
కామెడీనే కానీ ...‘పురుషః’ మూవీ రివ్యూ
‘F2’ ఫార్ములాకి మరో వెర్షన్?
గోవింద్ (పవన్ కళ్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (రాజ్‌కుమార్ కసిరెడ్డి)బాల్య స్నేహితులు. పెళ్లిళ్లు అయ్యినా వాళ్ల స్నేహం బంధం అలాగే కొనసాగుతుంది.ఇక వీరి వైవాహిక జీవితం మాత్రం అనుకున్నంత ఆనందంగా మాత్రం ఉండదు. అనుమానాలు, అలకలు,అపార్దాలతో మాటకు మాట పెరిగి చిరిగి చేటంత అయ్యి పరిస్దితులు ప్రతీ క్షణం ఎదురౌతూంతాయి.
కొద్దికాలానికి అది శృతి మించి వీళ్ల భార్యలు భర్తలను ప్రేమతో చూసే స్టేజ్ దాటేసి… “24 గంటల సస్పెక్ట్స్”లా ట్రీట్ చేస్తుంటారు. బాత్రూమ్‌కి ఫోన్ తీసుకెళ్లినా అనుమానం… నవ్వుతూ మెసేజ్ టైప్ చేసినా అనుమానం… ఒక్కసారి హెయిర్ స్టైల్ మార్చుకున్నా “ఎవర్ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావ్?” అనే ఇంటర్నల్ విచారణ అన్నట్లు ఉంటుంది.
ఇంతలో వీళ్ల బ్యాచ్‌లో ఇంకా పెళ్లి కాకుండా సింగిల్‌గా సంతోషంగా తిరిగే కిస్సు (వెన్నెల కిషోర్)కి పెళ్లి ఫిక్స్ అవుతుంది.దాంతో వీళ్లు ముగ్గురూ ఫ్యామిలీలతో కలిసి పెళ్లికి వెళ్తారు. కానీ అక్కడే ఈ ముగ్గురు మొగుళ్ల శాంతియుత జీవితం… వాట్సాప్ బ్యాకప్ లీక్ అయినట్టు చిథ్రమవుతుంది.
ఎందుకంటే కిస్సుకి ఓ డేంజరస్ అలవాటు ఉంటుంది . జీవితంలో జరిగిన ప్రతి జ్ఞాపకాన్ని డైరీలో బొమ్మలతో గీసి దాచుకోవడం. ఆ డైరీ భార్యల చేతికి చిక్కిన తర్వాత… ఈ ముగ్గురు చేసిన పాత ప్రేమ కథలు, చిలిపి పనులు, యవ్వనంలో చేసిన వెధవేషాలు ఒక్కో పేజీగా బయటికొస్తాయి.
ఇక భార్యల రియాక్షన్ చూస్తే… “ఇంతకాలం మనం మనుషులను పెళ్లి చేసుకున్నామా? లేక లోకల్ విజయ్ మాల్యాల్ని చేసుకున్నామా?” అనిపించేలా ఉంటుంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈ లోగా దేవిక అనే అమ్మాయి ఎంట్రీ…ఆ అమ్మాయితో తమ భర్తలకు ఏదో సంబంధం ఉందని భార్యలు నమ్మేస్తారు.గోవింద్ గతంలో రోజీ అనే మరో చాప్టర్… అన్నీ కలిసొచ్చేసరికి ఇంట్లో పరిస్థితి “కాపురం” నుంచి నేరుగా “కోర్టు డ్రామా”కి షిఫ్ట్ అవుతుంది.
చివరికి ఈ ముగ్గురు భార్యలు నిజంగానే విడాకులు తీసుకున్నారా? లేక “మొగుళ్లు ఇలానే ఉంటారు” అని భారతీయ భార్యల శాశ్వత సహనానికి మరో ఉదాహరణగా నిలిచారా? అసలు కిస్సు డైరీలో ఎంత నిజం ఉంది? ఎంత అతిశయోక్తి ఉంది? అనేదే మిగతా కథ.
విశ్లేషణ
తెలుగు సినిమాకి “పెళ్లైన మగాడి బాధ” అనేది ఎప్పటికీ ఎక్స్‌పైర్ కాని జానర్. మగాళ్ల బాధను దగ్గరగా చూస్తే సీరియస్ డ్రామా.దూరం నుంచి చూస్తే ఫుల్ కామెడీ. హీరోకి విలన్ అవసరం లేకపోయినా పర్వాలేదు… ఇంట్లో భార్య అనుమానం ఉంటే చాలు కథ రెడీ అయిపోతుంది. అందుకే క్షేమంగా వెళ్లి లాభంగా రండి నుంచి F2: Fun and Frustration వరకు ఈ ఫార్ములా తిరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు కేవలం కామెడీలు కాదు… “మ్యారేజ్ అనే సంస్థపై సామూహిక సెటైర్స్.”
