తిరువీర్ పాపం ప్రతాప్ మూవీ రివ్యూ
x

తిరువీర్ 'పాపం ప్రతాప్' మూవీ రివ్యూ

'నిద్ర' సమస్య ప్రతాప్‌దా? లేక చూసే ప్రేక్షకుడిదా?


కథ 90వ దశకంలో (1994-98) సాగుతుంది. మన హీరో ప్రతాప్ (తిరువీర్) కి చిన్నప్పటి నుండి బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ) అంటే పిచ్చి ప్రేమ. ఎంతలా అంటే, ఆమె అడగడమే ఆలస్యం.. తండ్రి రంగయ్య (అజయ్ ఘోష్) వద్దంటున్నా, కళ్ళెర్రజేస్తున్నా వినకుండా, ముహూర్తాలు పెట్టించేసి గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడి వరకు అంతా సజావుగానే సాగింది.

కట్ చేస్తే.. ముచ్చటగా మూడు శోభనం రాత్రులు గడవకముందే బుజ్జమ్మ ఊరి పెద్దల ముందు పంచాయితీ పెట్టి ఓ బాంబు పేలుస్తుంది. "ప్రతాప్‌లో ఏదో లోపం ఉంది, అతనితో నేను సంసారం చేయలేను" అని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేస్తుంది. ఆ సమస్య ఏంటని అడిగితే.. "నేను చెప్పను, తనే తెలుసుకుని సరిదిద్దుకుని రావాలి" అని కండిషన్ పెట్టి, సూట్‌కేస్ సర్దుకుని పుట్టింటికి చెక్కేస్తుంది.

దీంతో ఊళ్ళో ప్రతాప్ గురించి రకరకాల రుమర్స్ (Rumors) వైరల్ అయిపోతాయి. జనం రకరకాలుగా కామెంట్స్ చూస్తూ, అతన్ని సానుభూతిగానూ, వింతగానూ చూస్తూంటాడు. కొందరు గే అంటారు. మరి కొందరు విషయం లేదంటారు. పాపం ప్రతాప్, ఆ "మిస్టరీ సమస్య" ఏంటో తెలుసుకోవడానికి తన స్నేహితులతో రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. మొత్తానికి అసలు విషయం బయటపడుతుంది. అదేంటంటే.. అతనికి ఒక వింతైన స్లీపింగ్ డిజార్డర్ ఉంది. నిద్రలో తనకు తెలియకుండా ప్రతాప్ కొన్ని విన్యాసాలు చూస్తూంటాడు. అవి తట్టుకోవటం కష్టమే! మొత్తానికి నిద్రలో తను ఏం చేస్తున్నాడో తెలిసి ప్రతాప్ మైండ్ బ్లాక్ అవుతుంది. అప్పుడు ప్రతాప్ ఏం చేసాడు

అసలు ఇంతకీ నిద్రలో ప్రతాప్ చేసే విన్యాసాలేంటి? ప్రాణంగా ప్రేమించే పెళ్ళాన్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఈ గోలలో అతని పరిస్దితి ఏ స్దాయికి దిగ జారింది.. చివరికి ఆ 'నిద్ర' సమస్యను వదిలించుకుని బుజ్జమ్మను ఎలా ప్రసన్నం చేసుకున్నాడు అనేదే ఈ 'పాపం ప్రతాప్' లో తెలుసుకోవాల్సిన మేటర్!

విష్లేషణ

కొన్ని స్టోరీలైన్స్ వింటానికి వింతగా ఉంటాయి. అవే హీరోలను ఉత్సాహపరిచి సినిమా కమిటయ్యేలా చేస్తాయి. అలాంటిదే ఈ పాయింట్ కూడాదను. ఫన్ కు స్కోప్ ఉన్న పాయింటే.అయితే పాయింట్ చెప్పే విధానంలో ఫన్ తేవాలి తప్పించి, ఇది ఫన్ డైరక్ట్ గా ఉండే పాయింట్ కాదు. అప్పటికీ చాలా వరకూ ట్రై చేసారు, ప్రతీ సీన్ లోనూ ఫన్ తెద్దామని. అయితే ఎంత కామెడీ అయినా ప్రతీ డైలాగులో, ప్రీతీ సీన్ లో ఫన్ తేవాలనుకోవటం ఇబ్బంది, చూసేవారికీ ఇబ్బందే. మేజర్ ఎపిసోడ్స్ బాగా ఫన్ పండితే సరిపోతుంది. కానీ అడుగడక్కీ ఫన్ తేవాలనే తాపత్రయంలో ఎలా పడితే అలా డైలాగులు, సీన్స్ రాసుకుంటే అది పాపం ప్రతాప్ అవుతుంది. చూసే వారికి పాపం ప్రేక్షకుడు అనిపిస్తుంది.

