x

విదేశీ యూనివర్సిటీలకు తెలంగాణ రెడ్ కార్పెట్

ఫ్యూచర్ సిటీలో ఆఫ్ క్యాంపస్ లను ఏర్పాటు చేయబోతున్న ప్రతి విదేశీ యూనివర్సిటీకి సుమారు 25 ఎకరాలను కేటాయించాలని హైపవర్ కమిటి ప్రభుత్వానికి సూచించింది


విదేశీ యూనివర్సిటీలకు రేవంత్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. విదేశీ యూనివర్సిటీల్లో దొరికే అత్యుత్తమ విద్యా బోధనను విద్యార్ధులకు హైదరాబాద్ లోనే అందించాలన్నది రేవంత్ ప్రభుత్వం లక్ష్యం. ఇందులో భాగంగానే రేవంత్ కలలుకంటున్న ఫ్యూచర్ సిటీలో ఆఫ్ క్యాంపస్ లను ఏర్పాటు చేయబోతున్న ప్రతి విదేశీ యూనివర్సిటీకి సుమారు 25 ఎకరాలను కేటాయించాలని హైపవర్ కమిటి ప్రభుత్వానికి సూచించింది.

ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు, ఐటి కంపెనీలు, యూనివర్సిటీలను ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం చేయాలన్నది రేవంత్ టార్గెట్. ఇందులో భాగంగానే విదేశాల్లోనే అనేక మాన్యుఫ్యాక్షరింగ్, సాఫ్ట్ వేర్, ఐటి దిగ్గజ కంపెనీలతో రేవంత్ నియమించిన హైపవర్ కమిటి చర్చలు జరుపుతోంది. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పరిశ్రమలు, ఐటి, రెవిన్యు, రోడ్లు భవనాల ముఖ్య కార్యదర్శులే కాకుండా మరికొందరు ప్రొఫెసర్లతో కమిటీని రేవంత్ ఏర్పాటు చేశారు.

ఈ కమిటీయే విదేశీ కంపెనీల ప్రతినిధులతో పాటు విదేశీ యూనివర్సిటీల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగానే 10 యూనిర్సిటీల యాజమాన్యాలు ఫ్యూచర్ సిటీలో ఆఫ్‌ క్యాంపస్‌లను ఏర్పాటు చేయటానికి అంగీకరించినట్లు కమిటి ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఇప్పటికే యూనివర్సిటి ఆఫ్ లండన్, బర్మింగ్ హామ్ యూనివర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పదం కూడా చేసుకున్నాయి.

ఈ రెండు యూనివర్సిటీలతో పాటు అమెరికాలోని యూనివర్సిటి ఆఫ్ కొలరాడో హైదరాబాద్ లో క్యాంపస్ ల ఏర్పాటుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతులు కూడా తీసుకున్నాయి. మరికొన్ని యూనివర్సిటీలు కూడా ఫ్యూచర్ సిటీలో క్యాంపస్ ల ఏర్పాటుకు చాలా ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకనే ప్రతి యూనివర్సిటీకి సుమారు 25 ఎకరాల కేటాయింపుతో పాటు మరికొన్ని ప్రోత్సాహకాలను అందించే విషయమై కమిటి చర్చలు జరుపుతోంది.

Read More
Next Story