‘పురుషః’ కూడా దాదాపు అదే ట్రాక్‌లో నడించేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే… సినిమా అసలు కథ కంటే “మగాళ్లు భార్యల ముందు ఎందుకు భయపడతారు?” అనే సోషల్ కామెడీని ఎక్కువగా సెలబ్రేట్ చేస్తుంది.
కామెడీ జానర్‌లో కొత్త కథలకన్నా “కొత్త ట్రీట్‌మెంట్” ముఖ్యం అని Billy Wilder ఒకసారి అన్నాడు. ‘పురుషః’లో కూడా కథ కొద్దది కాదు… ట్రీట్‌మెంట్ కొత్తగా పనిచేసిన చోట్లే సినిమా బ్రతికింది.
ప్రారంభంలో సినిమా రిలేటబుల్‌గా మొదలవుతుంది. భార్యల అనుమానాలు… భర్తల అబద్ధాలు… ఫ్రెండ్స్ మధ్య ఫన్నీ సంభాషణలు… ఇవన్నీ ఆర్గానిక్‌గా అనిపిస్తాయి. కానీ కిస్సు డైరీ బయటపడిన తర్వాత సినిమా ఒక్కసారిగా లాజిక్ వదిలేసి “జబర్దస్త్ యూనివర్స్”లోకి వెళ్లిపోతుంది. కానీ ఒక రకంగా ఇదే వర్కవుట్ అయ్యింది. వెన్నెల కిషోర్ పాత్రే ఉన్నంతలో బాగా నవ్వించింది. మిగతా సీన్లు ఫన్నీగా ఉన్నా… ఎమోషన్ మాత్రం లోతుగా తగలదు.
అందుకే ‘పురుషః’ అసలు హీరో ఎవరు? అని అంటే వెన్నెల కిషోర్ అని చెప్పాలి. హీరో పాత్ర చాలాసార్లు “రియాక్ట్” అవుతూంటుంది … కానీ కమెడియన్ పాత్ర కథను “డ్రైవ్” చేస్తుంటుంది. కిస్సు పాత్రలో వెన్నెల కిషోర్ వచ్చేసరికి సినిమా ఒక్కసారిగా ఎనర్జీ పెరిగింది. ‘పురుషః’లో అదే జరిగింది.
ఈ సినిమా మనకు చెప్పే కొన్ని పాఠాలు: భర్తలు నిజం చెప్పరు, భార్యలు నమ్మరు, ఫ్రెండ్స్ సమస్యను సాల్వ్ చేయరు..క్రియేట్ చేస్తారు. కోర్ట్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది.
టెక్నికల్‌గా ..
సినిమా ఓకే. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ neat గా ఉంది. కానీ కొన్ని చోట్ల అక్కర్లేని VFX మాత్రం టీవీ షో ఫీలింగ్ తెస్తాయి. రన్‌టైమ్ చిన్నదిగా ఉండటం ప్లస్.
నటీనటుల్లో ..
పవన్ కళ్యాణ్‌కి ఇది తొలి సినిమా అయినా నటన పరంగా ఓకే అనిపించాడు. వెన్నెల కిషోర్ వచ్చిన సీన్లలో కామెడీ బాగా వర్కవుట్ అయింది. సప్తగిరి కూడా ఎక్కువ హడావుడి చేయకుండా సెటిల్డ్‌గా నటించి నవ్వించాడు. ఇలాంటి నేచురల్ కామెడీ పాత్రలు చేస్తే అతనికి ఇంకా మంచి అవకాశాలు రావచ్చు. అయితే రాజ్‌కుమార్ కసిరెడ్డికి మాత్రం మళ్లీ అదే తరహా రొటీన్ క్యారెక్టర్ పడిన ఫీలింగ్ వస్తుంది.
ఫైనల్‌గా…
‘పురుషః’ కొత్త కథ కాదు. కొత్త ఆలోచన కూడా కాదు. కానీ పెళ్లైన మగాళ్ల “daily survival instincts”ని సెటైర్ చేస్తూ మధ్య మధ్యలో నవ్విస్తుంది. ఇది గొప్ప సినిమా కాదు. కానీ “భార్య ఫోన్ చెక్ చేసే సమయంలో భర్త గుండె వేగం ఎంత ఉంటుందో” అర్థం చేసుకున్న సినిమా.
టైంపాస్‌గా ఒకసారి ట్రై చేయొచ్చు. అయితే ఇది “మ్యారేజ్‌పై గొప్ప స్టేట్మెంట్” కాదు… “మగాళ్ల వాట్సాప్ గ్రూప్‌లో వచ్చే ఫార్వర్డ్ మెసేజ్‌లోని మెసేజ్ ని తీసుకుని రెండు గంటల సినిమాగా తీశారనిపిస్తుంది”.

