
‘సంభవం అధ్యాయం ఒన్ను’ ఓటీటి మూవీ రివ్యూ!
ఎస్కేప్ లేని గేమ్… అసలు ట్విస్ట్ ఏమిటి?
అది కర్ణాటక - కేరళ సరిహద్దు ప్రాంతంలోని ఒక పోలీస్ స్టేషన్. ఆ స్టేషన్ కి సీపీఓ ఆనంద్ (అస్గర్ అలీ)కి ట్రాన్సఫర్ అవుతుంది. డ్యూటీలో చేరడానికి అతను పోలీస్ స్టేషన్ కి వెళుతుండగా, వేరే రాష్ట్రానికి చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ ను జీపు ఢీ కొడుతుంది. అతణ్ణి హాస్పిటల్లో చేర్పించాక అతని పేరు జాన్ పీటర్ అనే విషయం ఆనంద్ కి తెలుస్తుంది. దాంతో జాన్ పీటర్ దగ్గర లభించిన 'వాకీ టాకీ'ని తన దగ్గరే పెట్టుకుంటాడు ఆనంద్. ఆనంద్ తో పాటు పోలీస్ ఆఫీసర్ 'అశోకన్' కూడా ఉంటాడు. అలాగే అక్కడే మరో ఆఫీసర్ 'రెజీ'తో పరిచయం ఏర్పడుతుంది.
వీళ్లు ముగ్గరూ ఇంక వెళ్దామనుకున్న సమయానికి జాన్ పీటర్ వాకీ టాకీ మోగుతుంది. అటు నుంచి ఓ వాయిస్ ...తాను అడవిలో ఆపదలో ఉన్నాననీ, తనని కాపాడమని అడుగుతాడు. అలాగే తనను పోలీస్ ఆఫీసర్ ని అని, తన పేరు స్టీఫెన్ అని చెప్తాడు. దాంతో తమ తోటి పోలీస్ ఆపదలో ఉన్నాడని, అతను చెబుతున్న ఆనవాళ్ల ఆధారంగా ముగ్గురు పోలీస్ లు ఆ అడవిలో ముందుకు వెళతారు. అలావాళ్లు అడవిలో వెళ్తూండగా అక్కడ ఓ చిత్రమైన విగ్రహమం కనపడుతుంది. అది మానవ దేహం .. కాకి తల కలిగి ఉంటుంది.
అలాగే స్టీఫెన్ గురించి అతన చెప్తున్న పోలీస్ స్టేషన్ కు కాల్ చేస్తారు. ఆ పేరుతో అక్కడ ఎవరూ లేరని అంటారు. అయితే స్టీఫెన్ పేరు విని చాలా కాలం క్రితం అంటే దాదాపు ముప్పై ఏళ్ల క్రితం అదే పేరుతో ఓ పోలీస్ అదే ప్రదేశంలో కనిపించకుండా పోయాడని చెప్తారు. దాంతో ఆనంద్, అశోకన్, రెజీ షాక్ అవుతారు. మొదట నమ్మరు. అయితే సాటి మనిషిని రక్షించాలని ఆ అడవి లోపలకి మరింతగా వెళ్తారు. అక్కడ నుంచి మరిన్ని వింతలు కనపడటం మొదలవుతుంది. అంతేకాదు స్టీఫెన్ కు తనకు రిలేషన్ ఉందని ఆనంద్ కు అర్దమవుతుంది.
దాంతో అదేంటో పూర్తి గా తెలుసుకోవాలనుకుంటాడు. కానీ ధైర్యం చేసి ముందుకు వెళ్ళే కొలిది చిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవటం మొదలవుతాయి. అలాగే అక్కడకి వెళ్లిన వాళ్లు తిరిగి రావటం లేదని అర్దమవుతుంది. వాళ్లు కూడా ఆ అడివిలో చిక్కుకు పోయారు. అసలు ముప్పై ఏళ్ల క్రితం స్టీఫెన్ ఇప్పుడు కాల్ చేయటం ఏమిటి..అతను బ్రతికే ఉన్నాడా.. అక్కడున్న కాకి విగ్రహం విషయం ఏమిటి...చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ సినిమా గురించి లోతుగా మాట్లాడాలంటే, కొన్ని అంశాలు స్పాయిలర్ ఎలర్ట్ అయినా ప్రస్తావించాల్సి ఉంటుంది. అదే టైమ్ లూప్. నిజానికి ఈ సినిమా, దాదాపు ఏడాది క్రితం విడుదలైన జితు సతీషన్ మంగళత్తు దర్శకత్వం వహించిన ఒక షార్ట్ ఫిల్మ్ ఆధారంగా రూపొందింది. ఆ 15 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఈ సినిమా కాన్సెప్ట్‌కు పరిచయం లాంటిది. ఈ ఫీచర్ ఫిల్మ్‌లో ఆ షార్ట్ ఫిల్మ్ క్లైమాక్స్ మనకు ఇంటర్వెల్ పాయింట్‌గా వస్తుంది.
