
మోహన్ లాల్ ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ
జార్జ్‌కుట్టి ఈసారి దొరికేసాడా?
ఇప్బటికే రెండు సార్లు పోలీసుల కళ్ళు కప్పి, తన కుటుంబాన్ని కాపాడుకున్న జార్జ్‌కుట్టి (మోహన్ లాల్) జీవితం ఇప్పుడు మరో సంచలన మలుపు తిరిగటానికి రంగం సిద్దమైంది. వరుణ్ హత్య కేసు నుంచి క్లీన్ చీట్‌తో బయటపడిన జార్జ్‌కుట్టి.. ఇప్పుడు కేవలం కేబుల్ టీవీ ఓనర్ మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్! తన లైఫ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగానే ‘దృశ్యం’ అనే సినిమా తీసి, సూపర్ స్టార్ అరుణ్ కుమార్ (బిజూ మీనన్)తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ ఫేమ్, సక్సెస్‌తో జార్జ్‌కుట్టి ఫ్యామిలీ లైఫ్ మారిపోయింది అనుకుంటున్న టైమ్‌లో.. అసలు కథ ఇప్పుడే మొదలైంది.
ఓ థియేటర్ ఓనర్‌గా మొదలైన అతని ప్రయాణం… ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రభావం ఉన్న నిర్మాత స్థాయికి చేరుకుంటుంది. కానీ విజయం వచ్చిన చోట ప్రశాంతత రాదు… అనుమానాలు వస్తాయి. సినిమా హిట్ అవ్వడంతో మీడియా, ప్రజల దృష్టి మళ్లీ జార్జ్‌కుట్టి కుటుంబంపైనే పడుతుంది. ఇదే సమయంలో పెద్ద కూతురు అంజుకు పెళ్లి చేయాలని కుటుంబం నిర్ణయిస్తుంది. కానీ వచ్చిన ప్రతి సంబంధం చివరి నిమిషంలో చెడిపోతూ ఉండటంతో… దీంతో జార్జ్‌కుట్టికి డౌట్ వస్తుంది. “ఇది సాధారణ పెళ్లి చూపులు ఫెయిల్ అవ్వడం కాదు… ఎవరో బ్యాక్‌గ్రౌండ్‌లో ఫుల్ టైమ్ జాబ్ చేస్తున్నారే!” అని ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. మరోసారి తన పాత తెలివిని,టాలెంట్ ని బయటకు తీస్తాడు.
ఇంకో వైపు… తన కొడుకు వరుణ్ మరణాన్ని ఇప్పటికీ మర్చిపోలేని ప్రభాకరన్ (సిద్దిఖీ), ప్రతీకారంతో కాలిపోతూ ఉంటాడు. తన కుటుంబం ఎదుర్కొన్న బాధనే జార్జ్ కూడా అనుభవించాలనే కోపంతో… అతడు కొత్త ఆధారాలు సేకరించి పోలీసులను మళ్లీ కేసు రీ ఓపెన్ చేయమంటాడు.
ఈసారి అతనికి తోడుగా నిలుస్తాడు సహదేవన్ అనే సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్. ఒకప్పుడు ఈ కేసు వల్ల తన కెరీర్ నాశనం అయిందనే కసితో… జార్జ్ కుటుంబాన్ని కూల్చేయాలని ప్లాన్ వేస్తాడు. ఇద్దరూ కలిసి అంజు పెళ్లి రోజే భారీ షాక్ ఇవ్వాలని కుట్ర పన్నుతారు. అంజు పెళ్లి రోజే అరెస్ట్ డ్రామా ప్లాన్ చేస్తారు. అంటే పెళ్లి మండపంలో “తాళి కట్టండి” అనగానే… పక్కనే “అరెస్ట్ చేయండి” అనేందుకు రెడీ అవుతారు!
