కొలువులకు రాచబాట అమీర్‌పేట్
x

కొలువులకు రాచబాట "అమీర్‌పేట్"

ఐటీ కెరీర్‌కు లాంచ్‌ప్యాడ్‌గా ఎలా మారింది?


తెలుగు రాష్ట్రాల్లో ఐటీ ఉద్యోగం అనగానే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చే పేరు అమీర్‌పేట్. ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి నుంచి ఇప్పటికే ఐటీ ఉద్యోగంలో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వరకు కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలంటే చాలా మంది మొదట గుర్తు చేసుకునేది ఈ ప్రాంతాన్నే. వేలాది మంది యువతకు ఐటీ కెరీర్‌కు తొలి అడుగు వేసే వేదికగా మారిన అమీర్‌పేట్, హైదరాబాద్ ఐటీ శిక్షణకు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

నేడు దేశవ్యాప్తంగా ఐటీ ట్రైనింగ్ హబ్‌గా పేరొందిన ఈ ప్రాంతం ఒకప్పుడు పూర్తిగా భిన్నంగా ఉండేది. ఒకప్పుడు దట్టమైన చెట్లు, చిన్నచిన్న చెరువులు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉన్న ప్రశాంత ప్రాంతమే అమీర్‌పేట్. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన జాగీర్దార్ అమీర్ అలీకి ఈ భూమిని బహుమతిగా ఇవ్వడంతో ఈ ప్రాంతానికి "అమీర్‌పేట్" అనే పేరు వచ్చింది. అమీర్ అలీ నిర్మించిన వేసవి రాజభవనం నేడు ప్రభుత్వ నేచర్ క్యూర్ హాస్పిటల్‌గా కొనసాగుతోంది. ఇక్కడే నిజామియా అబ్జర్వేటరీ కూడా ఉంది. భారతదేశంలో తొలి ఖగోళ పరిశోధనా కేంద్రాల్లో ఒకటిగా అది గుర్తింపు పొందింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల మధ్య కేంద్ర ప్రాంతంగా ఉండటం వల్ల నిజాం కాలం నుంచే అమీర్‌పేట్‌కు రవాణా పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడిందని హిస్టారిక‌ల్ సొసైటీ ఆఫ్ హైద‌రాబాద్ స‌భ్యుడు డాక్ట‌ర్ ఎం.జి.అక్బ‌ర్ తెలిపారు.

కాలక్రమంలో ఈ పచ్చని నివాస ప్రాంతం పూర్తిగా రూపు మార్చుకుంది. ముఖ్యంగా 1980ల చివరి దశలో కంప్యూటర్ విద్యపై ఆసక్తి పెరగడం, 1990లలో హైదరాబాద్‌లో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందడం అమీర్‌పేట్ భవిష్యత్తును మార్చేశాయి. ప్రారంభంలో కొన్ని చిన్న కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లతో మొదలైన ప్రయాణం, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు భారీగా ఏర్పడిన తర్వాత మరింత వేగం అందుకుంది.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలను తక్కువ సమయంలో నేర్పించే శిక్షణా కేంద్రాలు వరుసగా ప్రారంభమయ్యాయి. రెండు మూడు సంస్థలతో మొదలైన ఈ ప్రయాణం, నేడు వందలాది ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లు, వేలాది బ్యాచ్‌లు, లక్షలాది మంది విద్యార్థులతో ఒక భారీ ఐటీ లెర్నింగ్ ఎకోసిస్టమ్‌గా మారింది.

అయితే... ఈ ఎదుగుదలతో పాటు పోటీ కూడా అంతే వేగంగా పెరిగింది. ఒకప్పుడు MS Office, C, C++ వంటి కోర్సులతో ప్రారంభమైన శిక్షణ... తర్వాత Java, .NET, Testing, SAP దశను దాటి... ప్రస్తుతం Cloud Computing, DevOps, Data Science, Artificial Intelligence వంటి అత్యాధునిక టెక్నాలజీల వరకు విస్తరించింది. పరిశ్రమలో ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా... దానికి అనుగుణంగా కొత్త కోర్సులు, కొత్త ఫ్యాకల్టీ, కొత్త ల్యాబ్‌లు ఏర్పాటు చేయడం అమీర్‌పేట్ శిక్షణా సంస్థల ప్రత్యేకతగా మారిందని క్వాలిటీ థాట్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ ఫౌండ‌ర్ ఛైర్మ‌న్ ర‌మ‌ణ భూప‌తి చెప్పారు. ఇక్కడ సుమారు 2 వేల వరకు ఐటీ శిక్షణా సంస్థలు ఉండగా, ఏడాది పొడవునా లక్ష మందికి పైగా విద్యార్థులు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నట్లు అంచనా.

