
అమ్మ ఒక సజీవ బాడీ డోనర్!
గీతాంజలి ‘ఇల్లోక రాజ్యాంగం’ -2
రిటైర్ అయిన నాన్న
కళ్ళు దానం చేయాలన్న గొప్ప నిర్ణయం తీసుకొని
కాగితాల మీద సంతకాలు చేశాడు!
నాన్న ఇప్పుడు కాబోయే గొప్ప ఐ డోనర్!
కళ్ళ దాత!
షాలువలు,సన్మానాలు పూల దండలు,
ఆహాలు, ఓహోలు!
నాన్న ఇప్పుడో ఆదర్శ అవయవ దాత!
***
కానీ అమ్మ సంగతి ఏంటి మరి?
కాస్త అమ్మ వైపు చూస్తారా? ఇటు చూడండి!
అమ్మ ఒక్క ఐ డోనర్ మాత్రమే కాదు!
మొత్తం సజీవ బాడీ డోనర్ కూడా!
అమ్మ చనిపోలేదు!
కానీ
బతికుండగానే
రోజూ ఒక్కో అవయవాన్ని ముక్కలు,ముక్కలుగా
ఇంటి కోసం దానం చేస్తూ పోయింది!
మెల్ల మెల్లగా చనిపోతూ వచ్చింది!
ఆమె అలా దానం చేస్తున్న సంగతి
ఆమెకే కాదు ఎవరికీ తెలీదు!
రోజూ ఇల్లు రక్షిస్తున్నట్లే నటిస్తూ,
కసాయిలాగా
ఆమెలోని ఏదో ఒక భాగాన్ని కోస్తూ పోవడం
పాపం ఆ పిచ్చి తల్లికి తెలీలేదు!
***
అందరికీ దారి దీపమై ఆ
మె కళ్లను మసకబార్చుకుంది!
ఇంటిల్లి పాదికీ సేవలు అందించిన చేతులు
ఆమెకిప్పుడీ వృద్ధాప్యంలో లేవు!
బలహీనంగా వణుకుతున్న పుల్లలే మిగిలాయి!
పరుగులు పెడుతూ అరిగ్గొట్టుకున్న మోకాళ్ళు
అయినవాళ్ల విసుగుల మధ్య
నిస్సహాయంగా నొప్పితో ముడుచుకున్నాయి!
***
అందరి కడుపులు నింపి
వేళ తప్పి తిన్నాక
ఆమె పేగులు ఆసిడ్ మంటలతో
పుండ్లై చిల్లులు పడి పోయాయి!
***
పిల్లల కోసం గాభరాగా
కొట్టుకుని కొట్టుకునీ ఆమె గుండె
లయతప్పి బలహీన పడిపోయింది!
అమ్మ హృదయం ఎప్పుడో
ఇంటి కోసం పరాధీనమై పోయింది!
ప్రేమ అందక స్టెంట్లు నింపుకుని
ప్రాణం నిలుపుకుంటుంది!
***
అదిగో చూడండి!
భార్య కిడ్నీ దానంగా పుచ్చుకుని
బతికిపోయిన భర్త ఒంటి కిడ్నీ తో
బలహీనమైన ఆమె త్యాగాన్ని చూసీ
చూడనట్లు మొఖం చాటేస్తున్నాడు!
***
పిల్లలని కనీ కనలేక ఆమె
గర్భసంచి కోతలతో గాట్లతో చిద్రమైపోయింది!
చాలా సార్లు, చాలామంది అమ్మలు
రోగ గ్రస్థమైనా, కాకాక పోయినా,
గర్భసంచులను కత్తెర కోరలకి దానం ఇచ్చేసారు.
కిలోల కొద్దీ గర్భ సంచులు
హాస్పిటళ్ళ రాకాసి నోళ్లకు దానంగా వెళ్ళిపోయాయి!
***
ఇక అమ్మల రొమ్ములు
కేన్సర్ పాలబడి నరికివేయబడ్డాయి!
పాలిచ్చి పెంచిన రొమ్ములు
పెరిగిన పిల్లలు వదిలి వెళ్ళాక
ఇప్పుడు ఎండుటాకుల్లా వడలి పోయాయి!
నాన్నల అసంతృప్తులకి వెరిసి సిలికాన్ ద్రవాన్ని
నింపుకున్న అమ్మల రొమ్ములు ఎప్పుడో
స్వంత రూపం కోల్పోయి దానం చేయబడ్డాయి!