కానీ జార్జ్‌కుట్టి అంటే కేవలం ఓ సాధారణ తండ్రి కాదు… తన కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్లే మనిషి. ప్రమాదం దగ్గరపడుతోందని ముందే గ్రహించిన జార్జ్… అందరికీ తెలియకుండా మరో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తాడు.ఇంకా జర్నలిస్టులు కూడా “జార్జ్ ఏం చేస్తున్నాడు?” అంటూ CCTVలా ఫాలో అవుతుంటారు.పోలీస్ డిపార్ట్‌మెంట్ అతడిని చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తుంది.కానీ మనోడు మాత్రం బయటకు అమాయకపు తండ్రి లా కనిపిస్తూ… లోపల చెస్ గ్రాండ్ మాస్టర్ లా పావులు కదుపుతూంటాడు.
చివరికి ఏమైంది?
అంజు పెళ్లి జరిగిందా?
ప్రభాకరన్ తన ప్రతీకారం తీర్చుకోగలిగాడా?
లేక జార్జ్‌కుట్టి మరోసారి సిస్టిమ్ నే స్క్రీన్ ప్లే ట్విస్ట్ తో మోసం చేశాడా? ఈ సారి ‘దృశ్యం’లో జార్జ్‌కుట్టి వేసిన చివరి ఎత్తు బిగ్ స్క్రీన్‌పైనే చూడాలి!
విశ్లేషణ:
Drishyam పస్ట్ పార్ట్ ఒక అనుకోని షాక్. “ఒక సాధారణ కుటుంబ మనిషి… సిస్టమ్‌నే ఎలా మోసం చేసి పోలీస్ లకు షాక్ ఇచ్చాడు?” అనే థ్రిల్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టింది. రెండో భాగం ఇంకో స్టెప్ ముందుకెళ్లింది. “అదే ట్రిక్ మళ్లీ పని చేస్తుందా?” అనుకున్న ప్రేక్షకుల్ని కూడా జీతూ జోసెఫ్ మోసం చేశాడు. అందుకే Drishyam 3 మొదలయ్యే ముందు ప్రేక్షకుడి మనస్సులో ఒకే ఒక ఫీలింగ్ ఉంది: “ఈసారి పోలీస్ ఏ ప్లాన్ వేసినా… జార్జ్‌కుట్టి ముందే ఊహించి counter ready పెట్టి ఉంటాడు!”. కానీ ఇక్కడే జీతూ జోసెఫ్ ఆడిన గేమ్ వేరే. ఈసారి ఆయన “స్క్రీన్‌ప్లే మేజిక్” కన్నా… “ఒక తండ్రి మానసిక అలసట” మీద ఫోకస్ పెట్టాడు. జీవితాంతం ఒక రహస్యాన్ని మోసిన మనిషి ఎంతగా లోపల అలసిపోతాడో… దాని వైపు కథను తిప్పాడు దర్శకుడు.
మొదటి రెండు భాగాల్లో ప్రధాన సంఘర్షణ “పోలీసులు vs జార్జ్‌కుట్టి”. ఈసారి మాత్రం “జార్జ్‌కుట్టి vs భయం”. తన కూతుళ్లు సాధారణ జీవితాన్ని గడపలేరేమో అనే భయం అతడిని వెంటాడుతూ ఉంటుంది. బయటకి విజయవంతమైన నిర్మాతలా కనిపించినా… లోపల మాత్రం ఎప్పుడైనా గతం తిరిగి వస్తుందనే ఆందోళన. ఇక్కడ దర్శకుడు ఒక ఆసక్తికరమైన మానసిక స్థితిని చూపించాడు:
“అబద్ధం చెప్పిన రోజు మనిషి బతికేస్తాడు… కానీ ఆ అబద్ధాన్ని జీవితాంతం మోసే మనస్సుకు మాత్రం చాలా కష్టం.” ఈ భావన సినిమా అంతా నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఉంటుంది.
