
జ్యోతిక ‘సిస్టమ్’ మూవీ రివ్యూ
ఫాదర్ vs డాటర్ కోర్ట్ వార్
ఢిల్లీ హైకోర్టులో రవి రాజ్ వంశ్ ( అశుతోష్ గోవారికర్) అంటే ఓ బ్రాండ్. ఆయన కోర్టులోకి దిగితే కేసు గెలిచిందే అన్న నమ్మకం ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద బిజినెస్ మెన్, డబ్బున్న వాళ్లంతా ఆయనకే క్యూ కడతారు. కానీ అదే సమయంలో “డబ్బున్న వాళ్ల కోసం మాత్రమే పోరాడే లాయర్” అనే ట్యాగ్ కూడా ఆయన వెంటాడుతూనే ఉంటుంది.
ఆయన కూతురు నేహా రాజ్ వంశ్ ( సోనాక్షి సిన్హా)మాత్రం తండ్రి పేరుతో కాదు… తన టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకోవాలని ఫిక్స్ అయి ఉంటుంది. అదే హైకోర్టులో లాయర్‌గా పని చేస్తూ, ప్రతి కేసులో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటుంది.
ఇక సారిక రావత్ (జ్యోతిక)జీవితం పూర్తిగా భిన్నం. కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తూ, ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన భర్తను చూసుకుంటూ, కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. చిన్న ఇంట్లో అద్దె జీవితం… కూతురు చదువు… ఇంటి బాధ్యతలు… ఇలా ప్రతి రోజు ఆమెకు ఓ స్ట్రగుల్.
ఒక రోజు యాదృచ్ఛికంగా నేహా కారులో సారికకు లిఫ్ట్ ఇస్తుంది. ఆ చిన్న ప్రయాణంలోనే సారిక ఆలోచనలు, కేసులను అర్థం చేసుకునే తీరు నేహాను ఇంప్రెస్ చేస్తాయి. అప్పటి నుంచి తన కేసుల్లో సారిక సలహాలు తీసుకోవడం మొదలుపెడుతుంది. ఆశ్చర్యకరంగా ఆ సూచనలు నేహాకు వరుస విజయాలు తెచ్చిపెడతాయి.
అంతలో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఇనయా కొఠారి(ఫ్రెయా కొఠారి) మర్డర్ కేసు నేహా చేతికి వస్తుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఇనయా హత్య కేసులో, ప్రముఖ బిజినెస్ మెన్ విక్రమ్ బజ్రాల్ (విజయంత్ కోహ్లీ) పేరు బయటకు రావడం సంచలనం అవుతుంది. అయితే విక్రమ్… రవి రాజ్ వంశ్‌కు క్లోజ్ ఫ్రెండ్. దీంతో అతని తరఫున కోర్టులో వాదించడానికి రవి రంగంలోకి దిగుతాడు.
కానీ ఈసారి కథలో ట్విస్ట్ ఏంటంటే… తండ్రి ఒక వైపు ఉంటే, కూతురు మరో వైపు నిలబడుతుంది. కేసును లోతుగా తవ్వుతున్న నేహాకు, కొంతకాలం క్రితం ‘ట్విస్టెడ్ బార్’లో జరిగిన అగ్ని ప్రమాదానికి, ఇనయా హత్యకు సంబంధం ఉందని అర్థమవుతుంది. అక్కడి నుంచి కేసు పూర్తిగా టర్న్ తీసుకుంటుంది.
అసలు ఇనయాను చంపింది ఎవరు? విక్రమ్ నిజంగానే నేరస్తుడా? లేక ఎవరో ప్లాన్ చేసి అతన్ని ఇరికించారా? చట్టంలోని లొసుగులతో ఆట ఆడేది ఎవరు? నిజం కోసం పోరాడేది ఎవరు? చివరికి కోర్టులో గెలిచింది న్యాయమా… నిజమా? అనే టెన్షన్‌తో కథ ముందుకు సాగుతుంది.చివరకు ఎవరు కేసు గెలిచారు..ఏమైందో తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.
విశ్లేషణ
కోర్ట్‌రూమ్ డ్రామాలు అంటే సాధారణంగా మనకు గుర్తొచ్చేది అరుపులు, టేబుల్‌పై గుద్దే లాయర్లు, ఒక్కసారిగా బయటపడే షాకింగ్ సాక్ష్యాలు. కానీ సిస్టమ్ మాత్రం ఆ ఫార్ములాకి పూర్తిగా భిన్నంగా వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ కథలో కోర్ట్ కంటే ఎక్కువగా కనిపించేది మనుషుల మధ్య ఉన్నఅవసరాలు, సంబంధాలు. చట్టం ఎలా పనిచేస్తుందన్నదికంటే… “ఎవరికి చట్టం పని చేస్తుంది?” అన్న ప్రశ్నను సినిమా ముందుకు తెస్తుంది.
దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ 'పంగా' సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లకు మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన కోర్టు రూమ్ డ్రామా 'సిస్టమ్'. హర్మాన్ బవేజా, అరుణ్ సుకుమార్ అందించిన ఈ కథ లీగల్ జానర్‌లో ఒక విభిన్నమైన ప్రయత్నంగా నిలుస్తుంది. “కోర్టులో ఎవరు నిజం చెబుతారన్నది ముఖ్యం కాదు… ఎవరు నిజాన్ని నమ్మించేలా చెబుతారన్నదే ముఖ్యం” అనే భావన సినిమా అంతా అండర్‌కరెంట్‌లా నడుస్తుంది.
