టైటిల్ వింటేనే వికారం.. అందుకే థియేటర్లకు జనం రావట్లేదా?
x

టైటిల్ వింటేనే వికారం.. అందుకే థియేటర్లకు జనం రావట్లేదా?

కంటెంట్ ఉన్నా కనెక్షన్ లేదు


ఒకప్పుడు తెలుగులో డబ్బింగ్ సినిమాల హవా నడిచింది. తమిళం నుంచి కానీ హిందీ నుంచి కానీ , మళయాళం నుంచి కానీ ఓ డబ్బింగ్ సినిమా వస్తుందంటే.. అది అచ్చతెలుగు సినిమా అనేంతగా మమేకమైపోయేవాళ్లం. అందుకు తగ్గట్లే తెలుగులో పాటలు, టైటిల్ వీటిన్నపై నిర్మాతలు శ్రద్ద చూపేవాళ్లు. థియేటర్ రివిన్యూ తప్పనిసరి అయ్యిన రోజులు అవి. డబ్బింగ్ సినిమాని అంతంత రేటు పెట్టి కొన్నప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకోకపోతే మునిగిపోతాం అని తెలుసు. అయితే ఇప్పుడు పరిస్దితలు మారాయి.

కేవలం ఓటిటిల కోసం అన్నట్లుగా డబ్బింగ్ సినిమాలు థియేటర్ కు తెస్తున్నారు. ఈ క్రమంలో 'వేట్టయాన్', 'రాయన్', 'పల్లిచట్టంబి' వంటి పేర్లు చూసి సగటు ప్రేక్షకుడు దండం పెట్టేసి వెనక్కి తిరిగిపోతున్నాడు. కంటెంట్ బాగున్నా సరే, టైటిల్ వినగానే కలిగే ఒక రకమైన 'వికారం' డబ్బింగ్ సినిమాల కొంప ముంచుతోంది. కాకపోతే దాన్ని పట్టించుకునేదెవరు..డబ్బింగ్ సినిమా రిలీజ్ పై ప్రత్యేకమైన రెవిన్యూ ఆశించినప్పుడే జాగ్రత్తలు అన్నీ వస్తాయి. అలాంటిది లేనప్పుడు ఇలాంటి సమస్యలే మొదలవుతాయి.

ఆ రోజుల్లో..

తెలుగు సినీ చరిత్రలో మణిరత్నం, శంకర్ వంటి దిగ్గజాల చిత్రాలకు డబ్బింగ్ అంటే అదొక కళ. అప్పట్లో 'రోజా', 'ముంబై', 'జెంటిల్ మేన్' వంటి సినిమాలకు తెలుగు సాహిత్యం తెలిసిన గొప్ప రైటర్లతో పాటలు, మాటలు రాయించేవారు. సినిమా టైటిల్ చూస్తే చాలు, ఇదొక చక్కని తెలుగు కథ అనే ఫీలింగ్ వచ్చేది. కానీ నేడు పరిస్థితి రివర్స్ అయింది. మన భాషలో అర్థవంతమైన పేరు పెట్టడానికి కూడా నిర్మాతలు బద్ధకిస్తున్నారు.

ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయాన్’కు తెలుగులో కనీస ఓపెనింగ్స్ రాలేదంటే దానికి ప్రధాన కారణం ఆ టైటిల్ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ధనుష్ విషయంలోనూ అదే జరుగుతోంది. 'రాయన్', 'ఇడ్లీ కడై' (ఇడ్లీ కొట్టు) తర్వాత ఇప్పుడు వస్తున్న ‘కర’ అనే టైటిల్ తెలుగు ప్రేక్షకులకు అస్సలు ఎక్కడం లేదు. 'కరసామి' నుంచి తీసుకున్న ఈ టైటిల్ వినడానికి వింతగా ఉండటంతో ప్రోమోలలో విషయం ఉన్నా జనాల్లో బజ్ పెరగడం లేదు. మలయాళ బ్లాక్‌బస్టర్ 'వాలా-2' లేదా టొవినో థామస్ 'పల్లిచట్టంబి' వంటి సినిమాల పేర్లు వింటే అసలు ఇవి తెలుగు సినిమాలేనా అనే సందేహం కలుగుతోంది.

ఎందుకు ఒరిజినల్ టైటిల్స్ వదలడం లేదు?

పాన్ ఇండియా బ్రాండింగ్: దేశవ్యాప్తంగా ఒకే పేరుతో సినిమాను ప్రమోట్ చేయడం వల్ల సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) సులభమవుతుందని భావిస్తున్నారు.

