‘పోచమ్మ’ వెబ్ సిరీస్ రివ్యూ!
x

‘పోచమ్మ’ వెబ్ సిరీస్ రివ్యూ!

మిస్టరీ కట్టిపడేస్తుంది… కానీ !


అరకు ప్రాంతంలోని కాఫీ తోటల మధ్య ఒక విలాసవంతమైన గెస్ట్ హౌజ్ ఉంటుంది. గతంలో ఈ ఎస్టేట్ రంగనాథ్ అలియాస్ రఘుపతి (అచ్యుత్ కుమార్) కుటుంబానిది. అయితే వ్యాపార నష్టాల వల్ల ఆయన ఆ ఎస్టేట్‌ను వ్యాపారవేత్త అయిన ఫెడ్రిక్ (రమేష్ ఇందిర)కు అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ ఎస్టేట్ యజమాని మారినా, రంగనాథ్ అక్కడే మేనేజర్‌గా ఉండిపోతాడు. ఆయన భార్య శాంతి, కుమారుడు సురేశ్, కూతురు గాయత్రి కూడా అదే ఎస్టేట్‌లో పని చేస్తుంటారు.

యజమాని ఫెడ్రిక్ తన భార్య నాన్సీ, పెద్ద కూతురు ఇవా/ఇవానా (పూజారెడ్డి/ప్రియ శతమర్షన్), అల్లుడు డానియల్/డేవిడ్ (అర్జున్ అంబటి), చిన్న కూతురు జెస్సీ (స్నేహాల్‌ కామత్)లతో కలిసి ఆ ఎస్టేట్‌కు వస్తాడు. అక్కడ పనిచేసే రంగనాథ్ కుటుంబంలో ఆయన భార్య శాంతికి భర్త నిజాయితీ నచ్చదు. పేదరికంలో ఉండిపోయామనే అసంతృప్తితో ఆమె ఇంట్లో చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ ఉంటుంది. మరోవైపు, యజమాని చిన్న కూతురు జెస్సీతో రంగనాథ్ కొడుకు సురేశ్ చనువుగా మెలగడం మొదలుపెడతాడు.

ఇక ఆ ఇంటి ముందు 'పోచమ్మ తల్లి' విగ్రహం ఉంటుంది. గ్రామాన్ని కాపాడే శక్తిమంతమైన దేవతగా స్థానికులు ఆ తల్లిని నమ్ముతారు. అయితే ఫెడ్రిక్ తన బంగ్లా ఎదురుగా ఆ విగ్రహం ఉండటాన్ని ఇష్టపడక, రంగనాథ్ హెచ్చరికలను లెక్కచేయకుండా దాన్ని తొలగిస్తాడు.

విగ్రహాన్ని తీసేసినప్పటి నుండి ఆ కుటుంబంలో వరుస అపశకునాలు మొదలవుతాయి. ఇంట్లోకి పాము రావడం, భార్య విచిత్రంగా ప్రవర్తించడం, ఇవానా 'పోతురాజు' మాస్క్ ధరించిన వ్యక్తిని చూసి భయపడటం వంటివి జరుగుతాయి. ఈ క్రమంలోనే చిన్న కూతురు జెస్సీ అనుమానాస్పద స్థితిలో మేడపై నుండి పడి చనిపోతుంది.

జెస్సీ చావుకు రఘుపతి కొడుకు సురేశ్ కారణమని ఫెడ్రిక్‌ పెద్ద కూతురు ఇవా(ప్రియా) పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు మాత్రం ఈ హత్య వెనుక ఇవా భర్త డేవిడ్‌(అర్జున్‌ అంబటి) కూడా ఉన్నట్లు అనుమానపడతారు. ఊరువాళ్లు మాత్రం పోచమ్మ విగ్రహం తొలగించినందుకే.. అమ్మ ఆగ్రహించి జెస్సీని చంపేసిందని అంటూంటారు.

అసలు జెస్సీ మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అది పోచమ్మ తల్లి శాపమా లేక ఎవరైనా ఆడిన నాటకమా? ఎస్టేట్‌పై కన్నేసిన 'రెడ్డి' అనే వ్యక్తితో ఫెడ్రిక్‌కు ఉన్న వైరం ఏంటి? అల్లుడు డానియల్ అసలు రూపం ఏంటి? అసలు జెస్సీ ఎలా చనిపోయింది... చివరకు ఫెడ్రిక్ కు తెలిసిన నిజం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సీరిస్ పూర్తిగా చూడాల్సిందే.

ఎనాలసిస్ ..

