
రష్యాకు భారీ స్థాయిలో చమురు ఎగుమతి చేస్తున్న భారత్
ఉక్రెయిన్ దాడులతో ముడి చమురును శుద్ది చేయలేకపోతున్న మాస్కో
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కీవ్ చేస్తున్న డ్రోన్ దాడులతో మాస్కోలో పెట్రోలియం శుద్దికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా కు భారీ స్థాయిలో శుద్ది చేసిన చమురును దిగుమతి చేసుకుంటోంది.
ఒక్క ఆగష్టులోనే 1,72,000 టన్నుల చమురు ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి వచ్చింది. వీటిలో వీటిలో రష్యాకు చెందిన రోస్నెఫ్ట్కు పాక్షిక యాజమాన్యం ఉన్న మన దేశంలోని ఒక రిఫైనరీలో రష్యా ముడి చమురు నుంచి శుద్ధి చేసిన గ్యాసోలిన్ కూడా ఉందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) నివేదిక వెల్లడించింది.
రష్యా శిలాజ ఇంధన ఎగుమతులు, ఆంక్షలపై CREA తన నెలవారీ విశ్లేషణ విడుదల చేసింది. ఆగస్టులో రష్యా చమురు ఉత్పత్తుల దిగుమతులలో 70 శాతాన్ని భారత్ సరఫరా చేసిందని, ఇందులో 78 మిలియన్ యూరోల విలువైన 1,20,000 టన్నుల గ్యాసోలిన్ కూడా ఉందని పేర్కొంది. రష్యా ఇంధన దిగుమతుల పరిమాణం గత నెలవారీ రికార్డు కంటే ఏడు రెట్లు, 2025 మొత్తం దిగుమతుల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది.
భారత్ దిగుమతి చేసుకున్న గ్యాసోలిన్ మొత్తం వడినార్ రిఫైనరీలో లోడ్ చేయబడి, EU ఆంక్షలకు గురైన నయారా ఎనర్జీ ద్వారా రోస్నెఫ్ట్కు విక్రయించినట్లు CREA తెలిపింది. నివేదిక ప్రకారం, రోస్నెఫ్ట్ నయారా ఎనర్జీలో 49.13 శాతం వాటా ఉంది. వడినార్ 2025 మొత్తం సంవత్సరానికి 81 శాతంతో పోలిస్తే, 2026 మొదటి ఎనిమిది నెలల్లో తన ముడి చమురు మొత్తాన్ని రష్యా నుంచి సేకరించింది.
"అందువల్ల రష్యా, తాను దేశీయంగా ఉత్పత్తి చేయలేని ఇంధనంగా మార్చడానికి, తాను పాక్షికంగా యాజమాన్యం వహించే రిఫైనరీకి డబ్బు చెల్లిస్తోంది. ఆ తర్వాత దానిని ప్రపంచంలో సగం దూరం వెనక్కి రవాణా చేస్తోంది" అని CREA పేర్కొంది.
CREA ప్రకారం, రష్యా చమురు రిఫైనరీలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ కొనసాగిస్తున్న డ్రోన్ దాడుల ప్రభావాన్ని ఈ రవాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది దేశీయ ఇంధన ఉత్పత్తిని తగ్గించి, కొరతకు దోహదపడింది. వడినార్ నుంచి రష్యాకు ఎగుమతి చేయబడిన ప్రతి గ్యాసోలిన్ కార్గో, రష్యా ఆర్కిటిక్ పోర్ట్ అయిన బెలో మోర్లో అన్లోడ్ చేయడానికి ముందు, ఈజిప్ట్ సమీపంలో నౌకల మధ్య బదిలీ చేయబడింది.
ఇందులో పాల్గొన్న నౌకలన్నీ ఆంక్షలు విధించిన ట్యాంకర్లేనని, ఆరింటిలో నాలుగు గతంలో నకిలీ జెండాల కింద పనిచేసాయని CREA తెలిపింది. చారిత్రాత్మకంగా ప్రపంచంలోనే శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలలో ఒకటైన రష్యా, ఎగుమతులు తగ్గుతున్నప్పటికీ, ఆ దేశ గ్యాసోలిన్ దిగుమతులు భారీగా పెరిగాయి.
2023 నుంచి 2025 మధ్య సగటున 6 శాతంగా ఉన్న గ్యాసోలిన్ వాటా, ఆగస్టులో మొత్తం చమురు ఉత్పత్తుల దిగుమతులలో 74 శాతంగా నమోదైంది. దక్షిణ కొరియా ఆగస్టులో రష్యాకు అదనంగా 18,000 టన్నుల చమురు ఉత్పత్తులను, ప్రధానంగా గ్యాసోయిల్ను సరఫరా చేయగా, ఈజిప్ట్ 16 మిలియన్ యూరోల విలువైన 25,000 టన్నుల డీజిల్‌ను ఎగుమతి చేసిందని CREA తెలిపింది.
