హారర్ కామెడీ యూనివర్స్‌లోకి విజయ్ దేవరకొండ?
x

హారర్ కామెడీ యూనివర్స్‌లోకి విజయ్ దేవరకొండ?

కొత్త గేమ్ మొదలైందా?


ఒకప్పుడు హారర్ కామెడీ అంటే చిన్న జానర్. ఇప్పుడు మాత్రం అదే బాక్సాఫీస్ వద్ద మల్టీ కోట్లు రప్పించే గోల్డ్ మైన్ గా మారిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ జానర్ ని భారీ స్కేల్ లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘స్త్రీ’, ‘ముంజ్యా’, ‘స్త్రీ 2’ లాంటి సినిమాలతో మ్యాడాక్ ఫిల్మ్స్ సృష్టించిన హారర్ కామెడీ యూనివర్స్ ఇప్పుడు బాలీవుడ్ లో ప్రత్యేక బ్రాండ్ గా నిలిచింది. ఇలాంటి కీలక సమయంలో విజయ్ దేవరకొండ మ్యాడాక్ ఆఫీస్ లో కనపడటం ఒక్కసారిగా కొత్త చర్చలకు దారితీసింది.

‘మ్యాడ్ డాక్ ఫిల్మ్స్’ ఆఫీస్ నుంచి విజయ్ బయటకు వస్తూ కెమెరాల కంటికి చిక్కాడు.ప్రొడ్యూసర్ దినేష్ విజన్‌తో విజయ్ దేవరకొండ జరిపిన ఈ సీక్రెట్ మీటింగ్ వెనుక అసలు కథేంటి? కచ్చితంగా ఏదో పెద్దదే కుకింగ్ అవుతోందనే అనుమానాలు బాలీవుడ్, టాలీవుడ్‌లలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఇమేజ్‌కి, మ్యాడ్ డాక్ హారర్ యూనివర్స్‌కి ఎక్కడైనా లింక్ కుదురుతుందా, ఈ ప్రపోజల్ వర్కవుట్ అయితే బాక్సాఫీస్ రేంజ్ ఎలా ఉంటుందనే విషయం హాట్ టాపిక్ గా మారి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇప్పటికే రష్మిక మందన్నకు మ్యాడాక్ తో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఆ బ్యానర్ లో ఆమె చేసిన ప్రాజెక్టులతో రష్మిక బాలీవుడ్ లో తన కెరీర్ ని సుస్దిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తూండగా, ఇప్పుడు విజయ్ కూడా అదే బ్యానర్ తో చేతులు కలపబోతున్నాడా? ముఖ్యంగా హారర్ కామెడీ యూనివర్స్ లోకి ఎంట్రీ ఇస్తాడా? అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వేడి పెంచుతున్నాయి.

అసలు ప్లాన్ ఇదేనా?

ప్రస్తుతం మ్యాడాక్ ఫిల్మ్స్ భారీ స్థాయిలో సినిమాటిక్ యూనివర్స్ ని విస్తరిస్తోంది. హారర్ కామెడీ, మైథాలజీ, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్… ఇలా అన్ని జానర్లలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో జరిగిన మీటింగ్ సాధారణ విషయం కాదనే టాక్ బలంగా వినిపిస్తోంది.

కొంతమంది ఇండస్ట్రీ వర్గాలు, విజయ్ ని ఒక హారర్ కామెడీ స్పిన్ ఆఫ్ కోసం పరిశీలిస్తున్నారని చెబుతుంటే… మరికొందరు అతనిని డార్క్, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం అనుకుంటున్నారని అంటున్నారు. అయితే ఇప్పటివరకు అధికారిక క్లారిటీ మాత్రం లేదు.

విజయ్ కి ఇదే కరెక్ట్ జానరా?

‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండకు వచ్చిన యూత్ క్రేజ్ ఒక దశలో అసాధారణం. కానీ తర్వాత వచ్చిన సినిమాలు, స్క్రిప్ట్ సెలక్షన్స్ అతని కెరీర్ గ్రాఫ్ ను గందరగోళంలోకి నెట్టేశాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో, జనరేషన్ Z లో విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉన్నా… బాక్సాఫీస్ హైప్ మాత్రం మునుపటిలా కనిపించడం లేదు.

ఇక్కడే హారర్ కామెడీ జానర్ అతనికి పెద్ద ప్లస్ కావొచ్చు. ఎందుకంటే ఈ జానర్ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను, యూత్ ను, మాస్ ప్రేక్షకులను ఒకేసారి థియేటర్లకు రప్పిస్తోంది. ముఖ్యంగా విజయ్ లో ఉన్న కామిక్ టైమింగ్, అటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్… సరైన రైటింగ్ పడితే హారర్ కామెడీలో బాగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నార్త్ బెల్ట్‌లో మ్యాడ్ డాక్ హారర్ సినిమాలకు బ్రాండ్ వాల్యూ ఉంది. దానికి విజయ్ దేవరకొండ లాంటి సౌత్ స్టార్ తోడైతే, ఆ ప్రాజెక్ట్‌కు వచ్చే ప్యాన్-ఇండియా హైప్ అంతా ఇంతా కాదు.

బాలీవుడ్ రూట్ స్ట్రాంగ్ అవుతుందా?

ఇప్పుడు విజయ్ కెరీర్ కు అవసరం కేవలం హిట్ మాత్రమే కాదు… స్ట్రాంగ్ పాన్ ఇండియా రీపోజిషనింగ్. అదే మ్యాడాక్ ద్వారా సాధ్యమవుతుందని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం హిందీ మార్కెట్ లో మ్యాడాక్ కి ఉన్న బ్రాండ్ వాల్యూ చాలా స్ట్రాంగ్ గా ఉంది.

ఒకవేళ విజయ్ నిజంగానే మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ లోకి ఎంటర్ అయితే… అది అతని కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ లో మళ్లీ కొత్త ఇమేజ్ తెచ్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది.

రిస్క్ కూడా తక్కువ కాదు!

అయితే ఈ ప్రయోగంలో రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే హారర్ కామెడీ జానర్ ఇప్పుడు బాగా వర్కవుట్ అవుతున్నా… అదే ఫార్ములా రిపీట్ అయితే ప్రేక్షకులు వెంటనే బోర్ ఫీల్ అవుతున్నారు. అలాగే విజయ్ కి ఉన్న రౌడీ ఇమేజ్ ను పూర్తిగా మార్చేసేలా క్యారెక్టర్ డిజైన్ చేస్తే, అది రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

ఏదైమైనా మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ లాంటి క్రేజీ ప్రొడక్షన్ హౌస్ దొరికితే నార్త్ ఇండియాలోని ప్రతి మూలకూ ఆ సినిమా ఈజీగా రీచ్ అవుతుంది. ఒకవేళ ఈ హారర్ కామెడీ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే, విజయ్ కోరుకుంటున్న అసలైన ప్యాన్-ఇండియా సక్సెస్ దక్కినట్లే. మరి ముంబై ఆఫీసులో జరిగిన ఆ సీక్రెట్ చర్చల వెనుక ఉన్న అసలు రహస్యం త్వరలోనే బయటకు రానుంది, రౌడీ ఫ్యాన్స్ మాత్రం ఈ హారర్ కాంబో కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Read More
Next Story