ఆమె అమృతాంజని!
x

ఆమె అమృతాంజని!

గీతాజంలి ‘ఇల్లొక రాజ్యాంగం’ కవితల సీరీస్ ప్రారంభం


పచ్చి గంధపు సుగంధంలా

తోటకి మల్లె,గులాబీల పరిమళంలా

అదిగో ఆమెలోంచి

ఆ ఇంటి ఇల్లాలి దేహ, చర్మాలనుంచి

అమృతాంజనం వాసన గుబాళిస్తుంది!

***

అర్థరాత్రి దిండు,దుప్పటి రెండూ

ఆమె నించి అమృతాంజనాన్ని పీల్చుకుంటాయి!

బహుశా కొన్ని కన్నీళ్లని, ఆమె ఒంటి నొప్పులను కూడా!

***

ఇష్టం లేని భర్తతో బలవంతపు శృంగారమప్పుడు

తరువాతా,

భరించలేక బిగించిన తల కండరాల

నొప్పిని తగ్గించుకోవడానికి

ఆమె మెరిసిపోయే చిన్ని గాజు సీసాలో

పలుచని పసుపు రంగులో ఉండే

మెత్తటి వెన్నలాంటి అమృతాంజనాన్ని

చూపుడువేలితో జతనంగా తీసుకుని నుదుటికి

కనుబొమ్మల మీద ఆప్యాయంగా రాసుకుంటుంది

***

నొప్పి ఆమె రక్తనాళాల్లో ప్రవహించే నిత్య నది!

ఒక్కోసారి నొప్పి సముద్రం కూడా అయిపోతుంది!

ఆమె వానిటీ బ్యాగుల్లో,దిండ్లకింద,

అలమరలో, చీర మడతలకింద

ఆమె జాకెట్లో రొమ్ముల మధ్య

వెచ్చని తల్లి చేతి స్పర్శలా

సొమ్ములేమైనా ఉన్నాయనుకుంటారా?

ఉహూ కానే కాదు!

నిత్యం అమృతాంజనం డబ్బానే ఉంటుంది!

అమృతాంజనం ఆమె అత్తింటి ఆభరణం!

పుట్టిల్లు చేయించిన పుస్తె!

***

ఇల్లంతా,ప్రతీ గదీ ఆమెకి నొప్పినే ఇస్తుంది!

ఏ గదిలోంచి పారిపోయినా

వాకిలి నుంచి పెరటి దాకా

నొప్పి ఆమెని వెంబడిస్తుంది!

దివా రాత్రుళ్ల చాకిరీ తరువాత

ఆమె అత్యంత ప్రియంగా తన రాత్రుళ్ళలోకి,

తన చర్మంలో కి,తన ఊపిరితిత్తుల్లోకి

గాఢమైన అమృతాంజనాన్నీ

పంపిస్తుంది కన్నీళ్ళతో సహా!

అమృతాంజనం డబ్బాను

వేళ్ళతో అరచేతులమధ్య పెట్టుకుని

మనిషిని నిమిరినట్లే నిమురుతుంది!

నువ్వున్నావు కాబట్టే అంటూ

దానితో ముచ్చట్లాడుతుంది.

ప్రేమగా హృదయానికి హత్తుకుంటుంది!

వెయ్యేనుగుల బలాన్ని

అమ్మ ఇచ్చే భద్రతను ఇస్తుంది

మరి ఆ చిన్ని డబ్బా స్పర్శ!

చాలా సార్లు

అమృతాంజనం

ఆమెకి ఒక ఆక్సిజన్ సిలిండర్!

***

జైలు లాంటి ఇంటినీ,పీడించే అత్త మామలనీ,

భర్తా,పిల్లలతో పాటు అమృతాంజనాన్నీ

కానుకగా ఇచ్చినందుకు

ఆమె నిద్రపోయే ముందూ,నిద్రలేచాకా

దేవుడికి శతకోటి వందనాలు చెప్పుకుంటుంది!

మంగళ సూత్రాల బదులుగా

ఆ ఇల్లాలు అమృతాంజనం సీసాని'

భక్తిగా కళ్ళకి అద్దుకుంటుంది.

ఆమెకి అమృతాంజనం

సాగర మథనం నుంచి పుట్టిన అమృతం!

