
తమిళంలో సూపర్ హిట్, తెలుగులో డిజాస్టర్, చిత్రమైన కారణం?
తెలుగువాళ్ల లెక్కలు వేరా?
13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ, "సింగం 2" తర్వాత హీరో సూర్య ఖాతాలో పక్కా బ్లాక్‌బస్టర్ హిట్ పడిందని తమిళ చిత్ర పరిశ్రమ మొత్తం పండగ చేసుకుంటోంది. ఆ సినిమానే “కరుప్పు”. తెలుగులో వీరభద్రుడు. తమిళనాట కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దారుణంగా చతికిలపడింది. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి పెద్ద సంస్థ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకొని, టాలీవుడ్ స్టార్ హీరోలు ట్వీట్లతో ప్రమోట్ చేసినా కూడా థియేటర్ల దగ్గర కనీస బుకింగ్స్ లేకపోవడం ఇండస్ట్రీని సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇంతటి పాజిటివ్ టాక్ ఉన్న సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఎందుకు బ్రహ్మరథం పట్టడం లేదు? దీని వెనకున్న అసలు లోపమేంటి?
తమిళనాట సంచలనం
అనేక వాయిదాలు, విడుదల అడ్డంకులను దాటుకుని థియేటర్లలోకి వచ్చిన హీరో సూర్య సరికొత్త చిత్రం “కరుప్పు” బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. సంచలన ఓపెనింగ్స్‌తో దూసుకుపోయిన ఈ సినిమా, వర్కింగ్ డేస్‌లోనూ ఎక్కడా తగ్గకుండా అద్భుతమైన హోల్డ్‌ను ప్రదర్శించింది. విడుదలైన ఐదో రోజే (అంటే సోమవారం) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹150 కోట్ల మార్కును దాటేసి సూర్య కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. సూర్య రెండు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ₹150 కోట్ల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం!
సోమవారం నాటి సంచలనం.. కలెక్షన్ల సునామీ!
ఈ చారిత్రాత్మక రన్ వెనుక సోమవారం నాటి కలెక్షన్లు కీలక పాత్ర పోషించాయి. సాధారణంగా వీకెండ్ తర్వాత సోమవారం డ్రాప్ ఉంటుంది, కానీ 'కరుప్పు' విషయంలో సీన్ రివర్స్ అయింది. సోమవారం ఒక్క రోజే తమిళనాడులో ఈ చిత్రం రెండంకెల వసూళ్లను రాబట్టింది.
90% హోల్డ్: దేశవ్యాప్తంగా మొదటి రోజు వచ్చిన కలెక్షన్లతో పోలిస్తే, సోమవారం నాడు ఏకంగా 90% కలెక్షన్లను నిలబెట్టుకుని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ఒక్క రోజే 20 కోట్లు: సోమవారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹20 కోట్ల గ్రాస్ వసూలు చేయడం సినిమాకున్న బలమైన మౌత్ టాక్‌కు నిదర్శనం. అంతేకాదు, లాంగ్ రన్‌లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆ ఒక్క తప్పు.. తెలుగులో డౌన్ చేసిందా?
తమిళనాట దర్శకుడు, ఈ సినిమాలో విలన్ గా చేసిన ఆర్జే బాలాజీకు క్రేజ్ ఉంది. దాంతో అక్కడ సమస్య రాలేదు. కానీ తెలుగులో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో చెబుతున్న ఒకే ఒక్క మైనస్ పాయింట్. ఆర్జే బాలాజీ క్యారెక్టర్, అతని నటన.
సూర్య ముందు తేలిపోయిన స్క్రీన్ ప్రెజెన్స్:
సినిమాలో సూర్య లాంటి పవర్‌హౌస్ పర్ఫార్మర్ ముందు నిలబడాలన్నా, దేవుడిని సైతం ఎదిరించే అత్యంత బలమైన 'బేబీ కన్నన్/కృష్ణన్' పాత్రలో మెప్పించాలన్నా అసాధారణమైన నటన కావాలి. కానీ, ఆ పాత్రలో ఆర్జే బాలాజీ అస్సలు సెట్ అవ్వలేదు. సూర్య నటన ముందు అతను చాలా సాదాసీదాగా, తేలిపోయినట్లు కనిపించాడని మనవాళ్లకు అనిపించాడు. అందుకు కారణం మనకు ఆర్జే బాలాజీ అంటే కామెజీ ఇమేజ్ ఉండటమే.
క్యాస్టింగ్ బ్లండర్:
ఈ పాత్రకు ఆర్జే బాలాజీ కంటే ఎస్.జే.సూర్య లేదా పృధ్వీరాజ్ సుకుమారన్ లాంటి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్సిటీ ఉన్న నటులను పెట్టుకుని ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేదనేది మనవాళ్ల విశ్లేషణ.
రైటింగ్‌కు న్యాయం చేయని యాక్టింగ్:
కథా పరంగా ఆ పాత్రకు ఆర్జే బాలాజీ రాసుకున్న ఎలివేషన్ సీన్స్ బాగున్నప్పటికీ, వాటిని పండించడంలో అతని నటన, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా విఫలమయ్యాయి. క్యాస్టింగ్ మరియు యాక్టింగ్ విషయంలో జరిగిన ఈ పెద్ద పొరపాటే సినిమాను తెలుగులో వెనక్కి నెట్టేస్తోంది.
ఇప్పుడు చేయాల్సింది ఏంటి?
తమిళంలో దూసుకుపోతున్న ఈ చిత్రాన్ని తెలుగులో కూడా నిలబెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు సూర్యపైనే ఉంది. సోషల్ మీడియా ట్వీట్లు మాత్రమే బుకింగ్స్‌ను పెంచలేవు. సూర్య స్వయంగా రంగంలోకి దిగి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ విజిట్స్ చేయడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా మాత్రమే ఈ పాజిటివ్ టాక్‌ను కలెక్షన్లుగా మార్చగలడు. అలాగే, సినిమా మేకింగ్‌లో తప్పులు చేసిన ఆర్జే బాలాజీ, కనీసం ప్రమోషన్స్ విషయంలోనైనా దూకుడు ప్రదర్శించి టాలీవుడ్ ఆడియన్స్‌కు రీచ్ అయ్యేలా ప్లాన్ చేయాల్సి ఉంది.
సూర్య కోసం ఆ ఒక్క అడుగు పడదా?
ఒక నటుడిగా సూర్య తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ నిరాశపరచలేదు. గజినీ, సూర్య s/o కృష్ణన్, సింగం చిత్రాలతో మన గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అలాంటి నటుడికి 13 ఏళ్ల తర్వాత దక్కిన ఈ అద్భుతమైన విజయాన్ని, కేవలం ఒకే ఒక్క క్యాస్టింగ్ లోపం కారణంగా మనం ఇక్కడ కోల్పోకూడదు. లోపాలు ఉన్నప్పటికీ, కథలోని ఆత్మను, సూర్య పడ్డ కష్టాన్ని గుర్తించి, ఈ వీకెండ్‌కైనా తెలుగు ప్రేక్షకులు థియేటర్ల వైపు అడుగులు వేస్తారని, 'కరుప్పు' (తెలుగులో వీరభద్రుడు) కు ఇక్కడ కూడా దక్కాల్సిన గౌరవాన్ని అందిస్తారని ఆశిద్దాం!

