థియేటర్ల వార్‌కు ఫుల్ స్టాప్? ‘పెద్ది’తో మారనున్న బిజినెస్ గేమ్!
x

థియేటర్ల వార్‌కు ఫుల్ స్టాప్? ‘పెద్ది’తో మారనున్న బిజినెస్ గేమ్!

కొత్త పర్సంటేజ్ సిస్టమ్ ఫిక్స్!


తెలుగు పరిశ్రమలో గత కొంతకాలంగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాల (ఎగ్జిబిటర్స్) మధ్య నడుస్తున్న తీవ్రమైన ‘పర్సంటేజ్ వర్సెస్ రెంటల్’ వివాదానికి ఎట్టకేలకు తెరపడినట్లే కనపడుతోంది. హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేదికగా జరిగిన హై-లెవెల్ సబ్‌కమిటీ సమావేశంలో ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే, ఈ ఒప్పందం అంత ఈజీగా ఏమీ జరగలేదు. దీని వెనుక భారీ చర్చలు, వాదోపవాదాలు, అలకలు, కోపాలు, , విరమ్శలు ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద సినిమా రిలీజ్ ఉంది. మెగా కాంపౌండ్ హీరో సినిమా కావటంతో త్వరగా ఎవరికీ అడ్డు పెట్టడానికి ధైర్యం లేదనేది నిజం. ఆ వివరాలు లోతుగా పరిశీలిస్తే...

అసలు సమస్య ఏమిటి?

టాలీవుడ్‌లో చాలాకాలంగా రెండు మోడళ్లు నడుస్తున్నాయి:

రెంటల్ సిస్టమ్ – థియేటర్ యజమానులు ముందుగానే ఫిక్స్‌డ్ రెంట్ తీసుకుంటారు.

పర్సంటేజ్ సిస్టమ్ – సినిమా కలెక్షన్స్‌లో శాతం పంచుకుంటారు.

పెద్ద హీరోల సినిమాలు భారీ ఓపెనింగ్స్ తెస్తున్నప్పటికీ, ఫ్లాప్ అయితే ఎక్కువ నష్టం డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలపైనే పడుతోందని నిర్మాతలు వాదిస్తున్నారు. మరోవైపు థియేటర్లు కూడా తమ ఖర్చులు, నిర్వహణ భారం పెరిగిందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు “కొత్త పర్సంటేజ్ మోడల్” తీసుకురావాలని నిర్ణయించడం ఒక పెద్ద మార్పుగా చూస్తున్నారు.

‘పెద్ది’ కోసం ప్రత్యేక ఒప్పందం!

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య నడుస్తున్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) జూన్ 4న థియేటర్లలోకి రావడానికి రూట్ క్లియర్ అయింది.

థియేటర్ల రెంట్లు, పర్సంటేజ్ సిస్టమ్ విషయంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లతో కూడిన ఒక ప్రత్యేక కమిటీ వరుస సమావేశాలు నిర్వహించింది. సుదీర్ఘ చర్చల అనంతరం, 'పెద్ది' సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చాయి.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం కుదిరిన ఆసక్తికరమైన ఒప్పందాలు ఇవే:

‘పెద్ది’ రిలీజ్ ఫార్ములా.. ఆ 7.5% లెక్క ఏంటి?కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ‘పెద్ది’ సినిమాను ఎక్కడా అడ్డుకోకుండా సాఫీగా విడుదల చేయడానికి అంగీకరించారు. అయితే దీనికి కొన్ని కండిషన్స్ పెట్టారు:

ఆంధ్రప్రదేశ్ (AP): ఒకవేళ ఏపీలో ‘పెద్ది’ సినిమాకు ప్రభుత్వం తరపున టికెట్ ధరల పెంపు (Ticket Price Hike) లభిస్తే.. పెరిగిన రేట్ల నుండి 7.5 శాతం మొత్తాన్ని ఒప్పందం ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ (TS): తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచితేనే ఈ రూల్స్ వర్తిస్తాయి.

ప్రీమియర్ షోల రేట్లు ఫిక్స్!