ఈ స్క్రిప్ట్ లోని అతిపెద్ద ప్లస్ పాయింట్ పాత్రల డిజైనింగ్. ముఖ్యంగా కోర్టులో ఉండే ఒక 'స్టెనోగ్రాఫర్' పాత్రను కథలో ప్రధాన భాగం చేయడం భారతీయ సినిమా స్క్రీన్‌ప్లేలలో చాలా అరుదు. కోర్టులోనే ఉంటూ, లాయర్ల గెలుపోటములను, వారి ఎత్తుగడలను ఏళ్ల తరబడి గమనించే స్టెనోగ్రాఫర్.. ఒక లాయర్‌కు ఎంతటి విలువైన ఆయుధంగా మారగలదు అనే పాయింట్‌ను రచయితలు చాలా సహజంగా, ఆసక్తికరంగా రాసుకున్నారు.
అలాగే తండ్రీ-కూతుళ్ల మధ్య సాగే ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ రైవల్రీ (పోటీ) కథకు మంచి డ్రామాను తెచ్చిపెట్టింది. పితృస్వామ్య వ్యవస్థను, ఇటు కుటుంబాలలోనే కాకుండా ఆఫీసుల్లో సైతం మహిళలు ఎదుర్కొనే అసౌకర్యాలను (ఉదాహరణకు పని ప్రదేశాల్లో మహిళలకు సరైన వాష్ రూమ్స్ లేకపోవడం వంటి చిన్న పాయింట్) చాలా లోతుగా స్పృశించారు. న్యాయం అనేది కేవలం ధనవంతులకే దక్కే ప్రివిలేజ్ (అవకాశం)గా ఎలా మారిందో చూపించిన విధానం ఆలోచింపజేస్తుంది.
అయితే రవి రాజ్ వంశ్ పాత్రను మొదట్లో ఎంత భయంకరమైన లాయర్‌లా చూపిస్తారో… తర్వాత అంతగా ఉపయోగించుకోలేదు. తన కూతురు ఎదురుగా ఉందనే కారణం చూపించుకోవచ్చు కానీ, స్క్రీన్‌ప్లే మాత్రం ఆ మానసిక సంఘర్షణను ఇంకా బలంగా రాయాల్సింది.
ఇంటర్వెల్ ముగిసేసరికి తండ్రీ-కూతుళ్ల మధ్య కోర్టులో ఒక పెద్ద యుద్ధమే జరగబోతోందని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ తీరా కోర్టు సీన్లు వచ్చేసరికి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చీల్చిచెండాడే సీనియర్ లాయర్ రవి రాజ్ పాత్ర, కూతురితో వాదించేటప్పుడు అంతటి పట్టును ప్రదర్శించదు.
ముఖ్యంగా నేహా దగ్గర కీలకమైన సాక్ష్యం ఉందని తెలిసిన తర్వాత కూడా, అతను దానికి ఎదురుదాడి చేయడానికి పెద్దగా ప్రయత్నించకపోవడం లాజిక్‌కు దూరంగా అనిపిస్తుంది. ఇది అసలు స్క్రీన్‌ప్లేలో ఉన్న పెద్ద సమస్య. సినిమా చాలా మంచి ప్రశ్నలు అడుగుతుంది. కానీ వాటిని నెక్ట్స్ లెవెల్ లోకి తీసుకెళ్లలేదు.
ఇక ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ నిజంగా బాగుంటుంది. అయితే ఆ ట్విస్ట్‌ను మరింత పెద్దదిగా చూపించే క్రమంలో పెట్టిన ఒక చిన్న సీక్వెన్స్, అసలు కథను ఏమాత్రం మార్చకపోగా.. క్లైమాక్స్‌లో రాబోయే పెద్ద ట్విస్ట్‌ను ప్రేక్షకులు ముందే ఊహించేలా (Predictable) చేసి, స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌ను దెబ్బతీసింది.కొన్ని సన్నివేశాలు కేవలం షాక్ విలువ కోసం పెట్టినట్టుగా అనిపిస్తాయి. తర్వాత వాటికి కొనసాగింపు లేకపోవడం వల్ల స్క్రీన్‌ప్లేలో ఖాళీలు కనిపిస్తాయి.
ఎవరెలా..
ఈ సినిమాకు పెద్ద ప్లస్ .. అక్షత్ ఘిల్డియాల్ రాసిన సంభాషణలు. చాలా పదునుగా ఉండటం కలిసొచ్చాయి.దర్శకురాలిగా అశ్విని అయ్యర్ తివారీ మేకింగ్ పరంగా, నటీనటుల నుంచి నటనను రాబట్టుకోవడంలో ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా డ్రామాను డీల్ చేసిన విధానం బాగుంది. కానీ ఎడిటింగ్ విభాగంపై మరింత శ్రద్ధ పెట్టాల్సింది. ల్యాగ్ అనిపించే సీన్లను, కథతో సంబంధం లేని కొన్ని లవ్ ట్రాక్ సీన్లను కత్తెర వేసి ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా ఉండేది.
ఫైనల్ థాట్
సిస్టమ్ చివరికి గుర్తు చేసేది ఒక్కటే ..మన వైపు న్యాయం ఎంత బలంగా ఉన్నా… దాన్ని వాదించే లాయర్ ఫీజు ఇంకా బలంగా ఉండాలి.ఇది కేవలం కోర్ట్‌రూమ్ డ్రామా కాదు… “న్యాయం” కూడా ఇప్పుడు స్టేటస్ సింబల్ అయిపోయిందనే సెటైర్.
చూడచ్చా?
రొటీన్ కోర్టు డ్రామాలకు భిన్నంగా కొత్తదనం కోరుకునే వారికి ఇది ఒక లుక్కేయదగ్గ సినిమా!
ఎక్కడ చూడవచ్చు?
అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది

