
సౌదీ హౌతీల ఘర్షణ, ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంతో పోల్చకూడదా?
సున్నీ- షియా పోరాటంగా మారిపోయిందా?
గల్ఫ్ లో యుద్దం కొత్తరూపు దాల్చుతోంది. యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీపై దాడులకు దిగారు. సౌదీ- హౌతీ మధ్య జరుగుతున్న సంఘర్షణను, ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను కలపడం అనేది రెండు వేర్వేరు అంశాలకు ఒక్కటిగా చూడటం లాంటిది. కొత్త సంఘర్షణ ఈ ప్రాంతాన్ని మరోసారి అస్థిరపరిచి, ప్రపంచాన్ని కొత్త సంక్షోభంలోకి నెట్టడానికి దారి తీస్తోంది.
యెమెన్ తిరుగుబాటు...
ముస్లిం ప్రపంచంలో 2011 లో సంభవించిన అరబ్ విప్లవం లేదా జాస్మిన్ విప్లవం అరబ్ పాలకుల గుండెల్లోనూ భయం పుట్టించింది. అది అప్పటికే ఈజిప్ట్, ట్యూనిషియాలో విజయవంతంగా ముగిశాయి. ఇదే సమయంలో యెమెన్ లోనూ ఇవి క్రమంగా బలం పుంజుకున్నాయి.
యెమెన్ ను అప్పటికే మూడు దశాబ్దాలుగా అలీ అబ్దుల్లా సలేహ్ పాలనలో ఉంది. ఆయన సున్నీ తెగకు చెందిన వాడు. ఆయన వ్యతిరేకంగా జరిగిన నిరసనలో హూతీ తెగ ముఖ్యపాత్ర పోషించింది. వారు షియా తెగకు చెందినవారు. దీని ఫలితంగా సౌదీ అరేబియా ఇందులో ప్రవేశించి సలేహ్ స్థానంలో ఆయన డిప్యూటీ అయిన అబ్దరబ్బూ మన్సూర్ హాదీ పగ్గాలు చేపట్టారు.
హౌతీలు.. సలేహ్...
అధికారం కోల్పోయిన తరువాత సలేహ్ రాజధాని సనా వైపు వస్తున్న హౌతీలతో చేతులు కలిపాడు. చివరి హాదీ ప్రభుత్వాన్ని కూలదోశారు. హదీ తన మంత్రివర్గం మొత్తం, ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి దక్షిణాన ఉన్న మరో ముఖ్యపట్టణమైన ఏడెన్ కు పారిపోయారు. రాజధానిలో హౌతీలు అధికారం చేజిక్కించుకున్నారు. సలేహ్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
తరువాత సౌదీలు తిరిగి సలేహ్ తో చర్చలు ప్రారంభించారు. కానీ ఇరు పక్షాల మధ్య రాజీ కుదరలేదు. కానీ దీనిని ద్రోహంగా భావించిన హౌతీలు సలెహ్ ను హత్య చేశారు. దీనితో హౌతీలకు, సౌదీ మద్దతు ఉన్న హాదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మధ్య యుద్ధం చెలరేగింది.
యూఏఈ, సౌదీలతో చేతులు కలిపింది. యూకే, యూఎస్ లతో కూడిన పాశ్చాత్య కూటమి వారిక ఆయుధ, ఆర్థిక సాయం అందించింది. హౌతీలకు ఇరాన్ మద్దతు ప్రకటించింది. మొత్తానికి ఇది సున్నీ, షియాల వార్ గా మారింది.
హౌతీలు ఎప్పుడైతే ఇరాన్ ప్రాక్సీగా మారారో ప్రతిఘటన మరింత తీవ్రం అయింది. అప్పటికే టెహ్రాన్ అధీనంలో హమాస్, హిజ్ బుల్లా ఉండగా, కొత్తగా హౌతీలు చేరారు. వీరికి సిరియా నుంచి కూడా సాయం అందింది.