మొదటి భాగంలో జార్జ్‌కుట్టి చేసే ప్రతి పని ప్రేక్షకుడిలో ఉత్సాహం కలిగిస్తుంది. రెండో భాగంలో అతడు పోలీసుల కంటే రెండు అడుగులు ముందే ఉండటంతో ప్రేక్షకుడు అతడిని చూసి ఆశ్చర్యపోతాడు. కానీ ఈసారి అతడు జాగ్రత్తగా ఉన్నప్పటికీ… మానసికంగా ప్రశాంతంగా ఉండడు. ప్రతి సంబంధం చెడిపోతుంటే, ప్రతి మీడియా వార్త కుటుంబాన్ని మళ్లీ ఆ ఘటన వైపు నెడుతుంటే… అతడి కళ్లలో కనిపించేది తెలివి కాదు, అలసట. ఇక్కడ జీతూ జోసెఫ్ జార్జ్‌కుట్టిని “మాస్టర్‌మైండ్” నుంచి “మనిషి”గా మార్చే ప్రయత్నం చేశాడు.
ఇదే సినిమాకు బలం కూడా, బలహీనత కూడా. ఎందుకంటే ప్రేక్షకుడు దృశ్యం సీక్వెల్ అంటే ఊహించేది:
తెలివైన తిప్పికొట్టే ప్లాన్లు
చివరి నిమిషం షాకులు
చట్టాన్ని బోల్తా కొట్టించే తెలివి
కానీ ఈసారి కథ నెమ్మదిగా సాగుతుంది. జార్జ్‌కుట్టి నిర్మాతగా మారడం, సినిమా నిర్మాణ సమస్యలు, కుటుంబ ఆందోళనలు — ఇవన్నీ కలిసి కథను థ్రిల్లర్ కంటే భావోద్వేగ కథనంలా మార్చేస్తాయి. కొన్ని చోట్ల చూసే మనకు ఇలా అనిపిస్తుంది. “ఏదో పెద్ద ప్రమాదం వస్తోందని సినిమా చెబుతోంది… కానీ ఆ ప్రమాదం నిజంగా కనిపించడం లేదు.” అందుకే ఇంటర్వెల్ వరకు కథలో పట్టు తగ్గిన భావన వస్తుంది.
అలాగే మొదటి రెండు భాగాల్లో క్లైమాక్స్ ప్రేక్షకుడిని ఆశ్చర్యపరిచింది. ఈసారి క్లైమాక్స్ ఆ దారిలో వెళ్లదు. ఇక్కడ దర్శకుడు ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వడం కన్నా… జార్జ్‌కుట్టి మానసిక స్థితిని చివరికి ఎక్కడికి తీసుకెళ్లాలో ఆలోచించాడు. అందుకే ముగింపు “విజయం”లా అనిపించదు. “తప్పించుకున్నాడు” అనే ఉత్సాహం రాదు. బదులుగా: “ఇన్ని సంవత్సరాలు కుటుంబాన్ని కాపాడిన మనిషి… చివరికి తనలో ఏమి కోల్పోయాడు?” అనే ప్రశ్న మిగులుతుంది.
ఫైనల్ థాట్
ఇది స్క్రీన్ ప్లే గేమ్ ఆడే సినిమా కాదు. ఎమోషన్ మిక్స్ చేసిన తండ్రి కథ. అయితే ప్రేక్షకుడు థియేటర్‌కు “ఫ్యామిలీ ట్రామా థెరపీ సెషన్” కోసం కాదు, దృశ్యం అనే స్క్రీన్‌ప్లే మాయాజాలం కోసం వచ్చాడు అనేది మర్చిపోయారు. దాంతో ఈ సినిమా బాగోలేదని చెప్పలేం కానీ బాగుందని ధైర్యం గా చెప్పలేం. థియేటర్ కన్నా ఓటిటిలో బాగుండే అవకాసం ఉందని మాత్రం చెప్పగలం.

