అర్రాసు: రాజీ కన్నా కథల సమీక్ష
x

అర్రాసు: రాజీ కన్నా కథల సమీక్ష

వర్తమాన తెలంగాణా సాహిత్యానికి కొత్త దర్వాజ రాజీ కన్నా!


చిక్కని సాయంత్రం పూట ఎంతకీ వొడవని వర్షంలో,బరువైన, తేలికైన, సన్ననైన, చల్లనైన, కత్తుల కోసే వాన చినుకుల్లా రాజీ కథలు! వేసవిలో వెన్నెలలా,అంధకారంలో నక్షత్రాల్లా రాజీ కథలు! ప్రత్యేకమైన ఆదిలాబాద్ తెలంగాణ మాండలికంలో, మంచిర్యాల దండేపల్లి గ్రామ పదాలు వర్షంలా తడిపేస్తాయి,వరదలా కమ్ముకుంటాయి.

రాజీ రాసిన ఈ అర్రాసు కథలు చదువుతున్నప్పుడు ఈ అమ్మాయి ఇంత అద్భుతంగా ఎలా రాసిందని నాకైతే చాలా అబ్బురము అపురూపము కూడా. ఇవి ఫిక్షన్ కథలు కావు ఊహించి రాసినవి కావు పేపర్లలోవార్తలు చదివి రాసిన కథలు అసలే కావు.ఏదోఫీల్డ్ వర్క్ మీద పల్లెల్లో తిరిగి రాసిన కథలు కూడా కావు. చల్లని ఏసీ గదిలో కూర్చుని రాసిన అకడమిక్ రాతలు కావు.ఇవి ఆమె జీవితంలో నుంచి వచ్చిన కథలు.తను పుట్టి పెరిగిన ఊరుని ప్రేమానురాగాలతో పెనవేసుకొన్నకథలు. ఆమె రక్తంలో ప్రవహిస్తున్న తల్లి భాషలో రాసిన కథలు ఇవి. ఈ పుస్తకమంతా చదివిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకమైన మాటలు, భాషా పదాలు, నుడికారాలకు సంబంధించి ఒక డిక్షనరీ తయారు చేయాలని అనిపించింది నాకు.

నిజంగా ఈ సమీక్ష చివర ఈ పుస్తకంలో నాకు తోచిన ఆ పదాలను నేను రాస్తాను నేను ఆదిలాబాద్ లో ఉన్నాను అదిలాబాద్ తో నాకు బంధుత్వం ఉంది అక్కడి భాష తెలుసు కానీ రాజీ ముందు నాకు తెలిసిన ఆదిలాబాద్ భాష తేలిపోతుంది. భాష ఒక్కటే కాదు రాజీ పట్టుకుంది. ఆ భాష వెనకాల, ఆ పదాల, ఆ నుడికారాల,నానుడిల, ఆ అచ్చమైన తెలంగాణా భాషని భద్రంగా మోసిన వాక్యాల వెనకాల ,కథల వెనకాల మంచిర్యాల మండలం, దండేపల్లి గ్రామం మట్టి మనుషుల, దళితుల అట్టడుగు కులాల మనుషుల జీవితాల్లోని ఆధిపత్య,పీడక కులాల మనుషులు చేసిన విద్వంసం, దోపిడీ వల్ల స్థానిక ప్రజలు చరిత్రలో,సమీప గతం లో,వర్తమానంలో పడ్డ,పడుతున్న బాధలు, విషాదాలు, కన్నీళ్లు, పోరాటాల చరిత్ర, ఉద్యమాలు ఆశ నిరాశలు అన్నింటినీ అందమైన దృశ్య కావ్యంగా రాసింది. వీటినే కాదు ఆదిలాబాద్ సంస్కృతిని,ప్రకృతి సౌందర్యాన్ని, అక్కడి సమాజం జీవన శైలిని, బాల్యానుభవాలని, పెళ్లిళని, పండగల్ని,స్థానిక కక్షలని,పాడి పంటల, పంట పొలాల, వాగు వంకల సౌందర్యాన్ని కూడా పరవశంగా రాసింది. ఇంత చక్కటి తెలంగాణ స్థానికత నిండిన వాతావరణంలో రాసిన కథలు చదువుతుంటే, అడవితేనె తాగుతున్న అనుభూతి కలుగుతుంది. ఆమె ప్రతి కథ చదువుతున్నప్పుడు, ప్రతి వాక్యము చదువుతున్నప్పుడు భాషలోని సౌందర్యాన్నంతా ఉపయోగించుకుంటూ, రాజీ చేసిన భావాల వ్యక్తీకరణ ,కథ చెప్పిన పద్ధతి దానికి ఎన్నుకున్న ఎత్తుగడ నైపుణ్యాన్ని చూస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి రాజీని హగ్ చేసుకోవాలి కౌగిలించుకోవాలని అనిపించింది. ఎందుకంటే ఇన్నేళ్ళకి ఇన్నాళ్ళకి నేను ఇంత మంచి సాహిత్యాన్ని తెలంగాణ జీవ భాషలో చదవగలిగాను రాజీ మూలంగా.