ఇది పూర్తిగా షియా ఆధిపత్య కూటమిగా మారింది. 2015 నుంచి వరుసగా ఏడు సంవత్సరాలు సౌదీ, హౌతీ తిరుగుబాటుదారులపై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ మద్దతుతో హౌతీలు కూడా ఎదురుదాడికి దిగారు.
యెమెన్ లో మానవతా సంక్షోభం..
ఈ యుద్ధంలో యెమెన్ లో మానవతా సంక్షోభం తారా స్థాయికి తీసుకెళ్లింది. భూమి మీద నరకం అనేది యెమెన్ లోనే ఉందని ఐరాస వంటి సంస్థలు ప్రకటించాయి. యుద్ధం కారణంగా ఐదు మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అక్కడున్న 41 మిలియన్ల ప్రజలలో సగం మందికి తక్షణ సాయం అవసరమని పేర్కొంది.
యుద్ధం కొనసాగుతూ ఉండటంతో 2022 లో ఇరుపక్షాలు కాల్పుల విరమణ పాటించాయి. హౌతీలు సనాలో పట్టుబిగించగా, హదీ ప్రభుత్వం ఏడెన్ లో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. దీనిని ఐరాస గుర్తించింది.
కొత్త నేపథ్యం..
ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్ పై ఇజ్రాయెల్, యూఎస్ దాడులకు దిగాయి. ఈ యుద్ధంలో హౌతీలు ఇరాన్ కు మద్దతు ప్రకటించింది. కానీ వీరు ఇరాన్ తరఫున యుద్ధానికి దిగలేదు. అయితే ఈ యుద్ధానికి అసలైన ట్రిగ్గర్ తరువాత ప్రారంభం అయింది.
ఇరాన్ సర్వోన్నత నాయకుడు, షియా మత గురువు అయిన అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హౌతీలు హజరు కావడానికి నిశ్చయించుకున్నారు. దాదాపు 200 మంది హౌతీల కోసం టెహ్రాన్ ఓ విమానాన్ని పంపింది.
అయితే హౌతీలు, సౌదీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం యెమెన్ గగనతలంలోకి ప్రవేశించే ఏ విమానమైన ముందు రియాద్ అనుమతి తీసుకోవాలి. కానీ ఇరాన్ ఆ పని చేయలేదు. నేరుగా సనాలో విమానాన్ని ల్యాండ్ చేసింది. దీనితో రియాద్ ఆగ్రహానికి గురైంది.
అంత్యక్రియలు ముగిశాక తిరిగి సనాకు చేరుకున్న హౌతీలకు సౌదీ షాక్ ఇచ్చింది. వచ్చిన విమానంపై కాల్పులకు తెగబడింది. దీనితో హౌతీలు వస్తున్న విమానం వారి ఆధీనంలో ఉన్న హోడెయిడాలో దిగవలసి వచ్చింది.
కాల్పుల విరమణకు చెల్లు చీటి..
ఈ సంఘటన హౌతీలు, సౌదీ మధ్య కొత్త పోరాటానికి దారితీసింది. దీనితో నాలుగేళ్ల కాల్పుల విరమణ వాస్తవంగా ముగిసింది. హదీ మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వ దళాలు వెంటనే రంగంలోకి దిగి హౌతీలు దాడి చేయడంతో అంతర్యుద్ధం తిరిగి ప్రారంభమైంది.
ఇరాన్ కు పోరాటాన్ని తిరిగి ప్రారంభించడం సైనికపరంగా ప్రయోజనకరమైంది. ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్ తో కలిపే ఇరుకైన బాబ్ అల్ మండెబ్ జలసంధిని హౌతీలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకుంది. దీనితో సౌదీకి ముడిచమురు ఎగుమతి చేయడం దాదాపుగా అసాధ్యంగా మారింది.
