త్యాగయ్య అపూర్వ రాగాలపై అరుదైన గ్రంథం
x
తిరుపతి ఎస్ వి యూనివర్సిటీ లో సోమవారం ఆవిష్కరణ జరగనున్న త్యాగరాజ స్వామి అపూర్వ రాగాల పై గిరిజ శేష మాంబ రాసిన గ్రంథం.

త్యాగయ్య అపూర్వ రాగాలపై అరుదైన గ్రంథం

త్యాగరాజస్వామి 700 కృతులు రాశారు. ఎనభై అపూర్వ రాగాలను సృష్టించారు. వాటి మీద వస్తున్న పుస్తకం పరిచయం


త్యాగరాజ స్వామి సృష్టించిన 80 అపూర్వ రాగాలపై సంగీత విద్వాంసురాలు, ఆ విభాగంలో అధ్యాపకురాలు, డాక్టర్ గిరిజ శేషమాంబ పరిశోధించి రచించిన అపూర్వ గ్రంథాన్ని సోమవారం ఎస్వీ యూనివర్సిటీ అన్నమయ్య భవన్ లో వైస్ చాన్సలర్ ఆచార్య తాతా నర్సింగ్ రావు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ‘అపూర్వ రాగాస్ ఆఫ్ సెయింట్ త్యాగరాజాస్ కంపోజిషన్’ అన్న ఈ పుస్తకం, నేపథ్యం గురించిన చిరు పరిచయం.

