ఈ బుల్లి ఆస్కార్ సినిమా మీ జీవితాన్ని మార్చేస్తుంది
x

ఈ బుల్లి ఆస్కార్ సినిమా మీ జీవితాన్ని మార్చేస్తుంది

ఆస్కార్ గెలవడం వెనుక అసలు రహస్యం ఇదే!


కొన్ని సినిమాలు చూశాక మనం వాటి గురించి మాట్లాడుకుంటాం, కానీ కొన్ని సినిమాలు చూశాక మనల్ని మనం కొత్తగా చూసుకుంటాం. సరిగ్గా అలాంటి అద్భుతమే 'ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్'. చార్లీ మాకేసీ రాసిన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం, కేవలం 38 నిమిషాల్లోనే మనిషి జీవితానికి అవసరమైన అతిపెద్ద పాఠాలను నేర్పిస్తుంది. మరో విశేషం ఏమిటంటే...2023లో బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం‌గా ఆస్కార్ అందుకుంది. ఈ సినిమా గురించి తెలిసిన వాళ్లకు ఓకే..తెలియని వాళ్లకు పరిచయం చేద్దామనే ఈ చిన్న రైటప్.

కథా నేపథ్యం:

మంచుతో నిండిన ఒక అడవిలో దారి తప్పిన ఒక చిన్న అబ్బాయి తన ఇంటిని వెతుక్కుంటూ బయలుదేరతాడు. ఈ ప్రయాణంలో అతనికి విభిన్న స్వభావాలు ఉన్న మూడు జంతువులు పరిచయం అవుతాయి. కేక్ అంటే అమితమైన ఇష్టం ఉన్న ఒక ఎలుక (Mole), లోకానికి భయపడి దూరంగా ఉండే ఒక నక్క (Fox), వివేకవంతమైన ఒక పెద్ద గుర్రం (Horse). ఈ నలుగురూ కలిసి ప్రయాణిస్తూ.. ఒకరికొకరు తోడుగా నిలబడతారు. చివరికి ఆ అబ్బాయి తన ఇంటిని చేరుకున్నాడా? అసలు ఇల్లు అంటే ఏమిటో అతను ఎలా గ్రహించాడు? అనేదే ఈ కథ.

ఒక దృశ్య కావ్యం

ఈ సినిమా చూడటం అంటే ఒక అందమైన పెయింటింగ్ బ్రతికి వచ్చి మనతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఈ రోజుల్లో వస్తున్న భారీ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలకు భిన్నంగా, పెన్సిల్ స్కెచ్‌లు, వాటర్ కలర్ పెయింటింగ్ తరహాలో దీని యానిమేషన్ కళ్ళకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది.

120 మంది కళాకారులు రేయింబవళ్లు కష్టపడి, కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను పక్కనపెట్టి, ప్రతి బొమ్మను చేత్తో గీసి, రంగులు అద్ది ప్రాణం పోశారు. చార్లీ మాకేసీ రాసిన ఈ పుస్తకం ఇప్పటికే కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపింది, ఇప్పుడు సినిమాగా మారి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది.

సినిమాలో యాక్షన్ కంటే సంభాషణలకే ప్రాధాన్యత ఎక్కువ. ప్రతి మాట ఒక ఆణిముత్యంలా మెరుస్తుంది. "పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు?" అని ఆ అబ్బాయిని అడిగితే, అతను "దయగలవాడిని అవుతాను" అని చెప్పడం.. నేటి సమాజానికి ఎంత అవసరమో గుర్తుచేస్తుంది. ముఖ్యంగా 'సహాయం (Help)' అడగడం అనేది బలహీనత కాదు, అది ఒకరు చూపించగల అతిపెద్ద ధైర్యం అని గుర్రం చెప్పే మాటలు గుండెల్లో గుచ్చుకుంటాయి.

సంభాషణలు: సినిమా ముగిసిన తర్వాత కూడా ఇందులోని మాటలు మనల్ని వెంటాడుతాయి. మానసిక ప్రశాంతతకు ఇవి ఒక మెడిసిన్ లా పనిచేస్తాయి.

కొన్ని డైలాగులు

మోల్: నువ్వు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు?

అబ్బాయి: దయగలవాడిగా (Kind).

మోల్: దయను మించినది ఏదీ లేదు. అది అన్నింటి వెనుక నిశ్శబ్దంగా ఉంటుంది.

అబ్బాయి: వింతగా ఉంది కదా, మన బయట రూపాన్ని మాత్రమే మనం చూడగలం, కానీ దాదాపు ప్రతిదీ మన లోపలే జరుగుతుంది.

అబ్బాయి: మనం భయం తక్కువగా ఉంటే ఎలా ఉండేవాళ్లమో ఊహించు.

