పెద్ది ట్రైలర్ అలా మిస్సైర్ అయ్యిందా?
x

'పెద్ది' ట్రైలర్ అలా మిస్సైర్ అయ్యిందా?

జాన్వీ పాత్ర క్రింజ్ ఫ్యాక్టర్‌గా మారుతుందా?


రామ్ చరణ్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ చిత్రం “పెద్ది”. ఈ చిత్రం ట్రైలర్ రిలీజయ్యాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ట్రైలర్‌లో చరణ్ చూపిన ట్రాన్స్ఫర్మేషన్, గ్రామీణ అథ్లెట్‌గా ఆయన బాడీ లాంగ్వేజ్, క్రికెట్-కుస్తీ-రన్నింగ్ వంటి స్పోర్ట్స్ ఎలిమెంట్స్ బలంగా కనిపించాయి. మట్టివాసన ఉన్న విజువల్స్, రగ్డ్ లుక్, మాస్ ఎనర్జీ… ఇవన్నీ అభిమానులను ఆకట్టుకున్నాయి. కానీ… ట్రైలర్ ముగిసేలోపే మరో అంశం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. అదే జాన్వీ కపూర్ పాత్ర.

చాలామంది ముఖ్యంగా నార్త్ ఇండియా సోషల్ మీడియా జనం ట్రైలర్ చూసి ఒకే ప్రశ్న ని వైరల్ చేస్తున్నారు. అదే “ఈ కథలో జాన్వీ పాత్ర నిజంగా అవసరమా? లేక కేవలం గ్లామర్ కోసమా?”. “పెద్ది”ని దర్శకుడు బుచ్చిబాబు ఒక అండర్‌డాగ్ స్పోర్ట్స్ డ్రామాగా చూపించాలని ప్రయత్నించాడు. హీరో తన ఊరి కోసం, తన ప్రజల కోసం పోరాడే వ్యక్తిలా కనిపిస్తున్నాడు. కానీ అదే సమయంలో హీరోయిన్ పాత్ర మాత్రం పూర్తిగా వేరే జోనర్ లేదా ప్రపచం నుంచి వచ్చినట్టు అనిపించింది.

జాన్వీ ను చూపించిన తీరు, కెమెరా ఫోకస్, డైలాగ్ స్టైల్… ఇవన్నీ చాలా మందికి “ఓల్డ్ స్కూల్ కమర్షియల్ తెలుగు సినిమా ఫార్ములా”ని గుర్తు చేశాయి. కథలో భావోద్వేగం, క్లాస్ స్ట్రగుల్, స్పోర్ట్స్ ప్యాషన్ నడుస్తుంటే… మధ్యలో హీరోయిన్ గ్లామర్ షాట్స్ రావడం వల్ల టోన్ బ్రేక్ అయిందనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా చరణ్ ఈ సినిమాను “దంగల్”, “సుల్తాన్” లాంటి స్పోర్ట్స్ డ్రామాలతో పోల్చడం వల్ల ప్రేక్షకుల అంచనాలు ఇంకాస్త మారాయి.

Dangal లో అమ్మాయిల పాత్రలు ఎంతో హృద్యంగా, కథకు కేంద్రంగా ఉంటాయి. Sultan లో అయితే హీరోయిన్ పాత్రే హీరోని మార్చే భావోద్వేగ శక్తిలా పనిచేస్తుంది. కానీ “పెద్ది” ట్రైలర్‌లో జాన్వీ పాత్రను చూస్తే… కథను ముందుకు నడిపే వ్యక్తిలా కాకుండా, మాస్ మసాలా ఎంటర్టైన్‌మెంట్ కోసం ఉంచిన కమర్షియల్ ఎలిమెంట్‌లా అనిపించిందనే విమర్శ ఉంది.

బాక్సాఫీస్ దగ్గర జాన్వీ పాత్ర ప్రభావం ఎలా ఉండొచ్చు?

ప్లస్ పాయింట్స్

1. మాస్ ఆడియన్స్ కి గ్లామర్ ఇప్పటికీ వర్కౌట్ అవుతుంది

గ్రామీణ మాస్ కమర్షియల్ సినిమాల్లో గ్లామర్, పాటలు, రొమాన్స్ అనేవి కొత్తవి కావు. చాలా సార్లు ఇవే B, C సెంటర్లలో అదనపు ఆకర్షణగా మారుతాయి. ట్రైలర్‌లో జాన్వీని గ్లామరస్‌గా చూపించడం కూడా ఆ కమర్షియల్ లెక్కలో భాగమే కావచ్చు.

2. హిందీ మార్కెట్‌లో గుర్తింపు

జాన్వీ కపూర్‌కు బాలీవుడ్‌లో ఉన్న గుర్తింపు వల్ల నార్త్ మార్కెట్‌లో కొంత బజ్ రావచ్చు. ముఖ్యంగా పాన్ ఇండియా రిలీజ్‌లో హీరోయిన్ ఫేస్ కూడా మార్కెటింగ్‌కు ఉపయోగపడుతుంది.

