
అద్దె vs పర్సంటేజీ: కనిపించని ఆ మూడో విషయమే అసలు సమస్య!
ఇండస్ట్రీలో షాకింగ్ చర్చ!
“పర్సంటేజీ షేరింగ్ వర్సెస్ అద్దె విధానం”... ఇప్పుడు తెలుగు పరిశ్రమలో, సినీ ప్రేమికులలలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. టీవీల్లో డిబేట్ లు, సోషల్ మీడియాలో రచ్చ..కామెంట్స్., నిర్మాతలు ఒక మాట అంటున్నారు. ఎగ్జిబిటర్లు మరో మాట చెబుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు మధ్యలో చిక్కుకుపోతున్నారు. కానీ తేలటం లేదు.
ఈ మొత్తం గొడవను బయట నుంచి చూస్తున్న ప్రేక్షకుడికి మాత్రం ఒక డౌట్ వస్తోంది —
“ఇంత ఫైట్ జరుగుతోంది... కానీ అసలు థియేటర్లకు జనాలు ఎందుకు తగ్గిపోతున్నారు? అని ఎందుకు ఆలోచించటం లేదు..దాని గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు అని”
ఇదే ఇప్పుడు అందరినీ లోపల నుంచి కుదిపేస్తున్న అసలు ప్రశ్న.
ఎందుకంటే ఈ వివాదం కేవలం డబ్బుల గురించి మాత్రమే కాదు. ఇది తెలుగు సినిమా థియేట్రికల్ కల్చర్ భవిష్యత్తుపై జరుగుతున్న వార్‌లా మారిపోయింది.
థియేటర్లు ఎందుకు గట్టిగా నిలబడ్డాయి?
ఎగ్జిబిటర్ల వాదన చాలా క్లియర్. “భారీ అద్దెలు పెట్టి థియేటర్లు నడపడం కష్టమవుతోంది. సినిమా ఫెయిల్ అయితే నష్టమంతా మాదే. అందుకే పర్సంటేజీ షేరింగ్ కావాలి” అంటున్నారు. అంటే సినిమా ఆడితే అందరికీ లాభం. ఆడకపోతే నష్టం కూడా అందరికీ పంచుకోవాలి అనేది వారి లాజిక్.
మరోవైపు నిర్మాతలు మాత్రం వేరే కోణంలో చూస్తున్నారు. “ఇప్పటికే సినిమా మీద భారీ పెట్టుబడులు పెడుతున్నాం. రిలీజ్‌కు దగ్గర్లో వచ్చాక కొత్త రూల్స్ అంటే ఎలా?” అని ప్రశ్నిస్తున్నారు.
ఈ టెన్షన్ మధ్యలో ‘పెద్ది’ లాంటి భారీ సినిమా రావడంతో... ఇప్పుడు ఈ మొత్తం సమస్య ఒక్కసారిగా బయటపడింది.
కానీ అసలు భయం డబ్బుల గురించేనా?
ఇండస్ట్రీలో చాలామంది ఇప్పుడు నెమ్మదిగా ఒప్పుకుంటున్న విషయం ఒక్కటే. సమస్య కేవలం షేరింగ్ మోడల్ కాదు. థియేటర్లకు ప్రేక్షకుడు తగ్గిపోవడమే అసలు భయం. ఎందుకంటే ఒకప్పుడు సాధారణ సినిమా కూడా థియేటర్‌లో రెండు మూడు వారాలు ఆడేది. ఇప్పుడు మాత్రం భారీ హైప్ ఉన్న సినిమాలు కూడా రెండు రోజుల్లో డ్రాప్ అవుతున్నాయి.
కంటెంట్ లేని కాకరపువ్వొత్తులు !
కేవలం అద్దెలు, షేరింగ్ మోడల్స్ మార్చినంత మాత్రాన థియేటర్లు నిండిపోవు. ఈ ఏడాది ప్రథమార్థంలో వచ్చిన సినిమాల్లో ప్రేక్షకులని మెప్పించినవి వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్నా, థియేటర్‌లో బొమ్మ పడగానే బాక్సాఫీస్ వెలవెలబోతోంది. బలమైన కథలు, ఎమోషన్లు లేని సినిమాలు రావడం వల్లే ప్రేక్షకులు ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు.
అంటే ప్రేక్షకుడు మారిపోయాడా?
అంతగా కాదు అంటున్నారు విశ్లేషకులు. ప్రేక్షకుడు ఇప్పటికీ మంచి అనుభూతి కోసం థియేటర్‌కు రావడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ “ఇది థియేటర్‌లోనే చూడాలి” అనిపించే సినిమాలు తగ్గిపోయాయని అంటున్నారు.
సోషల్ మీడియా హైప్ ఎందుకు సరిపోవడం లేదు?
ఇప్పుడు సినిమా రిలీజ్‌కు ముందు హడావిడి చాలా వేగంగా క్రియేట్ అవుతోంది. ట్రైలర్ ట్రెండింగ్, ఫ్యాన్ వార్స్, రికార్డ్ పోస్టులు... అన్నీ కనిపిస్తున్నాయి. కానీ అదే హైప్ థియేటర్ టికెట్లుగా మారడం లేదు.
