
రఘు కుంచె 'గేదెల రాజు' రివ్యూ
ఒక్క నిజం… వంద అనుమానాలు!
కాకినాడ లో రౌడీ షీటర్ గేదెల రాజు అలియాస్ భగవాన్ రాజు (రఘు కుంచె) అంటే అందరికీ భయం. మొండితనం, తిరుగులేని పవర్ ఉన్న రాజుకు రాజకీయాల్లోకి వెళ్లాలనే బలమైన కోరిక ఉంటుంది. ఈ క్రమంలో కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తాడు. అనుకున్నట్లుగానే గేదెల రాజుకే కేటాయిస్తారు. అయితే, అదే పార్టీకి చెందిన రాజు చిరకాల శత్రువు, ఆల్కహాల్ బిజినెస్ చేసే దుర్గ (శ్రీకాంత్ అయ్యంగార్) కూడా అదే టికెట్ ఆశించి భంగపడతాడు. వీరిద్దరి మధ్య వైరం తీవ్రమవడంతో, ఎమ్మెల్యే వారిద్దరినీ పిలిపించి కలిసి పనిచేయాలని సూచిస్తారు. కానీ, అందుకు ఇద్దరూ నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఊహించని మలుపు
అదే రోజు రాత్రి షాకింగ్‌గా గేదెల రాజు హత్యకు గురవుతాడు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీస్ డిపార్ట్ మెంట్ ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకుంటుంది. సి.ఐ. స్వాతి (దివ్య) ఆధ్వర్యంలో విచారణ మొదలవుతుంది. పోలీసులు రాజు సోదరుడు శ్యాంబాబుతో పాటు దుర్గను కూడా అనుమానించి విచారిస్తారు. అయితే, ప్రాథమిక విచారణలో ఈ హత్యతో వారికి సంబంధం లేదని తేలడంతో కేసు మిస్టరీగా మారుతుంది.
ప్రేమ జంటల లింక్
ఈ హత్యోదంతం వెనుక విజయ్ (రామచంద్రం) - సత్య (టీనా శ్రావ్య), రిచ్ (వికాస్) - మీరా (మౌనిక) అనే రెండు ప్రేమ జంటల ప్రమేయం ఏంటి? శివయ్య ( రవి ఆనంద్) కు ఈ హత్యతో సంభందం ఏమిటి... గేదెల రాజు ని చంపిందెవరు? రాజకీయ కారణాల వల్ల రాజు హత్యకు గురయ్యాడా లేక ఈ గందరగోళం వెనుక మరేదైనా వ్యక్తిగత కారణం ఉందా? పోలీసులకు ఎదురైన సవాళ్లను అధిగమించి ఈ మర్డర్ మిస్టరీని ఎలా చేధించారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
ఎనాలసిస్ ..
దర్శకుడు చైతన్య మోటూరి ఈ మర్డర్ మిస్టరీని సాధారణ కథగా కాకుండా, స్క్రీన్‌ప్లే పజిల్‌గా ట్రీట్ చేశాడు. కథ కంటే కథనం (Narration)కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సినిమా ఇది.
గేదెల రాజు హత్యతోనే ప్రారంభమవ్వడం వల్ల ఆడియెన్స్‌ను వెంటనే కథలోకి లాగేస్తుంది. ఆ తర్వాత ప్రతి ఒక్క అనుమానితుడిని పరిచయం చేస్తూ వాళ్ల ఫ్లాష్‌బ్యాక్ ద్వారా కథను విభజించడం జరగింది. ప్రతి పాత్రను “సస్పెక్ట్”లా చూపించడం. అలాగే కథలో బాగంగా రెండు లవ్ స్టోరీలు, ఐదు సబ్‌ప్లాట్స్ ద్వారా మల్టీ-లేయర్డ్ నేరేషన్ తో కథని నడిపారు.
స్క్రీన్ ప్లే పరంగా ఇది ఒక ఎఫెక్టివ్ టెక్నిక్… కానీ ఇక్కడ ఓ సమస్య ఉంది. చాలా ట్రాక్స్ ఒకేసారి రావడం వల్ల ఎమోషనల్ కనెక్ట్ కంటే కన్ఫ్యూజన్ పెరుగుతుంది. దానికి తోడు చూసే వారికి ఇబ్బంది అవుతుందనే అనుమానంతో ఫస్ట్ హాఫ్‌లో స్టోరీ సెట్ చేయడానికే ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. అలాగే కొన్ని సీన్స్ కేవలం “ఇన్ఫర్మేషన్ కోసం” ఉన్నట్టు అనిపిస్తాయి. దాంతో అక్కడ డ్రామా పుట్టదు. కాస్త విసుగిస్తుంది. అయినా ఎవరు చంపారు అనే యాంగిల్ చివరి దాకా సస్పెన్స్ గా మెయింటైన్ చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ఇక గేదెల రాజు పాత్ర కథలో కీలకం అయినప్పటికీ, స్క్రీన్ మీద పాత్ర ప్రెజెన్స్ అంత ప్రభావవంతంగా లేదు. మాటల్లో రౌడీ… ఫ్రేమ్‌లో బలం తక్కువ. “పెద్ద రౌడీ షీటర్” అని డైలాగ్స్ చెప్తాయి. కానీ విజువల్స్‌లో ఆ థ్రెట్ ఫీల్ కనిపించదు. అయినా ప్రారంభంలో చనిపోయిన పాత్రను చూసి మనం ఎందుకు భయపడతాము. ఓ రకంగా ఈ పాత్ర “Show, Don’t Tell” ప్రిన్సిపల్ మిస్ అయిన కేస్. అది మరికాస్త స్ట్రాంగ్ గా రాసుకోవాల్సింది.