***
ఇటు రా!
ఎంత సేపూ భర్త ఆలోచనలతో,
ఆజ్ఞలతో నిండిపోయి,
స్వంత ఆలోచనలు మరిచిపోయి
తన మెదడుని మొగుడికి,ఇంటికి దానం చేసిన,
మెదడు కోల్పోయి అయోమయమై,
మరుపు కోల్పోయిన అమ్మలు,అమ్మమ్మలు,
నాయనమ్మలని, ముత్తవ్వలని గుర్తు పట్టోసారి!
***
కళ్ళు ఆమె చూపులని చూడవు!
చెవులు ఆమె మాటలని వినవు!
నోరు ఆమె మాటల్ని పలకదు!
మెదడు ఆమె నిద్రని పోదు!
కనీసం ఆమెవైన కలల్నీ కనదు!
ఆమె ముఖాన్ని కోల్పోయి బతుకుతున్నది!
***
ఆ అమ్మలను చూడోసారి!
భర్తల కోరికల దాహంలో
కాపురాలు నిలబెట్టుకోవడం కోసం
అవయవాల కొలతలనే కాట్లతో,
కుట్లతో మార్చుకోవడానికి,
పాడేనెక్కే శవాల్లాగా
ఆపరేషన్ టేబుళ్ళు ఎక్కి దిగుతున్న
అమ్మల్ని చూడు రా ఇటోసారి!
***
ఒక్క కళ్ళేనా?
అమ్మలు తమ ఆపాదమస్తకాన్ని,
సమస్త దేహాన్ని,
కనిపించీ కనిపించని సజీవ అవయవ దానాలని
చనిపోక ముందే నిత్యం చేస్తూనే ఉన్నారు!
నువ్వేం చేసావు మాకోసం అని
కుటుంబం వెక్కిరింపుల మధ్య
ఆమె తనది కాని ఖాళీ దేహాన్ని
తెల్లబోయి ఖంగారుగా తడుముకుంటున్నది!
***
సమస్త అవయవాల దానం
ఎప్పుడు చేసేసిందో తెలియదు!
చూస్తూ చూస్తూండగానే
శరీరమంతా గుల్ల చేసుకొని
ఖాళీ దేహంతో మిగిలిపోయింది!
ఇప్పుడిక ఆమె అవయవానికొక్కటిగా
పీల్చుకుని పెరిగిపోయిన పిల్లల్ని
కాసింత ప్రేమ బిక్ష వేయమని
శూన్య పాత్రతో నిలబడి దీనంగా అర్థిస్తూ ఉంది!
***
ఆమె అవయవాలన్నీ
గదికొక్కటిగా స్వాహా చేసిన ఇల్లు కూడా
తనని ఖాళీ చేసిన
మనుషుల కోసం నిరీక్షిస్తున్నది!
చివరికి మిగిల్చుకున్న దేహంతో
ఈకలు పీకేసిన గువ్వ పిట్టలా
ఒరిగిపోయిన ఆమెది
మల్టి ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాడు డాక్టర్!
కానీ ఎక్కడ తాను ఫెయిల్
అయిందో ఆమెకే తెలుసు!
***
రండి!
దేహాల్లో అవయవాలన్నీ
భద్రంగా ఉన్న అమ్మల్ని
దివిటీ పెట్టి మరీ ఇళ్లల్లో వెతుకుదాము !
వాళ్ళు తీసుకున్న అవయవాలని
వాళ్ళకి తిరిగి ఇచ్చేయమని
భర్తలను అడుగుదాం రండి!
ఈ లోకంలో
స్త్రీలందరినీ అమ్మల్నీ, భార్యల్నీ చేసి
మాతృత్వ,పాతివ్రత్యపు మాంత్రిక తీర్థాలు
వాళ్ళ దోసిళ్లలో నింపి, మాయచేసి
సంసారపు బాధ్యతల మధువును తాపి
మత్తులో ముంచి
ఆ స్త్రీల మనోదేహాలని
బలవంతపు దానంగా దోచుకున్న మనువు ఏలే,
ఆ ఇళ్లు చేసే రాజకీయాలను ప్రశ్నిద్దాం రండి!
ఆమెకి కూడా ఒక వెచ్చని శాలువా కప్పి
ఇంటి బయటకి పంపుదాం రండి!
Next Story

