
లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ రివ్యూ
కథలో భర్త బందీ.. ప్రేక్షకుడూ అదే పరిస్థితి!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త..ఆమెను వద్దనుకుని మరో స్త్రీ కోసం విడాకులు అడిగితే ఏ భార్య అయినా ఏం చేస్తుంది? కుప్పకూలిపోతుంది లేదా కోర్టు మెట్లు ఎక్కుతుంది. కానీ ఇక్కడ లీలావతి మాత్రం రూట్ మార్చింది. తనను మోసం చేయాలనుకున్న భర్తను ఏకంగా గదిలో బంధించి దేహశుద్ధి చేసింది. అసలు ఆ మరో స్త్రీ ఎవరు? పచ్చని కాపురంలో నిప్పులు పోసింది ఎవరు?
చిన్ననాటి భయం.. సైకియాట్రిస్ట్‌తో ప్రేమ
లీలావతి (లావణ్య త్రిపాఠి) ఒక సక్సెస్‌ఫుల్ స్టార్ డైరెక్టర్. కానీ ఆమె బయటి ప్రపంచానికి కనిపించేంత ధైర్యవంతురాలు కాదు. చిన్నతనంలో తన కళ్లముందే తల్లిదండ్రులు (నరేష్, పవిత్ర లోకేష్) నిత్యం గొడవ పడటం చూసి ఆమె మానసికంగా డిస్టర్బ్ అవుతుంది. ఆమెలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టి, కాన్ఫిడెన్స్ నింపే క్రమంలో సైకియాట్రిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్) పరిచయం అవుతాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, పెద్దల సమక్షంలో ఇద్దరూ ఒక్కటవుతారు.
మూడేళ్ల ముచ్చట.. మూడో వ్యక్తి ఎంట్రీ
పెళ్లైన మూడేళ్ల వరకు అంతా సజావుగానే సాగుతుంది. సేతు ప్రోత్సాహంతో లీల స్టార్ డైరెక్టర్‌గా ఎదుగుతుంది. షూటింగ్స్, సక్సెస్‌లు, ఫేమ్ మధ్య ఆమె బిజీ అయిపోతుంది. అదే సమయంలో భర్త రామ్ సేతు జీవితంలో ఖాళీ పెరుగుతుంది. భార్య తనను పట్టించుకోవడం లేదనే ఫీలింగ్‌తో అతను డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు.
అక్కడే కథలోకి నర్స్ నికోలా సెబాస్టియన్ (మడోన్నా సెబాస్టియన్) ఎంట్రీ ఇస్తుంది. తన బాధను అర్థం చేసుకున్న నికోలాతో సేతు దగ్గరవుతాడు. ఆ అనుబంధం ప్రేమగా మారుతుంది. చివరకు లీలావతిని విడాకులు అడిగి, నికోలాతో కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు.
గదిలో బంధించి దేహశుద్ధి.. క్లైమాక్స్ ఏంటి?
తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే మరో మహిళ కోసం వెళ్లిపోతానంటే లీలావతి తట్టుకోలేకపోతుంది. షాక్, కోపం, అసహనం కలిసి ఆమెను ఊహించని నిర్ణయం తీసుకునేలా చేస్తాయి. రామ్ సేతును కొట్టి ఇంట్లోనే బంధిస్తుంది. అక్కడి నుంచి కథ పూర్తిగా సైకాలజికల్ మోడ్‌లోకి వెళ్తుంది. ఈ గొడవల మధ్య లాయర్ తమలపాకుల (వీటీవీ గణేష్), నిర్మాత మెట్ట రాజర్, దొంగ సప్తగిరి పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. మరి విడాకులు అడిగిన భర్తను లీలావతి వదిలేసిందా? లేక ఆ నర్సును తన భర్త జీవితం నుండి తరిమేసి తన కాపురాన్ని కాపాడుకుందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
“ఒకరికి పెళ్లి అంటే బంధం.. ఇంకొకరికి అది ఊపిరాడనివ్వని గది అయితే.. ఆ రిలేషన్ ఎంతకాలం నిలుస్తుంది?” — ఈ లైన్ చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతుంది. తండ్రీ - కూతురు ఎమోషన్, ఈ తరం వివాహాలలో పెరుగుతున్న కమ్యూనికేషన్ గ్యాప్, మానసిక ఒత్తిళ్లు వంటి అంశాలను కలిపి కథను నిర్మించినా.. స్క్రీన్‌ప్లే మాత్రం ఆ భావోద్వేగాలను ప్రేక్షకుడికి బలంగా కనెక్ట్ చేయలేకపోయింది.
సినిమా ఫస్టాఫ్ పూర్తిగా లీలావతి మానసిక పరిస్థితి, చిన్నప్పటి ట్రామా, రామ్ సేతుతో పరిచయం, ప్రేమ, పెళ్లి చుట్టూనే తిరుగుతుంది. కానీ ఈ ట్రాక్‌లో ఎక్కడా డ్రామా ఎలివేట్ అయ్యే సన్నివేశాలు కనిపించవు. ముఖ్యంగా హీరో - హీరోయిన్ మధ్య వచ్చే భావోద్వేగ ఘర్షణలు కూడా బలంగా తెరపై అనిపించవు. దాంతో ఫస్టాఫ్ ఎప్పుడు పూర్తవుతుందా..కథలోకి దర్శకుడు ఎప్పుడు వెళ్తాడా అని ఎదురుచూస్తూంటాము.