అమీర్‌పేట్‌లో అడుగుపెట్టగానే కనిపించే ప్రపంచం... ఐటీ ట్రైనింగ్. ప్రతి వీధిలో కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్లు, ప్రతి భవనంలో కొత్త టెక్నాలజీలకు సంబంధించిన క్లాసులు. జావా, పైథాన్, ఫుల్‌స్టాక్, టెస్టింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డెవ్‌ఆప్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ... ఇలా పరిశ్రమలో డిమాండ్ ఉన్న దాదాపు ప్రతి కోర్సు ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

అమీర్‌పేట్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది కేవలం కోర్సుల సంఖ్య కాదు. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే దీని బలం. చాలా కోర్సులు రెండు నుంచి ఆరు నెలల్లో పూర్తవుతాయి. కోర్సును బట్టి ఫీజులు కొన్ని వేల రూపాయల నుంచి ప్రారంభమై అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్‌లకు లక్ష రూపాయల వరకు ఉంటాయి. "క్లాస్‌రూమ్ ట్రైనింగ్‌తో పాటు లైవ్ ప్రాజెక్టులు, ల్యాబ్ ప్రాక్టీస్, రిజ్యూమ్ తయారీ, మాక్ ఇంటర్వ్యూలు, ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ వంటి సేవలను కూడా అనేక సంస్థలు అందిస్తున్నాయ‌ని" ఇక్క‌డ శిక్ష‌ణ పొందుతున్న‌ పుష్క‌ల్ యాద‌వ్ అనే యువ‌కుడు చెప్పారు.

అయితే... అమీర్‌పేట్‌లో కోర్సులో చేరితే ఉద్యోగం ఖాయం అవుతుందనే భావన మాత్రం సరైంది కాదు. శిక్షణా సంస్థలు ఇంటర్వ్యూలకు సిద్ధం చేసే వరకు మాత్రమే సహాయం చేస్తాయి. చివరకు ఉద్యోగం రావడం పూర్తిగా అభ్యర్థి నైపుణ్యం, ప్రాజెక్టుల అనుభవం, కోడింగ్ సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూలో చూపే ప్రతిభపై ఆధారపడి ఉంటుంది.

అందుకే ఇక్కడ శిక్షణ పొందుతున్న "చాలా మంది విద్యార్థులు రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు సాధన చేస్తుంటారు. క్లాస్‌లో నేర్చుకున్నది ల్యాబ్‌లో ప్రాక్టీస్ చేయడం, ఇంటికి వెళ్లాక మళ్లీ కోడింగ్ చేయడం, మాక్ ఇంటర్వ్యూలు రాయడం, ఇదే వారి దినచర్యగా మారుతుంది. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకునేవారికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని" సీనియ‌ర్ కౌన్సిల‌ర్ ప్రియాంక చెప్పారు.

అమీర్‌పేట్‌కు వచ్చే వారు హైదరాబాద్‌కే పరిమితం కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. ఫ్రెషర్స్, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువత, ఇప్పటికే ఐటీ రంగంలో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్, కొత్త టెక్నాలజీలు నేర్చుకుని కెరీర్‌లో ముందుకు వెళ్లాలనుకునే వారందరికీ అమీర్‌పేట్ ఒక కామన్ డెస్టినేషన్‌గా మారింది.

