
అక్షయ్ 'భూత్ బంగ్లా' రివ్యూ
వణికించిందా, నవ్వించిందా?
మంగళ్‌పూర్ పేరు వింటేనే చుట్టుపక్కల ప్రాంతాలు వణికిపోతూంటాయి. కారణం—అక్కడ పెళ్లి పీటల మీద కూర్చున్న ఏ పెళ్లి కూతురు క్షేమంగా అత్తారింటికి వెళ్లదు! పెళ్లి రోజే వధువులను వేటాడి, మాయం చేసే ఒక అదృశ్య శక్తి ఆ ఊరిని శాపంగా వెంటాడుతోంది. దాంతో ఆ ఊళ్లో పెళ్లిళ్లు అనేవి జరగవు.
ఇదిలా ఉండగా లండన్‌లో సెటిల్ అయిన మన హీరో అర్జున్ ఆచార్య (అక్షయ్ కుమార్) తన సోదరి మీరా (మిథిలా పాల్కర్) పెళ్లిని గ్రాండ్‌గా చేయాలనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో తన తాత దుష్యంత్ ఆచార్య మరణించడంతో, కొన్ని వేల కోట్ల ఆస్తితో పాటు మంగళ్‌పూర్‌లోని ఒక పురాతన హవేలీ (మహల్) కూడా అర్జున్ చేతికి వస్తుంది. దాంతో మీరా పెళ్లిని ఆ పాత మహల్‌లోనే ఘనంగా జరిపించాలని నిర్ణయించుకున్న అర్జున్, స్వయంగా మంగళ్‌పూర్‌కు వెళ్తాడు. కానీ అక్కడ అతనికి ఊహించనివి ఎదురవుతాయి. అది ఒక శిథిలావస్థకు చేరిన భవనం, దాని చుట్టూ అల్లిన ఎన్నో దెయ్యం కథలు అతనికి వినిపిస్తాయి.
ఆచార్య కుటుంబానికి చెందిన గురువు (జకీర్ హుస్సేన్) ఆ ఊరిపై ఉన్న శాపాన్ని ధృవీకరిస్తాడు. అయితే అర్జున్ మాత్రం దీన్ని నమ్మడు. పురాతన వస్తువులను అమ్ముకుని లాభపడే కేర్ టేకర్ శాంతారామ్ (అస్రానీ) వంటి స్వార్థపరులు అల్లిన కట్టుకథలే ఇవన్నీ అని అతను భావిస్తాడు. మంగళప్రదమైన మీరా వివాహం కోసం ఆ పాత మహల్‌ను శుభ్రం చేసి, ముస్తాబు చేయాలని అర్జున్ నిర్ణయించుకుంటాడు.
ఇందుకోసం డబ్బు మీద ఆశ ఉన్న తెలివైన వెడ్డింగ్ ప్లానర్ జగదీష్ (పరేష్ రావల్) ను నియమిస్తాడు. జగదీష్ తన మేనల్లుడు ,ఎలక్ట్రీషియన్ అయిన బల్లి (రాజ్ పాల్ యాదవ్) ను వెంటబెట్టుకొస్తాడు.
మరోవైపు, మంగళ్‌పూర్ వెళ్లే దారిలో రైలు ప్రమాదం నుండి అర్జున్ కాపాడిన ప్రియ (వామికా గబ్బి) అతనికి మళ్ళీ ఎదురవుతుంది. ప్రాచీన దేవాలయాల మీద పుస్తకం రాసే రచయిత్రిగా ఆమె అక్కడకు వస్తుంది, కానీ ఆమె అసలు ఉద్దేశం వేరే ఉంటుంది.
మహల్ అంతా పనివారితో సందడిగా మారుతుంది, కానీ క్రమంగా అక్కడ వింత సంఘటనలు మొదలవుతాయి. మీరా, ఆమె అత్తమామలు, ఆమె తండ్రి అక్కడికి చేరుకుంటారు. శాపం కారణంగా అక్కడ పెళ్లి జరగకూడదని తండ్రి కూడా అర్జున్‌ను హెచ్చరిస్తారు. గురువు అర్జున్‌కు ఆ భవింతి శాపం వెనుక ఉన్న గతాన్ని వివరిస్తారు. అంతేకాదు ఆ ఊరి శాపానికి, అర్జున్ తల్లి యశోధర (టబు) గతానికి ఉన్న సంబంధం చెప్తాడు.
ఇంతకీ ఆ శాపం ఏమిటి, అసలు భవంతిలో ఉన్న విషయం ఏమిటి ..హవేలీకి దగ్గరలో ఉన్న 'వధాసుర్' గుడిలో దాగి ఉన్న ఆ మర్మం ఏమిటి? తన కళ్ల ముందే తిరుగుతున్న ఆ అదృశ్య శక్తి నుండి అర్జున్ తన సోదరిని కాపాడుకోగలడా? లేక మీరా కూడా గతంలో మాయమైన వధువుల్లాగే ఆ రాక్షసుడికి బలైపోతుందా? కామెడీ, హారర్, సస్పెన్స్ కలగలిసిన ఈ మిస్టరీని ఛేదించాలంటే 'భూత్ బంగ్లా' చూడాల్సిందే!
