
'పుష్ప'కి పూర్ కాపీ: ‘కాటాలన్’ రివ్యూ
స్టైల్ ఎక్కువ… స్టోరీ తక్కువ!
కేరళ–తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ‘ఆనకొల్లి’ అనే దట్టమైన అడవి గ్రామం. అక్కడ మారి(సునీల్) అనే గ్యాంగ్‌స్టర్ ఏలుబడి నడుస్తుంటుంది. అక్కడి గిరిజనులను బానిసలుగా మార్చుకుని, ఫారెస్ట్ అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులను నెల జీతాల్లా లంచాలు ఇచ్చి తన చేతిలో పెట్టుకుని ఏనుగు దంతాల స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు.అయితే డబ్బు, పవర్ ఉన్న చోట ఘర్షణ తప్పదు కదా.
మారి స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని కూల్చేసి, “కింగ్” కుర్చీని దక్కించుకోవాలని రకరకాల ప్లాన్ లతో ఎదురు చూస్తుంటాడు ఎడ్డీ (కబీర్ దుహాన్ సింగ్). ఆ రోజు రానే వచ్చింది. మారి అడవి దాటిస్తున్న సుమారు రూ. పాతిక కోట్ల విలువైన ఏనుగు దంతాల గురించి ఎడ్డీకి సమాచారం అందుతుంది. దాంతో ఎడ్డీ, తన సోదరుడైన ఎస్పీ హరి శంకర్ నారాయణ్ (నెల్సన్ నాడర్) సహాయంతో ఆ సరకుపై దాడి చేసి, వాటిని స్వాధీనం చేసుకుంటాడు. మారి గ్యాంగ్‌లో మొదటిసారి “వైల్డ్‌లైఫ్ కంటే వైల్డ్ షాక్” కనిపిస్తుంది.
ఎడ్డీ చేసిన దాడి నుండి మారి తృటిలో ప్రాణాలతో బయటపడతాడు. పోగొట్టుకున్న తన రూ. పాతిక కోట్ల విలువైన సరకును ఎలాగైనా తిరిగి దక్కించుకోవడం కోసం, రవాణా చేయడంలో ఆరితేరిన ఆంటోనీ (ఆంటోనీ వర్గీస్)ను మారి రంగంలోకి దింపుతాడు. ఆంటోనీ ఎలాంటివాడంటే పోలీసుల చెక్‌పోస్టులను గూగుల్ మ్యాప్‌లా చదివేసేంత తెలివైన ట్రాన్స్‌పోర్ట్ మాస్టర్. పోయిన సరుకును తిరిగి తెప్పించే బాధ్యత అతడి మీద పడుతుంది.
అనుకున్నట్లుగానే ఆంటోనీ పోలీసుల కళ్ళు గప్పి, ఎంతో చాకచక్యంగా ఆ విలువైన ఏనుగు దంతాలను తిరిగి మారి దగ్గరకు సురక్షితంగా చేరుస్తాడు. ఈ విజయంతో ఆంటోనీ, మారి గ్యాంగ్‌లో అత్యంత కీలకమైన సభ్యుడిగా, అతనికి అత్యంత నమ్మకస్థుడైన ఉద్యోగిగా మారిపోతాడు.
కానీ సమస్య ఏంటంటే… డబ్బు కోసం మొదలైన పని, ఒక్కోసారి మనసుతో ఢీకొంటుంది.మారి చేసే దారుణాలు, గిరిజనుల బతుకులతో ఆడుకోవడం, ఏనుగులను కిలోల కొద్దీ మాంసంలా నరికి పడేయడం చూస్తూ ఆంటోనీ మనస్సు ఉడికిపోతుంది. మరోవైపు ఎడ్డీ, అతడి ఎస్పీ సోదరుడు కూడా ఆంటోనీని టార్గెట్ చేస్తుంటారు.
దాంతో అప్పటివరకు మారి కోసం ప్రాణాలు పెట్టిన ఆంటోనీ… చివరకు అతడికే ఎదురు తిరుగుతాడు.
డబ్బు కోసం అడవిని నరికేసిన వాళ్లకు, అదే అడవి చివరికి సమాధి అవుతుందా? లేక మళ్లీ మరో మారి పుడతాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలిసిస్
ఒక పెద్ద అడవి.
చీకటితో నిండిన ఫ్రేములు.
వందల మంది జూనియర్ ఆర్టిస్టులు.
పొగ, అగ్ని, రక్తం.
నెమ్మదిగా నడిచే హీరోలు.
పేలే శబ్దాలతో నేపథ్య సంగీతం.
ఇవన్నీ కలిపేస్తే “భారీ సినిమా” అవుతుందని చాలామంది దర్శకులు అనుకుంటున్నారు.‘కాటాలన్’ దర్శక,నిర్మాతలు కూడా అదే భావనలో ఉండి దారి తప్పినట్లున్నారు. అడివిలో ఓ సారి దారి తప్బితే జంతువులు బారి పడకుండా సురక్షితంగా చివరకు చేరటం కష్టం. ఇలాంటి సినిమాల్లోనూ అదే జరుగుతుంది.
ఈ సినిమా చూస్తుంటే దర్శకుడు కథ చెప్పాలనుకోలేదు… “భారీగా కనిపించాలి” అనుకున్నాడనే ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. అందుకే సినిమా మొదటి నిమిషం నుంచి చివరి నిమిషం వరకు పాత్రలు మాట్లాడవు… “ఎలివేషన్స్” ఇస్తుంటాయి.
‘పుష్ప’, ‘కేజీఎఫ్’ లాంటి సినిమాలును చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనిపించింది. ఆ సినిమాలు వర్కవుట్ అయ్యింది. అవి కేవలం మాస్ సినిమాలు అని కాదు… అవమానం, ఆకలి, గుర్తింపు కోసం పోరాటాల కథలు అవ్వటం.
