మైకేల్ జాక్సన్ బయోపిక్ ‘మైకేల్’ ఎలా ఉంది… చూడచ్చా?
x

మైకేల్ జాక్సన్ బయోపిక్ ‘మైకేల్’ ఎలా ఉంది… చూడచ్చా?

లెజెండ్‌కు నీరాజనమా? లేక బ్రాండ్ వ్యాపారమా?


ఆ మనిషి స్టేజ్‌పైకి వస్తే…

జనం కేకలు వేస్తారు కాదు…కాదు ఎమోషనల్ గా తట్టుకోలేక వణికిపోతారు. అతడు రెండు నిమిషాలు కదలకపోయినా… ప్రేక్షకులు ఊగిపోతారు. అలాంటి అద్బుత కళాకారుడు Michael Jackson.

అలాంటి వ్యక్తిని…బయోపిక్ సినిమాలో ఇలా నిశ్శబ్దంగా, నిర్జీవంగా ఎలా చూపించారు?ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. అవును.. Antoine Fuqua తీసిన మైకల్ చిత్రం అదే చేసింది. అందుకే ఓ ప్రక్క ఆశ్చర్యం… అదే సమయంలో తీవ్రమైన నిరాశ కూడా.

తెరపై ఆయన పాత్రలో Jaafar Jackson చూసినప్పుడు… మనకి నిజంగానే మైకేల్ గుర్తొస్తాడు. అడుగులు అవే..హావభావాలు అవే.. కానీ… ఆ లోపలి జ్వాల కనిపించదు. అగ్నిలా రగిలే ఆ శక్తి అనిపించదు. అంటే ఇది అనుకరణ మాత్రమే…అనుభూతి కాదు.

సాధారణంగా ప్రముఖుల బయోపిక్‌లు, ముఖ్యంగా చనిపోయినవారి మీద తీసేవి, తమకంటూ కొన్ని పార్మెట్ ల తో సాగుతాయి. ఇవి చారిత్రక వాస్తవాలతో తీస్తారని, ఒక గొప్ప సినిమాటిక్ ప్యాషన్ ప్రాజెక్ట్‌లు అని మనం ఆశించలేం. కుటుంబ సభ్యులు, ఆర్టిస్టిక్ సహచరులు, ఆ సింగర్ ఎస్టేట్ ఆమోదించిన స్క్రిప్ట్ మాత్రమే మనకు అందుతుంది. అంటే ఓ రకంగా అది కథను శుద్ధి చేయడం (sanitisation) లాంటిది. ఆ ప్రాసెస్ తర్వాత అసలేమీ మిగలదనేది అందరికీ తెలిసే నిజం. మన తెలుగులో బయోపిక్ లు తీసినప్పుడూ అదే జరిగింది. లేకపోతే వివాదాలు,విభేదాలు తప్పవు. ఏతావాతా 'Michael' విషయంలో సరిగ్గా అదే జరిగినట్లు అనిపిస్తుంది.

కింగ్ ఆఫ్ పాప్‌ను జాఫర్ జాక్సన్ అద్భుతంగా అనుకరించడం, మైకల్ జాక్సన్ మ్యూజిక్ వీడియోలు, స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లను 1:1 నిష్పత్తిలో రీ-క్రియేట్ చేయడంలో కొంత ఎంటర్ట్నైన్మెంట్ అయితే ఉంది. అలాగే థియేటర్‌లో అతని గొప్ప హిట్ సాంగ్స్ వినడం అద్భుతంగా అనిపించినా, అసలు ఒరిజినల్ వీడియోలు యూట్యూబ్ లో చూస్తూంటే ఇంతకంటే ఎక్కువ ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తాయనేది కాదనలేని నిజం.


మైకల్ జాక్సన్ బాల్యం , 'జాక్సన్ ఫైవ్' రోజులను చూపించిన తర్వాత, సినిమా ఒక మ్యూజిక్ వీడియో నుండి మరొక దానికి వెళ్తూ ఉంటుంది. గ్యాంగ్ వార్స్ వార్తలు అతనికి 'Beat It' చేయడానికి ఎలా ప్రేరణ ఇచ్చాయో, జాంబీ సినిమాలు 'Thriller' రూపకల్పనలో ఎలా ఉపయోగపడ్డాయో చూపిస్తారు కానీ, ఈ సృజనల వెనుక ఉన్న ఆ మెదడును మనం అర్థం చేసుకోలేం. అసలు మనం చూడాలనుకునేవి ఇవే కదా.

