
సౌత్ సినిమాలని దూరం పెడుతున్న మిల్కీ బ్యూటీ?
7 సినిమాలు రిజెక్ట్!
టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను దశాబ్ద కాలానికి పైగా తన అందచందాలతో అలరించిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఇప్పుడు సౌత్ సినిమాలకు 'గుడ్ బై' చెప్పే ఆలోచనలో ఉందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తాజాగా ఆమె ఒకేసారి దాదాపు ఏడు సౌత్ ప్రాజెక్టులను తిరస్కరించిందనే వార్త ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు తమన్నా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఆమె నెక్స్ట్ టార్గెట్ ఏంటి?
ఈ చర్చకు కారణం ఆమె ఏదైనా సంచలన ప్రకటన చేయడం కాదు. ఆమె మౌనంగా తీసుకుంటున్న నిర్ణయాలే.
సోషల్ మీడియా బజ్ ఎలా మొదలైంది?
ఇటీవల Reddit, X (ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో తమన్నా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. బాలీవుడ్లో పెద్ద ప్రాజెక్ట్స్‌కి ఆమె పేరు వినిపిస్తుండగా, అదే సమయంలో సౌత్ నుంచి వచ్చిన కొన్ని సినిమాలకు ఆమె ‘నో’ చెప్పిందన్న వార్తలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ అండ్ వార్', కరీనా కపూర్ 'క్రూ 2', రోహిత్ శెట్టి 'గోల్మాల్ 5' వంటి పెద్ద ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపిస్తోంది. వీటితో పాటు 'స్త్రీ 2' లాంటి హిట్స్ ఇస్తున్న మ్యాడాక్ హారర్-కామెడీ యూనివర్స్‌లో కూడా ఆమె పాగా వేయాలని చూస్తోంది. అయితే ఇవన్నీ ఇప్పటివరకు అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు.
‘నాగ్జిల్లా’ నుంచి తప్పుకోవడం: చిన్న కారణమా, పెద్ద ప్లాన్‌నా?
కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న నాగ్జిల్లా నుంచి తమన్నా బయటకు రావడం అప్పట్లో ‘డేట్స్ సమస్య’గా బయటికి వచ్చింది. కానీ ఇండస్ట్రీ వర్గాల మాటల్లో, అది కేవలం షెడ్యూల్ ఇష్యూ మాత్రమే కాదని, ఆమె తీసుకున్న పెద్ద నిర్ణయాల్లో ఒక భాగమని అంటున్నారు. అంటే… తక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలకంటే, క్యారెక్టర్‌కు వెయిట్ ఉన్న సినిమాలనే ఎంచుకోవాలన్న ఆలోచన ఆమెది.
2026 లైనప్.. అంతా హిందీమయం!
తమన్నా 2026 డైరీ చూస్తే ఆమె ప్లాన్ ఎంత పక్కాగా ఉందో అర్థమవుతుంది:
షాహిద్ కపూర్‌తో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో 'ఓ రోమియో'.
సిద్ధార్థ్ మల్హోత్రాతో 'వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్'.
జాన్ అబ్రహం - రోహిత్ శెట్టి కాంబోలో వస్తున్న 'రాకేష్ మరియా' బయోపిక్.
ఈ సినిమాల్లో కామన్ పాయింట్ ఒక్కటే ఇవి హీరోలకే కాదు, కథకూ, పాత్రలకూ ప్రాధాన్యం ఇచ్చే ప్రాజెక్ట్స్.
సౌత్ సినిమాలకు దూరమవుతున్నారా?
ఇన్సైడర్ సమాచారం ప్రకారం, తమన్నా ఇటీవల దాదాపు ఏడు తెలుగు, తమిళ సినిమాలను రిజెక్ట్ చేసిందట. కారణం – పాత్రలు కేవలం గ్లామర్‌కే పరిమితం కావడం. అంతేకాదు, జైలర్ 2లో ఆమె స్పెషల్ అపియరెన్స్ కూడా ఇంకా ఖరారు కాలేదన్న వార్తలు ఉన్నాయి. ఆ స్థానంలో నోరా ఫతేహీ పేరు వినిపించడం ఈ చర్చను మరింత పెంచింది.
'ఫ్లవర్ పాట్' పాత్రలకు స్వస్తి!
సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు కేవలం పాటలకు, గ్లామర్ ప్రదర్శనకే పరిమితమవుతున్నాయనేది తమన్నా అభిప్రాయంగా కనిపిస్తోంది. వీటిని ఇండస్ట్రీ పరిభాషలో 'Flowerpot Roles' అంటారు. కేవలం హీరో పక్కన అందంగా కనిపిస్తే సరిపోదు, తన నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే చేయాలని తమన్నా గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే వచ్చిన ఏడు భారీ ఆఫర్లను ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
‘క్వయెట్ లాబీయింగ్’ అనే ఆరోపణలు ఎంతవరకు నిజం?
కొంతమంది సోషల్ మీడియా యూజర్లు దీన్ని ‘క్వయెట్ లాబీయింగ్’గా అభివర్ణిస్తున్నారు. కానీ అభిమానుల మాటల్లో ఇది పూర్తిగా తప్పు అర్థం చేసుకోవడమే. 15 ఏళ్లకు పైగా కెరీర్ చేసిన నటిగా, తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకోవాలన్న ప్రయత్నమే ఇది అని వారు చెబుతున్నారు. నిజానికి ఇది సౌత్ వర్సెస్ బాలీవుడ్ చర్చ కాదు. ఇది ఒక నటిగా తమన్నా తీసుకుంటున్న మెచ్యూర్డ్ కెరీర్ డిసిషన్.
ఏదైమైనా 2026కు సంవత్సరం ప్రారంభంలో ఈ సమయంలో, తమన్నా తీసుకుంటున్న నిర్ణయాలు ఆమె కెరీర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లవచ్చు. రిస్క్ లేకుండా ఎదుగుదల ఉండదు. రొటీన్‌ను వదిలి బయటకు రావడం ప్రతి నటికీ సాధ్యం కాదు. తమన్నా ఇక సేఫ్ గేమ్ ఆడటం లేదనేది అర్దమవుతోంది.
తమన్నా తీసుకున్న ఈ నిర్ణయం ఒకరకంగా సాహసమే. సౌత్ లో ఉన్న క్రేజ్‌ను పక్కన పెట్టి బాలీవుడ్లో క్యారెక్టర్ డ్రివెన్ రోల్స్ కోసం ప్రయత్నించడం ఆమె పరిణతిని చూపిస్తుంది. గ్లామర్ డాల్ ఇమేజ్ నుండి 'పర్ఫార్మర్' ఇమేజ్ కోసం ఆమె చేస్తున్న ఈ పోరాటం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