మోల్: నాకు తెలిసిన చాలామంది ముసలి మోల్స్.. వారు తమ భయాలకు తక్కువగా, తమ కలలకు ఎక్కువగా విలువిచ్చి ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉంటారు.

మోల్: నేను చాలా చిన్నదాన్ని.

అబ్బాయి: అవును, కానీ నువ్వు చాలా పెద్ద మార్పును తీసుకురాగలవు.

గుర్రం: కన్నీళ్లు ఒక కారణం కోసమే వస్తాయి, అవి నీ బలం, బలహీనత కాదు.

అబ్బాయి: నాకంటే ఎక్కువగా నువ్వు నన్ను నమ్ముతున్నావని నేను అనుకుంటున్నాను.

గుర్రం: నువ్వు కూడా త్వరలోనే నిన్ను నువ్వు నమ్ముతావు. జీవితం కష్టతరమైనదే కానీ నిన్ను ప్రేమించేవారు ఉన్నారు.

నక్క: నిజం చెప్పాలంటే, నా దగ్గర చెప్పడానికి ఆసక్తికరమైన విషయాలేమీ లేవని నాకనిపిస్తూ ఉంటుంది.

గుర్రం: నిజాయితీగా ఉండటం అనేది ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది.

అబ్బాయి: నువ్వు ఇప్పటివరకు చెప్పిన అత్యంత ధైర్యవంతమైన మాట ఏది?

గుర్రం: "సహాయం (Help)." సహాయం అడగడం అంటే ఓటమిని ఒప్పుకోవడం కాదు. అది ప్రయత్నాన్ని ఆపడానికి నిరాకరించడం.

గుర్రం (అబ్బాయితో): పెద్ద విషయాలు నీ అదుపు తప్పినట్లు అనిపించినప్పుడు, నీ కళ్ల ముందే ఉన్న నువ్వు ప్రేమించే చిన్న విషయాలపై దృష్టి పెట్టు.

నక్క (అబ్బాయితో): నేను ఒకటి తెలుసుకున్నాను – నిన్ను ప్రేమించేవారు ఉన్నారు, నువ్వు చాలా ముఖ్యమైనవాడివి .ఈ ప్రపంచానికి మరెవరూ ఇవ్వలేని వాటిని నువ్వు అందిస్తున్నావు. కాబట్టి పట్టు వదలొద్దు.

అబ్బాయి (తన మిత్రులతో): ఇల్లు అంటే ఎప్పుడూ ఒక ప్రదేశమే అవ్వనక్కర్లేదు, అవునా?

సందేశం: "ఇల్లు అంటే ఒక ప్రదేశం కాదు, మనల్ని ప్రేమించే వ్యక్తులు ఎక్కడ ఉంటే అదే ఇల్లు" అనే పాయింట్ అద్భుతంగా ఆవిష్కరించబడింది.

మనం ఎంత ఎదిగినా, లోపల ఏదో ఒక వెలితి.. ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయాలను జయించి, మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంత ముఖ్యమో ఈ సినిమా చెబుతుంది.

చివరికి ఆ అబ్బాయి తన ఇంటిని చేరుకున్నాడా? అసలు ఇల్లు అంటే ఏమిటి? అనే ప్రశ్నలకు ఈ సినిమా ఇచ్చే ముగింపు చాలా గొప్పది. ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు, మనల్ని ప్రేమించే మనుషులు ఎక్కడుంటే అదే మన ఇల్లు. పరుగు పందెంలా మారుతున్న ఈ ప్రపంచంలో సభ్యత, సంస్కారం మృగ్యమవుతున్న వేళ.. మన కళ్ళముందు ఉన్న చిన్న చిన్న సంతోషాలను ఎలా ప్రేమించాలో ఈ సినిమా నేర్పిస్తుంది. అపరిచితుల మధ్య కూడా ఆత్మీయత వెల్లివిరియగలదని నిరూపించే ఈ అద్భుతాన్ని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడాల్సిందే.

చివరి మాట: ఈ సినిమా పిల్లల కోసం తీసినట్టు అనిపించినా, ఇది పెద్దలకు అంతకంటే ఎక్కువ అవసరం. మీరు ఒత్తిడిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, లేదా కాసేపు ప్రశాంతతను కోరుకున్నా.. కళ్ళు మూసుకుని ఈ సినిమా చూడండి. చూశాక మీ మనసు చాలా తేలికగా మారుతుంది. ఇది సినిమా కాదు, ఒక అనుభవం!

ఎక్కడ చూడచ్చు

ప్రముఖ ఓటిటి (OTT) ప్లాట్‌ఫారమ్ అయిన Apple TV+ లో స్ట్రీమ్ అవుతోంది.

Read More
Next Story