3. సోషల్ మీడియా వైరాలిటీ

విమర్శ వచ్చినా… చర్చ అయితే బాగా జరిగింది. సోషల్ మీడియాలో ట్రైలర్ చుట్టూ హీట్ పెరగడానికి జాన్వీ పాత్ర కూడా ఒక కారణమే. కొన్నిసార్లు కాంట్రవర్సీ కూడా సినిమాకి ఫ్రీ ప్రమోషన్ అవుతుంది.

మైనస్ పాయింట్స్

1. ఎమోషనల్ ఆథెంటిసిటీ దెబ్బతినే ప్రమాదం

స్పోర్ట్స్ డ్రామా అంటే ప్రేక్షకులు సహజత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు. హీరో పేదరికం, కష్టం, క్లాస్ స్ట్రగుల్ గురించి చూపిస్తుంటే… హీరోయిన్ పాత్ర మాత్రం పూర్తిగా “గ్లామర్ షోకేస్”లా కనిపిస్తే కథ యొక్క నిజాయితీ తగ్గిపోతుంది.

2. సినిమ పై నెగెటివ్ ఇంప్రెషన్

ఇప్పటి ఆడియన్స్ ముఖ్యంగా సోషల్ మీడియాలో హీరోయిన్ పాత్రల్ని కూడా సీరియస్‌గా విశ్లేషిస్తున్నారు. “కేవలం నాభి షాట్స్,, రొమాన్స్ కోసం మాత్రమే హీరోయిన్” అనే ఫార్ములా విసుగ్గా ఉందంటున్నారు.

3. ట్రైలర్ టోన్ అసమతుల్యం

ట్రైలర్ ఒకపక్క రగ్డ్ స్పోర్ట్స్ డ్రామా మూడ్‌లో వెళ్తుంటే… మరోపక్క హీరోయిన్ ట్రాక్ పూర్తిగా వేరే కమర్షియల్ సినిమాకి చెందినట్టుగా అనిపించడం వల్ల కొంతమందికి tonal mismatch ఫీలింగ్ వచ్చింది. రేపు సినిమా పరిస్దితి కూడా ఇలాగే అవుతుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

4.జాన్వీపై ప్రత్యేకమైన గ్లామర్ క్రేజ్ ఏది

కొంతమంది సోషల్ మీడియా యూజర్లు “జాన్వీ ఇప్పటికే గ్లామర్ ఇమేజ్‌తో బాగా ఓపెన్ అయిపోయింది… ఇప్పుడు ఇలాంటి పాత్రలు కొత్తగా అనిపించడం లేదు” అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. అంటే mystery factor తగ్గిపోయిందనే అభిప్రాయం.

అసలు ట్విస్ట్ ఏమిటంటే…

ట్రైలర్ చూసి వచ్చిన అభిప్రాయం ఒక్కటే నిజం కాదు.

బుచ్చిబాబు గత సినిమా Uppena లో కూడా ప్రేమ కథ వెనుక బలమైన భావోద్వేగం దాచాడు. అందుకే “పెద్ది”లో జాన్వీ పాత్రను ట్రైలర్‌లో ఉద్దేశపూర్వకంగా ఒకరకంగా చూపించి… సినిమాలో మాత్రం భావోద్వేగమైన ముగింపు ఇవ్వొచ్చు అనే అవకాశం కూడా ఉంది. అంటే ప్రస్తుతం కనిపిస్తున్న “గ్లామర్ క్యారెక్టర్” తర్వాత కథలో కీలక మలుపు తీసుకురావచ్చు. లేకపోతే నిజంగానే ఆమె పాత్ర కేవలం కమర్షియల్ రిలీఫ్‌గా మిగిలిపోవచ్చు.

అది తేలేది మాత్రం సినిమా రిలీజ్ తర్వాతే.

ఏదైమైనా

జాన్వీ కపూర్ పాత్ర “పెద్ది”కి పూర్తిగా నష్టం చేస్తుందనడం తొందరపాటు. కానీ ట్రైలర్ మాత్రం ఒక స్పష్టమైన సందేహాన్ని మన ముందు ఉంచింది. “ఈ సినిమా నిజంగా హృదయానికి దగ్గరయ్యే స్పోర్ట్స్ డ్రామానా… లేక మాస్ కమర్షియల్ ఫార్ములాలను కలిపిన మరో హీరో ఎలివేషన్ మూవీనా?” అని. కథలో జాన్వీ పాత్ర కేవలం పాటలకే పరిమితం కాకుండా, ప్రథమార్ధంలో నాటుగా కనిపించినా ద్వితీయార్ధంలో కథను మలుపు తిప్పే బలమైన పాత్ర అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లస్ అవుతుంది. అలా కాకుండా కేవలం మసాలా కోసమే అయితే, అది సినిమాకు స్పీడ్ బ్రేకర్ లా మారుతుంది. ఇది తేలాలంటే జూన్ 3 రాత్రి ప్రీమియర్స్ వరకు ఆగాల్సిందే.

Read More
Next Story