
ఎన్నికల సంఘం విశ్వసనీయతపై నీలినీడలు..
జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంతో రాజకీయ దుమారం!
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన ఎన్నికల సంఘం ఇప్పుడు తన విశ్వసనీయతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై సొంత కమిషన్‌లోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయన్న వార్తలు, రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక చర్చకు దారితీశాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్), కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాలు ఇప్పుడు ఎన్నికల సంఘం నిష్పక్షపాతంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యుల్లో ఇద్దరైన సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. గత పది నెలల్లో కనీసం 14 సార్లు వివిధ నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. తమకు సమాచారం ఇవ్వకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, ఓటర్ల జాబితాల నిర్వహణలో రాష్ట్ర స్థాయి అధికారుల పాత్రను తగ్గించేలా చర్యలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6లో మార్పులు వివాదానికి కేంద్రంగా మారాయి. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వ్యక్తి లేదా వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల పేర్లు గత ఓటర్ల జాబితాలో ఉన్నాయా అనే వివరాలను అడిగేలా ఫారంలో మార్పులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మార్పులకు అవసరమైన అనుమతులు ఉన్నాయా లేదా అన్నదానిపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
అదే సమయంలో, ఓటర్ల జాబితాల డేటాబేస్‌ను కేంద్రీకరించడం వల్ల రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులు తమ విధులను స్వతంత్రంగా నిర్వహించలేకపోతున్నారన్న ఆందోళనలు కూడా తెరపైకి వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ కింద తొలగించిన ఓటర్ల పేర్లకు సంబంధించిన అప్పీళ్ల వ్యవహారంలోనూ ప్రశ్నలు తలెత్తాయి. న్యాయాధికారులు చేర్చిన ఓటర్ల పేర్లను తొలగించాలని కోరుతూ ఎన్నికల సంఘం తరఫున అప్పీళ్లు ఎవరి అనుమతితో దాఖలు చేశారన్నది స్పష్టత లేని అంశంగా మిగిలింది.
ఈ పరిణామాలతో కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు జ్ఞానేశ్ కుమార్‌పై విమర్శలు తీవ్రం చేశాయి. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలని, ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా చూడాలని డిమాండ్ చేశాయి. కొన్ని పార్టీలు ఆయనను పదవి నుంచి తొలగించాలని కూడా కోరాయి.
అయితే, ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలు కమిషన్ ఏకగ్రీవ ఆమోదంతోనే తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు, సెప్టెంబర్‌లో ముగ్గురు కమిషనర్లు సమావేశమై వివాదంపై చర్చించారు. ఓటర్ల జాబితాలో వివరాలపై సందేహాలు ఉన్నవారి ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి పత్రాలు సేకరించేలా ప్రక్రియను సులభతరం చేయడం వంటి చర్యలను కూడా ప్రకటించారు.
ఇదిలా ఉండగా, అక్టోబర్ 5న సుప్రీంకోర్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ నిర్ణయాలపై వచ్చిన పిటిషన్లను విచారిస్తూ, వివాదాస్పద ఫారం-6 మార్పులకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే, విచారణ పూర్తయ్యే వరకు జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న మధ్యంతర అభ్యర్థనకు కోర్టు అంగీకరించలేదు.
మొత్తంగా, ఎన్నికల సంఘం అంతర్గతంగా తీసుకున్న నిర్ణయాలు, వాటిపై వ్యక్తమైన అభ్యంతరాలు ఇప్పుడు సంస్థ విశ్వసనీయతపై విస్తృత చర్చకు దారితీశాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరోపణలపై స్పష్టత ఇవ్వడం, ఓటర్ల హక్కులను కాపాడటం, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టడం ఎన్నికల సంఘానికి కీలకంగా మారాయి.