దానికి తోడు మర్డర్ సీన్ ఇంపాక్ట్ తక్కువగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం విజువల్‌గా బాగా ప్లేస్ చేశారు. అయితే కథకు కీలకమైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ — క్లీన్ & గ్రిప్పింగ్ గా నడిపారు. ఇలాంటి మర్డర్ మిస్టరీలో రెండు లవ్ స్టోరీలు పెట్టడం ఒక కొత్త ప్రయత్నం. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం — అన్‌ప్రెడిక్టబుల్ & సాటిస్ఫైయింగ్
'కనిక నీతి'
ఈ కథను మహాభారతం లోని కనిక నీతితో లింక్ చేయడం సినిమాకు ఒక డెప్త్ ఇచ్చింది. ఇంతకీ కనిక నీతి ఏమిటి అంటే...పాండవుల ఎదుగుదల చూసి అసూయ పడుతున్న ధృతరాష్ట్రుడికి, శకుని మిత్రుడైన 'కనికుడు' అనే బ్రాహ్మణ మంత్రి ఈ నీతిని బోధిస్తాడు. పాండవులను ఎలా అణచివేయాలో ఆయన ధృతరాష్ట్రుడికి సలహా ఇస్తాడు.
కనికుడు చెప్పిన సారాంశం ఏమిటంటే.. శత్రువు ఎంతటి వాడైనా, వారితో స్నేహం చేస్తున్నట్లు నటిస్తూనే అవకాశం దొరికినప్పుడు ఏమాత్రం కనికరం లేకుండా సంహరించాలని కనికుడు చెబుతాడు.
నక్క కథ: కనిక నీతిని వివరించడానికి ఆయన ఒక నక్క కథను చెబుతాడు. ఒక నక్క తనకంటే బలమైన పులి, తోడేలు, ఎలుక ,ముంగిసలతో స్నేహం చేసి, అవి వేటాడిన జింకను తన తెలివితేటలతో మొత్తం తానే ఎలా సొంతం చేసుకుందో వివరించి, రాజనీతిలో స్వార్థం, విజయం ముఖ్యమని బోధిస్తాడు.
ఎవరెలా చేసారు
ఈ సినిమాని రఘు కుంచె భుజాల మీద మోసారు. రౌడీ షీటర్ గా విలనిజం ప్రదర్శిస్తూ సాగిందా పాత్ర. శివయ్యగా రవి ఆనంద్ అదరకొట్టారు. మరిన్ని మంచి పాత్ర పడితే తెలుగులో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవ్వుతారనిపించింది . విజయ్‌గా రామచంద్రం ..హీరో లాంటి పాత్ర చేసారు. చిన్న సినిమాలకు ఓ కొత్త హీరో దొరకారు. ఇక వికాస్, టీనా శ్రావ్య, మౌనికలు కూడా తమదైన నటనతో ఆకట్టుకున్నారు.
టెక్నికల్ గా
రఘు కుంచె బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్. మొదటి పాట బాగుంది. సినిమాటోగ్రఫీ నడిచిపోయింది. ఎడిటర్ ఎక్కడ ఏం తీసేస్తే ఏమి మిస్సవుతారో చూసేవాళ్లు అని భయంతో చేసినట్లు అనిపించింది. దర్శకుడు కొత్తవాడైనా ఇలాంటి నేరేషన్ తో సినిమా చేయాలనుకోవటం ధైర్యమే. అందుకు అతన్ని అభినందించాలి. "చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు" అనే చిత్ర క్యాప్షన్‌కు తగ్గట్టుగానే, హంతకులెవరు అనే ఉత్కంఠను చివరి వరకు దర్శకుడు కొనసాగించగలిగారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఎవరు చూడవచ్చు?
మర్డర్ మిస్టరీ ప్రియులకు, ముఖ్యంగా కథలో పజిల్స్ విప్పడం ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి అనుభూతినిస్తుంది.
ఫైనల్ థాట్
ఇది ఒక హత్య కథ కాదు… అనుమానాల ఆట. కనిపించేది నిజం కాదు… వినిపించేది క్లూ కాదు… ప్రతి పాత్రలో ఒక ముసుగు… ప్రతి ముసుగులో ఒక రహస్యం. చివరికి నిజం బయటపడేది ఒక్కసారే —కానీ ఆ ఒక్క నిజం కోసం సినిమా మొత్తం నువ్వు నిన్నే అనుమానించుకునేలా చేస్తుంది. ఇదే ఈ కథ బలం… ఇదే దాని బలహీనత కూడా.

