
శేఖర్ కమ్ముల ఐడియానే కానీ..:‘రమణీ కల్యాణం’ రివ్యూ
ప్రేమ కంటే బాధ ఎక్కువ?
సంజన (దీప్షిక చంద్రన్) చిన్నతనంలో జరిగిన ఒక ఘోరమైన కారు ప్రమాదంలో తన కన్నవాళ్లను, కంటిచూపును ఒకేసారి కోల్పోతుంది. అయినా సరే, ఎవరి సానుభూతి అవసరం లేదంటూ ఆత్మవిశ్వాసంతో నిలబడుతుంది. బామ్మతో పాటు తనలాంటి నలుగురు అనాథ పిల్లలను చేరదీసి ఒక చిన్న ప్రపంచాన్ని ఏర్పరచుకుంటుంది. వారిని పోషించడం కోసం ఒక పబ్‌లో సింగర్‌గా, ఎఫ్‌ఎమ్ రేడియోలో ఆర్జేగా డ్యూయల్ రోల్ పోషిస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటుంది.
కట్ చేస్తే.. కథలోకి రాజ్ (సూర్య వసిష్ఠ) ఎంట్రీ ఇస్తాడు. నేషనల్ క్రికెట్ టీమ్‌లో స్థానం సంపాదించిన రోజే ఒక యాక్సిడెంట్‌లో రెండు కాళ్లు ప్యారలైజ్ అయి వీల్ చైర్‌కే పరిమితమవుతాడు. కలలు కన్న క్రికెట్ కెరీర్ నాశనమవడంతో, గతాన్ని తలుచుకుంటూ తీవ్రమైన డిప్రెషన్‌లో బతుకుతుంటాడు.
అలాంటి రాజ్, ఒకరోజు పబ్‌లో సంజన పాడిన పాట వినడంతో వీరిద్దరి పరిచయం మొదలవుతుంది. ప్రారంభంలో చిన్న చిన్న గొడవలు జరిగినా, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం కాస్తా మెల్లగా ప్రేమగా మారుతుంది. కంటిచూపు లేని సంజన అందించిన స్ఫూర్తితో, కాళ్లు కదపలేని రాజ్ తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనుకుంటాడు. ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కాలని డిసైడ్ అవుతారు.
కానీ, సరిగ్గా ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది! వీరిద్దరి ప్రేమ చూసి పబ్ ఓనర్, రాజ్ స్నేహితుడైన కిశోర్ (శ్రీనివాసరెడ్డి) తీవ్రమైన టెన్షన్ పడతాడు. రాజ్ గతం గురించి కిశోర్‌కి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ నిజం బయటపడటంతో వీరి పెళ్లికి పెద్ద అడ్డంకి ఎదురవుతుంది.
అసలు రాజ్ కాళ్లు కోల్పోవడానికి కారణమైన ఆ ప్రమాదం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? కిశోర్‌కి రాజ్ గురించి తెలిసిన ఆ నమ్మలేని నిజం ఏమిటి? సంజన, రాజ్ లవ్ స్టోరీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ విలన్ ఎవరు? మరి చివరకు ఈ ప్రేమ… పెళ్లి పీటల వరకు చేరిందా? లేక జీవితమే మరో ట్విస్ట్ ఇచ్చిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
నిజానికి ఇది శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాలోని కోర్ పాయింట్ ని తీసుకుని అల్లిన కథ. అదేంటన్నది క్లారిటీగా చెప్తే సినిమా చూద్దామనుకునే వాళ్ల కిక్ పోతుంది. కాబట్టి ఇక్కడితో వదిలేద్దాం.
సినిమాకు మంచి ఐడియా సరిపోదు. ఆ ఐడియా ఎప్పుడు రివీల్ అవ్వాలి? ఏ సీన్ తర్వాత ఏ భావోద్వేగం రావాలి? అనేదే అసలు సినిమా. ‘రమణీ కళ్యాణం’లో ఈ నిర్మాణం బలహీనంగా ఉంది.ఈ సినిమా “లోపాలు శరీరంలో ఉంటాయి… మనసులో కాదు” అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు.
హీరోయిన్ అంధురాలు. హీరో వీల్‌చైర్‌లో ఉంటాడు. ఈ రెండు పరిస్థితులూ ప్రేక్షకుడిలో సహజంగానే సింపతి తెస్తాయి. కానీ మంచి రచయితలు సింపతీని ఎమోషన్‌గా మార్చుతారు. ఇక్కడ మాత్రం బాధను లేయర్ల మీద లేయర్లు వేసినట్టు పెడతారు. ప్రతి పాత్రకు ట్రాజెడీ ఉంటుంది. ప్రతి సన్నివేశం బాధనే నొక్కి చెబుతుంది. కానీ బాధ ఎక్కువైతే ప్రేక్షకుడు ఫీల్ అవ్వడు… డిటాచ్ అవుతాడనే విషయం మర్చిపోయారు.
