
ఫెరఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్: 'కలంకావల్' మూవీ రివ్యూ
సిగరెట్ పొగతో కూడా వణుకు పుట్టించవచ్చు
స్టాన్లీ దాస్ (మమ్ముట్టి) ఓ సైకో కిల్లర్. అతను టార్గెట్ ఒంటరిగా ఉండే మహిళలు. పెళ్లి చేసుకుంటానని చెప్పి, వాళ్లతో గడిపి అదే రోజు హత్య చేస్త్తూంటాడు. అలా కేరళ-తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో ఆడవాళ్లు ను చాలా మందిని చంపేస్తాడు. దాంతో వారంతా కనిపించకుండా పోవడంతో ఇరు రాష్ట్రాల పోలీసులు దీనిపై ఎంక్వైరీ మొదలెడతారు. ఈ క్రమంలో కేరళ పోలీసులు ఈ కేసు విచారణకు ఎస్సై జయకృష్ణన్ (వినాయకన్)ను నియమిస్తారు. అతను ఎలా ఎంక్వైరీ చేసి స్టాన్లీదాస్ ని చేరుకుంటాడు. అసలు స్టాన్లీ హత్యలు చేయడానికి కారణం ఏంటి? పోలీసులకు దొరక్కుండా ఎలాంటి స్కెచ్ లు వేస్తూంటాడు? చివరకు ఏమైంది అన్నది చిత్ర కథ.
విశ్లేషణ
దుల్కర్ సల్మాన్ బ్లాక్ బస్టర్ హిట్ 'కురుప్' (Kurup) గుర్తుందా? ఒక క్రిమినల్ కథను కమర్షియల్ హంగులతో చూపించి ఆడియన్స్‌ను మెప్పించిన డైరెక్టర్ జితిన్ కె జోస్.. ఇప్పుడు తన దర్శకత్వంలో మమ్ముట్టితో 'కలంకావల్' (Kalamkaval) అనే ఈ థ్రిల్లర్‌ను పట్టాలెక్కించారు. నిజ జీవితంలో సైనైడ్ మోహన్ కథను తెరకు ఎక్కించాడు. మోహన్ బాధితులను ఎలా ట్రాప్ చేసేవాడు? హత్య చేసేటప్పుడు అతను అనుసరించే ఆ భయంకరమైన పద్ధతులు (Pattern) ఏంటి? అనే ప్రతి ఎలిమెంట్‌ను ఈ సినిమాలో జితిన్ కె జోస్ మరియు జిష్ణు శ్రీకుమార్ ఉన్నది ఉన్నట్లుగా తీసుకున్నారు.
సైనైడ్ మోహన్ క్రైమ్స్ ని ఇప్పటికే హిందీలో ‘దహాద్’ (Dahaad) మరియు ‘భగవత్’ (Bhagwat) వంటి ప్రాజెక్టులలో మనం చూశాం. కథాంశం పాతదే అయినా.. దర్శకుడు జితిన్ కె జోస్ ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు, సీన్ సీన్‌కు పెంచిన ఉత్కంఠ ప్రేక్షకులను సీట్లలో కుదురుగా కూర్చోనివ్వడం లేదు. ఈ పాత కథకు జితిన్ ఇచ్చిన సరికొత్త ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి.
నిజానికి సైనైడ్ మోహన్ కేసులో ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమీ ఉండదు. కానీ, ఇక్కడే జితిన్ తన 'క్రియేటివ్' బుర్రకు పదును పెట్టారు. ఆ బోర్ కొట్టే ఇన్వెస్టిగేషన్‌కు అద్భుతమైన ఫ్లేవర్ జోడించి, సినిమాలో ఒక మేజర్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఒక్క ట్విస్ట్ మొత్తం కథను, ఆ కిల్లర్ పద్ధతులను ఒక సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది.
మలయాళ సినిమా తన జానర్ పరిధులను ఎలా దాటుతుందో చెప్పడానికి 'కలంకావల్' ఒక నిలువెత్తు సాక్ష్యం గా చెప్పాలి. ఒక రియల్ లైఫ్ క్రిమినల్ ఐడియాను తీసుకుని, దానికి ఫిక్షన్ జోడించి ఒక సామాజిక కోణాన్ని (Social Angle) ఎలా టచ్ చేయవచ్చో ఈ సినిమా స్క్రిప్ట్ నేర్పిస్తుంది.
సాధారణంగా ప్రజలందరికీ తెలిసిన ఒక క్రైమ్ స్టోరీని సినిమాగా మలచాలంటే రెండు దారులు ఉంటాయి: ఎవరూ ఊహించని ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ (POV) నుండి కథను చెప్పడం. లేదా అసలు కథలోని ఐడియాను తీసుకుని, దానికి ఒక “What If” (ఒకవేళ ఇలా జరిగితే?) అనే ఊహను జోడించి కొత్త వెర్షన్ క్రియేట్ చేయడం. డైరెక్టర్ జితిన్ కె జోస్ రెండో మార్గాన్ని ఎంచుకుని, ఒక సాటిస్‌ఫైయింగ్ థ్రిల్లర్‌ను మన ముందుకు తెచ్చారు.
