
తెర నుంచి దివికెగిసిన ‘పుష్ఫక విమానం’
తుది శ్వాస విడిచిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు
సినిమా అంటే ఓ తపస్సులా భావించే దర్శకులు ఎందరు ఉన్నా.. తనకంటూ ప్రత్యేకతను తెచ్చుకున్న దర్శకులు మాత్రం కొందరే ఉంటారు. వారిలో మొదటి వరుసలో ఉండేవారు సింగీతం శ్రీనివాసరావు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు సినీ ప్రయాణం సాగించి, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, రచయితగా, నటుడిగా తనదైన ముద్రవేసిన ఈ దర్శక దిగ్గజం ఇక లేరు. 95 ఏళ్ల వయస్సులో వయోభారంతో తలెత్తిన అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో శనివారం మరణించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.
సింగీతం సినీ ప్రస్థానం..
తెలుగు దర్శక దిగ్గజంగా పేరు పొందిన కేవీ రెడ్డి వద్ద ఆయన సహాయకుడిగా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆయన తొలి చిత్రమే ‘మాయా బజార్’ కావడం యాధృచ్చికం. ఇలా ఏడు దశాబ్ధాలలో అనేక ప్రయోగాత్మక చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
అది జానపదమైన, సోషియే ఫాంటసీ అయినా, సైన్స్ ఫిక్షన్ అయినా తనదైన ముద్ర వేశాడు. ఎప్పటికి నవయువకుడిగా ఆలోచించడం ఆయన ప్రత్యేకత. ఇప్పటికి కూడా ఆయన యువకులు ధరించే టీ షర్ట్ ధరిస్తుంటారు. వయస్సు ఒక సంఖ్య మాత్రమే అని ఆయన ఎప్పుడు చెబుతుంటారు. కొత్త విషయాలు ఎప్పటికప్పుడూ నేర్చుకోవడమే తన విజయ రహస్యమని అంటారు. చిన్న చిన్న దర్శకుల నుంచి కూడా మంచి విషయాలు నేర్చుకుంటానని ఆయన సగర్వంగా చెబుతుంటారు.
తెరపై ప్రయోగాలు..
1972 లో కృష్ణంరాజు, కాంచన జంటగా నటించిన ‘నీతి నిజాయితీ’ సినిమాతో దర్శకుడిగా తెరంగ్రేటం చేశారు. ఇలా ఆయన తన ప్రయాణంలో దక్షిణాది భాషలతో పాటు హిందీలో కలిపి 60 కి పైగా సినిమాలు తీశారు. విలక్షణ నటుడు కమల్ హసన్ తో అనేక ప్రయోగాలు చేశారు.
మాటలు లేకుండా మూకీ తరహాలో కేవలం హావభావాలతో తెరకెక్కించిన సినిమాయే ‘ఫుష్పక విమానం’. ఇది ఆయనలోని సృజనాత్మకకు నిదర్శనం. ఈ సినిమా 1987 లో విడుదలై విజయం సాధించింది. రెండు జాతీయ పురస్కారాలు సైతం తన ఖాతాలో వేసుకుంది.
కమల్ హాసన్ గుడ్డివాడిగా ‘అమావాస్య చంద్రుడు’ , నాలుగు పాత్రలు పోషించిన ‘ మైకేల్ మదన కామ రాజు’, మరుగుజ్జుగా ‘విచిత్ర సోదరులు’ ఇలా ఆయనలోని నటనలోని కొత్త కోణాలు వెలికి తీశారు. నటులలోని నటనను బయటకు తీయడమే తన సినిమాల విజయానికి ప్రధాన కారణమని చెప్పారు.
బాలకృష్ణతో చేసిన జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’, సైన్స్ ఫిక్షన్ తో తెరకెక్కించిన ‘ఆదిత్య 369’ తెలుగులో అఖండ విజయాలు సాధించాయి. నర్తకి సుధా చంద్రన్ కథ ఆధారంగా ‘మయూరీ’, రాజేంద్ర ప్రసాద్ తో ‘మేడమ్’ మహిళా ఉద్యోగుల సమస్యల ఆధారంగా ‘ఆడవాళ్లకు మాత్రమే’ వంటి ప్రయోగాలు చేశారు.
సంగీత దర్శకుడిగా కూడా...
ఆయన దర్శక దిగ్గజమే కాదు.. సంగీతంపై కూడా సింగీతానికి పట్టు ఉంది. 1931 సెప్టెంబర్ 21 న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఆయన జన్మించారు. తండ్రి రామచంద్రరావు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, తల్లి శకుంతల బాయి వాయేలిన్ విద్వాంసురాలు. ఆయన విద్యాభ్యాసం ఉదయగిరి, గూడూర్, మద్రాస్ లో సాగింది.
ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు వద్ద శిష్యరికం చేసి సంగీతం నేర్చుకున్నారు. రెండు కన్నడ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. తెలుగులోనూ ఆయన తన ముద్ర వేశారు.
పెళ్లి...
సింగీతం వ్యక్తిగత జీవితం కూడా ఆసక్తికరమైనదే. 1960 లో లక్ష్మీ కల్యాణిని వివాహం చేసుకున్నారు. కథా చర్చలు, స్క్రిప్ట్ పనుల్లో ఆమె నుంచి సహకారం పొందిన సింగీతం, తననే వివాహం చేసుకున్నారు. వీరి మధ్య జీవిత ప్రయాణాన్ని ‘ శ్రీ కల్యాణీయం’ పేరుతో ఆత్మకథగా మలిచారు.
ఆమె కుమార్తె ఈ ఆత్మకథను ఇంగ్లీష్ లో అనువదించారు. మనవడు దీన్ని విడుదల చేశారు. 2002 లో ఆయన భార్య మరణించిన తరువాత సింగీతం చెన్నైలో నివసిస్తున్నారు.
రెండు జాతీయ పురస్కారాలు, ఐదు నంది అవార్డులు, పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా భారతీయ సినిమా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. సినిమా ఉన్నంత కాలం ఆయన పుష్పక విమానం ఎగురుతూనే ఉంటుంది.
Next Story