హాలీవుడ్‌లో Christopher Nolan ఒకసారి చెప్పిన మాట ఇప్పుడు టాలీవుడ్‌కు కూడా బాగా సరిపోతుంది:
“The audience is smarter than Hollywood thinks.”
అంటే ప్రేక్షకుడు ఇప్పుడు హైప్ చూసి కాదు, సినిమా నిజంగా తన టైమ్‌కి, డబ్బుకి విలువ ఇస్తుందా లేదా అన్నది చూసి నిర్ణయం తీసుకుంటున్నాడు.
హాలీవుడ్ నేర్చుకున్న పాఠం ఇదే
హాలీవుడ్ కూడా ఒక దశలో ఇదే సమస్యను ఎదుర్కొంది. భారీ CGI సినిమాలు వచ్చాయి. విజువల్స్ పెద్దగా ఉండేవి. కానీ కథలు మాత్రం ప్రేక్షకుడిని ఎక్కువ రోజులు వెంటాడేవి కావు. ఆ సమయంలో Steven Spielberg చెప్పిన మాట బాగా వైరల్ అయింది: “People have forgotten how good a story can be.” అంటే చివరికి ప్రేక్షకుడిని గెలిపించేది కథే.
అందుకే The Dark Knight, Interstellar, Top Gun: Maverick లాంటి సినిమాలు థియేటర్లను మళ్లీ ఫుల్ చేశాయి. ఎందుకంటే అవి ప్రేక్షకుడికి “ఈ సినిమా ఇంట్లో కాదు, థియేటర్‌లో చూడాలి” అనే ఫీలింగ్ ఇచ్చాయి.
టాలీవుడ్‌లో మిస్సవుతున్నది ఇదేనా?
ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తున్న పెద్ద విమర్శ . రైటింగ్ బలహీనపడుతోంది. స్టార్ పవర్ ఉంది. బడ్జెట్ ఉంది. మార్కెటింగ్ ఉంది. కానీ పాత్రలు, భావోద్వేగాలు, గుర్తుండిపోయే కథనం తగ్గిపోతున్నాయని అంటున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను, మాస్ ప్రేక్షకుడిని, యువతను ఒకేసారి కనెక్ట్ చేసేది. ఇప్పుడు చాలా సినిమాలు ఒక్క వీకెండ్‌కే పరిమితమవుతున్నాయి. అందుకే ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘హనుమాన్’ లాంటి సినిమాలు వర్క్ అయ్యాయి. అవి ప్రేక్షకుడికి “ఇది థియేటర్‌లో చూడాల్సిందే” అనే ఫీలింగ్ ఇచ్చాయి.
ఇప్పుడు చాలామంది ప్రేక్షకులు ఇలా ఆలోచిస్తున్నారు: “ఇది నిజంగా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందా? లేక ఓటీటీలో చూసినా సరిపోతుందా?” . ఇదే ప్రశ్న ఇప్పుడు థియేటర్లను భయపెడుతోంది.
‘పెద్ది’ తర్వాత పరిస్థితి మారుతుందా?
ఇప్పుడు ఇండస్ట్రీలో అందరి చూపు ‘పెద్ది’ మీదే ఉంది. ఎందుకంటే ఈ సినిమా చుట్టూ జరుగుతున్న డిబేట్... రేపటి టాలీవుడ్ బిజినెస్ మోడల్‌ను నిర్ణయించే స్థాయికి వెళ్లింది.
పర్సంటేజీ షేరింగ్ గెలుస్తుందా? లేక అద్దె విధానం కొనసాగుతుందా? అన్నది పక్కన పెడితే... ఈ మొత్తం గొడవ టాలీవుడ్‌కు ఒక నిజాన్ని మాత్రం బలంగా గుర్తు చేస్తోంది.
ప్రేక్షకుడు ఇంకా సినిమాను ప్రేమిస్తున్నాడు. కానీ అతడు ఇప్పుడు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతున్నాడు
“నన్ను నిజంగా కదిలించే సినిమా తీస్తే... నేను ఖచ్చితంగా థియేటర్‌కు వస్తాను.” అని
యుద్ధాలు ఆపండి.. సినిమాను కాపాడండి!
లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు మూతపడినా సినిమాల మీద ఆసక్తి ఉండేది, కానీ ఇప్పుడు థియేటర్లు తెరిచి ఉన్నా ప్రేక్షకుల మొహం చాటేస్తున్నారు. దీనికి కారణం బలహీనమైన రాత, ఆకట్టుకోని కథనాలు. ఇప్పటికైనా టాలీవుడ్ వర్గాలు పర్సంటేజీలు, అద్దెల గురించి గొడవలు మానేసి.. ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించే ‘దమ్మున్న’ కంటెంట్ మీద దృష్టి పెట్టాలి. అప్పుడే పరిశ్రమ నిలబడుతుంది, లేదంటే ఈ ఇగో క్లాష్‌ల మధ్య తెలుగు సినిమా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. యుద్ధం సిస్టమ్ మీద కాదు, క్వాలిటీ మీద జరగాలి!

