
అమ్మ అన్నీ మర్చిపోతోంది!
‘మాతృ దినోత్సవం’ ప్రత్యేక కవిత: డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
దేని కోసమో ఫ్రిజ్ దగ్గరికి వెళుతుంది
ఎందుకు వెళ్లిందో మర్చిపోతుంది
ఎంత గుర్తు తెచ్చుకుందామన్నా
గుర్తు రాదే!
తల కొట్టుకుంటూ వంటిటికి వెళితే
అక్కడ చాకో, కత్తిపీటో చూసాక
సంబంధ బాంధవ్యం కూరగాయల కోసమని
గుర్తు తెస్తుంది
స్టవ్ మీద పెట్టిన పాల గిన్నెలు
ఎన్ని మాడి మసయి పనికిరాకుండా పోయాయో లెక్కే లేదు
శుభాకార్యాలకు వెళ్ళినప్పుడు అమ్మ
బంధువులను గుర్తు పట్టలేకపోతోంది
ఎన్ని విధాల గుర్తులు చెప్పినా
ఎవరో తెలియట్లేదు అనేస్తోంది
సమూహాల్లో ఒంటరిగా మిగిలిపోతోంది
నిన్నటి జ్ఞాపకాలు నేడు లేవు
మొన్న చదివిన పుస్తకం లో ఒక్క వాక్యమైనా
దగ్గరికి రాదు
ఒకనాటి తీపి గురుతులు
చేదు అనుభవాలు
బాల్య స్నేహాలు
శున్యం లో వేలాడుతున్నాయి
ఒక్కోసారి మధ్యాహ్నం నిద్ర లేచి, కోయిల పాట విని
అప్పుడే తెల్లారిపోయిందని భ్రమ లో పడిపోతోంది
పజిల్స్ చేయి నానమ్మా
జ్ఞాపక శక్తి పెరుగుతుంది మనవడి సలహా!
‘అంకెలు రివర్స్ లో చెప్పండి అత్తయ్యా’ కోడలి సూచన!
‘ఏదో ఒకటి చేసి గుర్తు పెట్టుకోమ్మా ‘నిస్సహాయంగా కొడుకు!
‘ధ్యానం చెయ్యి వదినా’ జాలిగా వియ్యపురాలు!
ఏదీ గుర్తుండట్లేదు అని గుర్తుండటం
అమ్మకు పెద్ద విషాదం!
కొడుకు మనవడు
మతిమరపు కారణాలు గూగుల్ సెర్చ్ చేస్తున్నారు
అనేకానేక కారణాలలో నిద్రలేమి ఒకటని
పరిశోధన లో తేల్చారు
బాగా నిద్ర పోమ్మా అన్నాడు కొడుకు ఆశ గా!
అసలు మనసారా, కరువుతీరా
నిద్ర పోయిందెప్పుడు!
తెల్లవారాక ఏం వండాలి?
ఎవరెవరికి బాక్సుల్లో ఏమేం పెట్టాలి? సమయానికి అందివ్వగలనా?
తను తయారయి కాలేజీకి వెళ్ళగలనా?
ఒక్క నిముషం ఆలస్యం అయినా
ప్రిన్సిపాల్ కొరకొర చూపులు!
పట్టిన కొంచెం నిద్రను చెరిపేస్తూ వంటింటి కలలు!
కాలేజీ కలలు!
మూత పడటం మరచిన రెప్పలు!
ఇప్పుడు విరామం దొరికినా మొరాయిస్తున్నాయి
అమ్మ అన్నీ మర్చిపోతోంది
పిల్లలు దిగులు పడుతున్నారు
అమ్మ ఆహ్లాదం కోసం ఏమైనా చేయాలని
ఆరాట పడుతున్నారు
వాళ్ళ ఉరుకుల పరుగుల జీవన పోరాటం లో
అమ్మ అన్నీ మర్చిపోతోంది
అని నిట్టూర్చటమే చేస్తున్నారు!
-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
(డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గురజాడ రచనలపై పరిశోధన చేసారు. 'చెంగల్వ పూలు 'అనే కథా సంపుటాన్ని, 'గురజాడ అప్పారావు ', జాషువా జీవితం --సాహిత్యం ', అనే పుస్తకాలను ప్రచురించారు. ప్రస్తుతం సాహిత్య వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, కథలు, కవితలు వివిధ పత్రికలలో రాస్తున్నారు.)
Next Story