"చాలా మంది అమీర్‌పేట్, ఎస్‌.ఆర్‌.నగర్, యూసుఫ్‌గూడ, బేగంపేట్ పరిసర ప్రాంతాల్లోని హాస్టళ్లు, పీజీలు, షేర్డ్ రూముల్లో ఉంటూ కోర్సులు పూర్తి చేస్తారు. నెలకు సుమారు పది వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు జీవన వ్యయం అవుతుంది. ఉదయం క్లాసులు... మధ్యాహ్నం ల్యాబ్ ప్రాక్టీస్... సాయంత్రం ఇంటర్వ్యూ ప్రిపరేషన్... రాత్రి అసైన్‌మెంట్లు, ఆన్‌లైన్ లెర్నింగ్. ఉద్యోగం దక్కే వరకు ఇదే చాలా మంది విద్యార్థుల జీవనశైలిగా మారిపోతుంద‌ని" ఇక్క‌డ శిక్ష‌ణ పొందుతున్న యువ‌కుడు న‌వ తేజ చెప్పారు.

ప్రస్తుతం అమీర్‌పేట్‌లోని శిక్షణా సంస్థల్లో ప్రతి సంవత్సరం సుమారు లక్ష మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరుతున్నారు. ఫ్రెషర్స్ మాత్రమే కాదు... ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న ఐటీ నిపుణులు కూడా కొత్త టెక్నాలజీల్లో నైపుణ్యం పెంచుకునేందుకు ఇక్కడికే వస్తున్నారు. ఐటీ రంగంలో ప్రతి కొద్ది నెలలకోసారి కొత్త టెక్నాలజీలు రావడంతో... అమీర్‌పేట్‌లోని సంస్థలు కూడా తమ కోర్సులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిరంతరం నవీకరిస్తూ విద్యార్థులను ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధం చేస్తున్నాయి.

గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోతలు, లేఆఫ్స్ వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయినప్పటికీ... అమీర్‌పేట్‌లో శిక్షణ పొందేందుకు వచ్చే విద్యార్థుల సంఖ్యలో మాత్రం పెద్దగా తగ్గుదల కనిపించడం లేదని శిక్షణా సంస్థలు చెబుతున్నాయి.

దీనికి ప్రధాన కారణం, టెక్నాలజీ మార్పు. పాత నైపుణ్యాలకు డిమాండ్ తగ్గుతున్నా, కొత్త టెక్నాలజీల్లో అవకాశాలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డెవ్‌ఆప్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి ఇప్పటికీ మంచి అవకాశాలు లభిస్తున్నాయి.

"ఉద్యోగం కోల్పోయిన వారిలో చాలామంది కూడా కొత్త స్కిల్స్ నేర్చుకుని మళ్లీ ఉద్యోగ మార్కెట్‌లోకి రావడానికి అమీర్‌పేట్‌ను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ఫ్రెషర్స్ మాత్రం మొదటి ఉద్యోగం కోసం ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారని" ర‌మ‌ణ భూప‌తి చెప్పారు.

ఇక విద్యార్థుల ఆలోచన కూడా మారింది. ఒకప్పుడు ఐటీ ఉద్యోగమే లక్ష్యంగా శిక్షణ తీసుకునేవారు. ఇప్పుడు మాత్రం విదేశాల్లో కెరీర్, రిమోట్ జాబ్స్, ఫ్రీలాన్సింగ్, స్టార్టప్‌లు వంటి అవకాశాలను కూడా దృష్టిలో పెట్టుకుని కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటున్నారు. "టెక్నాలజీ మారొచ్చు... కానీ నేర్చుకునే సామర్థ్యం ఉన్నవారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి" అనే నమ్మకమే వారిని ముందుకు నడిపిస్తోందని ఇక్క‌డ శిక్ష‌ణ పొందుతున్న‌ కృష్ణ‌ప్రియ చెప్పారు.

అయితే... శిక్షణా సంస్థలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. అవి ఉద్యోగానికి హామీ ఇవ్వవు. కానీ ఉద్యోగానికి అవసరమైన సిద్ధత కల్పిస్తాయి. రిజ్యూమ్ తయారీ, కమ్యూనికేషన్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూలు, ఆఫ్‌క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్, కంపెనీ రిఫరల్స్ వంటి సేవల ద్వారా అభ్యర్థులను అవకాశాల వరకు తీసుకెళ్తాయి.