***

రాత్రి పడుకునే ముందు

వంటింటి వాసనని తన వంటి నుంచి

పోగొట్టే అమృతాంజనం అంటే ఆమెకి చాలా ఇష్టం!

వేసవి మల్లెలు, గులాబీలు

చామంతులు సంపెంగలు కూడా

ఆమె జడలో కుదురుకొని

ఆమె దేహం మీది అమృతాంజనంతో

కలిసిపోయి కొత్త రకపు జమిలి సువాసన వేస్తాయి!

పూలకి కూడా ఏం నొప్పులున్నాయో మరి?

***

రోజూ రాత్రి , నొప్పెట్టే చేతి వేళ్ల కణుపులకి,

పరిగెత్తి అరిగిపోయిన మోకాళ్ళకి

నొప్పితో పుండైన నుదుటికి,పట్టేసిన నడుముకి

ఆమె అమృతాంజనం రాస్తూనే ఉంటుంది!

ఆమె అప్పుడు ఇంట్లో తిరిగే

పచ్చని అమృతాంజనం చెట్టులా

కర్పూర,లవంగ నూనె వాసనలతో

ఘుమ ఘుమ లాడుతూ ఉంటుంది!

***

డైరీలో రహస్యంగా కర్పూరం,పుదీనా,

గంధపు ర పత్రతైలం, యవని సత్వ

నీలగిరి తైలం,లవంగ,సరళ తైలం అంటూ

అమృతాంజనంలోని ఫార్ములాలు రాసుకుంటూనే ఉండేది!

నిద్రలో లలితా సహస్ర నామాలలాగా కలవరిస్తూనే ఉండేది!

వంటల రెసిపీ అనుకుని తేలిగ్గా నవ్వు కొనేవాడు ఆమె భర్త!

ఆమె గమనిస్తుందని తెలిసినా

ఆమె ప్రాణ సమానమైన

అమృతాంజనం డబ్బాలని నిర్లక్ష్యంగా

చెత్త బుట్టలో పడేస్తుండేవాడు!

***

అలా అనేక కోట్ల ఆమెలు

కోటాను కోట్ల కొద్దీ అమృతాంజనం

డబ్బాలుగా యుగాలు గడిచిపోయాయి!

***

ఒకానొక రోజు,

నొప్పీ,అమృతాంజనమూ రెండూ కలిసి

ఆమెని కౌగలించుకుని నిద్రపుచ్చుతున్న రాత్రి,

"చూడూ నీ నుంచి, అయితే వంటింటి వాసన,

లేదా నీ ఒంటి వాసన,

అంతగా కాకపోతే మల్లె గులాబీల సుగంధం రావాలి!

అంతే తప్పితే,అమృతాంజనం వాసన ఏంటి?

మూడ్ రావాలా వద్దా"? అని చిరాగ్గా

ఆమె భర్త ఇంట్లోకి ,పడకగదిలోకి,

ఆమె వంటి మీదికి

అమృతాంజనాన్ని నిషేధించాడు!

ఆమెకి ఎన్నిటినో బహిష్కరించినట్లుగా!

ఆమె అతగాడి వైపు వింతగా చూస్తూ నవ్వింది!

***

అమృతాంజనం ఫార్ములా అవుపోశన పట్టిన ఆమె

పోపు డబ్బాల పక్కనే

వంటింట్లోనే తయారు చేసుకున్న

రూపం మారిన అమృతాంజనం డబ్బా

అమ్మలా నవ్వడం

అతనికెలా కనిపిస్తుంది?

***

అప్పటికే ఆమె అమృతాంజనిగా

మారిపోయిందన్న విషయం ఆమె భర్తకి తెలీదు!


(గీతాంజలి ‘ఫెడరల్ తెలంగాణ’ లో అచ్చయిన 41 ఇల్లు కవితలను ‘ఇల్లొక రాజకీయం’ శీర్షికన ఒక సంకలనం తీసుకువచ్చారు. ఇప్పుడు రెండవ భాగంగా ‘ఇల్లోక రాజ్యాంగం’ అనే శీర్షికన మరిన్ని ఇంటి కవితలతో వారం వారం మన ముందుకు వస్తున్నారు)

Read More
Next Story