
10 కోట్లతో తీస్తే… 1000 కోట్లు!
‘అబ్సెషన్’ బాక్సాఫీస్ షాక్
మైఖేల్ జాక్సన్ బయోపిక్‌ను బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక చిన్న హారర్ సినిమా ఓడించేస్తుందని ఎవరైనా ఊహించగలరా? కానీ అదే ఇప్పుడు జరిగింది. థియేటర్ లోపలికి వెళ్లిన ప్రేక్షకులు భయంతో వణికిపోతూ, రక్తం ఏరులై పారుతుంటే కళ్ళు మూసుకునేలా చేస్తోంది ఒక సరికొత్త సినిమా. కేవలం ₹10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం, ఇప్పుడు ఏకంగా ₹1000 కోట్ల వసూళ్ల వైపు దూసుకుపోతోంది! హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ఆ సంచలన చిత్రమే ‘అబ్సెషన్’ (Obsession). ఇంతకీ ఈ సినిమాలో ఏముంది? జనాలు ఎందుకు దీనికి అంతలా పిచ్చెక్కిపోతున్నారు?
“అబ్సెషన్” కథ ఏమిటి?
Obsession అసలు బయటికి చూస్తే ఇది ఒక సాధారణ “ఫ్రెండ్షిప్ నుంచి మొదలై ప్రేమగా మారే” కథలా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇది ప్రేమ కథ కాదు… “పొసెషన్” గురించిన కథ.
బేర్ అనే ఒక అబ్బాయి తన చిన్నప్పటి ఫ్రెండ్ నిక్కీని చాలా ఏళ్లుగా ప్రేమిస్తుంటాడు. కానీ చెప్పడానికి భయపడుతుంటాడు. ఎందుకంటే ఆమెను కోల్పోవడం ఇష్టం లేదు. దాన్నే “నైస్ గై” సిండ్రోమ్ అంటారు. బయటికి సాఫ్ట్, లోపల మాత్రం “ఆమె నాదైపోవాలి” అనే ఆబ్సెసివ్ పిచ్చిపట్టించే కోరిక.
ఒకరోజు అతడు ఓ వింత బొమ్మ దగ్గర నిలబడి “నిక్కీ నన్ను ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించాలి” అని కోరుకుంటాడు. అక్కడి నుంచి సినిమా టర్న్ తీసుకుంటుంది.అతని కోరికైతే తీరుతుంది కానీ, అక్కడి నుండి కథ రూటే మారిపోతుంది!
నిజమైన నిక్కీ ఆత్మ నరకంలో దారుణమైన వేదన అనుభవిస్తుంటే.. ఆమె స్థానంలో ఒక భయంకరమైన డూప్లికేట్ (Doppelgänger) బేర్ జీవితంలోకి వస్తుంది. ఆమె కళ్ళు తేలేస్తూ, విచిత్రంగా అరుస్తూ, సైకోలా ప్రవర్తిస్తూ.. చివరికి దారుణమైన హత్యలు చేయడం మొదలుపెడుతుంది. ఆమె కళ్లలో జీవం ఉండదు. మాటల్లో గ్లిచ్ ఉంటుంది. ప్రవర్తన భయంకరంగా మారుతుంది. హింస మొదలవుతుంది.
కానీ బేర్ కి మాత్రం అదంతా అనవసరం. తనతో ఉన్న “నకిలీ నిక్కీ”ని వదిలిపెట్టడు. ఎందుకంటే అతనికి ప్రేమ కాదు… “ఆమె నాదై ఉండాలి” అన్న స్వార్థం ముఖ్యం. అక్కడినుంచి సినిమా ఒక డార్క్ మోరాలిటీ టేల్‌గా మారిపోతుంది. “నువ్వు ప్రేమను కంట్రోల్ చేయాలనుకుంటే… అది నిన్నే తినేస్తుంది” అనే థీమ్‌తో.
ఎందుకింత క్లిక్ అయ్యింది
ఇన్నాళ్లూ హారర్ సినిమాలు భూతాల గురించి వచ్చాయి. కొన్ని సినిమాలు రాక్షసుల గురించి వచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చిన Obsession మాత్రం మరింత ప్రమాదకరమైన విషయం చుట్టూ తిరుగుతుంది. అదే “Obsessive Love.”