ఆగస్టులో రష్యా సముద్ర మార్గ చమురు ఉత్పత్తుల ఎగుమతులు పరిమాణం పరంగా 21 శాతం తగ్గాయి, అయితే గమ్యస్థాన ఓడరేవులలో అన్లోడ్ చేయబడిన ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయాలు జూలై నుంచి 32 శాతం తగ్గి రోజుకు 78 మిలియన్ యూరోలకు పడిపోయాయి.
ఇది ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దాడి తర్వాత అత్యల్ప స్థాయి. రష్యా ఓడరేవులలో చమురు ఉత్పత్తుల లోడింగ్‌లు వరుసగా మూడు నెలలుగా తగ్గుతూ, ఆగస్టు 2025 నాటి స్థాయి కంటే సగానికంటే తక్కువగా ఉన్నాయని CREA తెలిపింది.
పూర్తిస్థాయి దాడికి ముందు రష్యా నాల్గవ అతిపెద్ద చమురు ఉత్పత్తి ఎగుమతి ఓడరేవు అయిన టువాప్సే, మే నుంచి కొనసాగుతున్న ఉక్రేనియన్ డ్రోన్ దాడుల కారణంగా వరుసగా మూడవ నెలలో కూడా ఒక్క చమురు ఉత్పత్తి కార్గోను కూడా లోడ్ చేయలేదు.
ఉక్రేనియన్ దాడులు రష్యా నల్ల సముద్ర ఓడరేవు అయిన నోవోరోస్సిస్క్ ద్వారా జరిగే ముడి చమురు ఎగుమతులకు కూడా అంతరాయం కలిగించాయి. CREA ప్రకారం, ఆగస్టులో అక్కడ ముడి చమురు లోడింగ్‌లు నెలవారీగా 58 శాతం తగ్గాయి. అదే సమయంలో లోడింగ్‌లు వరుసగా తొమ్మిది రోజుల పాటు నిలిచిపోయాయి. పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆ పోర్టులో నమోదైన సుదీర్ఘ అంతరాయం ఇదే.
మొత్తం మీద, ఆగస్టులో రష్యా శిలాజ ఇంధన ఎగుమతి ఆదాయాలు 8 శాతం తగ్గి రోజుకు 604 మిలియన్ యూరోలకు పడిపోగా, ఎగుమతి పరిమాణాలు 7 శాతం తగ్గాయి. ఆగస్టులో చైనా తర్వాత రష్యాకు భారత్ రెండవ అతిపెద్ద శిలాజ ఇంధన వినియోగదారుగా నిలిచిన తరుణంలో ఈ ఇంధన వాణిజ్యం చోటుచేసుకుంది. ఆ నెలలో భారతదేశం 4.8 బిలియన్ యూరోల విలువైన రష్యన్ హైడ్రోకార్బన్లను దిగుమతి చేసుకుంది. అందులో 4.1 బిలియన్ యూరోల విలువైన ముడి చమురు, అంటే మొత్తం కొనుగోళ్లలో 87 శాతం వాటా కలిగి ఉందని CREA తెలిపింది.
అయినప్పటికీ, గత రెండు నెలల్లో రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత, జూలైతో పోలిస్తే రష్యా ముడి చమురు భారత దిగుమతులు 24 శాతం తగ్గాయి. నివేదిక ప్రకారం, జామ్‌నగర్ రిఫైనరీలో దిగుమతులు 15 శాతం తగ్గగా, వడినార్‌లో 5 శాతం, పారాదీప్‌లో 1 శాతం పెరిగాయి.
ఆగస్టు నెలలో రష్యాకు శిలాజ ఇంధనాల అతిపెద్ద కొనుగోలుదారుగా చైనా నిలిచింది. దాని ఐదు అతిపెద్ద కొనుగోలుదారుల ద్వారా వచ్చిన ఆదాయంలో 8.4 బిలియన్ యూరోలు, అంటే 51 శాతం చైనా నుంచే వచ్చింది. చైనాలోకి రష్యా సముద్ర మార్గ ముడి చమురు దిగుమతులు నెలవారీగా 16 శాతం పెరిగాయని, ఆగస్టు 2025 స్థాయిల కంటే 62 శాతం అధికంగా ఉన్నాయని CREA తెలిపింది.
ఎగుమతి పరిమాణంలో తగ్గుదల ఉన్నప్పటికీ, పెరిగిన ప్రపంచ ఇంధన ధరల వల్ల రష్యా ప్రయోజనం పొందడం కొనసాగించింది. CREA ప్రకారం, ఆగస్టులో రష్యా యురల్స్ ముడి చమురు సగటు ధర 23 శాతం పెరిగి బ్యారెల్‌కు 69.90 డాలర్లకు చేరుకుంది.
ఇది G7, యూరోపియన్ యూనియన్ ధరల పరిమితి అయిన 44.10 డాలర్ల కంటే చాలా ఎక్కువ. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత పెరిగిన చమురు, గ్యాస్ ధరల వల్ల, ఆ దాడుల అనంతరం ఆరు నెలల్లో రష్యా సముద్ర మార్గ శిలాజ ఇంధన ఎగుమతి ఆదాయాలు సుమారు 31 బిలియన్ యూరోలు పెరిగాయని ఈ పరిశోధనా సంస్థ అంచనా వేసింది.
Next Story

