పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ. 3 తగ్గింపు
x

పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ. 3 తగ్గింపు

దేశంలోని అతిపెద్ద పెట్రోలియం సంస్థ నయారా చర్యలు, తక్షణమే వినియోగదారులకు బదిలీ


Click the Play button to hear this message in audio format

హార్ముజ్ జలసంధి తెరుచుకుని ప్రపంచ ఇంధన రవాణా తిరిగి యథాస్థితికి చేరుకున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. మన దేశంలో అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ బుధవారం నుంచి పెట్రోల్, డీజిల్ పై ధరలు తగ్గించింది. నిన్న ఉదయం నుంచి లీటర్ పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ. 3 తగ్గించినట్లు ప్రకటించింది. ఈ సేవలు తక్షణమే వినియోగదారులకు అందించింది. గత రెండేళ్లకు పైగా కాలంలో ఏ కంపెనీ అయినా రిటైల్ ఇంధన ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి.

పశ్చిమ ఆసియాలో ఘర్షణలు సద్దుమణిగిన తర్వాత, ఒక కీలకమైన సముద్ర మార్గం తిరిగి తెరుచుకోవడంతో ముడి చమురు, సహజ వాయువుల సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతోంది. దీంతో సరఫరా అంతరాయాలపై ఆందోళనలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ముడి చమురు ధరలు తగ్గాయి.
దేశవ్యాప్తంగా నయారాకు చెందిన 7,000కు పైగా ఇంధన కేంద్రాలన్నింటిలో సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వంటి స్థానిక సుంకాలను బట్టి రాష్ట్రాల వారీగా వాస్తవ పంప్ ధరలు మారుతూ ఉంటాయి.
అయితే, ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు ధరలను యథాతథంగా ఉంచారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కలిసి 1,000కు పైగా కేంద్రాల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నాయి. దేశంలోని లక్షకు పైగా ఇంధన కేంద్రాలలో 90 శాతం, ఎటువంటి సవరణను ప్రకటించలేదు.
ఢిల్లీలోని ఐఓసీ అవుట్‌లెట్లలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 102.12, డీజిల్ ధర లీటరుకు రూ. 95.20 వద్ద కొనసాగుతోంది. ఇరాన్ సంఘర్షణ చెలరేగి అంతర్జాతీయ చమురు ధరలు పెరిగిన తర్వాత, ఇంధన ధరలను పెంచిన తొలి రిటైలర్లలో నయారా ఒకటి. మార్చి 26న, ఇది పెట్రోల్ ధరను లీటరుకు రూ. 5, డీజిల్ ధరను లీటరుకు రూ. 3 పెంచింది.
ఆ తర్వాత ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు కూడా ఇదే బాటలో నడిచాయి. మే నెల ద్వితీయార్థంలో జరిగిన వరుస సవరణలలో, పెరిగిన అంతర్జాతీయ ముడి చమురు ధరలు, అధిక ఉత్పత్తి వ్యయాలను కారణంగా చూపుతూ, పెట్రోల్ - డీజిల్ ధరలను లీటరుకు రూ. 7.50 చొప్పున పెంచాయి.
బుధవారం నయారా చేసిన తగ్గింపు, మార్చిలో చేసిన పెంపును రద్దు చేస్తుంది. ఇటీవలి వారాల్లో ప్రపంచ చమురు మార్కెట్లు స్థిరపడిన తర్వాత, భారతీయ వినియోగదారులకు తక్కువ ఇంధన ధరలు చేరుతున్నాయనడానికి ఇది మొదటి సంకేతం.
రిఫైనరీ పునరుద్ధరణ తర్వాత, డిమాండ్‌ను తీర్చడానికి నయారా పూర్తిగా సిద్ధంగా ఉందని, దేశ వినియోగ అవసరాలను తీర్చడానికి తన మొత్తం నెట్‌వర్క్‌ను వినియోగిస్తోందని వర్గాలు తెలిపాయి. గుజరాత్‌లోని వడినార్‌లో సంవత్సరానికి 20 మిలియన్ టన్నుల సామర్థ్యం గల చమురు శుద్ధి కర్మాగారాన్ని నయారా నిర్వహిస్తోంది.
Read More
Next Story