సినిమా విడుదలకు ముందు వేసే స్పెషల్ ప్రీమియర్ షోల పేమెంట్లపై క్లారిటీ ఇచ్చారు. సెంటర్ల వారీగా ఒక్కో షోకి చెల్లించాల్సిన రేట్లను లాక్ చేశారు

సెంటర్ కేటగిరీఒక్కో ప్రీమియర్ షోకి చెల్లించాల్సిన మొత్తం

A సెంటర్స్ (నగరాలు/మల్టీప్లెక్స్‌లు)₹25,000

B సెంటర్స్ (పట్టణాలు)₹15,000

C సెంటర్స్ (గ్రామీణ ప్రాంతాలు/సింగిల్ స్క్రీన్స్)₹10,000

సరికొత్త ‘పర్సంటేజ్ సిస్టమ్’ అమలుకు సై

ఇకపై పరిశ్రమలో పాత పద్ధతులకు స్వస్తి పలికి, ‘పర్సంటేజ్ సిస్టమ్’ను పూర్తిగా తీసుకురావడానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ ఒకే తాటిపైకి వచ్చారు.

మూడు వారాల గడువు:

ఈ కొత్త పర్సంటేజ్ విధానానికి సంబంధించిన పూర్తి రూపురేఖలను మరో మూడు వారాల్లోగా లేదా తదుపరి పెద్ద సినిమా విడుదలయ్యే లోపు (ఏది ముందైతే అది) ఫైనలైజ్ చేయనున్నారు.

70% పూర్తైన సినిమాలకు స్పెషల్ బెనిఫిట్

ఇప్పటికే 70% షూటింగ్ పూర్తయిన సినిమాలకు పాత వ్యవస్థతో పోలిస్తే కొంత అనుకూలమైన శాతం అమలు చేసే అవకాశం ఉంది. కానీ ఇక నుంచి స్టార్ట్ అయ్యే ప్రాజెక్టులన్నీ కొత్త మోడల్‌కే రావాల్సి ఉంటుంది.

ఇది చాలా కీలక అంశం. ఎందుకంటే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ సినిమాల బడ్జెట్లు, బిజినెస్ ఒప్పందాలు ఇప్పటికే పాత లెక్కల ప్రకారం ఫిక్స్ అయ్యాయి. ఒక్కసారిగా కొత్త సిస్టమ్ పెడితే పెద్ద గందరగోళం వచ్చే ప్రమాదం ఉండేది.

ఇది నిజంగా పరిష్కారమేనా… లేక తాత్కాలిక రాజీనా?

ఈ ఒప్పందం బయటకు చూస్తే ఇండస్ట్రీకి మంచి పరిణామంలా కనిపిస్తున్నా, అసలు పరీక్ష మాత్రం “పెద్ది” రిలీజ్ తర్వాత మొదలవుతుంది.

ఎందుకంటే:

పెద్ద హీరో సినిమాలకు ఒక రూల్,

చిన్న సినిమాలకు మరో రూల్,

టికెట్ హైక్ ఉంటే మరో లెక్క…

ఇలా వ్యవస్థ ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదనే అభిప్రాయం కూడా ఉంది. ముఖ్యంగా ఓటీటీలు, తగ్గుతున్న థియేటర్ ఫుట్‌ఫాల్స్, పెరుగుతున్న బడ్జెట్లు… ఈ పరిస్థితుల్లో థియేట్రికల్ బిజినెస్‌ని బ్రతికించాలంటే నిర్మాతలు – ఎగ్జిబిటర్లు ఇద్దరూ కొంత వెనక్కి తగ్గాల్సిందే. ఇప్పుడు అదే జరిగింది.

కానీ ఈ మాటలు ఎంతకాలం నిలుస్తాయనేదే అసలు ప్రశ్న.

ఒక విషయం మాత్రం స్పష్టం

“పెద్ది” ఇప్పుడు కేవలం సినిమా కాదు… టాలీవుడ్ థియేట్రికల్ ఎకానమీకి లిట్మస్ టెస్ట్‌గా మారింది. మొత్తానికి ‘పెద్ది’ రిలీజ్ కాబోతున్న తరుణంలో టాలీవుడ్ బాక్సాఫీస్ బిజినెస్ స్మూత్‌గా సాగడానికి ఈ మీటింగ్ ఒక పెద్ద బూస్టర్ డోస్ అని చెప్పవచ్చు. జూన్ 4న బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ దండయాత్రకు థియేటర్ల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇండస్ట్రీ పెద్దలు ముందే లైన్ క్లియర్ చేయడం మెగా అభిమానులకు పెద్ద ఉపశమనమే అని చెప్పాలి!

Read More
Next Story