త్యాగరాజ స్వామి అనగానే ‘ఎందరోమహానుభావులు.. అందరీకి వందనములు..’ అన్న కీర్తన ఆబాల గోపాలానికి గుర్తుకు వస్తుంది. ‘తెరతీయగరాదా..’ అన్న కృతి గుర్తుకు వస్తుంది. మరో అపూర్వ రాగం ‘మరుగేలరా..ఓ..రాఘవా..’ గుర్తుకు వస్తుంది.
కర్ణాటక సంగీత త్రయాల్లో ఒకరైన త్యాగరాజస్వామి 700 కృతులు రాశారు. ఎనభై అపూర్వ రాగాలను సృష్టించారు. ఈ గ్రంథకర్త డాక్టర్ తాతా గిరిజ శేష మాంబ 80 అపూర్వ రాగాలకు రాగలక్షణాన్ని, కృతి సాహిత్యాన్ని, స్వరంతోపాటు రచించి ఒక అపూర్వ గ్రంథంగా తీసుకొచ్చారు. ఈ అపూర్వ రాగాలను పాడుకోవడానికి ఈ గ్రంథం ఎంతగానో ఉపకరిస్తుంది.
త్యాగరాజస్వామి ఈ 80 అపూర్వ రాగాలను సృష్టించి, సంగీత ప్రపంచానికి అందించారు. గతంలో ఎవరూ ఈ పనిచేయలేదు. ఈ రాగాలకు పేర్లను పెట్టింది కూడా వారే. ఈ 80 రాగాలలో 65 రాగాలకు ఒక్కో కృతి మాత్రమే రాశారు. మిగతా పదహేను రాగాలకు రెండేసి చొప్పున కృతులున్నాయి. ఈ 80 రాగాలకు స్వరంతో, ఒకే చోట పుస్తకంగా రావడం ఇదే ప్రథమం.
కర్ణాటక సంగీతానికి పజ్జెనిమిదవ శతాబ్దం ఒక స్వర్ణయుగం. పజ్జెనిమిదవ శతాబ్దం రెండవ అర్ధభాగంలో, పంతొమ్మిదవ శతాబ్దం తొలి అర్ధ భాగంలో జీవించిన త్యాగరాజస్వామి కర్ణాటక సంగీతాన్ని ఉచ్ఛస్థితి కి తీసుకు వెళ్ళిన మహానుభావులు. కర్నూలుకు చెందిన వీరి పూర్వీకులు 1600 ప్రాంతంలో తంజావూరుకు వలస వచ్చారు. త్యాగరాజస్వామి తాతగారు గిరిరాజ తంజావూరు ఆస్థాన వాగ్గేయకారుడు.
త్యాగరాజస్వామి చిన్న తనం నుంచే పురందరదాసు, రామదాసు కీర్తనలను పాడేవారు. తండ్రి రామబ్రహ్మం వద్దనే తెలుగు సంస్కృతం నేర్చుకున్నారు. తంజావూరు సంగీత విద్వాంసులైన శొంటి వెంకటరమణయ్య వద్ద సంగీతంలో శిష్యరికం చేశారు. త్యాగరాజస్వామిలో మధురమైన గాత్రం, స్పష్టమైన ఉచ్ఛారణ, భావస్ఫూర్తి, సహజ సంగీత జ్ఞానం, తెలుగు సంస్కృత భాషా పరిజ్ఞానంతో పాటు, సహజమైన కవితా ధార ఉండడంతో ఆయన పరిణితి చెందిన మహాభక్తుడు, మహావేదాంతి, మహావాగ్గేయకారు డయ్యారు.
త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రుల, ముత్తుస్వామి దీక్షితార్ ముగ్గురూ కర్ణాటక సంగీత రత్నత్రయంగా ప్రసిద్ధులయ్యారు. వీరిలో త్యాగరాజస్వామి కీర్తనల్లో సంప్రదాయ పద్ధతి, పాండిత్య ప్రతిభే కాకుండా, పండిత పామర రంజకంగా ఉండి, అన్ని రచనలూ కూడా తెలుగులో ఉండడం వల్ల, శిష్యపరంపర మెండుగా ఉండడం వల్ల వీరి రచనలు బాగా ప్రాచుర్యం పొందాయి.
త్యాగరాజ స్వామి కీర్తనలను అందరిలా కూర్చుని రాసేవారు కాదు. కళ్ళు మూసుకుని తంబుర వాయిస్తూ, రాగాలాపనతో అశుధారా ప్రవాహంలో పాడేవారు. వారి శిష్యులు వాటిని తాటి ఆకులపై రాసేవారు. త్యాగరాజస్వామి కీర్తనలను స్వరరాగ బద్ధంగా రాయాలంటే ఎంతో సంగీత పరి జ్ఞానం అవసరం. వారి శిష్యుల ద్వారా అవి అలా గ్రంథస్తమయ్యాయి. తరువాత వాటిని రాసిన శిష్యులు పాడి వినిపిస్తే, ‘ఒహో..అలా వచ్చిందా.. !’ అనే వారట త్యాగరాజ స్వామి. వారి కీర్తనలన్నీ సంగీత సాహిత్య కళాఖండాలుగా మిగిలిపోయి, మన వారసత్వ సంపదైపోయాయి.
త్యాగరాజస్వామి ఏ విధంగా కీర్తనలను రచించారో (సృష్టించారో), ఏఏ సాహిత్యానికి ఏఏ స్వరం వాడారో తు.చ తప్పకుండా ఈ నాటికీ అదే విధంగా, అవే స్వరాలతో కర్ణాటక సంగీజ్ఞులు పాడుతున్నారు. ఇది పరంపరగా వస్తోంది. ప్రతీకీర్తనకు కూడా వారు రాగాన్ని స్వరాన్ని సమకూర్చారు.
త్యాగరాజ స్వామి కీర్తనల్లో భక్తితత్వం, ప్రేమతత్వం, సంగీత తత్వం కలగలిసి ఉంటాయి. డాంబిక వృత్తిని, సంఘ వ్యతిరేక శక్తుల్ని తెగిడేవి కూడా త్యాగరాజస్వామి కీర్తనల్లో ఉన్నాయి. త్యాగరాజస్వామి వ్యావహారిక భాషనే వాడారు. వారు తమ కీర్తనల్లో లోకోక్తులను, జాను తెనుగు పలుకు బళ్ళను కూడా ఉపయోగించారు.
‘‘రూకలు పదివేలున్న చేరెడు నూకలు గతిగానిదీ మనసా
కోకలు వేయున్న కట్టుకొనుట ఒకటే గానీ..’’
‘‘ఏరు నుండి పారిన పాత్రకడుగు నీరు వచ్చుగాని
సారమౌ కవితలు విని వెర్రివాడు సంతోషపడియేమి, పడకనేమి?’’
త్యాగరాజస్వామి అర్థంపర్థం లేని ఆచారాలను, ధనవంతుల ఆడంబరాలను, కులాచారాలను, మత భేదాలను తీవ్రంగా నిరసించారు. తమ కాలం నాటి భక్తిని ఆలంబనగా చేసుకుని, ఆనాటి సామాజిక అవరాలను బట్టి, వర్గ ప్రయోజనాలను బట్టి వారు నిర్వహించిన పాత్రను నిర్వచించాలి.
త్యాగరాజస్వామి భక్తిని ఆలంబనగా చేసుకుని, సంస్కరణ దృష్టితో కీర్తనలు రాశారు. తెలుగు భాష తీయదనాన్ని నిరూపించారు. అలంకార శాస్త్రాలు, వ్యాకరణాల జోలికి వెళ్ళ లేదు. సహజమైన భాషలో, సహజమైన రీతిలో రాశారు. త్యాగరాజస్వామి భౌతిక వాది కాకపోయినా, భౌతిక మార్గీయులు. చలనం లేకుండా స్తబ్దతగా ఉన్న మధ్య యుగాల్లో, తిరుగుబాటు రూపంలో కాకపోయినా, పరిమితంగానైనా నిరసన రూపంలో తన భావాలను తెలియచేశారు.
త్యాగరాజ స్వామి రచనలు
త్యాగరాజ స్వామి 700 కీర్తనలతో పాటు లాలిపాటలు కూడా రాశారు. ప్రహ్లాద భక్త విజయం, నౌకా చరిత్రం, సీతారామ విజయం అనే మూడు గేయ నాటకాలు రాశారు. కృతులు కీర్తనలతో పాటు, దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు రాశారు. పంచరత్న కృతులు, మేలుకొలుపు పాటలు రాశారు. కానీ నృత్య, శృంగార, కథాతత్మక నాటకాలపైన పెద్దగా ఆసక్తి కనబరచలేదు. సంగీతత్రయాల్లో త్యాగరాజ స్వామి మాత్రమే గేయనాటకాలు రాశారు. కర్ణాటక సంగీతంలో మాత్రమే ఉండే కృతుల్లో పల్లవి, అనుపల్లవి, చరణాలు ఉంటాయి. కీర్తనల్లో పల్లవి, చరణాలు మాత్రమే ఉంటాయి. అను పల్లవి ఉండదు. ఈ కీర్తనలను త్యాగరాజస్వామి మాత్రమే రాశారు. కృతులు, కీర్తనలలో అపూర్వ రాగాలు చేశారు. వీరి రచనల్లో జాను తెలుగు పలుకు బళ్ళు కనిపిస్తాయి.
జీవనయానం
త్యాగరాజస్వామి రాజుల కొలువులను ఆశ్రయించలేదు. తిరువాయూరు ప్రభువు, మహావాగ్గేయ కారుడు కులశేఖర మహారాజు త్యాగరాజ స్వామి కీర్తనల గురించి విని, తన ఆస్థాన గాయకుడడైన వడివేలు ద్వారా కబురంపాడు. ప్రభువుల ఆశ్రయాన్ని త్యాగరాజస్వామి సున్నితంగా తిరస్కరించారు. త్యాగరాజ స్వామి తంబుర వాయిస్తూ, సంకీర్తనలను గానం చేస్తూ వీధుల వెంట శిష్యగణంతో తిరిగేవారు. గృహస్థులిచ్చిన దినుసులు స్వీకరిస్తూ, సంగీత సాధనతో గడిపేవారు.
త్యాగరాజ కీర్తనల్లో ప్రపంచ రికార్డు

