయాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. అనేక చట్టబద్దమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
గత సంవత్సరం బీహార్లో మొదలైనప్పటి నుంచి ప్రతిపక్షాలు ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఇండి కూటమి దారుణంగా ఓటమి పాలైంది. ఈ విషయం బయటపడటంతో ఈసీ కూడా కాస్త వెనకడుగు వేసింది. మా మధ్య బేదాభిప్రాయాలే నిజమే అని, కానీ నిర్ణయాలన్నీ కూడా ఏకాభిప్రాయంతోనే తీసుకున్నట్లు వివరించింది. అయితే ఇవన్నీ కూడా ఇండి కూటమికి తమ విమర్శలను మరింత తీవ్రతరం చేయడానికి కొత్త ఆయుధాన్ని అందించింది.
ఇంతకుముందులా కాకుండా, కుమార్ ప్రతిపక్షాల విమర్శలకు వ్యక్తిగతంగా గర్వంతో కూడిన సవాళ్లు, ఖండనలతో సమాధానమిచ్చేవారు. ఇటీవలి విషయాలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సీఈసీ మీడియాకు దూరంగా ఉండటమే కాకుండా, తన సొంత సహచరుల నుంచే వ్యతిరేకతను ఎదుర్కొన్న తన నిర్ణయాల ముద్రను మరుగుపరచడానికి ఎస్ఐఆర్ ప్రక్రియలో అనేక కొత్త మార్పులు చేయవలసి వచ్చింది.
గతంలో మాదిరిగానే, సీఈసీని గట్టిగా సమర్థిస్తూ ఈ దుమారాన్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, ఈ వివాదంపై మోదీ, షాల మౌనం చెవులు చిల్లులు పడేలా ఉంది. పరీక్షా పత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా యువత చేసిన నిరసనలను కేంద్రం నిర్వహించిన తీరు, అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల దొంగతనం, యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ వంటి వరుస వివాదాల కారణంగా ఇటీవలి నెలల్లో మోదీ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఇప్పటికే దెబ్బతిన్న నేపథ్యంలో, ఈ తాజా ఈసీ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని ప్రతిపక్షాలు తమ ఆవేదనను వెళ్లగక్కడానికి ఒక అవకాశాన్ని పసిగట్టాయి.
ఇప్పటివరకు పార్టీ, విస్తృత ప్రతిపక్షం కేవలం కుమార్ను సీఈసీ పదవి నుంచి తొలగించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్న వివాదంలోకి మోదీ, షాలను లాగాలన్న సీడబ్ల్యూసీ నిర్ణయం, ఇండి కూటమిలోని అతిపెద్ద భాగస్వామి అయిన కాంగ్రెస్, ఎస్ఐఆర్ (SIR) అంశంపై తమ సామూహిక నిరసనను తీవ్రతరం చేయడానికి, ఆ నిందను ప్రధానమంత్రిపై మోపి, బుధవారం తన మిత్రపక్షాల ముందు వాదనలు వినిపించనుందనడానికి ఒక సూచన.
ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ ప్రయత్నం..
సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన ప్రారంభ ప్రసంగంలో కూడా ఇదే దిశగా సూచించారు. “పదేళ్ల క్రితం నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది ఇదే ప్రధానమంత్రేనని చరిత్ర చెబుతోంది. పదేళ్ల తర్వాత, ఓటుబందీ కుట్రతో ఇప్పుడు మన ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు... ఆయన చేసిన ఈ దుష్కార్యాల భారం ఎక్కువగా పేదలపైనే పడుతుంది.
నోట్ల రద్దు సమయంలో పేదలు వరుసలో నిలబడ్డారు, ఓటుబందీలో వారిని వరుస నుంచి బయటకు నెట్టేశారు. పేదలకు ఉన్న ఏకైక బలం వారి ఓటు. మోదీ దీనిని లాక్కోవాలని చూస్తున్నారు, కానీ మేము దానిని అనుమతించము,” అని సమావేశానికి హాజరైన 60 మందికి పైగా కాంగ్రెస్ నాయకులతో ఖర్గే అన్నారు.
రెండు గంటలకు పైగా సాగిన చర్చల అనంతరం సీడబ్ల్యూసీ ఆమోదించిన తీర్మానం నాలుగు కీలక డిమాండ్లను పేర్కొంది: “నైతిక, సంస్థాగత అధికారాన్ని పూర్తిగా కోల్పోయిన సీఈసీ తక్షణ రాజీనామా... ఎస్ఐఆర్ తక్షణ సస్పెన్షన్... ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 13.30 కోట్ల పేర్లను తక్షణమే పునరుద్ధరించడం”, “మన రాజ్యాంగం, కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామ్యం భద్రతను నిర్ధారించడానికి” మోదీ, షాల రాజీనామా చేయాలి.
