
'వాలా 2' (తెలుగు డబ్బింగ్) రివ్యూ
నవ్వులే కాదు, కన్నీళ్లు కూడా!
ఇదో నలుగురు అల్లరి చిల్లరి కుర్రాళ్ల కథ. చిన్ననాటి స్నేహితులు హషీర్, అలెన్. వీళ్లకో తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. అలెన్ చెల్లెలు అస్నాను మరో కుర్రాడు అజిన్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడతాడు. దాంతో ఈ స్నేహితులకు కాలుతుంది. దాంతో వాడి మీదకు ఈ ఇద్దరు ప్రెండ్స్ యుద్దానికి వెళ్తారు. అక్కడ అజిన్ కు తోడుగా అతని ప్రెండ్ వినాయక్ ఈ దెబ్బలాటకు వస్తారు. పెద్ద దెబ్బలాట అయ్యిన కొంతకాలానికి గొడవ పడ్డవాళ్లు, గొడవకు మూలమైన వాళ్లు నలుగురు మంచి స్నేహితులు అయ్యిపోతారు. అక్కడ నుంచి నలుగురూ హ్యాపీగా కలిసి తిరుగుతూ అల్లరి డోస్ పెంచేస్తారు. కాలేజీలో ప్రతీ చెత్తపనికి వీరే ముందుంటారు.
కాలేజీకు రాకుండా సినిమాలకు వెళ్లటం, క్లాసుల్లో సెల్ ఫోన్ లు వాడటం, ఇదేంటని అడిగితే గొడవపడటం చేస్తూంటారు. ఇలా నలుగురు కలిసి జనాలని కొట్టడం, మందు కొట్టడంతో మొదలైన రచ్చ డ్రగ్స్ తీసుకోవటంతో పీక్స్ కు వెళ్తుంది. ఆ డ్రగ్స్ మత్తులోనే ఓ గొడవ జరిగి ఓ టీచర్ తలపగలకొడతారు. అంతే అప్పటిదాకా ఏదో కుర్రాళ్లలే..ఆ వయస్సులో అలాగే ఉంటారు. అంటూ.. వీళ్ల మీద కొద్దో గొప్పో సాప్ట్ కార్నర్ ఉన్నవాళ్లు సైతం వీళ్లను అసహ్యించుకోవటం మొదలెడతారు. మరో ప్రక్క ఈ గొడవ పోలీస్ లు దాకా వెళ్తుంది. పోలీస్ ఆఫీసర్ (ఆల్ఫోన్స్ పుత్రన్) వీళ్ల జీవితంలోకి వస్తాడు.
ఎప్పుడైతే ఈ గొడవతో రచ్చ రచ్చ అయ్యిందో...కాలేజీలోనూ,బయిట, ఇళ్లదగ్గరా అంతా ఈ నలుగురు కుర్రాళ్లను వెలేసినట్లు చూస్తారు. అప్పుడు అర్దమవుతుంది ఈ కుర్రాళ్లకు తాము ఎంతలా ఇరుక్కుపోయామో, అవమానాలు భరించాల్సి వస్తోందో. దాంతోఎలాగైనా కష్టపడి చదివి ఇంటర్‌మీడియట్ పాసై పై చదువుల కోసం యూకే వెళ్ళి తామేంటో నిరూపించుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో వాళ్లు ఏం చేసారు. వీళ్ల జీవితాలు ఏ టర్న్ తీసుకున్నాయి. వీళ్ల ప్రేమ కథలు ఏ తీరానికి చేరుకున్నాయి అనేది తెలియాలంటే సినిమ చూడాల్సిందే.
ఎనాలసిస్
2024లో మలయాళంలో ఘనవిజయం సాధించిన 'వాళా' (Vaazha) సినిమా ప్రధాన బలం అందులో కంటెంట్.. కలిగించిన కనెక్టివిటీ (Relatability). ఆ సినిమాలోని ఎక్కువ భాగం ఫన్ తో నిండి ఉంటుంది, ముఖ్యంగా హీరోలు తమ తెలివితక్కువ నిర్ణయాలతో జీవితాలను ఎలా పాడు చేసుకుంటారో చూసి మనం నవ్వుకుంటాం. అయితే, సినిమా క్లైమాక్స్ కు వచ్చేసరికి ఆ పాత్రల పట్ల సానుభూతిని చూపిస్తూ, మనం పెద్దగా పట్టించుకోని తప్పుదారి పట్టిన పెంపకం (Flawed parenting) వంటి అనేక అంశాలను ఎత్తి చూపుతూ, వారి తరపున నిలబడి ప్రశ్నిస్తుంది. ఆ బాలెన్సే ఓ కామెడీ , మామూలు సినిమాను ఒక భారీ హిట్ చేసింది.