ప్రారంభం సెటప్, పాత్రలు దాకా బాగానే ఉందనిపిస్తుంది. ఆ తర్వాత ప్ర‌తాప్‌కు ఉన్న స‌మ‌స్య విష‌యంలో ఊరివాళ్లు ర‌క‌ర‌కాల పుకార్లు సృష్టించ‌డం… ఆ క్ర‌మంలో వ‌చ్చే కామెడీతో హిలేరియ‌స్‌ అనను కానీ కొంత నవ్విస్తుంది. ముఖ్యంగా అజ‌య్ ఘోష్‌, గోప‌రాజు ర‌మ‌ణ మ‌ధ్య వ‌చ్చే ఎపిసోడ్స్ కాస్త న‌వ్విస్తాయి. ష‌కీలా సినిమా సీన్, ర‌ఘు మ‌ధ్య వ‌ర్తిత్వం ఎపిసోడ్స్ కూడా ఛల్తాహై అన్నట్లు వెళ్లిపోతాయి.

ఎప్పుడైతే ఇంటర్వెల్ దగ్గర ప్రతాప్ కు తన సమస్య విషయం తెలిసిందో..అక్కడ నుంచి ప్ర‌తాప్ వేసే ప్లాన్స్ మొత్తం ఫెయిల‌వ్వ‌డం ఇవన్నీ మాత్రం విసుగు తెప్పిస్తాయి.నిజానికి ఏ సినిమాకు అయినా సెకండాఫ్ ప్రాణం. అదే ఇక్కడే పోయింది. సెకెండ్ ఆఫ్ చాలా స్లో నరేషన్ తో సాగుతూ రిపీటివ్ సీన్స్ తో సాగింది… దానికి తోడు త‌న స‌మ‌స్య త‌గ్గిపోయింద‌ని ఊరివాళ్ల‌ముందు నిరూపించే క్ర‌మంలో వ‌చ్చే ర‌చ్చ‌బండ సీన్, క్లైమాక్స్ క‌న్వీన్సింగ్‌గా రాసుకున్నట్లు, ఇక సినిమా ముగించాలి కదా అన్నట్లు అనిపిస్తుంది.

నటీనటుల్లో ..

తిరువీర్ ని ఈ కథలో తప్పు పట్టడానికి ఏమీ లేదు..దాదాపు మొత్తం అతనే సినిమాని మాగ్జమం మోసే ప్రయత్నం చేసాడు. స్క్రిప్టే సహకరించలేదు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ కూడా బాగా చేసింది అనేదాని కన్నా బాగుంది అనాలి. సీనియర్ నటి రాశి.. హీరో తల్లి పాత్రలో చాలా కాలం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. తండ్రి పాత్రలో అజయ్ ఘోష్ బాగా ఎక్కువ రచ్చ చేసారు. అంత అవసరం లేదేమో. గోపరాజు రమణ పాత్ర.. కూడా సేమ్ టు సేమ్. రఘుబాబు ఓకే. దేవి ప్రసాద్.. రూపలక్ష్మి తమ పాత్రలకు తగ్గట్లు నటించారు. ప్రసాద్ బెహరాను సరిగా ఉపయోగించుకోలేదనిపించింది.

టెక్నికల్ గా..

సంగీతం: చాలా కాలం తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చిన కేఎం రాధాకృష్ణన్ తన మార్కు సంగీతంతో మెప్పించారు. ముఖ్యంగా ‘పిల్లెక్కడుంది’ పాట హుషారుగా ఉండగా, ఎస్పీ చరణ్ పాడిన పాట మనసుకు హత్తుకుంటుంది. సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం (BGM) సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది.

సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్ విజువల్స్ పల్లెటూరి వాతావరణాన్ని చాలా సహజంగా, అందంగా తెరకెక్కించాయి.

దర్శకత్వం & రచన: దర్శకుడు దుర్గా నరేష్ ఒక విభిన్నమైన పాయింట్‌ను ఎంచుకోవడం అభినందనీయం. అయితే, స్క్రీన్ ప్లే దెబ్బ కొట్టింది.

నిర్మాణ విలువలు: సినిమా స్థాయికి తగ్గట్టుగా నిర్మాణ విలువలు రిచ్‌గానే ఉన్నాయి.

ఫైనల్ థాట్

ప్రతాప్‌కి ఉన్నది 'నిద్ర' సమస్య.. కానీ సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి వచ్చేది 'నిద్ర' సమస్య!

Read More
Next Story