ఇండి కూటమిలోని వర్గాలు తమ తమ పార్టీలు “కాంగ్రెస్ డిమాండ్లకు మద్దతుగా ఉన్నాయని” బుధవారం జరిగే కూటమి సీనియర్ నాయకుల సమావేశం “సీడబ్ల్యూసీ తీర్మానంలో ఇప్పటికే పేర్కొన్న అంశాలను మరింత ముందుకు తీసుకువెళ్లి, ఈ డిమాండ్లపై దేశవ్యాప్తంగా కొనసాగే ఉమ్మడి ఆందోళనకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందని” తెలిపాయి.
తదుపరి ఏం చేయాలి...
సీడబ్ల్యూసీ సమావేశంలో ఎప్పటిలాగే ముఖస్తుతి దృశ్యాలు కనిపించాయి. ఎస్ఐఆర్ ప్రారంభం కాకముందే పార్టీ ఓట్ల దొంగతనం ప్రచారానికి నాయకత్వం వహించినందుకు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఖర్గే, కేసీ వేణుగోపాల్ సహా పలువురు సభ్యులు పొగడ్తలతో ముంచెత్తారు. అయితే, ఇండి కూటమి సమావేశం మాత్రం, కూటమి ఆందోళనను ఎలా అమలు చేయాలనే అసలు విషయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
ఎన్నికల వ్యవస్థలోని అవకతవకలను ఎత్తిచూపడంలో నిస్సందేహంగా ప్రతిపక్షంలో అత్యంత స్థిరమైన నాయకుడిగా ఉన్న రాహుల్, ఈసీ గందరగోళంపై మోదీ, షాలను నేరుగా విమర్శల బాట పట్టించేందుకు బుధవారం నాటి సమావేశంలో తన పార్టీ తరపున ముందుండి నడిపిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
బెంగాల్ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన 8 వారాల తర్వాత, జూన్లో జరిగిన చివరి ఇండి బ్లాక్ సమావేశంలో కూడా రాహుల్ ఓటు దొంగతనానికి వ్యతిరేకంగా తీవ్రంగా మాట్లాడారు. మమతా బెనర్జీ, శివసేన-యూబీటీ అధినేత ఉద్ధవ్ థాకరే, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వంటి మిత్రపక్షాలతో, ఈసీ ద్వారా బీజేపీ ఎన్నికలను దొంగిలిస్తుందన్న విషయంలో వారికి ఇంకా కొంత అనుమానం ఉన్నప్పటికీ, తాను మాత్రం ఆ విషయంలో "వంద శాతం ఖచ్చితంగా ఉన్నానని" చెప్పారు.
ఓటర్లను కేంద్రంగా ఉంచడం...
ఎస్ఐఆర్ నిర్వహిస్తున్న తీరు, ఇప్పుడు రాహుల్ నుంచి కాకుండా మీడియా, ప్రభుత్వం నుండే వెలువడుతున్న విషయాలు ఎన్నికల నిష్పాక్షికతపై ఓటర్లలో సందేహాలను రేకెత్తిస్తున్నాయని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు (LoP) దృఢంగా భావిస్తున్నట్లు) ఒక సీనియర్ సీడబ్ల్యూసీ సభ్యుడు తెలిపారు.
ఇండి కూటమి సదస్సులో రాహుల్ కూడా ఇదే వాదనను వినిపించే అవకాశం ఉంది. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, "మా ప్రచారంలో ఓటరును కేంద్రంగా ఉంచే" విధంగా ఈసీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష వాదనలను రూపొందించడం ద్వారా, బీజేపీకి అనుకూలంగా ముందుగా నిర్ణయించిన ఫలితం కోసం వ్యవస్థ "మోసపూరితంగా" ఉందని నమ్మినప్పటికీ, భాగస్వామ్యం ద్వారా ఎన్నికలను ఎందుకు చట్టబద్ధం చేస్తోందనే ప్రశ్నలను ఇండి బ్లాక్ తప్పించుకోగలదు. సీడబ్ల్యూసీ చర్చల గురించి మీడియాకు వివరించిన కాంగ్రెస్ నాయకులు జైరామ్ రమేష్, కేసీ వేణుగోపాల్, ఎన్నికలను బహిష్కరించడానికి ప్రతిపక్షం విముఖత చూపుతోందన్న ప్రశ్నలను దాటవేసి సరిగ్గా అదే చేశారు.
దానికి బదులుగా, ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాతాన్ని కాపాడటానికి, వయోజన ఓటర్ల ఓటు హక్కును పరిరక్షించడానికి పోరాడటం ప్రతిపక్షం నైతిక బాధ్యత అని వారు నొక్కి చెప్పారు.
Next Story