అంతెందుకు మైకల్ జాక్సన్ మొదటిసారి 'మూన్‌వాక్' చేసిన ఐకానిక్ క్షణం, యూట్యూబ్‌లో ఉండే ఏదో ఒక కంపైలేషన్ వీడియో లాగా అలా వచ్చి వెళ్ళిపోతుంది. ఆ సంగీతం, కొరియోగ్రఫీ లేదా ఫ్యాషన్ వెనుక ఉన్న ఫిలాసఫీని మనం తెలుసుకోలేం. మైకల్ జాక్సన్, ప్రిన్స్‌ల మధ్య ఉన్న విషయాన్ని కేవలం ఒక చిన్న డైలాగ్‌తో ముగించారు. మూన్‌వాక్ కోసం ప్రేరణనిచ్చిన ఎంతోమంది నల్లజాతీయుల ప్రస్తావన గానీ, స్టేజ్ మీద ప్రేక్షకులను అలరించడానికి అతను వాడిన 'లెవిటేషన్ షూస్' వంటి టెక్నిక్స్ గురించి గానీ ఎక్కడా చర్చించలేదు.

మైకల్ తన తండ్రి చేతిలో ఎలా వేధింపులకు గురయ్యాడో సినిమాలో చూస్తాం. ఎందుకంటే మైకల్ , అతని తోబుట్టువులు తమ బాల్య గాయాల గురించి ఇంటర్వ్యూలలో బాహాటంగా చెప్పడం వల్ల అది రికార్డ్ అయి ఉండవచ్చు. దాంతో అవి వాడినా సమస్య లేదనుకోవచ్చు. అయితే సినిమాలో ఉన్న మిగిలిన పాత్రలు - ఏజెంట్లు, రికార్డ్ లేబుల్స్, నెట్‌వర్క్ హెడ్స్ అందరూ చాలా మంచి వాళ్లుగా సున్నిత హృదయులుగా, మైఖల్ కుసహకారంగా ఉన్నట్లు చూపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్లు లేదా వాళ్ల వాళ్లు సినిమాను చాలా నియంత్రించినట్లు క్లియర్ గా తెలుస్తుంది,

అలాగే సినిమా కూడా 80వ దశకంతోనే ముగిసిపోతుంది. దానికి తోడు చివర్లో 'His story continues' (అతని కథ కొనసాగుతుంది) అనే ఒక ట్యాగ్‌లైన్ మనని చిరాకు పరుస్తుంది. ఇది సీక్వెల్ కోసం వేసిన ఎర కావచ్చు లేదా ఆ తర్వాత వచ్చిన వివాదాలను చూపించకుండా తప్పించుకునే మార్గం కావచ్చు. ఏదైమైనా సినిమా తీసిన విధానం చూస్తుంటే మైకల్ బ్రాండ్‌ను మరోసారి వాడుకోవడమే తప్ప, వేరే ఏ గొప్ప ఉద్దేశం కనిపించదు. ఒక లెజెండ్‌ను మనిషిగా చూపించాల్సింది పోయి, ఈ సినిమా అతనిని మరింత దూరం చేసింది.

ఫైనల్ గా

మైకెల్ లాంటి లెజెండ్‌ని తెరపై చూపించడం అంటే… ఆయన వేసిన స్టెప్స్ చూపించడం కాదు, ఆ స్టెప్స్ వెనుక ఉన్న తపనను, తుఫాన్‌ను చూపించడం. ఈ సినిమా ఆయన రూపాన్ని పట్టుకుంది… రక్తాన్ని, రాగాన్ని, రగిలే మనసును కోల్పోయింది.

అయినా ఒక్కటి మాత్రం నిజం

Michael Jackson అనే అగ్నిని

ఏ తెరలోనూ బంధించలేము.

Read More
Next Story