సాధారణంగా ఒక షార్ట్ ఫిల్మ్‌ను సినిమాగా తీసినప్పుడు కథను చాలా సాగదీయాల్సి ఉంటుంది. 'సంభవం' విషయంలో ఆ సాగదీత లేనట్లే చెప్పాలి. ఉందీ అనుకుంటే ఫస్టాఫ్ స్లోగా జరగటంలో కనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లో , ఆ థీమ్‌కు సంబంధించి ఉన్న వివిధ రకాల అవకాశాలను (possibilities) అన్వేషించారు. ఇది అనేక యూరోపియన్ సినిమాలు, షోల నుండి ప్రేరణ పొందినప్పటికీ, హీరో అడవిలో మిస్ అవ్వటం అనే విషయం మొత్తం ఎలా పనిచేస్తుందో తెలుసుకునే విధానం, ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించే క్రమం ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా చివరి నలభై నిముషాలు సినిమాకు ప్రాణం. అక్కడ ట్విస్ట్ లు మనకు షాక్ గురిచేస్తాయి. అలాగే ఏమరుపాటు లేకుండా చూడకపోతే కాస్త తికమకకు గురి చేస్తాయి.
ఒక మంచి కథ అంటే కొత్తదనం మాత్రమే కాదు… అది ఎలా ట్రీట్ చేసి, మనకు చెప్తున్నారనేది అనేదే అసలు గేమ్. ఈ సినిమాలో అదే కనిపిస్తుంది. కథలో ఉన్న కోర్ ఐడియా చాలా స్ట్రాంగ్. టైమ్ లూప్ అనే కాన్సెప్ట్ కొత్తది కాకపోయినా, ఇక్కడ దాన్ని నడిపించిన తీరు మాత్రం మనని తల తిప్పుకోనివ్వదు. సుమారు రెండు గంటల నిడివిలో సినిమా ఎక్కడా లాగ్ అవ్వదు. మొదట్లో స్లో బిల్డ్, తర్వాత మెల్లగా పికప్… చివరికి ఎక్కువ ఇన్వాల్వ్ చేసే నేరేషన్. ఈ గ్రాఫ్ చాలా నేచురల్‌గా ఉంది.
స్క్రీన్‌ప్లే స్ట్రక్చర్ చూసుకుంటే, మొదట్లో నెమ్మదిగా సెటప్ తీసుకుంటుంది. పాత్రలు, వారి పరిస్థితులు, వాళ్లు ఉన్న ప్రపంచం — ఇవన్నీ క్రమంగా పరిచయం చేస్తుంది. ఇది ఫాస్ట్‌గా వెళ్లే కథ కాదు, కానీ బోర్ కొట్టేలా కూడా ఉండదు. రైటింగ్‌లో ఉన్న కంట్రోల్ వల్ల ప్రతి సీన్ ఒక చిన్న హుక్‌లా పనిచేస్తుంది.
ఇక్కడ ముఖ్యమైనది లూప్ కాన్సెప్ట్ కాదు, దాని వల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్. ప్రతి రిపీట్ ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదే కథను ముందుకు తీసుకెళ్తుంది. ఈ అడవిలోంచి తప్పించుకోలేరు అనే ఫీలింగ్‌ను స్క్రీన్‌ప్లే బలంగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ టెన్షన్ వల్లే ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ అవుతాడు.
కథలో బయిట జరిగే సంఘటనల కంటే అంతర్గత టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. హీరో పరిస్థితి, అతని నిర్ణయాలు, అతను ఎదుర్కొనే మానసిక ఒత్తిడి ఇవే సినిమాలో కనపడే అసలు డ్రామా.
మిస్టరీ & మిథ్ టచ్:
సినిమా కేవలం సైన్స్ లేదా లాజిక్ మీదే నడవదు. కొంచెం మిస్టరీ, కొంచెం మిథాలజికల్ టచ్ కూడా కలిపి ఒక ప్రత్యేకమైన వాతావరణం సృష్టిస్తుంది. ఈ టోన్ కన్సిస్టెన్సీ వల్ల సినిమా వేరే ఫీల్ ఇస్తుంది.
చూడచ్చా?
'టైమ్ లూప్' అనే కాన్సెప్ట్ 'ఎడ్జ్ ఆఫ్ టుమారో' వంటి సినిమాలు చూసిన వారికి సుపరిచితమే అనిపించవచ్చు, కానీ ఇందులో చూపించిన సంఘర్షణలు, కథను నడిపించిన తీరు ప్రేక్షకుడిని కట్టిపడేసేలా భిన్నంగా ఉన్నాయి.
ఫైనల్ థాట్
‘సంభవం అధ్యాయం ఒకటి’ ఒక సింపుల్ థ్రిల్లర్ కాదు… ఇది ఒక సర్కిల్‌లో ఇరుక్కున్న మనిషి కథ. బయటకు దారి లేకపోవడం వల్ల వచ్చే టెన్షన్, అదే కథను ముందుకు నడిపించే ప్రధాన శక్తి. చిన్న లోపాలు ఉన్నా… స్క్రీన్‌ప్లే ఆసక్తిని నిలబెట్టడం వల్ల, ఈ సినిమా తన స్థాయిలో ఒక గుర్తుండిపోయే ప్రయత్నంగా నిలుస్తుంది.
ఎక్కడ చూడచ్చు
జియో హాట్ స్టార్ ఓటిటి లో తెలుగులో ఉందీ సినిమా.

