యానిమేషన్ సర్‌ప్రైజ్!: ‘స్వాప్డ్’ రివ్యూ
x

యానిమేషన్ సర్‌ప్రైజ్!: ‘స్వాప్డ్’ రివ్యూ

నవ్వుల మధ్య కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది


ఈ కథ 'వ్యాలీ' (Valley) అనే ఒక విచిత్ర ప్రపంచంలో 'ఒల్లీ', 'ఐవీ' అనే రెండు పాత్రల చుట్టూ సాగుతుంది. ఇక్కడ అడవి జీవులన్నీ కలిసిమెలిసి కాకుండా విడివిడిగా జీవిస్తుంటాయి. 'ఒల్లీ' (మైఖేల్ బి. జోర్డాన్ వాయిస్) ఒక పూకూ (Pookoo) అనే జీవి, ఇది చూడటానికి ఉడత లాగా, ఇంకా చెప్పాలంటే నీటి కుక్క (సీ ఆటర్) లాగా ఉంటుంది. ఒల్లీకి 'జావాన్స్' (Javans) అంటే చాలా భయం. ఈ జావాన్స్ అనేవి గుడ్లగూబ, చిలుకల కలయికతో ఉండే ఒక వింత పక్షి జాతి.

ఇందులో ఫన్ ఏంటంటే.. ఒల్లీ నేలపై, భూమి కింద బొరియల్లో నివసించే క్లాసిక్ నేల జీవి. దానికి నేలకు దగ్గరగా బతకడమే ఇష్టం. మరోవైపు ఐవీ పూర్తిగా ఫ్రీ బర్డ్, ఆకాశమే హద్దుగా చెట్లపై జీవించే పక్షి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఒకరు "కాళ్లు నేలపై గట్టిగా ఆనించి బతికే బ్యాచ్" అయితే, ఇంకొకరు "నేను గాల్లో ఎగురుతా" అనే టైప్ అన్నమాట.

ఒల్లీ ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవాలనే కుతూహలంతో, ఇతరులకు సహాయం చేసే గుణంతో ఉంటాడు. ఈ క్రమంలో ఒల్లీ ఎప్పుడూ తమ నివాస ప్రాంతాన్ని దాటి దూరంగా వెళ్తుండటంతో అతని తల్లిదండ్రులు (సెడ్రిక్ ది ఎంటర్‌టైనర్, జస్టినా మచాడో) అతడిని మందలిస్తుంటారు. ఒకరోజు ఒల్లీ ఆకలితో అలమటిస్తున్న ఒక చిన్న జావాన్ పక్షికి సహాయం చేయడంతో కథ మలుపు తిరుగుతుంది. పూకూ జీవులకు మాత్రమే దొరికే ఒక విత్తనాన్ని ఎలా ఓపెన్ చేసి తినాలో ఆ పక్షికి ఒల్లీ నేర్పిస్తాడు. అయితే, ఇదే పూకూ జీవుల మనుగడకు ముప్పుగా మారుతుంది. ఆ జావాన్ పక్షులన్నీ వచ్చి ఆ విత్తనాలను పట్టుకుపోవడంతో, పూకూ జీవులకు తినడానికి ఏమీ మిగలదు.

బాడీ స్వాప్ ట్విస్ట్

కొన్నేళ్ల తర్వాత, ఒల్లీకి ముగ్గురు జావాన్ పక్షి సోదరీమణులు ఎదురవుతారు. అందులో ఒకరైన 'ఐవీ' (జూనో టెంపుల్), చిన్నప్పుడు ఒల్లీ సహాయం పొందిన ఆ పక్షే! వారి నుండి తప్పించుకునే క్రమంలో ఒల్లీ ఒక గోతిలో పడి, అక్కడ మెరుస్తున్న ఒక మాయా మొక్కను తాకుతాడు. దాంతో అతడు జావాన్ పక్షిలా మారిపోతాడు. అలాగే ఐవీ అనే ఆ పక్షి కూడా పూకూ జీవిగా మారిపోతుంది. అంటే శత్రువులైన ఐవీ, ఒల్లీ ఒకరు మరొకరులా మారారన్నమాట.

