
మునిగిపోతాం :సినీ పరిశ్రమకు కమల్ హాసన్ స్ట్రాంగ్ వార్నింగ్
భారతీయ సినిమా కుప్పకూలుతుందా?
“ఇకపై సినిమాలు తీసే విధానం మారకపోతే… భారీ సంక్షోభం తప్పదు” అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కేవలం రాజకీయాల వరకే పరిమితం కావని, అవి నేరుగా భారతీయ సినిమా బడ్జెట్లను దెబ్బతీయబోతున్నాయని కమల్ హాసన్ హెచ్చరించారు. ఇంధన ధరల పెరుగుదల, రవాణా ఖర్చుల భారం, విదేశీ షూటింగ్‌ల వ్యయాలు… ఇవన్నీ కలిసి సినిమా పరిశ్రమను ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టేస్తాయని ఆయన స్పష్టం చేశారు. విశ్వనటుడు కమల్ హాసన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా వదిలిన ఒక బహిరంగ లేఖ ఇప్పుడు యావత్ సినీ ప్రపంచాన్ని కుదిపేస్తోంది, టాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల నిర్మాతల్లో గుబులు రేపుతోంది. ఇంతకీ ఏముందా లేఖలో చూద్దాం.
లేఖలో సమాచారం యధాతథంగా..
‘‘పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. దీనివల్ల ఇంధనం, వాణిజ్యం, లాజిస్టిక్స్, ఆర్థిక స్థిరత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన, రవాణా, ఉత్పత్తి ఖర్చుల ప్రభావం భారతదేశంపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే బడ్జెట్‌లు విపరీతంగా పెరిగిపోయి, మార్కెట్ రికవరీలు అస్థిరంగా ఉన్న తరుణంలో ఈ పరిస్థితి ఎదురైంది. ఈ ప్రభావం కేవలం సినిమా నిర్మాణంపైనే కాదు.. ద్రవ్యోల్బణం కారణంగా రాబోయే నెలల్లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే విధానంపై ఎఫెక్ట్ చూపిస్తుంది.
ఈ భారం నిర్మాతలు, కార్మికులు, థియేటర్లు, పంపిణీదారులు, ఫైనాన్షియర్లు.. మొత్తం సినీ రంగంపై పడుతుంది. సినిమా ప్రస్థానం ఇలాగే ముందుకు సాగాలంటే, మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి సినిమా నాణ్యతను పెంచేందుకు ఉపయోగపడాలే తప్ప, కేవలం పైపై హంగుల కోసం కాకూడదు. నేను ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. సినిమా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే ఏ ప్రయత్నమైనా సరే.. అది కార్మికుల వేతనాలు, వారి భద్రత, గౌరవం, ఆహారం, రవాణా, వసతి వంటి వాటిని దెబ్బతీసేలా ఉండకూడదు. రాత్రింబవళ్లు కష్టపడే కార్మికులపై ఈ భారం పడటానికి వీల్లేదు.
మనం చేయాల్సింది ఇదే..
వృధా ఖర్చులు, సరైన ప్రణాళిక లేకపోవడం, భారీ మేనేజ్‌మెంట్, అనవసరమైన విదేశీ ప్రయాణాలు, షూటింగ్ ఆలస్యం కావడం, పెట్టే ఖర్చుకు-సినిమాకు సంబంధం లేకపోవడం వంటి వాటిని అదుపు చేయాలి. ప్రతి ప్రేమకథ ప్యారిస్‌లోనే చిగురించాలని, ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ముగియాలని ఎందుకు అనుకోవాలి? అదృష్టవశాత్తూ, ప్రేమను చూపించడానికి విదేశీ కరెన్సీ అవసరం లేదు. భారతీయ సినిమాకు, భారతీయులకు తమపై, మన దేశంపై మరింత నమ్మకం ఉండాలి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అన్ని వర్గాలూ ఏకం కావడానికి, కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయమని నేను నమ్ముతున్నాను. రాబోయే ఆర్థిక సవాళ్లను మనం సమష్టిగా ఎలా ఎదుర్కోవాలో చర్చించడానికి నిర్మాతలు, నటులు, దర్శకులు, యూనియన్లు, స్టూడియోలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లు, గిల్డ్‌ల మధ్య చర్చలు జరగాలని నేను కోరుతున్నాను.
