టాలీవుడ్‌లో ఓటీటీ బాంబ్: నిర్మాతలు మటాష్?!
x

టాలీవుడ్‌లో ఓటీటీ బాంబ్: నిర్మాతలు మటాష్?!

బాక్సాఫీస్ దగ్గర అసలు ఏం జరుగుతోంది?


హిట్ అయితేనే రేట్… లేదంటే వెయిట్!

థియేటర్‌లో తీర్పు పాజిటివ్ గా రాకపోతే, ఓటీటీ గేటు కూడా ఓపెన్ అవ్వదు.

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే థియేటర్ల వద్ద జాతర, ఫస్ట్ వీకెండ్ వసూళ్ల గ్యారెంటీ. అయితే గత ఐదారేళ్లగా తెలుగు సినిమా అంటే ఓటిటి బిజినెస్. అక్కడ వ్యూస్ ప్రాతిపదిక. కానీ 2026కి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఇండస్ట్రీలో ఇప్పుడు థియేటర్ లేదు, ఓటీటీ లేదు, అసలు నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న నిర్మాతలను వేధిస్తోంది. మిడ్ రేంజ్ హీరో సినిమా అంటే ఒకప్పుడు ఫస్ట్ వీకెండ్‌లో 6 నుంచి 8 కోట్ల షేర్ కళ్లు మూసుకుని వచ్చేది, కానీ ఇప్పుడు ఫస్ట్ డే కోటి రూపాయలు వస్తేనే పండగ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఘోరమైన గ్యాప్ ఇండస్ట్రీ ఆర్థిక చక్రాన్ని ఛిన్నాభిన్నం చేస్తోంది.

ఓటీటీల రివర్స్ గేర్: హిట్ అయితేనే అగ్రిమెంట్!

కోవిడ్ సమయంలో థియేటర్లలో సినిమా ఫ్లాప్ అయినా, ఓటీటీలు 7 లేదా 8 కోట్లు పోసి కొనేవి. ఆ ధైర్యంతోనే నిర్మాతలు ఏడాదికి 25 సినిమాలు తీసేవారు. కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు వ్యూయర్‌షిప్ డేటా, ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్‌ను బట్టి రేట్లు ఫిక్స్ చేస్తున్నాయి. "మీ సినిమా థియేటర్‌లో కనీసం 15 కోట్ల గ్రాస్ కొడితేనే మేము 5 కోట్లు ఇస్తాం" అని కండిషన్లు పెడుతున్నాయి. అంటే థియేటర్‌లో బాక్సాఫీస్ బాదుడు ఉంటేనే డిజిటల్ డీల్, లేదంటే రెండు చోట్లా సున్నానే.

ఓటీటీ బిజినెస్ కోట్స్ – మారుతున్న గేమ్ రూల్స్

“స్టార్ పవర్ కాదు… కంప్లీషన్ రేట్ మా కరెన్సీ.”

— ఒక ప్రముఖ ఓటీటీ కంటెంట్ హెడ్

ఇది ఓటీటీ బిజినెస్‌లో బేసిక్ షిఫ్ట్. ఒకప్పుడు హీరో మార్కెట్ చూసి రేటు ఫిక్స్ చేసేవారు. ఇప్పుడు ప్రేక్షకుడు సినిమా ఎంతవరకు చూసాడు? మధ్యలో వదిలేశాడా? మళ్లీ ప్లే చేశాడా? — ఇవే విలువను నిర్ణయిస్తున్నాయి. ముఖ్యంగా థియేటర్‌లో నాయిస్ లేకపోతే, మా ప్లాట్‌ఫామ్‌లో నంబర్స్ రావు అని తేల్చి చెప్పేస్తున్నాయి ఓటిటి సంస్దలు.

ల్యాబ్‌లో మగ్గుతున్న సినిమాలు.. నిర్మాతలకు నిద్రలేని రాత్రులు!

ఈ కొత్త రూల్స్ వల్ల టాలీవుడ్‌లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. సెన్సార్ అయిపోయినా రిలీజ్ డేట్ దొరకని సినిమాలు దాదాపు 12 ఉన్నాయని టాక్. థియేటర్‌లో రిలీజ్ చేస్తే పబ్లిసిటీకే కోటి దాకా ఖర్చవుతుంది, ఒకవేళ సినిమాకి నెగటివ్ టాక్ వస్తే ఓటీటీ రేటు 6 కోట్ల నుండి 2 కోట్లకి పడిపోతుంది. దీంతో రిస్క్ తీసుకోలేక నిర్మాతలు సినిమాలను హోల్డ్‌లో పెట్టి డీల్స్ కోసం వేచి చూస్తున్నారు.

“కంటెంట్ స్ట్రాంగ్ అయితే చిన్న సినిమా కూడా గ్లోబల్ అవుతుంది… లేకపోతే పెద్ద సినిమా కూడా లోకల్‌గానే మిగులుతుంది.” అంటూ స్ట్రీమింగ్ స్ట్రాటజీ హెడ్ చెప్తున్నారు. దీని వెనుక ఉన్న లాజిక్ క్లియర్: ఓటీటీకి భౌగోళిక పరిమితి లేదు. కానీ కంటెంట్‌లో యూనివర్సల్ కనెక్ట్ లేకపోతే, అది ఎంత పెద్ద సినిమా అయినా పరిమితంగానే ఉంటుంది.