సాధారణంగా ఫ్రెషర్స్‌కు సంవత్సరానికి మూడు నుంచి ఆరు లక్షల రూపాయల వేతనంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని శిక్షణా రంగం చెబుతోంది. అయితే మెరుగైన నైపుణ్యాలు, బలమైన ప్రాజెక్టులు, మంచి కమ్యూనికేషన్ ఉన్న అభ్యర్థులు ఇంకా ఎక్కువ ప్యాకేజీలతో కూడా ఎంపికవుతున్నారు. చివరకు ఉద్యోగాన్ని నిర్ణయించేది సర్టిఫికెట్ కాదు, అభ్యర్థి ప్రతిభేనని సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

అమీర్‌పేట్ ప్రభావం కేవలం ఐటీ శిక్షణకే పరిమితం కాలేదు. వేలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడంతో మొత్తం ప్రాంతంలో ఒక ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది.సాధారణ నివాస భవనాలు హాస్టళ్లు, పీజీలుగా మారాయి. మెస్‌లు, టిఫిన్ సెంటర్లు, కేఫేలు, స్టేషనరీ షాపులు, జిరాక్స్ సెంటర్లు, కంప్యూటర్ సర్వీస్ సెంటర్లు, ల్యాప్‌టాప్ రిపేర్ షాపులు, కో-వర్కింగ్ స్పేస్‌లు, డిజిటల్ సేవలు వేగంగా విస్తరించాయి. ఒక విద్యార్థికి అవసరమైన దాదాపు అన్ని సేవలు కొన్ని వందల మీటర్ల పరిధిలోనే లభించేలా అమీర్‌పేట్ అభివృద్ధి చెందింది.

స్థానిక వ్యాపారులకు కూడా ఇది పెద్ద అవకాశంగా మారింది. అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది. కమర్షియల్ భవనాల విలువలు పెరిగాయి. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించింది. అయితే ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్యలు, జనసాంద్రత, శబ్ద కాలుష్యం వంటి సవాళ్లు కూడా ఇదే సమయంలో పెరిగాయని స్థానిక వ్యాపార‌స్థుడు పి.ల‌క్ష్మీకాంత్ చెప్పారు.అమీర్‌పేట్ విజయగాథలో ట్రైనింగ్ సంస్థలతో పాటు ఈ మొత్తం సపోర్ట్ ఎకోసిస్టమ్ కూడా కీలక పాత్ర పోషించింది.

అందుకే నేడు అమీర్‌పేట్‌ను చాలామంది కేవలం కోచింగ్ సెంటర్ల సముదాయంగా కాకుండా... విద్య, ఉపాధి, వ్యాపారం కలిసి అభివృద్ధి చెందిన ప్రత్యేక స్కిల్ ఎకానమీగా అభివర్ణిస్తున్నారు.హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు కొత్త అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు అమీర్‌పేట్ శిక్షణా సంస్థలపై కూడా దృష్టి పెడుతుంటాయి. కారణం, ఇక్కడి విద్యార్థులు ఉద్యోగానికి అవసరమైన నిర్దిష్ట టెక్నాలజీల్లో ప్రత్యేక శిక్షణ పొందడం.

"జావా, పైథాన్, టెస్టింగ్, ఫుల్‌స్టాక్, క్లౌడ్, డెవ్‌ఆప్స్ వంటి కోర్సుల్లో నెలల తరబడి ప్రాక్టీస్ చేయడం వల్ల వారికి కోడింగ్, టూల్స్, ప్రాజెక్టులు, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విధానాలపై ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. దీంతో ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయానికి వారు పరిశ్రమ అవసరాలకు కొంతవరకు సిద్ధంగా ఉంటారని" ఐటీ రంగ నిపుణులు Adeen Solutions CEO ఇర్ఫాన్ అజీజ్ చెప్పారు.

అయితే... ప్రస్తుతం కంపెనీలు కేవలం డిగ్రీని మాత్రమే చూసి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, కోడింగ్ నైపుణ్యం, కొత్త టెక్నాలజీలను వేగంగా నేర్చుకునే ఆసక్తి, టీమ్‌తో కలిసి పనిచేసే తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమీర్‌పేట్ వంటి శిక్షణా కేంద్రాలు విద్యార్థుల్లో ప్రాక్టికల్ స్కిల్స్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని హెచ్‌ఆర్ నిపుణులు చెబుతున్నారు.

అయితే వారు మరో విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. శిక్షణ అనేది కెరీర్‌కు ఒక బలమైన పునాది మాత్రమే. నిరంతరం నేర్చుకునే తత్వం, కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా మారే సామర్థ్యమే దీర్ఘకాల విజయాన్ని నిర్ణయిస్తుంది.

క్యాంపస్ ప్లేస్‌మెంట్... అమీర్‌పేట్ ప్లేస్‌మెంట్... తేడా ఏంటి?

ఇంజినీరింగ్ కళాశాలల్లో జరిగే క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో కంపెనీలు ఒకేసారి వందలాది మంది విద్యార్థులను ఎంపిక చేస్తాయి. అక్కడ కళాశాల ప్రతిష్ఠ, అకడమిక్ రికార్డు, క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తాయి.

అమీర్‌పేట్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి అభ్యర్థి తన వ్యక్తిగత నైపుణ్యాలతోనే పోటీ పడాలి. ఏ కాలేజీలో చదివారన్నదానికంటే... ఏ స్కిల్ నేర్చుకున్నారు? ఎంత ప్రాక్టీస్ చేశారు? ఎలాంటి ప్రాజెక్టులు చేశారు? ఇంటర్వ్యూలో ఎలా రాణించారు? అన్నదే ప్రధానంగా మారుతుంది.

అందుకే అమీర్‌పేట్‌లోని అనేక శిక్షణా సంస్థలు సబ్జెక్టు బోధనకే పరిమితం కావడం లేదు. రిజ్యూమ్ తయారీ, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ నిర్మాణం, గిట్‌హబ్ ప్రాజెక్టులు, మాక్ ఇంటర్వ్యూలు, ఆప్టిట్యూడ్ ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలపై కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు ఐటీ కంపెనీల హెచ్‌ఆర్‌లు, టెక్నికల్ మేనేజర్లు, పరిశ్రమ నిపుణులతో ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తూ విద్యార్థులను వాస్తవ ఉద్యోగ ప్రపంచానికి దగ్గర చేస్తున్నాయి.

ఇంజినీరింగ్ కళాశాల అయినా, అమీర్‌పేట్ శిక్షణా సంస్థ అయినా, కంపెనీల దృష్టిలో ఒకే విషయం ముఖ్యం. స్కిల్. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా నేర్చుకున్న నైపుణ్యాలు, ప్రాక్టికల్ ప్రాజెక్టులు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, మంచి కమ్యూనికేషన్, నిరంతరం నేర్చుకునే తత్వం ఉన్నవారికే అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి.

ఒకప్పుడు నిజాం కాలంలో వేసవి విడిది ప్రాంతంగా పేరొందిన అమీర్‌పేట్, కాలక్రమంలో వేలాది మంది యువత కలలకు చిరునామాగా మారింది. రెండు మూడు కంప్యూటర్ శిక్షణా కేంద్రాలతో మొదలైన ప్రయాణం, నేడు దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన ఐటీ ట్రైనింగ్ హబ్‌లలో ఒకటిగా ఎదిగింది.

ప్రతి ఏడాది వేలాది మంది యువత ఇక్కడికి ఒకే ఆశతో వస్తారు. ఒక మంచి ఉద్యోగం. ఒక మంచి జీతం. ఒక మంచి భవిష్యత్తు. కొందరికి ఆ కల వెంటనే నెరవేరుతుంది. మరికొందరికి కొంత సమయం పడుతుంది. కానీ ఒక విషయం మాత్రం మారదు. అమీర్‌పేట్ అవకాశాల తలుపు తెరుస్తుంది. ఆ తలుపు దాటి ముందుకు వెళ్లేది మాత్రం అభ్యర్థి నైపుణ్యం, కృషి, పట్టుదలే.అందుకే... అమీర్‌పేట్ కేవలం ఒక ప్రాంతం కాదు. అది లక్షలాది యువత ఆశలు, వేలాది విజయగాథలు, నిరంతరం మారుతున్న టెక్నాలజీ ప్రపంచానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగుతున్న ఒక ప్రత్యేక స్కిల్ ఎకోసిస్టమ్. టెక్నాలజీలు మారొచ్చు. ట్రెండ్లు మారొచ్చు. కానీ నేర్చుకోవాలనే తపన ఉన్నంత కాలం, ఐటీ కెరీర్‌కు అమీర్‌పేట్ ఒక లాంచ్‌ప్యాడ్‌గానే కొనసాగుతుంది.

Read More
Next Story