కానీ ‘కాటాలన్’లో? ఇక్కడ మనకు కనిపించేది కోపం మాత్రమే.ఆ కోపానికి కారణమైన గాయం మాత్రం కనిపించదు.
సినిమా ప్రారంభం నుంచే సమస్య మొదలవుతుంది. ‘కాటాలన్’ ఫస్టాఫ్ మొత్తం మారి అనే విలన్ ఎంత క్రూరమో చూపించడంలోనే గడిచిపోతుంది. ఏనుగులను చంపడం.దంతాలు నరికేయడం. గిరిజనులను భయపెట్టడం.అధికారులకు లంచాలు ఇవ్వడం. ఇవి చూపిస్తూ ప్రేక్షకుడుని కథలోకి వెళ్లాలి అనుకున్నారు కానీ… చూస్తున్న మనకి మాత్రం “చూడండి మా విలన్ ఎంత డేంజరో!” అని మళ్లీ మళ్లీ చెప్పుకుంటూ వచ్చినట్లు అనిపిస్తుంది. ఒక దశ తర్వాత “సరే… ఇతను చెడ్డోడని అర్థమైంది. కథ ఎప్పుడు మొదలవుతుంది?” అని అడగాలి అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సీన్స్ “మూడ్” కోసం ఉన్నాయి…“మూవ్‌మెంట్” కోసం కాదు.
ఇక హీరో ఆంటోనీ పాత్ర పైకి యాక్షన్ తో కనపడుతుంది కానీ అతని మనస్సులో ఏముందో, అతని కోరిక ఏమిటో తెలియదు. మనకు కనెక్ట్ కానివ్వదు.
పుష్పకి గుర్తింపు కావాలి.
రాకీకి డబ్బు కావాలి.
అందుకే వాళ్ల నిర్ణయాలు మనకు అర్థమవుతాయి. మనం ఇమ్మిడియట్ గా కనెక్ట్ అవుతాం. కానీ ఆంటోనీకి ఏమి కావాలి? నిమా దానికి స్పష్టమైన సమాధానం ఇవ్వదు.
మొదట అతను స్మగ్లింగ్ చేస్తాడు.తర్వాత మారికి నమ్మకస్తుడవుతాడు. ఆ తర్వాత ఒక్కసారిగా గ్రామస్తుల బాధ చూసి మారిపోతాడు.ఆంటోనీ తిరుగుబాటు మనకి లోపల నుంచి తాకదు.“బయటి యుద్ధం కంటే ముందు…
అతని లోపల యుద్ధం మొదలవ్వాలైతేనే మనకు నచ్చుతాడు. మనం అతనితో పాటు జర్నీ చేస్తాం. దానికి తోడు ఈ సినిమా సీక్వెల్ కోసం లీడ్ లు ..వదలటం కూడా.
ఇప్పుడు చాలా సినిమాలకు ఒక కొత్త జబ్బు వచ్చింది.
ముందు మంచి సినిమా తీయాలి అనుకోవడం లేదు…“యూనివర్స్ నిర్మించాలి”అనుకుంటున్నారు.‘కాటాలన్’ చివర్లో కూడా అదే కనిపిస్తుంది.“మొదటి భాగమే బాగోలేకపోతే… రెండో భాగం ఎవరు చూస్తారనే కామన్ సెన్స్ మర్చ్రిపోతున్నారు.
టెక్నికల్ గా ...
బి. అజనీష్ లోకనాథ్, రవి బస్రూర్, నిహాల్ సాదిక్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండిపోయేలా లేవు. రవి బస్రూర్ నేపథ్య సంగీతం మాత్రం సినిమా మొత్తం ఒకే టోన్‌లో గట్టిగా వినిపిస్తూ కొంతసేపటికి విసుగు వస్తుంది.
ఈ సినిమాలో నిజంగా తమ బెస్ట్ ఇచ్చినవి సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ.అడవి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. దట్టమైన అడవిని చాలా గ్రాండ్‌గా చూపించాడు.అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా స్టైలిష్‌గా ఉన్నాయి. కానీ షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ మాత్రం సోసోగా అనిపిస్తుంది. చాలా సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ కుదరలేదు.
ఎవరెలా ..
మారి పాత్రలో సునీల్ పుష్పను గుర్తు చేస్తాడు. ఎడ్డీ పాత్రలో కబీర్ సింగ్ ఓకే. హీరోగా ఆంటోనీ వర్గీస్ ఫెరఫెక్ట్. హీరోయిన్ దూశారా విజయన్ గెస్ట్ పాత్రలో అదరగొట్టింది. మలయాళ నటులు జగదీశ్, సిద్ధికి.. వంటివారు రెగ్యులర్ గా చేసుకుంటూ పోయారు. గెస్ట్ పాత్రలో లోకేష్ కనగరాజ్ కనపించి ఆశ్చర్యపరుస్తాడు.
ఫైనల్ థాట్
మొత్తంగా చూస్తే ‘కాటాలన్’ సినిమా అడవిలో తీసిన “పుష్ప ఫ్యాన్ మేడ్ ప్రాజెక్ట్” లా అనిపిస్తుంది. తేడా ఏంటంటే అక్కడ ఎర్రచందనం… ఇక్కడ ఏనుగు దంతాలు. మిగతాదంతా అదే టెంప్లేట్. కాబట్టి మనకు కొత్తగా ఏమీ అనిపించదు..మేము పుష్ప లాంటి సినిమాలు తీయగలం అని మళయాళీలు ఆనందపడాలేమో.