ఎందుకింత పెద్ద హిట్టైంది అనేదానిపై హాలీవుడ్ విశ్లేషణ ఇదీ... ఈ సినిమా కేవలం హారర్ మూవీ కాదు.ఇది ఈ సోషల్ మీడియా జెనరేషన్లో పెరుగుతున్న loneliness, rejection frustration, toxic attachment, “nice guy syndrome”ల మీద తీసిన ఒక డిస్టర్బింగ్ మిర్రర్. అందుకే ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు “భయపడ్డాం” అనలేదు…“అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యాం” అంటున్నారు. అదే దీని అసలు విజయం అని తేల్చారు.అందుకే చాలా మంది ఈ సినిమాలో తమ చుట్టూ కనిపించే వ్యక్తులను చూసారు. కొందరు తమను తాము కూడా చూసుకున్నారు.
ఆధునిక కాలపు స్వార్థం:
అసలైన నిక్కీ నరకంలో నలిగిపోతున్నా.. తన పక్కన ఉన్న డూప్లికేట్ అమ్మాయి తనను ప్రేమిస్తోంది కదా అని సంతోషపడే హీరో సైకో మనస్తత్వం, నేటి జనరేషన్ ప్రేమల్లోని వికృత రూపానికి అద్దం పట్టింది. పైకి చాలా 'నైస్ గై'లా కనిపించే అబ్బాయిల్లో ఉండే స్వార్థాన్ని డైరెక్టర్ అద్భుతంగా పట్టుకున్నాడు.
సెన్సార్‌ను వణికించిన వైలెన్స్:
సినిమాలో ఒక మర్డర్ సీన్ అయితే థియేటర్లలో జనాల గుండె ఆగిపోయేంత క్రూరంగా ఉంటుంది. అమెరికాలోనే ఈ సీన్ల వల్ల సినిమాకు బ్యాన్ లాంటి రేటింగ్ (NC-17) రాకుండా ఉండటానికి కొన్ని సీన్లు కట్ చేయాల్సి వచ్చింది.
పిల్లా.. దెయ్యమా?:
నిక్కీ పాత్రలో ఇండే నవరెట్ నటన సినిమాకే ప్రాణం. దయ్యం పట్టిన అమ్మాయిగా ఆమె ఇచ్చిన సైకో ఎక్స్ప్రెషన్స్ చూస్తే థియేటర్ నుంచి బయటకు వచ్చినా ఆ కళ్ళు మనల్ని వెంటాడుతాయి.
ఒకే ఒక్క చాన్స్.. లైఫ్ చేంజ్!
ఒకప్పుడు యూట్యూబ్‌లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, కామెడీ స్కెచ్‌లు చేసుకునే కర్రీ బార్కర్, ఈ రోజు తన ఎడిటింగ్ స్టైల్‌తో హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లను సైతం తన వైపు తిప్పుకున్నాడు. ‘అబ్సెషన్’ సృష్టించిన ప్రభంజనంతో అతనికి హాలీవుడ్ పెద్ద పెద్ద సంస్థల నుండి కోట్ల ఆఫర్లు క్యూ కడుతున్నాయి. పెట్టిన పెట్టుబడికి 100 రెట్లు లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమా, గ్లోబల్ సినిమా హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిపోవడం ఖాయం.
చివరగా…
Obsession ఒక ఫెరఫెక్ట్ సినిమా కాకపోవచ్చు. కొన్ని చోట్ల చెత్తగా ఉంటుంది. కొన్ని సీన్స్ చాలా డిస్ట్రబింగ్ గా అనిపిస్తాయి. కానీ ఒక విషయం మాత్రం నిజం ఈ సినిమా చూసే వాళ్లని చూపు ప్రక్కకు తిప్పనివ్వదు.
థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా…
“ప్రేమ అంటే ఏమిటి?”
“మనిషి obsession ఎక్కడ మొదలవుతుంది?” అనే ప్రశ్నలు వెంటాడుతూనే ఉంటాయి.
అందుకే ఇది సాధారణ హారర్ కాదు. ఇది ఈ ఇంటర్నెట్ జెనరేషన్‌కు వచ్చిన ఒక సైక్లాజికల్ పీడకల.

