
ప్రేమావతి: మహిళల ఆత్మగౌరవం ఆమె పరమావధి
సాహితీవేత్త, స్నేహశీలి ప్రేమావతి జ్ఞాపకాలు
తిరుపతి సాహితీ వేత్త, స్నేహశీలి డాక్టర్ ప్రేమావతి కన్ను మూసి శనివారం నాటికి ఏడాది పూర్తవుతోంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు వేమన విజ్ఞాన కేంద్రంలో ‘జ్ఞాపకాల్లో ప్రేమావతి’ సంచిక ఆవిష్కరణ జరగనుంది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో చదువు మొదలు పెట్టి, జీవితంలో నిలదొక్కుకోవడానికి అస్తిత్వ పోరాటం చేసిన మహిళల జీవితాలకి ప్రేమావతి ఒక ఉదాహరణ,ఒక ప్రేరణ. ప్రేమావతి సంస్మరణ
***
సాహితీవేత్త.. గొప్ప స్నేహశీలి.. నిత్యచలనశీలి డాక్టర్ ప్రేమావతి ఒంటరి మహిళైనా నిత్యం సమూహంలో జీవిస్తుండేవారు. ఎస్పీ డబ్ల్యు మహిళా కాలేజీలో తెలుగు పాఠాలు చెపుతూ, పాతికేళ్ళ క్రితం ఉద్యోగ విరమణ చేసినా, నిన్న మొన్నటి దాకా, తన విద్యార్థులకు జీవిత పాఠాలు చెపుతూనే ఉన్నారు. అనేక మందికి దారిదీపమై, అందరికీ కనిపించే, వినిపించే ప్రేమావతి 83 ఏళ్ళ వయసులో ఉన్నట్టుండి గత ఏడాది (మే9 2025) మన నుంచి నిష్క్ర మించారు!
ఎక్కడ నంగమంగళం! ఎక్కడ తిరుపతి! చిత్తూరు జిల్లాలో మారుమూల ఉన్న ఐరాల మండలం, నంగమంగళంలో ఒక రైతు కుటుంబంలో 1942లో పుట్టిన ప్రేమావతి, ఇంత మందికి తలలో నాలుకలా మెలగడం ఆశ్చర్యమే! పదహారేళ్ళ వయసులో పీయూసీలో చేరడానికి 1958లో తిరుపతికి ఒంటరిగా వచ్చారు. అసలు తిరుపతికి ఎలా వచ్చారు? ఈ రాకకు ఎవరి ప్రేరణ కారణమైంది? తిరుపతిలో ఈ అరవై ఏడేళ్ళ సుదీర్ఘ జీవన యానాన్ని గుర్తు చేసుకుంటే, అనేక ఆసక్తికర విషయాలు.
ముగ్గురు స్ఫూర్తి ప్రదాతలు
నంగమంగళం నుంచి వచ్చిన ప్రేమావతి చదువుకుని, ఎస్పీడబ్ల్యు కాలేజీలో తెలుగు అధ్యాపకురాలిగా నిలదొక్కుకోవడానికి ముగ్గురు స్ఫూర్తి కలిగించారు. ప్రేమావతికి వరుసకు తాతగారయ్యే కె.ఎం. రెడ్డి, ఇద్దరు గురువులు జి.ఎన్.రెడ్డి, రాజేశ్వరి మూర్తి వారికి స్ఫూర్తి ప్రదాతలు.
తాతగారే తొలిగురువు
సంగమంగళం పక్కనే ఉన్న బొమ్మసముద్రానికి చెందిన కె.ఎం. రెడ్డి ప్రేమావతికి వరుసకు తాతవుతారు. ప్రేమావతికి ఓనమాలు దిద్దించి, చదువుకు పునాది వేసిన విద్యాప్రదాత ఆయన. ప్రేమావతికే కాదు, వెనుకబడిన బొమ్మసముద్రం ప్రాంతంలో వేలాది మంది చదువుకోవడానికి దోహదపడ్డ ధన్యజీవి. ఆయనొక అద్భుతమైన వ్యక్తి.
కె.ఎం.రెడ్డి ఒక రైతు కుటుంబంలో 1912లో జన్మించాడు. వేలూరులో ఇంటర్మీడియట్ చదివాడు. ఆయన తండ్రి మాత్రం తన కొడుకు పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నారు. కె.ఎం.రెడ్డి ఆలోచనలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఓ రోజు ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా, అర్ధ రాత్రి తన తల్లి నగలు దొంగిలించి, వేలూరులో అమ్మేసి కలకత్తా రైలెక్కాడు. శాంతినికేతన్ కు వెళ్ళి రవీంద్రుడికి ప్రియశిష్యుడయ్యాడు. బెంగాల్ ను కరువు కాటేస్తున్న రోజులవి. ముప్ఫై లక్షల మంది చనిపోగా, మిగిలిన మనుషులు, పశువులను కాపాడుకోవడానికి, విరాళాల కోసం రవీంద్రుడు ఒక నృత్య రూపకాన్ని తయారు చేశాడు. కరువు రూపంలో కె.ఎం. రెడ్డిని నటించమని, విరాళాల సేకరణకు తన ప్రతినిధిగా ఆ బృందానికి నాయకుడిగా కె.ఎం. రెడ్డిని నియమిస్తూ, ఆయనకు ఒక లేఖ రాసిచ్చి దేశంపైకి పంపించాడు. ఆ సమయంలో కె.ఎం. రెడ్డి ఇందిరాగాంధీని సైతం విరాళాలడిగాడు.
చైనా అధినేత చాంకైషేక్ భారత పర్యటనలో భాగంగా శాంతినికేతన్ కు వచ్చిప్పుడు, విశ్వకవి రవీంద్ర నాథ్ టాగోర్ కె.ఎం. రెడ్డిని ఆయనకు గైడ్ గా ఇచ్చి పంపించాడు. చాంకైషేక్ సమక్షంలో కె.ఎం. రెడ్డి జనగణమన పాడడంతో రవీంద్రుడు సైతం ముగ్ధులయ్యారు. బి.ఏ., ఆనర్స్ అయిపోయాక, బొంబాయి వెళ్ళి కమ్యూనిస్టు పార్టీలో చేరి కార్మికుల పోరాటంలో పాలుపంచుకున్నాడు. 'నేషనల్ హెరాల్డ్' పత్రికలో చేరి పనిచేశాడు. లక్నో విశ్వవిద్యాల యానికి వెళ్ళి సంగీతంలో పరిశోధన చేశాడు. ఏం చేసినా కె.ఎం. రెడ్డిని ఏదో అసంతృప్తి వెంటాడుతూనే ఉంది.
కె.ఎం. రెడ్డి 1948లో బొమ్మసముద్రం తిరిగి వచ్చాడు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలు. చుట్టుపక్కల పన్నెండు గ్రామాల్లో ఎక్కడా స్కూళ్ళు లేవు. తన పొలంలో పాకలు(కొట్టాలు) వేసి స్కూలు ప్రారంభించాడు. చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి, పిల్లల్ని స్కూల్లో చేర్పించాడు. అలా ప్రేమావతికూడా ఆరేళ్ళవయసులో తాతగారు పెట్టిన స్కూల్లో చేరారు. బొమ్మ సముద్రంలో కె.ఎం.రెడ్డి స్కూల్ పెట్టకపోతే, ఈరోజు మనం ప్రేమావతి గురించి ముచ్చటించుకునే అవసరం ఉండేది కాదు. ఆ స్కూలే లేకపోతే, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికీ చదువు వచ్చేది కాదు. అసలు ప్రేమావతి జీవితం ఎలా ఉండేదో! అది వారి మాటల్లోనే...
"మా తాతగారే స్కూల్ పెట్టకపోతే, మిగతా ఆడపిల్లలతో పాటు నేను కూడా ఆ పల్లెటూర్లో తొక్కుడు బిళ్ళలు ఆడుకుంటూ, అచ్చన్నగాయలు ఆడుకుంటూ ఉండేదాన్ని. ఒకళ్ళ తలలో ఒకళ్ళు పేలు చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, పొలానికి చద్ది మోసుకెళుతూ మిగతా ఆడ పిల్లల్లా ఉండేదాన్ని. ఎవరో ఒకర్ని పెళ్ళి చేసుకుని, పదిమంది పిల్లల్ని కని, ఆ పల్లెటూరిలో జీవితాన్నలా వెళ్ళదీసేదాన్ని. మా తాతగారు స్కూల్ పెట్టి చదువుకోమని ప్రోత్సహించకపోతే, నా జీవితం ఎలా ఉండేదో ఊహించలేను”
అప్పటికి ఆరేళ్ళ వయసున్న ప్రేమావతి కె.ఎం. రెడ్డి ప్రోత్సాహంతో నంగమంగళం నుంచి బొమ్మసముద్రం వరకు రోజూ నడుచుకుంటూ వచ్చి స్కూల్ కొచ్చి చదువుకునే వారు. స్కూల్ కొచ్చిన ఆడపిల్లలికి కె.ఎం. రెడ్డి చదువు చెప్పడమే కాదు, బట్టలు సరిగా వేసుకోవాలని చెప్పేవారు. వేసుకున్న బట్టలు సరిగా లేకపోతే, సరిచేసేవారు. తాతగారి పుణ్యాన ప్రేమావతి గారి చదువు సాఫీగా సాగుతోంది. స్కూల్ ఫైనల్ కు వచ్చారు. స్కూల్ ఫైనల్ తప్పితే పెళ్ళి చేసి అత్తారింటికి పంపించేస్తామన్నారు అమ్మానాన్న. ఆ భయంతో పుట్టిన పట్టుదలతో చదివి స్కూల్ ఫైనల్ పాసయ్యారు.
రాజేశ్వరిమూర్తి ప్రోత్సాహం-జి.ఎన్.రెడ్డి మార్గదర్శనం
ఆంధ్రరాష్ట్రంలో తొలి మహిళా కళాశాలగా తిరుపతిలో శ్రీపద్మావతి మహిళా కళాశాలను 1952లో టీటీడీ నెలకొల్పింది. పదహారేళ్ళ వయసులో తిరుపతి వచ్చిన ప్రేమావతి1958లో పీయూసీలో చేరారు. ఆ కళాశాల రూపశిల్పి, ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరి మూర్తి ప్రేమావతిని దగ్గరకు తీసి, బాగా ప్రోత్సహించారు. డిగ్రీ అయిపోయాక, ఎస్వీయూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి జి.ఎన్.రెడ్డి ప్రేమావతిని ఎం.ఏ. లో చేరమని ప్రోత్సహించి, చివరి వరకు వెన్నుదన్నుగా నిలిచారు.
ఎస్పీడబ్ల్యూ కాలేజీలో లెక్చరర్ పోస్టులు పడ్డాయి. “మా కాలేజీలో చదువుకున్న ఆడపిల్లలికి మాకాలేజీలో ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎలాగండి! ఉద్యోగాల కోసం ఆడపిల్లలు ఎక్కడికి వెళతారు!?” అంటూ నాటి టీటీడీ చైర్మన్ అన్నారావుతో రాజేశ్వరి మూర్తి పోట్లాడి మరీ ప్రేమావతి లాంటి తొలితరం విద్యార్థినులకు లెక్చరర్ ఉద్యోగాలు వచ్చేలా చేశారు. తెలుగు లెక్చర్ గా 1965లో చేరిన ప్రేమావతి వద్ద వేలాది మంది చదువుకున్నారు. రాజేశ్వరి మూర్తి స్ఫూర్తితో ప్రేమావతికి కూడా ఎస్పీడబ్ల్యు కాలేజే జీవిత సర్వస్వమైపోయింది. లెక్చరర్ గా చేస్తూనే జి.ఎన్.రెడ్డి గారి పర్యవేక్షణలో ప్రేమావతి దాశరథి రంగాచార్య నవలలపై పరిశోధన చేసి, డాక్టరేట్ పొందారు.
ప్రేమావతి దగ్గర ఎంత మంది చదువుకున్నారో, ఎందరు ఎన్నెన్ని పదవులు అలంకరించారో లెక్కేలేదు. రచయిత్రి ఆచంట శారదాదేవి ప్రేమావతికి గురువు. చివరికి గురువు సరసనే కూర్చుని ఉద్యోగం చేశారు. ప్రేమావతి 2000 సంవత్సరంలో రీడర్ గా రిటైరయ్యారు.
కె.వి.రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదన రావు వంటి సాహితీ వేత్తలతో వారికి స్నేహముండేది. ప్రముఖ చరిత్ర కారులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ, వారి సతీమణి దివంగత డాక్టర్ లలిత కుటుంబంతో ప్రేమావతికి అర్ధ శతాబ్దం పైగా స్నేహ సంబంధాలు ఉన్నాయి. తిరుపతిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.రామిరెడ్డి ప్రేమావతికి వరసకు బావ అవుతారు. 'కారు మాత్రం కొనుక్కోకు. దాని వల్ల చాలా అవస్థలు ఉన్నాయి' అని రామిరెడ్డి సలహా ఇచ్చారు. 'బావా నువ్వెందుకు కారు కొనుక్కున్నావు' అని నన్ను అడుగుతావేమో, ఐఏఎస్ అని ఒక హెూదా ఉంది కదా, దాని కోసం తప్పడం లేదని అన్నారుట.
స్ఫూర్తి ప్రదాతలపై తరగని గౌరవం
జీవితంలో తాను నిలదొక్కుకోవడానికి, తానీ స్థాయికి ఎదగడానికి దోహదపడిన కె.ఎం. రెడ్డి, జి.ఎన్.రెడ్డి, రాజేశ్వరి మూర్తి పట్ల ప్రేమావతి చివరి వరకు గౌరవభావంతో ఉన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 3వ తేదీన కె.ఎం. రెడ్డిజయంతికి బొమ్మసముద్రం వెళ్ళి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వచ్చేవారు. అలాగే జి.ఎన్.రెడ్డిజయంతికి కూడా ఎస్వీయూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖకు వెళ్ళి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి వచ్చేవారు. అలాగే డిసెంబర్ 10వతేదీ రాజేశ్వరి మూర్తి జన్మదినానికి వారు ఎక్కడున్నా శుభాకాంక్షలు చెప్పేవారు.
గత ఏడాది రాజేశ్వరి మూర్తి 103వ జన్మదినానికి కూడా శుభాకాంక్షలు చెప్పారు. రాజేశ్వరి మూర్తితో ప్రేమావతి స్నేహం చాలా అపురూపమైంది. అమెరికాలో స్థిరపడిన రాజేశ్వరి మూర్తి తిరుపతి వచ్చిన సందర్భంగా వారిని ప్రేమావతే నాకు పరిచయం చేశారు. ఆలిండియా రేడియో కోసం రాజేశ్వరి మూర్తిని ఇంటర్వ్యూ చేశాను. అలాగే ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్ డాట్ కామ్’ న్యూస్ వెబ్ సైట్ కోసం కూడా వారిని ఇంటర్వ్యూ చేశాను. ప్రేమావతిని కొన్ని సాహిత్య సభల్లో చూడడమే తప్ప, వారితో నాకు పెద్దగా పరిచయం లేదు. వారితో నా పరిచయం చాలా అనూహ్యంగా జరిగింది.
నేను సాక్షిలో పనిచేస్తున్నప్పుడు, ఒక ఏడాదిపాటు ప్రతి బుధవారం సాహిత్య పేజీ నిర్వహించేవాణ్ణి. సాహిత్య పేజీ ప్రారంభించిన తొలి రోజు, 2009 జులై 11వ తేదీన 'తెలుగు వటవృక్షం' అన్న శీర్షికన జి.ఎన్.రెడ్డిగురించి రాశాను. ప్రేమావతి నా ఫోన్ నెంబర్ కనుక్కుని, నాకు ఫోన్ చేసి 'మాసార్ గురించి ఎంత బాగా రాశారు' అంటూ చాలా ఆనందపడిపోయారు. ఆ పరిచయం కుటుంబ స్నేహంగా మారి, చివరి వరకు కొనసాగింది. వారు అప్పుడప్పుడూ మా ఇంటికి వచ్చేవారు. మా అమ్మను 'అమ్మా' అని పిలుస్తూ, ఎంతో ఆప్యాయంగా మెలిగేవారు. రెండేళ్ళ క్రితం కన్ను మూసిన మా అమ్మకు అత్యంత ఆత్మీయమైన స్నేహితురాలిగా మిగిలిపోయారు. నలభై ఆరేళ్ళ తరువాత 2016లో తిరుపతిలో జరిగిన చిత్తూరు జిల్లా రచయితల మహాసభలో నా 'సాహితీ సౌగంధం' పుస్తకాన్ని ప్రేమావతి ఆవిష్కరించారు. గత కొంత కాలంగా తాను పనిచేసిన ఎస్పీడబ్ల్యు కాలేజిలో జరిగే కార్యక్రమాలకు తప్ప, ఇతర సాహిత్య సభలకు హాజరుకావడం మానుకున్నారు. కానీ, రెండేళ్ళ క్రితం నా 'తిరుమల దృశ్యకావ్యం' పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యారు.
ఎప్పుడు చూసినా ప్రేమావతి చాలా ఆరోగ్యంగా కనిపించేవారు. పొద్దున్నే వాకింగ్ చేసేవారు. పాతికేళ్ళ క్రితం పద్మావతి కాజేజీ నుంచి రిటైరైనా, కాలేజీకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నట్టుగానే నిత్యం తయారయ్యేవారు. అది తన గురువు జి.ఎన్.రెడ్డి స్ఫూర్తి అని చెప్పేవారు. చాలా ఆరోగ్యంగా కనిపించే ప్రేమావతి గత ఏడాది మేలో అనారోగ్యంతో స్విమ్స్ లో చేరాల్సి వచ్చింది. వెంటిలేటర్ పైనే చాలా రోజులు చికిత్సపొంది కోలుకున్నారు. ఇలాంటివి సర్వసాధారణంలే అనుకున్నాం.
గత ఏడాది మే 7వ తేదీ మళ్లీ స్విమ్స్ లో చారారు..స్విమ్స్ ఐసీయూలో వెంటిలేటర్ పైనే ఉన్నారు. అవయవాలన్నీ దెబ్బతిన్నాయి. చాలా మంది వచ్చి చూసివెళుతున్నారు. సాయంత్రం చీకటిపడే వేళ తెలిసిపోయింది ప్రేమావతి తుది శ్వాస విడిచారని. మర్నాడు ఉదయం ఇంటికి వెళ్ళే సరికి ఐస్ బాక్స్‌లో వారి పార్థివ దేహం కనిపించింది. నిద్రపోతున్నట్టే ఉంది. ఎంత మంది విద్యార్థులు, ఎంత మంది అధ్యాపకులు, ఎంత మంది పుర ప్రముఖులొచ్చారో! ఒంటరి మహిళైనా ఆమె సమూహం మధ్య ఎంత స్నేహశీలిగా జీవించారో! ధన్యజీవి ప్రేమావతి.
Next Story