డాక్టర్ గిరిజ శేషమాంబ

త్యాగరాజ స్వామి సృష్టించిన 80 అపూర్వ రాగాలను సేకరించి, వాటికి రాగ లక్షణాలను, స్వరాలను సమకూర్చి, ‘అపూర్వ రాగాస్ ఆఫ్ సెయింట్ త్యాగరాజాస్ కంపోజిషన్’ అన్న పుస్తకాన్ని తెచ్చిన డాక్టర్ తాతా గిరిజా శేషమాంబ త్యాగరాజ కీర్తనల ఆలాపనలో ప్రపంచ రికార్డులు సృష్టించారు. ఈ త్యాగరాజ స్వామి అపూర్వ రాగ కృతులను ప్రచారంలోకి తీసుకు రావడానికి వీరు అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ అపూర్వ రాగాల మీద అనేక ప్రసంగాలు చేశారు.
శృంగేరి శారదా పీఠంలో పన్నెండు గంటలపాటు నిరాటంకంగా త్యాగరాజస్వామి స్వరార్చన చేసి, 2006లో లిమ్కాబుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి గిరిజా శేషమాంబ ఎక్కారు. మరొకసారి ముంబైలో పద్నాలుగు గంటలపాటు నిరాటంకంగా త్యాగరాజ స్వరార్చన-2 చేసి, ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కారు. అపూర్వ రాగ గానకోకిల, సంగీతశ్రీ, సంగీత సరస్వతి, కర్ణాటక సంగీత కౌస్తుభం వంటి అనేక బిరుదులు పొందారు. ఆమె పొందిన అవార్డుల్లో, బహుమతుల్లో ఇవి కొన్ని మాత్రమే.
త్యాగరాజ స్వామి కృతులు, కీర్తనలతో అనేక ప్రదర్శనలు ఇచ్చిన గిరిజా శేషమాంబ ప్రస్తుతం ఎస్వీయూనివర్సిటీ సంగీత విభాగంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. సంగీతమే జీవిత సర్వస్వంగా సాగుతున్న గిరిజా శేషమాంబ త్యగరాజ స్వామి అపూర్వ రాగాలపైనే పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. హిందీలోనూ, న్యాయ శాస్త్రంలోనూ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన విద్యావంతురాలు.


Read More
Next Story