కిరణ్ అబ్బవరం ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రివ్యూ
x

కిరణ్ అబ్బవరం ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రివ్యూ

90వ దశకపు జ్ఞాపకాలు


తొంబై వ దశకంలో ఈ కథ మొదలవుతుంది. అప్పట్లో టీవీలు,కేబుల్ వచ్చిన కొత్త. ఎవరైనా టీవీ కొన్నా, వీసీడీల్లో క్యాసెట్ లు తెచ్చుకుని సినిమాలు వేసుకుని చూస్తున్నారన్నా గొప్పగా చెప్పుకునే రోజులు. టీవీ ఉన్న ఇంట్లోకి చుట్ట ప్రక్కల జనం చేరేవారు. చిత్ర లహరి, వారంకు ఓ సారి దూర దర్శన్ లో వచ్చే సినిమా అంటే ఓ రేంజి క్రేజ్. అలా జనం అంతా అప్పుడప్పుడే టీవీ మోజులో పడుతూ, ఎంజాయ్ చేస్తున్న సమయంలో చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని తిమ్మరాజుపల్లి అనే పల్లెటూరిలో టీవీ వల్లే కొన్ని గొడవలు, కొన్ని ప్రేమ వ్యవహారాలు చోటు చేసుకుంటాయి.

ఇక ఊరిలో రాజప్ప (ప్రదీప్ కొట్టె) ది ప్రత్యేకస్దానం. ఆ ఊళ్లో అందరికంటే ముందుగా పక్కా ఇల్లు కట్టుకున్నది అతనే. అలాగే అందరికంటే ముందుగా టీవీని కూడా తెచ్చుకున్నది అతనే. దీంతో రాజప్ప ఇల్లు కాస్తా ఊరి ఎంటర్టైన్మెంట్ కేంద్రంగా మారిపోతుంది. మొదట్లో అది గొప్పగా అనిపించినా, రాను రాను.. ఊరి జనం గుంపులు గుంపులుగా వచ్చి టీవీ చూడటంతో రాజప్పకు ప్రైవసీ కరువవుతుంది. అక్కడితో ఆగదు..ఇది ఆ ఊరి పెద్ద రామచంద్రయ్యకు గుండె మండేలా చేస్తుంది. రాజప్ప కంటే ముందే తాను టీవీ కొనలేకపోయానని, ఇప్పుడు అతని గురించే మాట్లాడుకుంటున్నారు, ఈ దెబ్బతో తన కంటే రాజప్ప గొప్పవాడైపోయాడని అవమానంగా భావిస్తూ లోలోపల రగిలిపోతుంటాడు.

ఇదిలా ఉంటే ఆ ఊరిలో చిల్లర దొంగతనాలు చేస్తూ కాలక్షేపం చేస్తూంటాడు సతీష్ (సాయి తేజ్). అతను రాజప్ప చెల్లెలు శారద (వేద జలంధర్) ప్రేమలో ఉంటాడు. దొంగకు తన చెల్లిన ఇవ్వలేడు కాబట్టి, ప్రేమ విషయం తెలిసిన రాజప్ప, సతీష్‌ను తీవ్రంగా అవమానిస్తాడు. ఆ కోపంలో సతీష్, "ఏ టీవీని చూసి అయితే గర్వపడుతున్నావో, ఆ టీవీనే లేకుండా చేస్తా" అని రాజప్పకు ఛాలెంజ్ సినిమా టైప్ లో సవాల్ విసిరి వెళ్తాడు.

అయితే చిత్ర విచిత్రంగా ఆ రాత్రే రాజప్ప ఇంట్లో టీవీ మాయమవుతుంది. సహజంగానే అనుమానం సతీష్ మీదకు మళ్లుతుంది. ఊరి పెద్దలు సతీష్‌ను పిలిపించి పంచాయితి పెడతారు. అలాగే రెండు వారాల గడువులోగా టీవీని తిరిగి తెవాలని, లేదంటే దాని ఖరీదు చెల్లించాలని హుకుం జారీ చేస్తారు. మరో ప్రక్క రాజప్ప తన చెల్లికి వేరే పెళ్లి సంబంధం నిశ్చయించి సతీష్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెడతాడు. ఈ క్రమంలో సతీష్ ఏం చేసాడు.

అసలు ఆ టీవీని దొంగిలించింది ఎవరు? పరువు కోసం పాకులాడే రామచంద్రయ్యేనా? లేక రాజప్ప మీద పగ తీర్చుకోవాలనుకున్న సతీష్ నిజంగానే ఆ పని చేశాడా? తనపై పడిన దొంగతనం నిందను చెరిపేసుకుని, శారద ప్రేమను సతీష్ ఎలా గెలుచుకున్నాడు? అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్

“తిమ్మరాజుపల్లి టీవీ” ఒక సింపుల్ ఐడియాతో నడిచే సినిమా. ఊరికి టీవీ రావడం, అది దొంగతనం కావడం… ఈ చిన్న లైన్ చుట్టూనే కథ తిరుగుతుంది. ఇలాంటి సింగిల్ లైన్ కథతో ఫీచర్ ఫిల్మ్ నడపడం అంత ఈజీ కాదు. ఎందుకంటే, కథ కంటే డ్రామా బలంగా ఉండాలి.

