
మలయాళ ఫ్యామిలీ కామెడీ: ‘మధువిధు’ మూవీ రివ్యూ
నవ్వుల మధ్య షాకిచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్!
కేరళలోని కొచ్చాంబళం ఊర్లో అంజిలి మూట్టిల్ తడవాడు అనే ఓ ఇంటి గురించి జనాలకు ఒక స్పెషల్ నమ్మకం. “ఆ ఇంట్లో పెళ్లి అంటే దేవుడికీ టెన్షన్ వస్తుంది!” అని. కారణం? రాజ్‌కుమార్ కుటుంబానికి నాగదోషం ఉందనే ప్రచారం. భార్య చనిపోయిన తర్వాత రాజ్‌కుమార్, అతని తమ్ముడు అంబరీష్, కొడుకులు అమృత్‌రాజ్ (అమ్ము), విమల్‌రాజ్ కలిసి పూర్తిగా “మేల్ హాస్టల్” మోడ్‌లో బతుకుతుంటారు. ఇంట్లో ఆడదిక్కు లేక, వంతులు వారీగా వంటలు చేసుకుంటూ… జీవితం కన్నా కిచెన్ షెడ్యూల్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు.
అమృత్‌రాజ్ ఓ కేఫ్ నడుపుతుంటాడు. కానీ అతని అసలు ఫుల్‌టైమ్ జాబ్ మాత్రం “పెళ్లి చూపులు.” ఇప్పటికే 28 సంబంధాలు మిస్ ఫైర్ అవ్వడంతో, ఊర్లో వాళ్లు అతన్ని వరుడిగా కాకుండా “రిజెక్ట్ అయిన ప్రాజెక్ట్”లా చూడటం మొదలుపెడతారు. మరోవైపు తమ్ముడు విమల్ యూట్యూబ్ వీడియోలతో బిజీ, బాబాయ్ అంబరీష్ మాత్రం కేబుల్ టీవీ బిజినెస్‌లో కాలక్షేపం చేస్తుంటాడు.
ఇక అదే ఊర్లో మార్కోస్ కుటుంబం ఉంటుంది. అతని కూతురు స్నేహతో అమృత్‌రాజ్ ప్రేమలో పడతాడు. ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వాళ్లు కావడంతో మొదట్లో కొంచెం టెన్షన్ ఉన్నా, చివరికి ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే చెబుతాయి. దీంతో అంజిలి మూట్టిల్ ఇంట్లో సంవత్సరాల తర్వాత పెళ్లి శుభకార్యాల సందడి మొదలవుతుంది. ఊరంతా కూడా “పోన్లే... శాపం పోయినట్లుందే!” అన్నట్టుగా చూస్తుంది.
కానీ కథ ఇక్కడే అసలు ట్విస్ట్ ఇస్తుంది. కొడుకు పెళ్లి పనులు జరుగుతుండగానే, తండ్రి రాజ్‌కుమార్ తన కొడుకు చేసుకోబోయే అమ్మాయి..స్నేహ మేనత్త మెర్సీని సైలెంట్‌గా పెళ్లి చేసుకుంటాడు! దాంతో రెండు కుటుంబాలు షాక్ అవుతాయి. కొడుకి పెళ్లికన్నా తండ్రి పెళ్లే పెద్ద న్యూస్ అయిపోతుంది. ఇంట్లో ఉన్న నాగదోషం కంటే… రాజ్‌కుమార్ తీసుకున్న “సెకండ్ ఇన్నింగ్స్ డెసిషన్” పెద్ద బాంబ్ లా పేలుతుంది.
అక్కడి నుంచి కుటుంబ బంధాలు, మత భేదాలు, ఊరి గాసిప్స్, ఈగోలు అన్నీ కలిసిపోతాయి. చివరికి అమృత్‌రాజ్ – స్నేహ ప్రేమ పెళ్లి వరకు చేరుతుందా? లేక ఈ కుటుంబంలో పెళ్లిళ్లకు నిజంగానే ఏదైనా “కాస్మిక్ బ్యాన్” ఉందా? అనేదే సినిమా అసలు కథ.
విశ్లేషణ:
మలయాళ సినిమాల్లో ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. పెద్ద కథలు చెప్పకపోయినా… చిన్న చిన్న ఫ్యామిలీ కన్‌ఫ్లిక్ట్స్, ఆర్గానిక్ హ్యూమర్, రియలిస్టిక్ క్యారెక్టర్లతో ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. కూడా అదే జోనర్‌లో నడిచే సినిమా. బయటికి చూస్తే ఇది ఓ సింపుల్ ఫ్యామిలీ కామెడీలా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం “ఒంటరితనం, కుటుంబ శాపం, మత భేదాలు, మిడ్‌లైఫ్ ఎమోషన్స్” లాంటి అంశాలను చాలా లైట్ టోన్‌లో హ్యాండిల్ చేయడానికి ప్రయత్నిస్తుంది.
“28 పెళ్లి చూపులు ఫెయిల్”… అక్కడే స్క్రీన్‌ప్లే టోన్ సెటప్
సినిమా మొదటి 20 నిమిషాల్లోనే దర్శకుడు కథ ఎటు వెళ్లబోతుందో చెప్పేస్తాడు. నాగదోషం వల్ల పెళ్లిళ్లు కుదరని కుటుంబం… 28 సార్లు రిజెక్ట్ అయిన హీరో… ఇంట్లో ముగ్గురు మగాళ్లు మాత్రమే… ఇవన్నీ చూసిన వెంటనే ప్రేక్షకుడు కథ బీట్‌లను దాదాపు ఊహించేస్తాడు.