ఇక ఇప్పుడు ఆ సినిమాకు కథ అందించిన విపిన్ దాస్, మరోసారి అదే ఫార్ములాతో ఒక సీక్వెల్‌ను (కొత్త దర్శకుడు సవిన్ ఎస్.ఏతో కలిసి) తీసుకువచ్చారు. అయితే, ఈ సారి తీసుకున్న నేపథ్యం ఇప్పటి కాలానికి సంబంధించిన సమకాలీన సమస్యలను (Contemporary issues) స్పృశిస్తూ రాసుకున్నారు. అందుకే ఆ పాత ఫార్ములా రిపీట్ అవుతున్నా మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టదు. మొత్తం మీద, టార్గెట్ ఆడియన్స్ అయితే యూత్ లాంగ్వేజ్ లోనే వారికి బుద్ధులు చెబుతూ సాగే ఒక మంచి ఫన్ ఫిల్మ్ ఇది.
అప్పట్లో వచ్చిన మొదటి భాగం ..రెగ్యూలర్ గాఅబ్బాయిలు ఎదుర్కొనే సమస్యలను...అంటే ఫ్రంట్ బెంచర్లపై ఉండే ఒత్తిడి, లాస్ట్ బెంచర్లపై ఉండే చులకన భావం, మిడిల్ బెంచర్ల అయోమయం వంటి వాటిని స్పృశిస్తే, ఈ రెండో పార్ట్ కొంచెం ప్రత్యేకమైన అంశాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ప్రస్తుతం యూత్ అంతా విదేశాలకు (UK వంటి దేశాలకు) వెళ్లడమే గొప్ప అని, అక్కడ జీవితం అంతా చాలా అద్బుతంగా ఉంటుందని అనుకునే ట్రెండ్ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగాఈ ఫ్రాంచైజీకి ప్రాణం హాస్యం (Humor). అదే కలిసి వచ్చింది. లేకపోతే ఈ సినిమా జెన్-జీ (Gen Z) వెర్షన్ 'ఆడుజీవితం'లా అయ్యిపోయేది.
ఎవరెలా చేసారు
కేరళలో సోషల్ మీడియాతో ఫేమస్ అయిన కుర్రాళ్లే ప్రధాన పాత్రధారులుగా, నిజ జీవిత పేర్లతోనే వాళ్లని తెరపై చూపించారు. అయితే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు వెండితెరపై స్టార్లుగా మారటం అంటే అంత ఈజీకాదు. ఎందుకంటే ఈ క్రియేటర్ల శైలిని మనం ఇప్పటికే వారి ఆన్‌లైన్ వీడియోల ద్వారా చూసేసి ఉంటాం. అందుకే సినిమా దర్శకులు వారిని తమ సినిమాల్లో తీసుకున్నప్పుడు, వారి నటన సామర్థ్యం కంటే వారికున్న ఫాలోయింగ్‌ని టిక్కెట్ల అమ్మకాల కోసం వాడుకోవడమే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఆశ్చర్యకరంగా ఆయా సీన్స్ లో వీరందరూ అద్భుతమైన నటనను కనబరిచారు.
టెక్నికల్ గా చూస్తే..
ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సవిన్ ఎస్.ఏ టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ ఉన్నవాడే. ముఖ్యంగా ఎడిటింగ్ ప్యాటర్న్ ద్వారా సినిమా స్పీడుని (Pacing) అద్భుతంగా మెయింటైన్ చేశారు. సినిమాలో వచ్చే ఇన్‌సెర్ట్ షాట్లు లాజికల్‌గా సంబంధం లేకపోయినా, సినిమాలోని ఎనర్జిటిక్ రిథమ్‌లో భలేగా కలిసిపోయాయి.
సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, పాత్రల ఎమోషన్ ని బట్టి విజువల్ స్టైల్ మారుతూ ఉంటుంది. కేరళలో జరిగే చిన్నప్పటి సీన్స్ వాళ్ల ఎనర్జీని ప్రతిబింబించేలా డైనమిక్ స్టైల్ వాడారు. అదే వారువిదేశాలకు వెళ్ళాక తమ జీవితాల్లోని చేదు నిజాలను గ్రహించే దశకు వచ్చేసరికి, విజువల్ లాంగ్వేజ్ చాలా ప్రశాంతంగా (Calmer) మారిపోతుంది. పాటలు ఓకే. క్లైమాక్స్ ముందు వచ్చే పాట ఎమోషనల్ గా ఉంది. అలాగే తెలుగు డబ్బింగ్ కూడా ఇక్కడ వారిని దృష్టిలో పెట్టుకుని చేయించారు. కొన్నిడైలాగులు బాగా పేలాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఫెరఫెక్ట్.
ఫైనల్ థాట్
సినిమా అంతా చూసాక ఏముంది సినిమాలో అనిపిస్తే మీరు మన డ్రామా సినిమాలకు కనెక్ట్ అయ్యి ఇంకా బయిటకు రాలేదని అర్దం. ఇది ఒక "స్లైస్ ఆఫ్ లైఫ్" (slice-of-life) సినిమా, ఫన్ తో చెప్పారు. అలా చూస్తేనే ఎంజాయ్ చేయగలం.