సెకండాఫ్ లో కథ పూర్తిగా ట్రాక్ తప్పుతుంది. సప్తగిరి దొంగ పాత్ర, హీరో ఎస్కేప్ ప్రయత్నాలు, కిడ్నాప్ డ్రామా.. ఇవన్నీ కథను ముందుకు తీసుకెళ్లకుండా మరింత ఇబ్బందిగా మార్చేస్తాయి. మనం కథలో నెక్ట్స్ ఏం జరుగుతుందో చూద్దామనుకుంటే ఇవన్నీ అడ్డం పడుతూంటాయి. ప్రత్యేకంగా “స్పైడర్‌మ్యాన్” తరహా యాక్షన్ ఎపిసోడ్ కథ టోన్‌కు అస్సలు మ్యాచ్ కాలేదు. రిలేషన్‌షిప్ థ్రిల్లర్‌గా మొదలైన సినిమా.. ఒక్కసారిగా ర్యాండమ్ కామెడీ యాక్షన్ డ్రామాగా మారిపోతుంది.
కథలో అసలు కాన్ఫ్లిక్ట్ మొదలయ్యేది హీరో రామ్ సేతు విడాకులు అడిగిన దగ్గర నుంచి. అక్కడి వరకూ స్లోగా వెళ్లిన కథ.. ఆ తర్వాత థ్రిల్లింగ్ మోడ్‌లోకి వెళ్తుందనిపిస్తుంది. కానీ దర్శకుడు కథను ఒకే ఇంట్లో బంధించేయడంతో స్క్రీన్‌ప్లే కూడా అక్కడే ఇరుక్కుపోయింది. హీరోను కొట్టి ఇంట్లో బంధించిన తర్వాత వచ్చే సన్నివేశాలు మొదట్లో కొత్తగా అనిపించినా.. కొద్దిసేపటికే రిపిటేటివ్‌గా మారిపోతాయి.
ఇది సరిపోదన్నట్లు...ఇలాంటి ఇంటెన్స్ రిలేషన్ డ్రామాలో వీటీవీ గణేశ్ పాత్రతో రిలీఫ్ ఇవ్వాలని దర్శకుడు ప్రయత్నించాడు. కానీ లాయర్ తమలపాకుల పాత్ర ఎక్కువగా స్కిట్‌లా అనిపిస్తుంది. కథ తీవ్రతకు ఆ కామెడీ టోన్ సరిగ్గా సెట్ కాలేదు. ప్రీ ఇంటర్వెల్ లో కథ కాస్త వేగం పెంచినట్టు అనిపించినా.. విరామం దగ్గర ప్రేక్షకుడిలో “తర్వాత ఏమవుతుంది?” అనే థ్రిల్ మాత్రం క్రియేట్ కాలేదు.
ఫైనల్ గా...ప్రీక్లైమాక్స్ దగ్గర వచ్చే భావోద్వేగం కొద్దిసేపు సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ అప్పటికే మనం ఎమోషనల్‌గా ఇన్వెస్ట్ అయ్యే స్థితిలో ఉండము. ఇక క్లైమాక్స్‌ను ఓ రియాలిటీ అడ్వెంచర్ గేమ్ తరహాలో డిజైన్ చేయాలని దర్శకుడు ప్రయత్నించాడు. కానీ అక్కడ సస్పెన్స్ కంటే ఆర్టిఫిషియల్ ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. పాత్రల భావోద్వేగాలకు సరైన ముగింపు ఇవ్వకుండా.. కాన్సెప్ట్‌ను స్టైలిష్‌గా ముగించాలనే ప్రయత్నం ఎక్కువగా కనిపిస్తుంది.
టెక్నికల్ గా ..
దర్శకుడు తాతినేని సత్య..ఎస్ఎంఎస్, భీమిలి కబడ్డీ జట్టు సినిమాలనాటి టచ్ మిస్సైనట్లు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ అవి రెండు రీమేక్ లే. ఇక మిక్కీ జే మేయర్ అందించిన పాటలు కూడా సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు. కొన్ని చోట్ల అవి కథ ఫ్లోను మరింత నెమ్మదింపజేసిన ఫీలింగ్ కలిగిస్తాయి. ఉదయ్ పొట్టిపాడు రాసిన డైలాగ్స్ కొన్ని సన్నివేశాల్లో బాగున్నా, చాలా చోట్ల సహజంగా అనిపించవు. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ మాత్రం ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ చేసి,లెంగ్త్ తగ్గించి ఉంటే లాగిన ఫీలింగ్ తగ్గేదేమో.
నటీనటుల్లో ..
లీలావతి పాత్రలో లావణ్య త్రిపాఠి మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా భర్తతో గొడవపడే సన్నివేశాల్లో ఆమె పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలుస్తుంది. దేవ్ మోహన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా పర్వాలేదనిపించాడు. నరేష్ తన అనుభవంతో ఆకట్టుకున్నాడు. వీటీవీ గణేష్, మడోన్నా సెబాస్టియన్ తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు.
ఫైనల్ థాట్
భర్తను ఇంట్లో బంధించింది లీలావతి.. కానీ ప్రేక్షకుడిని థియేటర్ సీట్లో బంధించలేకపోయింది స్క్రీన్‌ప్లే! దాంతో సినిమా చూసే వాళ్ల పరిస్థితి కూడా హీరోలానే — “ఇంకా ఎంతసేపు..ఎప్పుడు బయటపడతాను?” అన్న ఫీలింగ్ తో ఎదురుచూడాల్సి వచ్చింది!