కానీ ఇక్కడ స్క్రీన్‌ప్లే తెలివి ఏమిటంటే — “సస్పెన్స్” మీద కాకుండా “సిట్యుయేషనల్ హ్యూమర్” మీద సినిమా ఆధారపడుతుంది. హీరో అమృత్‌రాజ్ జీవితం ఒక ట్రాజెడీలా ఉన్నా, దాన్ని దర్శకుడు ఎక్కడా మెలోడ్రామాగా చూపించడు.
లవ్ స్టోరీ ఎందుకు వర్క్ అయింది?
అమృత్‌రాజ్ – స్నేహ ట్రాక్ చాలా సింపుల్. పెద్ద డైలాగులు, భారీ రొమాంటిక్ మూమెంట్స్ ఏమీ ఉండవు. కానీ వాళ్ల రిలేషన్ “రాసినట్టు” కాకుండా “జరిగినట్టు” అనిపిస్తుంది. అదే ఈ ట్రాక్ బలం.
ముఖ్యంగా మలయాళ సినిమాల్లో కనిపించే “underplayed romance” ఇక్కడ కూడా కనిపిస్తుంది. దర్శకుడు ప్రేమని డ్రామాటిక్ హైలైట్ చేయకుండా, డైలీ లైఫ్ మూమెంట్స్ ద్వారా నెమ్మదిగా బిల్డ్ చేస్తాడు. అందుకే ప్రేక్షకుడు వాళ్ల బంధంతో కనెక్ట్ అవుతాడు.
ఇంటర్వెల్ ట్విస్ట్: ప్రేక్షకుడిని మోసం చేసిన స్క్రీన్‌ప్లే
సినిమా అసలు హైలైట్ ఇంటర్వెల్ ట్విస్ట్. కొడుకు పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా… తండ్రి రాజ్‌కుమార్ స్నేహ మేనత్త మెర్సీని సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడం! ఈ ట్విస్ట్ కొత్తది కాదు. తెలుగు ప్రేక్షకుడు అయితే ఇలాంటి “ఫ్యామిలీ షాక్ ట్విస్ట్” చాలాసార్లు చూసేశాడు. కానీ ‘మధువిధు’ దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు వర్క్ అయింది. ఎందుకంటే దర్శకుడు ప్రేక్షకుడి ఫోకస్‌ని హీరో ప్రేమకథ, పెళ్లి ఏర్పాట్లు, ఫ్యామిలీ కామెడీ మీద ఉంచి… అసలు ట్విస్ట్‌ని బ్యాక్‌డోర్ నుంచి తీసుకొస్తాడు.
ఇది స్క్రీన్‌ప్లేలో “misdirection technique.” ప్రేక్షకుడు ఒక సమస్య మీద ఫోకస్ అవుతుంటే, రచయిత మరో సమస్యని పేల్చేస్తాడు. ఇక్కడ థియేటర్‌లో వచ్చే నవ్వు కేవలం ట్విస్ట్ వల్ల కాదు… “ఈ టైంలో ఇదేంట్రా బాబూ!” అనే షాక్ వల్ల.
అయితే స్క్రీన్‌ప్లే బ్యాలెన్స్ అక్కడక్కగా కొంచెం తప్పుతుంది. ముఖ్యంగా స్నేహ – అమృత్‌రాజ్ ట్రాక్‌లో వచ్చే ఎమోషనల్ బ్లాక్స్ అంతగా డెప్త్ ఇవ్వలేవు. ప్రేక్షకుడు నవ్వుల మూడ్‌లో ఉన్నప్పుడు, సినిమా ఒక్కసారిగా భావోద్వేగాల వైపు వెళ్లడం వల్ల పేసింగ్ స్లో అవుతుంది.
అయినా సినిమా ఎందుకు బోర్ కొట్టదు?
ఎందుకంటే దర్శకుడు “టోన్”ని కోల్పోలేదు. కథలో లాజిక్ లోపాలు ఉన్నా… నేరేషన్ చాలా breezyగా ఉంటుంది. ఒక పెద్ద విషయం ఏమిటంటే — సినిమా ఎక్కడా తనని తాను చాలా సీరియస్‌గా తీసుకోదు. అదే దాని సేవింగ్ గ్రేస్.
టెక్నికల్‌గా:
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ “ఓకే” అనిపిస్తాయి. ఎక్కడా విజువల్‌గా కొత్తదనం కనిపించదు. కానీ మ్యూజిక్ మాత్రం సినిమాకి చాలా హెల్ప్ అయింది. ముఖ్యంగా లైట్-హార్ట్‌డ్ టోన్‌ని మ్యూజిక్ బాగా క్యారీ చేసింది.
ఫైనల్ థాట్:
కథ పరంగా పెద్ద కొత్తదనం లేకపోయినా, నవ్వులతో లాగేస్తుంది. లాజిక్ వెతికితే loopholes కనిపిస్తాయి… కానీ ఫన్ మూడ్‌లో చూస్తే “ఇలాంటి ఫ్యామిలీలు మన చుట్టూ ఉన్నాయ్ బాస్!” అనిపిస్తుంది. మొత్తానికి ‘మధువిధు’… ఓటిటిలో హ్యాపిగా చూస్తూ ,నవ్వుకునే సినిమా.
ఏ ఓటిటిలో ఉంది?
సోనీ లివ్ లో తెలుగులో ఉంది.