పబ్లిక్ డొమైన్‌లో ఉన్న ఒక కథను (సైనైడ్ మోహన్ ఉదంతం) నేరుగా చెబితే అది డాక్యుమెంటరీ అవుతుంది. కానీ జితిన్ కె జోస్ ఇక్కడ "What If" విధానాన్ని వాడటంతో కొత్తదనం వచ్చింది. సైనైడ్ మోహన్ కథను కేవలం ఒక కిల్లర్ కథగా కాకుండా, ఒక మతపరమైన ఘర్షణకు (Communal Violence) లింక్ చేయడం అనేది ఈ స్క్రిప్ట్‌లోని అసలైన మేధావితనం.
కథ 2000ల ప్రారంభంలో సాగుతుంది. దక్షిణ కేరళలో జరిగిన ఒక మతపరమైన ఘర్షణకు (Communal Violence) గల అసలు కారణాన్ని కనుగొనే బాధ్యత ఆఫీసర్ జయకృష్ణన్ (వినాయకన్) పై పడుతుంది. ఒక అమ్మాయి ఎవరో వ్యక్తితో లేచిపోవడం వల్ల తలెత్తిన అపోహలే ఆ అల్లర్లకు కారణమని జయకృష్ణన్ ప్రాథమిక విచారణలో తేలుతుంది. కానీ, లోతుగా దర్యాప్తు చేసే కొద్దీ ఒక భయంకరమైన గొలుసుకట్టు మిస్టరీ బయటపడుతుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది మహిళలు ఒకే తరహా ప్యాట్రన్‌లో అదృశ్యం కావడాన్ని జయకృష్ణన్ గమనిస్తాడు. ఆ అదృశ్యాల వెనుక ఉన్నది ఎవరు? ఆ మహిళలకు ఏమైంది? అనే అన్వేషణే ఈ 'కలంకావల్'.
క్యారెక్టర్ ఆర్క్స్ & సింబాలిజం
స్టాన్లీ (మమ్ముట్టి): ఇతను కేవలం కిల్లర్ మాత్రమే కాదు, ఒక వ్యవస్థలోని లొసుగులను వాడుకునే ఒక 'ప్రిడేటర్'. అతని అలియాస్ పేర్లు, అతను బాధితులను ట్రాప్ చేసే విధానం అత్యంత క్రూరంగా ఉన్నా, తెరపై అది ఒక 'ఆర్ట్' లాగా (Elegant) ప్రెజెంట్ చేసారు.
జయకృష్ణన్ (వినాయకన్): ఈ పాత్ర ద్వారా ప్రేక్షకుడు ఇన్వెస్టిగేషన్ లోకి వెళ్తాడు. అల్లర్ల వెనుక ఉన్న నిజాన్ని వెతికే క్రమంలో అతను ఒక అగాధంలోకి వెళ్లడం, అక్కడ అతనికి ఎదురైన నిజాలు స్క్రిప్ట్ ఇంటెన్సిటీని పెంచాయి.
సింబాలిజం: సిగరెట్ పొగ రింగులకు కూడా ఒక ఆర్క్ ఇవ్వడం అనేది దర్శకుడి విజన్ కు నిదర్శనం. సూపర్ స్టార్ల క్యామియోల కంటే ఆ పొగ రింగులు ఎక్కువ ఇంపాక్ట్ చూపడం అంటే, స్క్రిప్ట్ పై దర్శకుడికి ఉన్న పట్టు అర్థమవుతుంది.
టెక్నికల్ గా ..
స్క్రిప్ట్ ,ఎడిటింగ్ మధ్య గీతలు చెరిగిపోవటం ఈ సినిమాలో గమనించవచ్చు. అలాగే ముమ్మట్టి వచ్చినప్పుడు వచ్చే పాత తమిళ పాట కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాదు, అదొక 'టెర్రర్ ఎలిమెంట్'. ఆ పాట వినిపించినప్పుడల్లా బాధితులకు ఏదో జరగబోతోందనే ఒక భయంకరమైన వాతావరణాన్ని (Sinister Atmosphere) సృష్టించడంలో స్క్రిప్ట్ సక్సెస్ అయ్యింది. ఫైసల్ అలీ ఫొటోగ్రఫీ థ్రిల్లర్ సినిమాకు ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలనే పాఠంలా ఉంది.
ఇక ఒక సైకో కిల్లర్ ఎంత ప్రశాంతంగా ఉంటూనే ఎంతటి క్రూరత్వానికి ఒడిగడతాడో మమ్ముట్టి తన కళ్ళతోనే చూపించారు. వినాయగన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ముమ్మట్టి కు పోటా పోటీగా చేసారు.
చూడచ్చా?
క్రైమ్ థ్రిల్లర్స్ చూడటం ఇష్టపడేవాళ్ళకు ఇది ఫెరఫెక్ట్ ఛాయిస్, హింస మితిమీరి లేదు కాబట్టి ఫ్యామిలీలు కూడా ఓ లుక్కేయచ్చు.
ఎక్కడ చూడచ్చు?
'సోనీ లివ్' లో తెలుగులో ఉంది


