పురుషుల్లో రొమ్ము క్యాన్సర్.. ఆలస్యంగానే గుర్తింపు!
x

పురుషుల్లో రొమ్ము క్యాన్సర్.. ఆలస్యంగానే గుర్తింపు!

హైదరాబాద్‌లో పురుషుల రొమ్ము క్యాన్సర్‌పై షాకింగ్ నిజాలు. 87 శాతం మందికి ముదిరిన స్టేజ్‌లోనే వ్యాధి నిర్ధారణ.


హైదరాబాద్ పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ భయం అధికం అవుతోంది. చాలా మంది వ్యాధి నిర్ధారణ చాలా ఆలస్యంగా జరుగుతోంది. దాదాపు 87శాతం మంది క్యాన్సర్‌ అడ్వాన్స్‌డ్ స్టేజ్‌కు చేరుకునే వరకు గుర్తించడం లేదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఈ స్టడీలో హైదరాబాద్‌లో పురుషుల రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలో ప్రతి నలుగురు బాధితుల్లో ఒకరు అత్యంత ప్రమాదకరమైన నాలుగో దశలో ఆస్పత్రికి వస్తున్నారు. వ్యాధి పట్ల అవగాహన లేకపోవడం, ప్రాథమిక దశలో లక్షణాలను గుర్తించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది.

సనత్‌నగర్‌లోని ESIC మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 2019 నుండి 2025 మధ్య కాలంలో నిర్వహించిన ఈ పరిశోధన వివరాలను 'జర్నల్ ఆఫ్ ది అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా' (JAPI) ప్రచురించింది. ఈ ఆరేళ్ల కాలంలో 15 మంది బాధితులను విశ్లేషించగా, అందులో దాదాపు 87 శాతం మందికి క్యాన్సర్ ముదిరిన తర్వాతే (స్టేజ్ 3 మరియు స్టేజ్ 4) వ్యాధి నిర్ధారణ అయింది.

సాధారణంగా లక్షణాలు కనిపించిన ఆరు నెలల తర్వాతే బాధితులు డాక్టర్లను సంప్రదిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. నిపుల్ వెనుక గడ్డలు రావడం, చర్మం మందబారడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ సమస్యగా భావిస్తున్నారు. కొందరిలో ఇవి పుండ్లుగా మారిన తర్వాతే చికిత్స కోసం వస్తున్నారు. వాస్తవానికి ఈ బాధితుల్లో ఎవరికీ కుటుంబ చరిత్ర లేదా హార్మోన్ల ప్రభావం వంటి ముందస్తు ముప్పులు లేకపోవడం గమనార్హం.

ప్రస్తుతం ఈ 15 మందిలో తొమ్మిది మంది చికిత్స పొందుతూ కోలుకుంటుండగా, ఇద్దరు వ్యాధి తీవ్రత వల్ల మరణించారు. మరికొందరు మధ్యలోనే చికిత్స ఆపేశారు. ఉచిత వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రయాణ దూరం మరియు సామాజిక వివక్ష కారణంగా చికిత్సకు దూరమవుతున్నారని డాక్టర్ విశ్వేష్ పేర్కొన్నారు. పురుషుల్లో ఈ క్యాన్సర్ శాతం తక్కువైనా, సరైన మార్గదర్శకాలు లేకపోవడం ఫలితాలపై ప్రభావం చూపుతోందని డాక్టర్ నివాలిక రాజమణి అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటించడం వల్ల డేటా సేకరణ సులభం కానుంది. అయితే పురుషులకు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రత్యేక పాలసీలు, అవగాహన కార్యక్రమాలు అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read More
Next Story