పక్షిలా మారిన ఒల్లీని చూసి అతని తల్లిదండ్రులే గుర్తుపట్టలేక ఆ ద్వీపం నుండి తరిమేస్తారు. తాను పక్షిని కాదని, పూకూ జీవినని ఒల్లీ ఎంత మొత్తుకున్నా ఎవరూ నమ్మరు. కానీ ఐవీ, ఆమె సోదరీమణులు అతడికి ఆశ్రయం ఇస్తారు. ఈ క్రమంలో ఒల్లీకి 'బూగుల్' (ట్రేసీ మోర్గాన్ వాయిస్) అనే జీవి పరిచయమవుతుంది. ఒల్లీ మళ్లీ తన సొంత రూపంలోకి మారడానికి బూగుల్ సహాయం చేస్తానని చెప్పి, మాయా మొక్కలు ఎక్కడున్నాయో ఆ దారి చూపిస్తాడు. అప్పుడే ఆ అడవిని నాశనం చేసే దుష్ట శక్తి (ఫైర్ వుల్వ్స్ - అగ్ని తోడేళ్లు)వాళ్లకు తగులుతుంది. ఆ అగ్ని తోడేళ్లతో పోరాడి తిరిగి వాళ్లిద్దరూ తమ సొంత శరీరాల్లోకి ఎలా మారారనేదే మిగతా సినిమా.

విశ్లేషణ

“ఎదుటివాడి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే, ఒకరోజు వారి సమస్యలతో బ్రతకాలి” — ఇది మాటా కాదు .. కొత్త ఐడియాను కాదు. ఎప్పటినుంచో వింటున్నదే. కానీ “Swapped” చేసిన చిన్న మాయ ఏమిటంటే… ఆ మాటను స్కూల్ అసెంబ్లీలో చెప్పే సూక్తిలా కాకుండా, అడవిలో పడిపోయిన రెండు జీవుల ప్రాణాంతక సమస్యలా చూపించడం. ఈ సినిమా కథలో అసలు ట్విస్ట్ “బాడీ స్వాప్” కాదు. అది ఒక దృష్టికోణ (పాయింటాఫ్ వ్యూ) స్వాప్.

ఒకరు నేల మీద నడిచే జీవి. ఇంకొకరు ఆకాశంలో ఎగిరే జీవి. ఒకరి ప్రపంచంలో భయం “పడిపోవడం.” మరొకరి ప్రపంచంలో భయం “ఎప్పటికీ ఎగరలేకపోవడం.” వాళ్లు శరీరాలు మార్చుకున్న తర్వాత, సినిమా అడిగే అసలు ప్రశ్న: “జీవులు చెడ్డవా? లేక అవి ఎప్పుడూ తన ప్రపంచం నుంచే చూడటానికే అలవాటు పడిపోయాయా?” ఇది చాలా మంచి పాయింట్. అయితే ఇలాంటి సినిమాలు “ముందు ఈ మెసేజ్ విను… తర్వాత యాక్షన్ ఇస్తాం” అన్నట్టు సాగుతాయి. కానీ అదృష్టవశాత్తు “Swapped”లో రచయితలు ఆ మెసేజ్‌ని కథలోనే కలిపేశారు. అందుకే అది బోధలా కాకుండా ప్రయాణంలా అనిపిస్తుంది.

