కామెడీనే కానీ ‘టోస్టర్’ మూవీ రివ్యూ
x

కామెడీనే కానీ ‘టోస్టర్’ మూవీ రివ్యూ

ఐడియా అదిరింది.. ఎగ్జిక్యూషన్ మాడింది!


డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే.. ఆ సంపాదించిన డబ్బును పైసా కూడా ఖర్చు పెట్టకుండా దాచుకోవడం మరో ఎత్తు. మన హీరో రామకాంత్ (రాజ్‌కుమార్ రావు) అందులో పీహెచ్‌డీ చేసిన వ్యక్తి. ఎంత పిసినారి అంటే.. ఒక పర్ఫ్యూమ్ షాపు నడుపుతూ, ఆరు రూపాయల రీఫండ్ కోసం కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో గంటల తరబడి గొడవపడే రకం. ఈయనగారి 'కక్కుర్తి' వేషాలతో భార్య శిల్ప (సాన్యా మల్హోత్రా) కి అప్పుడప్పుడు బీపీ రైజ్ అవుతూంటుంది. కానీ భర్తతో రాజీపడుతూ..అప్పుడప్పుడూ ఆయన దారిలోనే ప్రయాణిస్తూంటుంది.

ఇద్దరూ ఇలా తమ జీవితాన్ని పైసా మే పరమాత్మా టైప్ లో లాగుతూంటే... ఓ సారి శిల్ప వాళ్ళ గురువుగారి కూతురి పెళ్లికి వెళ్లాల్సి వస్తుంది. మన రామకాంత్‌కి ఇలాంటి ఖర్చు పనులు అంటే అస్సలు ఇష్టం లేదు కానీ, భార్య పోరు పడలేక బయిలుదేరతాడు. దానికి తోడు ఉత్తి చేతుల్తో వెళ్తే బాగుండదని, మనసు చంపుకొని ఒక 5 వేల రూపాయల టోస్టర్‌ను గిఫ్ట్‌గా కొనుక్కుని మరీ పట్టుకెళ్తాడు.

కట్ చేస్తే.. అక్కడ సీన్ రివర్స్!

ఆ పెళ్లి పెటాకులై రద్దయిపోతుంది. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? "అయ్యో పాపం" అని ఊరుకుంటారు. కానీ మన రామకాంత్ కదా.. ఆయన బుర్రలో వేరే ప్లాన్ నడిచింది. "పెళ్లే లేనప్పుడు ఆ గిఫ్ట్ మాత్రం ఎందుకు? టోస్టర్‌ని వెనక్కి తెచ్చేస్తే.. ఆ ఐదు వేలు సేవ్ అవుతాయి కదా!" అని స్కెచ్ వేస్తాడు. కానీ అప్పటికే ఆ టోస్టర్ అనాథాశ్రమానికి చేరిపోతుంది.

ఆ టోస్టర్‌ను తిరిగి తెచ్చేందుకు బయిలుదేరతాడు. ఆ క్రమంలో రామకాంత్ జీవితం తలకిందులవుతుంది. ఆ అప్లయన్స్ ఊరికే రాలేదు.. తనతో పాటు ఒక భయంకరమైన సీక్రెట్‌ను కూడా మోసుకొస్తుంది. అదేంటో ఆ టోస్టర్ దగ్గరున్న గ్లెన్ (అభిషేక్ బెనర్జీ)కి మాత్రమే తెలుసు. గ్లెన్ ఎప్పుడూ ఫుల్ గా గంజాయి కొట్టి చిల్ అవుతుంటాడు. వీడి దగ్గరికే ఆ టోస్టర్ వెళ్తుంది.

రామకాంత్ ఆ టోస్టర్ వెనకాల పడుతుంటే, అన్ లక్కీగా అది ఒక మర్డర్ సీన్‌లో మెయిన్ వెపన్ (Accessory) లా మారిపోతుంది. ఇక్కడ నుంచి స్టోరీలోకి మెల్లగా పోలీస్ ఇన్‌స్పెక్టర్ బాలగోడె (ఉపేంద్ర లిమాయే), పొలిటిషియన్ అమ్రే (జితేంద్ర జోషి) ఇంకా రామకాంత్ పక్కింటి వింత ముసలావిడ మాలిని (అర్చన పూరన్ సింగ్) ఎంటర్ అవుతారు. ఆ పొరుగింటి పిచ్చి బామ్మ మాలిని (అర్చన పూరన్ సింగ్) ఇంట్లో ఈ టోస్టర్‌ను దాచబోతే, ఆమె సడన్‌గా చనిపోవడంతో కథ మరిన్ని మలుపులు తిరుగుతుంది.

చివరికి ఏమైంది?

ఐదు వేల రూపాయల కోసం మొదలైన ఈ 'టోస్టర్ వేట'.. చివరకు బ్లాక్ మెయిల్స్, ఛేజింగ్‌ల వరకు వెళ్తుంది. ఈ క్రమంలో ఆ టోస్టర్ కోసం రామకాంత్ చేసే సర్కస్ మామూలుగా ఉండదు. అసలు ఆ టోస్టర్‌లో ఉన్న సీక్రెట్ ఏంటి? అది మనోడిని ఎలా ఇరికించింది? డబ్బే ముఖ్యం అనుకునే ఒక పిసినారికి, ప్రాణం మీదకి వస్తే పరిస్థితి ఏంటి? అసలు ఆ టోస్టర్‌లో దాగున్న ఆ రహస్యం ఏంటి? రామకాంత్ పర్సనల్ సీక్రెట్ దీనికి ఎలా ముడిపడింది? ప్రాణాల మీదకు వచ్చినా సరే మనోడు ఆ టోస్టర్‌ను వదిలాడా లేదా? అన్నదే ఈ సినిమా క్లైమాక్స్.