సాధారణంగా మర్డర్ మిస్టరీలలో కొత్తదనం తీసుకురావడం చాలా కష్టం. కానీ అదే జానర్‌లో మైథాలజీని కలిపితే కథకి ఒక కొత్త డైమెన్షన్ వస్తుంది. ఈ ఆలోచనతో తెరకెక్కిన వెబ్‌సిరీస్ ‘పోచమ్మ’. దర్శకుడు రమేష్ ఇందిరా ఈ సిరీస్‌ను కేవలం క్రైమ్ స్టోరీగా కాకుండా, దేవుడుపై విశ్వాసం, అహంకారం, శాపం అనే థీమ్స్ చుట్టూ నిర్మించడానికి ప్రయత్నించాడు. ఐదు ఎపిసోడ్స్‌తో తక్కువ నిడివిలో వచ్చిన ఈ సిరీస్, మొదటి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలోకి లాగేస్తుంది.

సిరీస్ జెస్సీ మరణంతో ప్రారంభమవుతుంది. ఇది సాధారణ మర్డర్ కేస్ కాదు అనే ఫీలింగ్‌ను దర్శకుడు మొదటి నుంచే క్రియేట్ చేస్తాడు. ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్, మరోవైపు పోచమ్మ తల్లి చుట్టూ తిరిగే విశ్వాసాలు—ఈ రెండు లైన్స్ కలిసిపోతూ కథలో ఆసక్తిని పెంచుతాయి. “ఇది హత్యా? లేక శాపమా?” అనే సందేహంతో కథ ముందుకు సాగడం ఈ సిరీస్‌కు ప్రధాన బలం.

ఈ సిరీస్‌కు ప్రధాన బలం కావాల్సింది పోచమ్మ తల్లి ఎలిమెంట్. గ్రామస్థుల విశ్వాసం, ఆ తల్లిపై వారి భావోద్వేగం కథలో కీలకం కావాలి. కానీ ఇక్కడే సిరీస్ కొంచెం వెనుకబడింది. పోచమ్మపై ఉన్న నమ్మకాన్ని, ఆ శక్తిని దర్శకుడు పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. కొన్ని సన్నివేశాలు ఉన్నా, అవి కథలో డీప్ ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. పోచమ్మ విగ్రహాన్ని తొలగించే సీన్ మాత్రం ఎమోషనల్‌గా హైలైట్ అవుతుంది. “మానవ అహంకారం vs దేవత” అనే కాన్సెప్ట్ అక్కడ బలంగా కనిపిస్తుంది.

జెస్సీ మరణం చుట్టూ అనుమానితులుగా కనిపించే పాత్రలు—ఫెడ్రిక్, రెడ్డి, డేవిడ్, సురేష్—ప్రతి ఒక్కరికీ ఒక మోటివ్ ఉంటుంది. దర్శకుడు ఈ పాత్రలపై అనుమానాలు రేకెత్తిస్తూ కథను మలుపులు తిప్పుతాడు. కానీ థ్రిల్లర్స్‌కు అలవాటు పడిన ప్రేక్షకులకు విలన్‌ను ముందుగానే ఊహించే అవకాశం ఉంటుంది. ట్విస్ట్స్ ఉన్నా, అవి ఆశించిన రేంజ్‌లో షాక్ ఇవ్వవు. ఎక్కువగా “ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్స్”గానే అనిపిస్తాయి.

సిరీస్ చివర్లో వచ్చే ట్విస్ట్, కథను వెనక్కి తీసుకెళ్లే నేరేషన్ స్టైల్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ అనూహ్యంగా అనిపించినా, పూర్తిగా షాక్ ఇచ్చే స్థాయిలో ఉండదు. కొన్ని సీన్స్‌లో లాజిక్ మిస్సింగ్ అనిపించడం కూడా మైనస్‌గా నిలుస్తుంది.

చూడచ్చా

థ్రిల్లర్స్‌ను ఇష్టపడే వారికి ఇది ఒకసారి చూడదగ్గ సిరీస్. కానీ ఎక్స్‌పెక్ట్ చేసే రేంజ్‌లో సస్పెన్స్, ఎమోషనల్ డెప్త్ మాత్రం పూర్తిగా అందదు.

ఫైనల్ థాట్

ఈ కథలో మిస్టరీ కట్టిపడేస్తుంది… కానీ మైథాలజీ మాత్రం మనసులో ముద్ర వేయలేకపోతుంది.

ఎక్కడ చూడచ్చు

ఆహా ఓటిటిలో తెలుగులో ఉంది

Read More
Next Story