ప్రొడక్షన్ ఖర్చు తగ్గింపు: తెలుగులో ప్రత్యేకంగా టైటిల్ లోగో డిజైన్ చేయడం, సెన్సార్ ఫార్మాలిటీస్ వంటి చిన్నపాటి ఖర్చులను కూడా తగ్గించుకోవాలనే ఆలోచన.

క్రియేటివ్ ఈగో: సినిమా టైటిల్ మార్చితే దాని 'ఒరిజినాలిటీ' పోతుందని మేకర్స్ అనుకోవడం.

నిర్మాతల ఆలోచన:

“ప్రేక్షకుడు అడ్జస్ట్ అవుతాడు… భాష అడ్డంకి కాదు”

కానీ… నష్టాలు కూడా అంతే గట్టిగా ఉన్నాయి

1. ఫస్ట్ ఇంప్రెషన్ ఫెయిల్యూర్

టైటిల్ అర్థం కాకపోతే… ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. ట్రైలర్ కూడా చూడాలనిపించదు

2. లోకల్ కల్చర్ మిస్

తెలుగు ప్రేక్షకుడికి తన భాషలోనే ఎమోషన్ స్ట్రాంగ్‌గా తాకుతుంది. అదే కనెక్షన్ పోతుంది

3. నెగటివ్ బజ్

సోషల్ మీడియాలో మొదటి చర్చే: “ఈ పేరు ఏంటి?”. సినిమా కంటే టైటిల్ ట్రోల్ అవుతుంది

4. ఓపెనింగ్స్‌పై ఇంపాక్ట్

కంటెంట్ బాగున్నా…మొదటి రోజు కలెక్షన్స్ పడిపోతాయి

అసలు సమస్య ఏమిటి?

ఇది భాష సమస్య కాదు…

“రెస్పెక్ట్” సమస్య.

తెలుగు మార్కెట్ నుంచి కోట్ల రూపాయలు ఆశించే వాళ్లు…

కనీసం ఒక లోకల్ కనెక్ట్ ఇవ్వడానికి కూడా ప్రయత్నించకపోవడం

→ ఇదే ప్రేక్షకుడిని దూరం చేస్తోంది.

మార్పు ఎక్కడి నుంచి రావాలి?

ప్రేక్షకుడు ఇప్పటికే తన అభిప్రాయాన్ని చెబుతున్నాడు— చూడకుండా వదిలేస్తూ. బజ్ క్రియేట్ చేయకుండా వదిలేస్తున్నాడు.

ఇప్పుడు మారాల్సింది ఇండస్ట్రీ మైండ్‌సెట్. పాన్-ఇండియా అంటే ఒకే పేరు కాదు… ప్రతి భాషలో కనెక్ట్ అయ్యే ప్రయత్నం అని అర్దం చేసుకోవాలి.

ఏదైమైనా తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలో ఎక్కడి కంటెంట్‌నైనా ఆదరిస్తారు, కానీ అది మనదైన ముద్రతో ఉన్నప్పుడు మాత్రమే. సొంత భాషా అస్తిత్వాన్ని పక్కన పెట్టి, పరభాషా పేర్లతో కోట్లు కొల్లగొట్టాలనుకోవడం అత్యాశే అవుతుంది. కనీసం టైటిల్ కూడా తెలుగులో మార్చుకోలేని స్థితిలో డబ్బింగ్ సినిమాలు ఉంటే, భవిష్యత్తులో అవి కేవలం ఓటీటీలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

ఫైనల్ గా...

సినిమాకు టైటిల్ అనేది చిన్న విషయం అనుకుంటున్నారు… కానీ అదే సినిమా పుట్టిన సర్టిఫికేట్ అన్న విషయం మర్చిపోతున్నారు.

పేరే పట్టు లేకపోతే… కథ ఎంత గొప్పదైనా, కంటెంట్ ఎంత అద్బుతమైనా… ప్రేక్షకుడు కళ్ళు కూడా అటు వైపు పడవు.

“పాన్ ఇండియా” పేరుతో పరభాష టైటిల్స్ పెడుతూ…ప్రేక్షకుడి పాకెట్ మాత్రం లోకల్‌గా ఖాళీ చేయాలని చూస్తే చెల్లే రోజులు పోయాయి.

చివరికి ఒక మాట—

పేరు పలకలేని సినిమాని…

ప్రేక్షకుడు పలకరించడు!

Read More
Next Story