ఎనాలసిస్ ...

లోభం వల్ల లాభం సంగతి పక్కన పెడితే.. ఒక్కోసారి అది ఎలా 'టోస్ట్' చేస్తుందో ఈ సినిమా ద్వారా చూపించాలని దర్శక,నిర్మాతల ఆలోచన. ఐడియా లెవిల్లో ఇది బ్రహ్మాండమైనదే, చాలా క్రేజీగానూ ఉంది. ఒక చిన్న టోస్టర్ చుట్టూ మర్డర్ మిస్టరీని అల్లడం 'బ్లాక్ కామెడీ'కి మంచి స్కోప్ ఇస్తుంది.అయితే ట్రీట్మెంట్ కు వచ్చేసరికే తుస్సుమంది. మొదటి అరగంటలో ఉన్న వేగం, సెకండ్ హాఫ్‌లో రిపీటెడ్ సీన్ల వల్ల మందగించింది.

రాజ్‌కుమార్ రావు క్యారెక్టర్ చాలా బలంగా ఉంది (Character Driven), కానీ మిగిలిన పాత్రలు కేవలం కథను ముందుకు నడిపించడానికి వాడినట్లుగా ఉన్నాయి (Plot Driven). రాజ్‌కుమార్ రావు ఎంత బాగా చేసినా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ నుంచి సరైన రియాక్షన్ లేకపోవడంతో డ్రామా పండలేదు.

అబ్సర్డ్ కామెడీలో కూడా ఒక 'ఇంటర్నల్ లాజిక్' ఉండాలి. అంటే ఆ ప్రపంచంలో జరిగే విడ్డూరాలు ఆ పాత్రలకు నమ్మశక్యంగా ఉండాలి. ఈ సినిమాలో సీన్లు 'సిల్లీ'గా మారడానికి కారణం, అవి కథలో భాగంగా కాకుండా కేవలం నవ్వించడం కోసమే పేర్చినట్లు ఉండటం. చాలా సినిమాలు సెకండ్ హాఫ్‌లోనే చచ్చిపోతాయి. టోస్టర్ విషయంలో కూడా అదే జరిగింది. కథనం బిగువు లేకపోతే ఎంత గొప్ప పాయింట్ అయినా పేలదు.

అలాగే ఒక మంచి కామెడీ సినిమాకు 'క్లైమాక్స్ పే-ఆఫ్' చాలా ముఖ్యం. అన్ని ముడులు విడిపోయేటప్పుడు ప్రేక్షకుడు థ్రిల్ అవ్వాలి. కానీ ఇక్కడ గందరగోళం ఎక్కువై, ప్రేక్షకుడు కథ నుంచి డిస్‌కనెక్ట్ అయిపోయాడు.

టోస్టర్ సినిమా కేవలం ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీని అందించాలనే ఉద్దేశంతో రాసినట్టు కనిపిస్తుంది. కానీ, దురదృష్టవశాత్తూ కథ ముందుకు వెళ్లేకొద్దీ లాజిక్ అన్నది అస్సలు కనిపించదు. ప్రతి అడుగులోనూ సిల్లీ సీన్లతో సినిమా అర్ధరహితంగా తయారవుతుంది. ఆ ఇల్లాజికల్ సీన్ల గురించి వివరంగా చెప్పాలంటే అవి స్పాయిలర్స్ అవుతాయి.

ఎవరెలా చేసారు.

ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఏకైక విషయం రాజ్‌కుమార్ రావు క్యారెక్టరైజేషన్. అతని విపరీతమైన పిసినారితనం, ఏమాత్రం మొహమాటం లేని ప్రవర్తన కొన్ని చోట్ల నిజంగానే నవ్విస్తాయి. రాజ్‌కుమార్ రావు ఒక్కడే సినిమాను భుజాన వేసుకుని నడిపించడం కష్టమైపోయింది. మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ బాగానే చేసారు కానీ కథకు పెద్దగా బలాన్ని ఇవ్వలేకపోయాయి.

టెక్నికల్ అంశాలు:

సినిమాటోగ్రఫీ పర్వాలేదు కానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సీన్లను ఎలివేట్ చేయలేక చప్పగా సాగింది. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది.

డైలాగ్స్: కొన్ని చోట్ల నవ్వు తెప్పించినా, చాలా చోట్ల మాత్రం చిన్నపిల్లల మాటల్లా, బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తాయి.

డైరెక్షన్: చేతిలో ఉన్న స్క్రిప్ట్ వీక్ అని తెలిసినా, దర్శకుడు వివేక్ దశ్చౌదరి దాన్ని తన టేకింగ్‌తో కూడా నిలబెట్టలేకపోయారు.

ఫైనల్ థాట్

ఒక వెరైటీ కాన్సెప్ట్‌ను 'టోస్ట్' చేసి మాడ్చేశారు! సినిమా కథ కూడా రాజ్‌కుమార్ రావు క్యారెక్టర్ లాగే కొంచెం క్రేజీగా, వెరైటీగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది.అక్కడక్కడా కొన్ని నవ్వులు తప్ప, సినిమా మొత్తం బోర్ కొట్టిస్తుంది. క్రేజీ కామెడీ అవ్వాల్సిన సినిమా కాస్తా.. సాగదీసిన, ఫ్లేవర్ లేని ఒక డల్ ఎక్స్‌పీరియన్స్‌గా మిగిలిపోయింది.

చూడచ్చా

రాజ్‌కుమార్ రావు నటన కోసం ఒకసారి చూడొచ్చు కానీ, పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం డిజప్పాయింట్మెంట్ తప్పదు!

ఎక్కడ చూడచ్చు

నెట్ ప్లిక్స్ లో తెలుగులో ఉంది

Read More
Next Story