విశ్లేషణ
ఈ చిత్రానికి ఆకాష్ కౌశిక్ (భూల్ భులయ్యా 2, 3 ఫేమ్) కథను అందించారు. హారర్-కామెడీ జోనర్‌లో పట్టున్న ఆకాష్, ఒక పురాతన శాపం, మనుషుల స్వార్థం చుట్టూ ఒక తెలివైన ప్లాట్‌ను అల్లారు. అభిలాష్ నాయర్, రోహన్ శంకర్, ప్రియదర్శన్ త్రయం ఈ కథను స్క్రీన్‌ప్లేగా మార్చారు. మానవ నైజం చుట్టూ అల్లిన ట్విస్టులు తెలివిగా బాగున్నాయి. కానీ అవన్నీ తెరపైకి తీసుకురావడంలో తడబడ్డారు.
సినిమా ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. పాత్రల మధ్య వచ్చే ఫన్, ముఖ్యంగా Rohan Shankar రాసిన సంభాషణల్లో కనిపించే పంచ్, కథను ముందుకు నడిపిస్తాయి. ఈ దశలో సినిమా తన టోన్‌ని క్లియర్‌గా సెట్ చేసుకుంటుంది. ఇంటర్వెల్ దగ్గర జానపదం కు చెందిన మలుపుతో కథ ఒక్కసారిగా టర్న్ తీసుకుంటుంది. అక్కడివరకు నీట్ గా నడిచింది.
కానీ సెకండాఫ్ లోనే అసలు సమస్య మొదలవుతుంది. శాపం వెనుక ఉన్న గతాన్ని వివరించే క్రమంలో కథ లో స్పీడ్ పూర్తిగా పడిపోయింది. చూపించాల్సిన విషయాలను డైలాగులతో ఎక్కువగా చెప్పడం వల్ల డ్రామా ఇంటెన్సిటీ తగ్గిపోయింది. అలాగే కథలో వచ్చే మలుపులు కూడా ముందే అంచనా వేయగలిగేలా ఉండటంతో ఉత్కంఠ తగ్గిపోయింది. క్లైమాక్స్‌కి వచ్చే సరికి కథను ముగించాల్సిన చోట, దాన్ని లాగడం వల్ల ఎమోషన్, టెన్షన్ రెండూ నీరసంగా మారాయి.
మామూలుగా Priyadarshan స్టైల్‌లో 'సిట్యుయేషనల్ కామెడీ' సహజంగా వస్తుంది. అదే ఫస్టాఫ్ లో వర్కవుట్ అయ్యింది. కానీ అదే ఫన్ రెండో భాగంలో భయాన్ని అడ్డుకుంటుంది. హారర్‌కు అవసరమైన నిశ్శబ్దం, ఉత్కంఠ ని దెబ్బకొట్టింది. ఫలితంగా సినిమా పూర్తిగా భయపెట్టలేకపోయింది, పూర్తిగా నవ్వించలేకపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది.
స్క్రిప్ట్‌లో ఉన్న అసలు సమస్య రిథమ్‌లోనే ఉంది. మొదటి భాగం తేలికగా, వేగంగా నడిస్తే, రెండో భాగం నెమ్మదిగా, వివరణలతో నిండిపోతుంది. పాత్రలు కూడా కథను నడిపించేంత లోతుగా రాయలేదు. అవి కథకు అవసరమైన పాత్రలుగానే మిగిలిపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే బలమైన ఆలోచనతో మొదలై, మధ్యలో నెమ్మదించి, చివరికి సాధారణంగా ముగిసే హారర్-కామెడీ ప్రయత్నం.
టెక్నికల్ గా ...
దర్శకుడు ప్రియదర్శన్ తన పాత మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో అని ఎదురుచూసిన వాళ్లకి నిరాశే. స్క్రిప్టు సరిగ్గా సెట్ కాకపోవడం వల్ల ఆయన అనుభవం కూడా సినిమాను కాపాడలేకపోయింది. సంగీతం ఒకే. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త షార్ప్ లో ఉండేలా... ముఖ్యంగా సెకండాఫ్ లో విషయంలో జాగ్రత్తగా ఉండి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. బంగ్లా సెటప్, విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి.
ఇక ఈ సినిమాకు ప్రధాన బలం అక్షయ్ కుమార్. తన మార్కు కామెడీ టైమింగ్‌తో కొన్ని సీన్లలో బాగానే నవ్వించాడు. రాజ్ పాల్ యాదవ్, పరేశ్ రావల్ కాంబినేషన్ సీన్లు పాత రోజులను గుర్తుచేస్తాయి. వారి నటన సినిమాకు కొంత రిలీఫ్.
ఫైనల్ థాట్
ఒకవేళ మీరు అక్షయ్ కుమార్ వీరాభిమాని అయితే, ఈ సినిమా మీకు బాగానే నచ్చుతుంది. అదేవిధంగా మీరు దర్శకుడు ప్రియదర్శన్ అభిమాని అయి ఉండి, వీరిద్దరి కాంబినేషన్ కోసం ఎదురుచూసే వారైతే.. ఈ 'భూత్ బంగ్లా' మిమ్మల్ని అస్సలు నిరాశపరచదు.అయితే, నేటి జెన్-జీ (Gen Z) ప్రేక్షకులకు మాత్రం ఏ మాత్రం నచ్చుతుందో చూడాలి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' వంటి భారీ ఫ్రాంచైజీ చిత్రాలకు బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు, ఈ సినిమా ఒక రిలీఫే.

