‘పెద్ది’కి కోర్టు డైనమిక్ ఇంజంక్షన్ ఆర్డర్
x

‘పెద్ది’కి కోర్టు డైనమిక్ ఇంజంక్షన్ ఆర్డర్

డైనమిక్ ఇంజంక్షన్ ఎలా పని చేస్తుంది?


ఒకప్పుడు సినిమాకు హిట్, ఫ్లాప్ తీర్పు, భాక్సాఫీస్ కలెక్షన్స్ కేవలం ప్రేక్షకులు, అభిమానులు,రివ్యూల చేతిలోనే ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ తీర్పు పైరసీ వెబ్‌సైట్ల చేతిలోకి వెళ్లిపోయింది. థియేటర్లలో ఫస్ట్ షో పూర్తికాకముందే HD ప్రింట్లు బయటకు రావడం, కోట్ల రూపాయల బిజినెస్ ను టాక్ తో సంభందం లేకుండా ఒక్క రాత్రిలో కూల్చేస్తోంది. ముఖ్యంగా భారీ పాన్ ఇండియా సినిమాలకు పైరసీ ఇప్పుడు అసలైన టెన్షన్ గా మారింది.పైరసీ బయిటకు వస్తే ఆ సినిమా ఎంత బాగున్నా కలెక్షన్స్ డ్రాప్ అయ్యిపోతున్నాయి. యావరేజ్ టాక్ వస్తే అసలు కలెక్షన్స్ ఉండటం లేదు. పైరసీలో చూస్తున్నారు. ఓటిటి కోసం ఎదురుచూస్తున్నారు.ఇంక తేడా టాక్ వస్తే చెప్పక్కర్లేదు.ఓటిటి వచ్చేదాకా పైరసీదే రాజ్యం.

అందుకే రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ రిలీజ్ కి ముందే మేకర్స్ అలర్ట్ అయ్యారు. సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు ఉండగానే కోర్టును ఆశ్రయించి యాంటీ పైరసీ రక్షణ తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ మీద భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమాకు, లీకుల భయం ఎంత పెద్దదో ఈ నిర్ణయం చెప్పకనే చెబుతోంది.

లీక్ అయితే గేమ్ ఓవర్?

వచ్చిన సమాచారం ప్రకారం, ‘పెద్ది’ సినిమాకు సంబంధించి పైరసీ, అక్రమ లీకులు, అనధికారిక స్ట్రీమింగ్ ని అడ్డుకోవాలని కోరుతూ నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, సినిమాను అనధికారికంగా అప్‌లోడ్ చేయడం, రికార్డ్ చేయడం, సోషల్ మీడియాలో షేర్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పైరసీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ లింకులు, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది.డైనమిక్ ఇంజక్షన్ ఆర్డర్ తో ముందుకు వెళ్తోంది.

డైనమిక్ ఇంజంక్షన్ అంటే ఏంటి? చరణ్ సినిమాకు ఇది ఎలా ప్లస్?

సాధారణంగా ఒక సైట్‌ను బ్లాక్ చేస్తే, పైరసీ దొంగలు మరో పేరుతో మిర్రర్ సైట్లను ఓపెన్ చేస్తారు. దీనికి చెక్ పెట్టడానికే కోర్టు ఈసారి 'డైనమిక్ ఇంజంక్షన్' ఆయుధాన్ని వాడింది. దీనివల్ల ప్రతిసారీ నిర్మాతలు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కొత్తగా పుట్టుకొచ్చే నకిలీ డొమైన్లను, పైరసీ లింకులను అధికారులు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే వెసులుబాటు దొరుకుతుంది. ఒక్క పైరసీ లీక్ వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, యావత్ సినీ పరిశ్రమ వందల కోట్లు నష్టపోయే ప్రమాదం ఉందని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.

భారీ బడ్జెట్ సినిమాలకు ఇది ఇప్పుడు తప్పనిసరి ఆయుధంగా మారుతోంది. ఎందుకంటే మొదటి మూడు రోజుల కలెక్షన్స్ మీదే సినిమాల బిజినెస్ నిలబడుతోంది.

అసలు భయం HD ప్రింట్!

పైరసీ కొత్త విషయం కాదు. కానీ ఇప్పుడు సమస్య స్పీడ్. సినిమా రిలీజ్ అయిన గంటల్లోనే టెలిగ్రామ్, టోరెంట్, పైరసీ వెబ్‌సైట్లలో ప్రింట్లు దర్శనమిస్తున్నాయి. చాలాసార్లు థియేటర్ క్యామ్ ప్రింట్లు మాత్రమే రావడంతో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. కానీ HD ప్రింట్ బయటకు వస్తే మాత్రం పరిస్థితి మారిపోతుంది.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, పెద్ద సినిమాలకు పైరసీ ప్రింట్ కనక వస్తే ఫస్ట్ వీక్ లోనే 50 శాతం వరకు రెవెన్యూ దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు ఇది మరింత ప్రమాదకరం.

కోర్టు ఆర్డర్ సరిపోతుందా?

లీగల్ ప్రొటెక్షన్ ఉండటం నిర్మాతలకు ఒక భరోసా. కానీ నిజంగా పైరసీని పూర్తిగా ఆపగలమా? అన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ప్రశ్న. ఎందుకంటే చట్టాలు కఠినమవుతున్నా, లీకులు మాత్రం ఆగడం లేదు.ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ అత్యంత కీలకంగా మారిన ఈ రోజుల్లో, 'పెద్ది' లాంటి భారీ బడ్జెట్ సినిమాకు ఈ లీకుల భయం చాలా పెద్దది.

మరి కోర్టు ఇచ్చిన ఈ లీగల్ రక్షణ కవచం 'పెద్ది' బాక్సాఫీస్ కలెక్షన్లను ఎంతవరకు కాపాడుతుందో, ఆన్‌లైన్ దొంగల నుంచి సినిమాను ఎలా రక్షిస్తుందో చూడాలి. జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న మెగా పవర్‌స్టార్ ఏ మేరకు బాక్సాఫీస్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తాడో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!

Read More
Next Story