సినిమా నిర్మాణాన్ని సమర్థవంతంగా నడపాలి
క్రమశిక్షణ, పక్కా షెడ్యూల్స్, విలాసాలు - అసిస్టెంట్ల ఖర్చులను తగ్గించడం, స్థానికంగా ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు విదేశీ ప్రయాణాలను పరిమితం చేయడం, సెట్స్ - స్టూడియోలలో ఇంధనాన్ని ఆదా చేయడం, పర్యావరణానికి అనుకూలమైన సెట్ల నిర్మాణం, మెటీరియల్స్‌ను తిరిగి ఉపయోగించడం వంటివి చేయాలి. చాలా సార్లు అమితమైన ఖర్చునే సినిమా ‘స్కేల్’ అని పొరబడుతుంటారు. కానీ మన గొప్ప చిత్రాలలో కొన్ని.. భారీ ఖర్చులతో కాకుండా స్పష్టత, క్రమశిక్షణ, ఎంతో నమ్మకంతో రూపుదిద్దుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న ఇలాంటి సమయాల్లో, ప్రతి రంగం కూడా ముందుచూపుతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని దేశం పిలుపునిస్తోంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ కూడా ఈ సందర్భానికి తగ్గట్టుగా స్పందించాలి.
ఇది వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం. మన పరిశ్రమ సంస్కృతిని మారుస్తుంది, ఆలోచనలను ప్రభావితం చేస్తుంది, ప్రతిరోజూ మిలియన్ల మంది ప్రజలను చేరుకుంటుంది. కాబట్టి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా సినిమాకు అంతకుమించిన బాధ్యతలు ఉన్నాయి. ఈ పరిశ్రమ నుంచి అత్యధికంగా లాభం పొందిన మనలాంటి వారే మొదటగా ఆదర్శంగా నిలవాలి. ఈ రోజు మనం సినిమా ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటేనే, రేపటి సినిమా భవిష్యత్తును కాపాడినట్లవుతుంది..’’ అని కమల్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
టాలీవుడ్ వినకపోతే సర్వనాశనమే!
ఈ హెచ్చరిక కేవలం కోలీవుడ్‌కో, బాలీవుడ్‌కో పరిమితం కాదు. ముఖ్యంగా భారీ బడ్జెట్లతో రిస్క్ చేస్తున్న టాలీవుడ్‌కు ఇది అత్యంత కీలకం. ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ పెద్దలు ఎగ్జిబిటర్లు, నిర్మాతల సమస్యలపై సమీక్షలు జరుపుతున్నారు. కానీ, ఈ ఆయిల్ క్రైసిస్, పెరగబోయే బడ్జెట్లపై ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే తెలుగు సినిమా కోలుకోలేని దెబ్బ తింటుంది.
సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది వేలాది కుటుంబాలకు జీవనోపాధినిచ్చే ఒక అద్భుతమైన వ్యవస్థ. సమస్య ముదిరి, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే.. ఇప్పుడే మేల్కొని టాలీవుడ్ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు అంతా ఒక్కతాటిపైకి రావాలి. ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని బడ్జెట్ నియంత్రణపై చర్చించాల్సిందే. ఈరోజు మనం సినిమా ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటేనే, రేపు సినిమా భవిష్యత్తును కాపాడుకోగలం. కమల్ హాసన్ చేసిన ఈ ముందస్తు హెచ్చరికను లైట్ తీసుకుంటే మాత్రం.. టాలీవుడ్ ఊహించని భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు!