దర్శకుడు Roger Greno చేసిన తెలివైన పని ఏమిటంటే ఈ కథలో విలన్‌ను కూడా “భయం” మీద నిర్మించాడు. “మళ్లీ ఈ లోయను భయమే పాలించాలి” అని ఫైర్ వుల్ఫ్ చెప్పే డైలాగ్… పిల్లల సినిమాకి చాలా పెద్ద రాజకీయ వాక్యం. ఎందుకంటే ప్రతి యుగంలో అధికారానికి చౌకైన ఆయుధం మాట, ఒకటే: “వాళ్లు వేరే వాళ్లు… కాబట్టి ప్రమాదం.” ఇది జంతువుల కథలా కనిపించినా, లోపల మాత్రం మన సమాజాల కథ. ఎందుకంటే ఒకర్ని “ఇతరులు”గా చూపించగానే, కరుణ చనిపోతుంది. కరుణ చనిపోతే… ద్వేషం మనస్సుని ఆక్రమించుకుంటుంది. అందుకే ఈ కథలో శరీర మార్పు అనేది ఫాంటసీ కాదు. అది రాజకీయ వ్యంగ్యం కూడా.

దర్శకుడు Hayao Miyazaki ఒకసారి అన్నాడు: “Children understand far more than adults think.” “Swapped” అదే నమ్ముతుంది.

పిల్లలకు “మోరల్ ఆఫ్ ది స్టోరీ” చెప్పదు. వాళ్లని ఒకరి బాధలో పడేస్తుంది. ఇక్కడ రచనలో ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. సినిమా మొత్తం “సహాయం” గురించి కాదు… “పరస్పర ఆధారపడటం” గురించి. ఒకరు ఎగరడం నేర్పాలి. మరొకరు నేల మీద బతకడం నేర్పాలి.

అంటే కథ చెబుతున్న అసలు విషయం: “స్వతంత్రం గొప్పది. కానీ ఒంటరిగా ఎవరూ పూర్తికారు.”

ఈ సోషల్ మీడియా రోజుల్లో “Swapped” వచ్చి చెబుతుంది: “బ్రో… నీ ప్రపంచమే మొత్తం ప్రపంచం కాదు.” ఇది వినడానికి చిన్న లైన్.

కానీ నేటి ప్రపంచానికి పెద్ద హెచ్చరిక.

అయితే ఇందులో లోపాలు లేవని కాదు. కథలో ఒక సమస్య వస్తుంది. రెండు నిమిషాల్లో సాల్వ్ అవుతుంది. మళ్లీ ఇంకో అడ్డంకి.

దానికీ వెంటనే పరిష్కారం. దాంతో ఇది కథలో భావోద్వేగ బరువును తగ్గిస్తుంది. ఒకసారి అయినా సినిమా ఆగి, పాత్రల భయాన్ని నిశ్శబ్దంగా చూడాల్సింది. కానీ అది తొందరపడుతుంది. “ఎమోషన్ రావడానికి ముందే తదుపరి సీన్‌కి వెళ్దాం బ్రదర్…” అన్నట్టుగా. అందుకే ఈ సినిమా “గుర్తుండిపోయే మాస్టర్‌పీస్” కాకుండా, “చూడడానికి హాయిగా ఉన్న మంచి సినిమా” దగ్గర ఆగిపోతుంది.

ఫైనల్ థాట్

ఇది పెద్దగా కొత్త సినిమా కాదు. కానీ మనం పాత నిజాలను మర్చిపోయిన కాలంలో వచ్చిన సినిమా. కొన్ని కథలు మనల్ని ఆశ్చర్యపరచడానికి రావు. మనిషిగా ఉండటం అంటే ఏమిటో మళ్లీ గుర్తు చేయడానికి వస్తాయి. ప్రపంచానికి కొత్త సూపర్ హీరోల కంటే… “ఇతరుల కోణంలో” ఆలోచించే మనుషులు ఎక్కువ అవసరం. “Swapped” అలాంటి కథ. చాలా లోతైనది కాదు. చాలా ధైర్యమైనది కాదు. కానీ ద్వేషం మార్కెట్‌లో ప్రేమను ఇంకా అమ్మడానికి ప్రయత్నిస్తున్న చిన్న సినిమా. అది ఈ రోజుల్లో చిన్న విషయం కాదు.

ఎక్కడ చూడచ్చు

నెట్ ప్లిక్స్ లో తెలుగులో ఉంది

Read More
Next Story