
‘ఫెయిల్’ అనే పదం ఇక నుంచి తొలగింపు
నైపుణ్యానికి అర్హులు అనే పదం వాడాలని బీహార్ ప్రభుత్వం సూచన
బీహార్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకునుంది. ఇక నుంచి విద్యార్థులకు పాస్, ఫెయిల్ అనే పదాలను తొలగించాలని నిర్ణయించుకుంది. ఇక నుంచి పదో తరగతి, 12 వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల మార్క్ షీట్లలో ఫెయిల్ బదులుగా, నైపుణ్య శిక్షణకు అర్హులు అనే పదాన్ని చేర్చాలని నిర్ణయించుకుంది.
బీహార్ ‘బోర్డ్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అండ్ ఎగ్జామినేషన్’ (బీబీఓఎస్ఈ) అందించే వృత్తి విద్యా శిక్షణా కార్యక్రమాలను విద్యార్థులు అభ్యసించేందుకు వీలు కల్పించడమే ఈ చర్య లక్ష్యమని వారు చెప్పారు. "ఈ మార్పును అమలు చేయడానికి విద్యాశాఖ తదనుగుణంగా నిబంధనలను సవరిస్తుంది.
ఈ శాఖ త్వరలో బీఎస్ఈబీకి అవసరమైన సూచనలు జారీ చేస్తుంది. సర్టిఫికెట్లలో 'ఫెయిల్'కు బదులుగా 'నైపుణ్యాభివృద్ధికి అర్హులు' అనే పదం ఉంటుంది" అని బీహార్ విద్యాశాఖ మంత్రి మిథ్లేష్ తివారీ ఇక్కడ విలేకరులతో అన్నారు.
ఒక పరీక్షలో ఆశించిన మార్కులు సాధించలేకపోయినంత మాత్రాన విద్యార్థుల ప్రతిభ మాయమైపోదని తివారీ అన్నారు. "10వ తరగతి బోర్డు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు, వారు సన్నద్ధమవడానికి, వారి విజయావకాశాలను మెరుగుపరచుకోవడానికి ఒక నెలపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాము," అని ఆయన తెలిపారు.
పరీక్షలో విఫలమైన తర్వాత విద్యార్థులు వెనుకబడకుండా నివారించడానికి, వారికి పరిహార మద్దతును అందించడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ఈ కార్యక్రమం ఒక భాగమని తివారీ అన్నారు.
సాంప్రదాయ పాఠ్యపుస్తకాల ఆధారిత అభ్యాసానికి మించి విద్యార్థులకు మరిన్ని కార్యకలాపాలను పరిచయం చేయడానికి బీహార్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో శనివారాల్లో 'నో-బ్యాగ్ డే'ని ప్రవేశపెట్టడం ఇటీవలి చర్యలలో ఒకటి. ఆగస్టు 6న ప్రకటించిన ఈ ఏర్పాటు ప్రకారం, ప్రభుత్వ పాఠశాలలు శనివారాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేస్తాయి. కాగా సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ యథావిధిగా పనిచేస్తాయి.
Next Story