ఓటిటిల లెక్క ఒకటే వాళ్లు సినిమాలు కొనడం కాదు… ఆడియన్స్ టైమ్ కొనుగోలు చేస్తున్నారు. ప్రేక్షకుడి దృష్టి (Attention) ఇప్పుడు అత్యంత విలువైన వనరు. ఒక సినిమా ఆ దృష్టిని ఎంతసేపు పట్టుకుంటుంది అనేదే అసలు వ్యాపారం.

థియేటర్ vs ఓటీటీ – ఎవరు లీడ్ చేస్తున్నారు?

మొదట ఓటీటీ రాకతో థియేటర్ విలువ తగ్గినట్టు అనిపించింది. కానీ ఇప్పుడు క్లియర్ అవుతోంది. ఓటీటీ అనేది థియేటర్‌కు ప్రత్యామ్నాయం కాదు… విస్తరణ.

1. థియేటర్ = ఫస్ట్ ఇంపాక్ట్

థియేటర్ అనుభవం ఒక ఎమోషనల్ ఈవెంట్. అక్కడ వచ్చిన టాక్, హైప్… ఓటీటీకి ముందుగానే మార్కెట్ సృష్టిస్తుంది.

థియేటర్‌లో “హిట్” అనే ట్యాగ్ వస్తేనే ఓటీటీ రేటు పెరుగుతుంది.

2. ఓటీటీ = లాంగ్ టెయిల్ రెవెన్యూ

ఓటీటీ ఒకసారి కొనేసి వదిలేసే వ్యవస్థ కాదు. అది లాంగ్ టెర్మ్ ఎంగేజ్‌మెంట్ చూస్తుంది. ఒక సినిమా నెలల తరబడి వ్యూస్ తెచ్చితేనే అది విలువైన అసెట్ అవుతుంది.

3. మిడ్ రేంజ్ సంక్షోభం

ఇక్కడే అసలు సమస్య. పెద్ద సినిమాలకు థియేటర్ హైప్ ఉంటుంది. చిన్న సినిమాలకు కంటెంట్ బలం ఉంటుంది. మధ్యలో ఉన్న సినిమాలు ..చిన్నపాటి ఇమేజ్ మీద నడిచేవి ఇప్పుడు ఎక్కడా ఫిట్ కావడం లేదు.

కోట్లు డిమాండ్ చేసే హీరోలు.. ప్రాఫిట్ షేరింగ్ వైపు అడుగులు!

ఇది చాలదన్నట్లు రెమ్యునరేషన్ల విషయంలోనూ యుద్ధం జరుగుతోంది. 2021లో 12 కోట్లు తీసుకున్న హీరో మార్కెట్ ఇప్పుడు 9 కోట్లు కూడా దాటడం లేదు. శాటిలైట్ మార్కెట్ పూర్తిగా డెడ్ కావడంతో నిర్మాతలు ఇప్పుడు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ ఇవ్వలేమని, ప్రాఫిట్ షేరింగ్‌కు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు హీరోలు పరిస్థితిని అర్థం చేసుకుని దిగొస్తున్నా, మరికొందరు మాత్రం సైలెంట్ అయిపోతున్నారు.

కంటెంట్ ఉంటేనే కాసులు.. లేదంటే లిస్ట్ నుండి అవుట్!

ఆడియన్స్ ఇప్పుడు ఇమేజ్ చూడటం లేదు, కేవలం కథను మాత్రమే నమ్ముతున్నారు. 2.5 కోట్లతో తీసిన ‘బలగం’ 26 కోట్లు వసూలు చేయడమే దీనికి నిదర్శనం. 200 రూపాయల టికెట్ కొని థియేటర్‌కి రావాలంటే ప్రేక్షకుడికి బలమైన కారణం కావాలి. టెక్నాలజీ ఎంత వచ్చినా వెండితెర ఇచ్చే ఎమోషన్, విజువల్ ఎక్స్‌పీరియన్స్ అద్వితీయం. దాన్ని నమ్ముకుని క్వాలిటీ కంటెంట్ ఇస్తేనే తెలుగు సినిమాకు పూర్వ వైభవం వస్తుంది, లేదంటే ఎంతటి స్టార్ అయినా రెండేళ్లలో ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే. ఇది 2026 టాలీవుడ్ రాసిపెట్టుకున్న కొత్త రూల్.

ప్రేక్షకుడు మారిపోయాడు

ప్రేక్షకుడు ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతున్నాడు: “నేను థియేటర్‌కి ఎందుకు రావాలి?”. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని సినిమా. ఓటీటీలో కూడా నిలబడదు.

ఇది టాలీవుడ్‌కు క్లియర్ సిగ్నల్. ఓటీటీపై ఆధారపడే కాలం ముగిసింది. థియేటర్‌ను తిరిగి గెలుచుకోవాల్సిన సమయం వచ్చింది. కానీ అసలు గేమ్ ఎక్కడుంది అంటే... థియేటర్, ఓటీటీ మధ్య పోటీ కాదు… ప్రేక్షకుడి దృష్టి కోసం పోటీ. ఆ దృష్టిని గెలుచుకున్నవాడే. రెండు వేదికలపై కూడా రాజు అవుతాడు.

Read More
Next Story