సౌదీ అరేబియా తూర్పు నుంచి పశ్చిమానికి పెద్ద పైపులైన్ ను నిర్మించింది. దీనిద్వారా రోజుకు దాదాపు ఆరు మిలియన్ బ్యారెళ్ల చమురును బాబ్ ఎల్ మండెబ్ ద్వారా రవాణా చేసేది. ఇవి ఆసియాకు, అటూ యూరప్ కు అందేది.
ప్రపంచానికి అంతరాయం..
హౌతీలు ఇక్కడ కూడా తమ తెలివిని ఉపయోగించడం ప్రారంభించారు. బాబ్ ఎల్ మాండెబ్ ద్వారా కేవలం సౌదీకి చెందిన నౌకలను మాత్రమే అడ్డుకుంటామని, మిగిలిన ప్రపంచానికి చెందిన రవాణాను అడ్డుకోమని ప్రకటించారు.
అయితే సౌదీ చమురు పై ఆధారపడిన మిగిలిన ఆసియా దేశాలకు ఇది ఇబ్బందికరంగా మారింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడానికి కారణంగా మారింది. ప్రస్తుతం ముడి చమురు బ్యారెల్ ఏకంగా 110 డాలర్ల వైపుగా దూసుకుపోతోంది.
తాము భూమిపై, సముద్రం మీద కేవలం సౌదీలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ కలిపి ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్దంలో అనివార్యంగా రెండో వార్ ఫ్రంట్ తెరుచుకోవడానికి కారణమైంది.
ప్రస్తుతం ఇరాన్ తో యుద్దాన్ని కొనసాగించడానికి ట్రంప్ ఏ మాత్రం ఆసక్తి కనపరచడం లేదు. ఇక్కడి నుంచి పారిపోవడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఈ యుద్ధంలో ట్రంప్ ను జోక్యం చేసుకోవాలని సౌదీ కోరుతోంది. అయితే ఇందులో చేరడానికి తమకు ఆసక్తి లేదని వాషింగ్టన్ ప్రకటించింది.
యూఎస్- యూకే మద్దతు..
ఈ యుద్ధంలో తమ సిబ్బంది, ఇతర సైనిక ఆయుధాలతో రియాద్ లో ఉన్నారని అమెరికా, యూకే వెల్లడించింది. అయితే ఇదే సమయంలో బాబ్ ఎల్ మాండెబ్ ను హౌతీలు స్వాధీనం చేసుకున్నాక కూడా వీరికి ఎలాంటి మద్దతు అందలేదని తెలిసింది. ఇదే సమయంలో సౌదీ రాజధాని రియాద్ పైకి హౌతీలు మిస్సైల్లు, డ్రోన్లు ప్రయోగించారు.
గల్ఫ్ లో ముస్లిం దేశాల ఐక్యత గురించి ఇరాన్ ప్రతిపాదన, ప్రారంభం కాకముందే విచ్చిన్నమయ్యే ప్రమాదంలో పడ్డాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ మధ్య కుదిరిన మక్కా ఒప్పందం కూడా తుస్సుమంది. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే మిగిలిన రెండు దేశాలు రావాలి. కానీ ఇక్కడ సౌదీకి సాయం చేయడానికి టర్కీ, పాక్ రాలేదు. మద్దతు ప్రకటనలు తప్ప ఏమి రాలేదు.
హర్ముజ్, బాబ్ ఎల్ మాండెబ్ ముట్టడి వంటి ఇతర కారణాల వల్ల యుద్దం కొనసాగితే ఆ ప్రాంతంలో ముస్లిం దేశాల ఐక్యత ఇప్పటికి సాధ్యం కాదు. మక్కా ఒప్పందం వంటివి రక్షణ ఒప్పందాలు ఆచరణ యోగ్యమైనవి కావని రూడీ అయింది. అయితే మిగిలిన ప్రపంచానికి ఇంధన సరఫరాల విషయంలో మళ్లీ దినదిన గండం నూరేళ్లు ఆయుష్షు లా మారింది.
Next Story