ఫస్ట్ హాఫ్‌లో డైరెక్టర్ ఊరి వాతావరణం, క్యారెక్టర్స్, 90s ఫీల్‌ను నేచురల్‌గా ఎస్టాబ్లిష్ చేశాడు. ఎక్కడా కమర్షియల్ హంగులు లేకుండా రియలిస్టిక్ టోన్ మెయింటైన్ చేయడం ప్లస్. కానీ అదే సమయంలో సెటప్ కాస్త ఎక్కువై, కథ ఆలస్యంగా మొదలైన ఫీలింగ్ వచ్చింది.

టీవీ దొంగతనం జరిగిన తర్వాత కథ అసలు ట్రాక్‌లోకి వస్తుంది. ఇక్కడ నుంచి మిస్టరీ ఎలిమెంట్ స్టార్ట్ అవుతుంది. దొంగ ఎవరు అన్న సస్పెన్స్‌ను చివరి వరకు దాచిపెట్టడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కానీ హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంత స్ట్రాంగ్‌గా అనిపించదు. సన్నివేశాలు సాగుతాయి కానీ కథ ముందుకు వెళ్లినట్లు అనిపించదు. అక్కడక్కడే తిరుగుతున్న ఫీల్ వస్తుంది.

దానికి తోడు సెకండ్ హాఫ్‌లో ప్రధాన సమస్య పేసింగ్. కాన్ఫ్లిక్ట్ ఉన్నా, అది ఎక్కడా పీక్‌కి చేరదు. కొన్ని సీన్స్ రిపీటివ్‌గా అనిపిస్తాయి. లవ్ స్టోరీ ట్రాక్ కూడా కథలో భాగంగా ఉన్నా, ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోతుంది.

క్యారెక్టర్స్ విషయంలో నేచురాలిటీ ఉంది కానీ డెప్త్ తక్కువ. చాలా పాత్రలు పూర్తిగా డెవలప్ కాలేదు. దీంతో డ్రామా ఉన్నా, ఇంపాక్ట్ మాత్రం తగ్గుతుంది. క్లైమాక్స్‌లో దొంగ ఎవరో రివీల్ చేయడం, సమస్యను లాజికల్‌గా ముగించడం బాగానే ఉంది. ఓ చిన్న ఎమోషన్‌తో సినిమా ఎండ్ చేయడం బాగుందనిస్తుంది. కానీ స్ట్రాంగ్ హై ఇవ్వలేకపోతుంది.

మొత్తంగా చూస్తే, “తిమ్మరాజుపల్లి టీవీ” ఒక మంచి ఐడియాతో వచ్చిన నిజాయితీ ప్రయత్నం. కానీ స్క్రీన్‌ప్లే పరంగా చూస్తే, ఇది ఫీచర్ ఫిల్మ్ కంటే షార్ట్ ఫిల్మ్‌కు దగ్గరగా అనిపిస్తుంది.

ఎవరెలా చేసారంటే..

నటీనటుల పరంగా సినిమా స్ట్రాంగ్‌గా నిలుస్తుంది. సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి—all performances చాలా నేచురల్‌గా ఉన్నాయి. పాత్రలకు తగ్గట్టు అండర్‌ప్లే చేసి నటించడం వల్ల రియలిస్టిక్ ఫీల్ వచ్చింది. వీరిలో స్వాతి కరిమిరెడ్డి స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎక్కువగా గుర్తుండిపోతుంది.

సంగీత దర్శకుడు వంశీకాంత్ రేఖణా ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి సపోర్ట్. ముఖ్యంగా స్లో మరియు ఎమోషనల్ సీన్స్‌లో BGM సీన్స్‌ని హోల్డ్ చేస్తూ నేరేషన్‌కు సహాయపడింది.

సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని సింపుల్‌గా కానీ ఎఫెక్టివ్‌గా క్యాప్చర్ చేసింది. నేచురల్ లొకేషన్స్, లైట్ ట్రీట్‌మెంట్ వల్ల విజువల్స్‌కు ఒక రియలిస్టిక్ టోన్ వచ్చింది. ప్రొడక్షన్ డిజైన్ కూడా 90ల కాలానికి సరిపోయేలా డిటైలింగ్‌తో వర్క్ చేసి, సినిమా వరల్డ్‌ను బిలీవబుల్‌గా నిలబెట్టింది.

ఫైనల్ థాట్

ఊరికి టీవీ వచ్చేసరికి కథ మొదలైంది… కానీ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలోపే సిగ్నల్ కట్ అయిపోయింది!

కాన్సెప్ట్‌లో ఉన్న కాన్ఫ్లిక్ట్‌ను పూర్తి స్థాయిలో ఎక్స్‌ప్లోర్ చేయలేకపోవడం వల్ల, సినిమా ఎక్కడో హాఫ్ వేలోనే ఆగిపోయిన ఫీలింగ్ ఇస్తుంది.

Read More
Next Story