ఇది క్రిస్టఫర్ నోలన్ Christopher Nolan ఒక ఇంటర్వ్యూలో చెప్పిన “Emotion comes from clarity” అనే పాయింట్‌ను గుర్తు చేస్తుంది. ప్రేక్షకుడు పాత్రల మనసు క్లియర్‌గా అర్థం చేసుకుంటేనే ఎమోషన్ పనిచేస్తుంది.కానీ ఇక్కడ క్యారెక్టర్ల అంతర్గత ప్రపంచం స్పష్టంగా లేదు.దాంతో మనం పూర్తిగా వాళ్లతో జర్నీ చేయలేం.
ముఖ్యంగా లవ్ ట్రాక్‌లో “progression” లేదు. మంచి ప్రేమకథల్లో ఒకరి జీవితాన్ని లేదా ప్రపంచాన్ని ఇంకొకరు ఎలా మార్చారు లేదా ప్రభావం చూపించారన్నది కనిపించాలి. ఉదాహరణకు గీతా గోవిందం లో విజయ్ దేవరకొండ పాత్ర తప్పు చేసిన తర్వాత గెలవాల్సింది ప్రేమ కాదు… నమ్మకం. అందుకే ఆ రిలేషన్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. ఇక్కడ రాజ్-సంజన రిలేషన్ మాత్రం “సన్నివేశాలు ముందుకు జరిగాయి కాబట్టి ప్రేమ వచ్చింది” అనే ఫీలింగ్ ఇస్తుంది.
స్క్రీన్‌ప్లేలో మరో పెద్ద సమస్య...సపోర్టింగ్ క్యారెక్టర్లు. సినిమా ప్రపంచం నిజంగా అనిపించాలంటే హీరో, హీరోయిన్ చుట్టూ ఉండే పాత్రలకు కూడా జీవం ఉండాలి. కానీ ఇక్కడ చాలా పాత్రలు “స్క్రిప్ట్ అవసరానికి వచ్చిన మనుషులు”లా కనిపిస్తారు. వాళ్ల ఆర్క్స్ పూర్తి కావు. వాళ్ల నిర్ణయాలకు భావోద్వేగ బలం ఉండదు.
గతంలో వచ్చి హిట్ అయ్యిన C/o Kancharapalem, Mallesham, Anand వంటి సినిమాలలో బాధ ఉంది. కానీ ఆ బాధలో జీవితం కూడా ఉంది. ఆశ ఉంది. చిన్న చిన్న హ్యూమన్ మూమెంట్స్ ఉన్నాయి.
‘రమణీ కళ్యాణం’లో మాత్రం జీవితం కంటే “విషాదం” ఎక్కువగా వినిపిస్తుంది. అందుకే క్లైమాక్స్‌లో రావాల్సిన guilt, redemption, forgiveness… కాగితంపై బలంగా ఉన్నా తెరపై మనను అంతగా తాకవు.
టెక్నికల్ గా ...
దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి టేకింగ్, రైటింగ్‌లో చేసిన తప్పులను టెక్నికల్ టీమ్ చాలా వరకు కవర్ చేసిందనే చెప్పాలి. మలయాళీ సంగీత దర్శకుడు Suraj S Kurup అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి ఫీల్ తీసుకొచ్చాయి. అరవింద్ తిరుకోవెల కెమెరా వర్క్ విజువల్స్‌ను ప్లెజెంట్‌గా చూపించింది. నిర్మాతలు కూడా కథకు తగ్గట్టు కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు.అన్ని ఉన్నా అల్లుడు నోట్లో అన్నట్లు అసలైన స్టోరీ ప్రెజెంటేషన్ మిస్సైంది.నటీనటులు వంకపెట్టలేని విధంగా చేసుకుంటూ పోయారు.అక్కడదాకా హ్యాపీస్.
ఫైనల్ థాట్
ఈ సినిమాలో ట్రాజెడీ ఉంది… ట్విస్ట్ ఉంది… సందేశం ఉంది. కానీ ప్రేక్షకుడు పాత్రల ప్రేమను పూర్తిగా నమ్మేంత భావోద్వేగ ప్రయాణం మాత్రం లేదు. అందుకే క్లైమాక్స్‌లో హృదయాన్ని తాకాల్సిన అంశాలు కేవలం “ఒక ఐడియా”గానే మిగిలిపోతాయి. మంచి కథ ఒక్కటే సరిపోదు.ఆ కథలో మనుషులు నిజంగా బ్రతకాలి. ప్రేక్షకుడు వాళ్లతో కలిసి నవ్వాలి, పడిపోవాలి, మళ్లీ లేవాలి. ‘రమణీ కళ్యాణం’ అక్కడే కొంచెం దూరంలో ఆగిపోయిన సినిమా.అయినా నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయితో డ్రీమ్ సాంగ్స్ పెట్టడం న్యాయమేనా?అదీ ఈ రోజుల్లో..