****

రాజీ ఇప్పుడు హైదరాబాదులో, ప్రింట్ డిజిటల్ మీడియాలో జర్నలిస్టుగా పనిచేస్తున్నప్పటికీ ఆమె ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ లో ఎంఎస్సీ చదివింది. కొన్ని రోజులు టీచింగ్ కూడా చేసింది. తెలుగు సాహిత్యం లో కాకుండా జువాలజీలో ఎంఎస్సీ చదివిన అమ్మాయి స్థానిక తెలంగాణా భాష మీద ఇంత చక్కని పట్టుతో ఎలా రాయగలిగింది అని కూడా చాలా ఆశ్చర్యం నాకు. నిజానికి రాజీ వాడిన స్థానిక మాండలిక భాషనే ఆమె కథల్ని గొప్ప శైలితో ముందుకు తీసుకెళ్ళి చదువరులని ఆగకుండా చదివించాయి. కథలకి,కథనాలకి సహజత్వాన్ని, జీవాన్నిచ్చాయి.

నిజానికి యూనివర్సిటీలో తెలుగు భాషలో పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్లు బాగా రాస్తున్నారు. వాళ్ళు కష్టపడి నేర్చుకున్న శిష్ట , వాడుక భాషతో, తమ మాండలికాన్ని వదిలి పెట్టి రాస్తున్నారు. నిజానికి పల్లెటూరు నుంచి పీజీ చేయడానికి హైదరాబాదుకి వచ్చాక తన జీవ భాష అయిన తెలంగాణా లో మాట్లాడడానికి ,రాయడానికి వెరిసేదాన్ని అనే చెప్పుకుంది రాజీ ముందు మాటలో.

తెలంగాణలో బతుకుతున్నఆధిపత్య కోస్తాంధ్ర, ప్రజలు, సాహిత్య కారులతో తీవ్రమైన భాష వెక్కిరింతలకి అవమానానికి గురి అయిన తెలంగాణా భాషలో, అదీ సమస్త రంగాల్లో కోస్తాంధ్ర ఆధిపత్యాన్ని, దోపిడీని ఎదిరించి, ధిక్కరించి, వోడించి ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్న తరువాత కూడా తెలంగాణా భాషలో స్వేచ్ఛగా గర్వంగా మాట్లాడే, రాసే చొరవ చూపని తెలంగాణా రచయతలు కొద్దిమంది ఉన్నారంటే ఆశ్చర్యమే. రాజీ కూడా అలా మొదట్లో భయపడ్డానని చెప్పుకుంది. తండ్రి ఎక్కడ పెళ్లి చేస్తాడో అన్న భయానికి ఊరొదిలి చేతిలో మూడు వేలు పట్టుకుని పట్నానికి వచ్చింది రాజీ పీజీ చేద్దామని. గంగకిటు వైపు ఒక పెద్ద జంగలి వొడ్డుకుండే తన ఊరు నుంచి పట్నానికచ్చిన తన మాటలు వింటూ జనం నవ్వేవారని రాసుకుంది. అలా నాలుగైదు ఏళ్ళు తన వూరి భాష మాట్లాడాలంటే భయం తనని తన్ని కూర్చో బెట్టేదట. కానీ అఖిల్ అనే దోస్తు పోస్ట్ ని అచ్చమైన తెలంగాణా భాషలో చదివాక తనకి ఆత్మ విశ్వాసం వచ్చి రాయడం మొదలు పెట్టానని చెప్పుకుంది. అలా చాలా త్వరగానే తనకి భాష పట్ల ఉన్నవెరపుని పోగొట్టుకుని రాయడం మొదలుపెట్టింది రాజీ.

తొలిగా ఏం రాయాలో తెలీక పోయినా అమ్మ లచ్చవ్వ ఎప్పుడో చెప్పిన కథ యాదికొచ్చి “భీమి” కథ రాసింది. అలా డైరీ లో అమ్మ లచ్చవ్వ చెప్పిన తన కాలపు బహుశ 1990 కాలపు మౌఖిక కథల జ్ఞాపకాలను రాసుకుంటూ, వాటికి తన కాలపు 2020 దశకపు అనుభవాలను జోడిస్తూ ఒక దాని తరువాత ఒకటిగా రాసుకుంటూ పోయింది. అలా తనలోని కథకురాలిని ఆవిష్కరించుకుంది రాజీ. కథలు రాసేటప్పుడు పదాలు దొరక్క ఇబ్బంది పడింది. మాటలాడుతుంటే సులువుగా దొరికే పదాలు రాసేటప్పుడు దొరికేవి కావు. ఒక దానికొకటి అల్లుకుంటూ, కలుపుకుంటూ తన వాడుక భాషలోని పదాల్ని రాసి సాధించింది రాజీ. అందుకే “రాసుడు లవ్ కట్టం, రాసుడు ఓ తండ్లాట” అంటుంది.అలా రాజవ్వ కథల్ని ఏడాది పొడుగుతా రాసింది రాజి.

రాజికి ఇంత మంచి కథలు అల్లడం ఎలా వచ్చింది? రాజీ తన ఊర్లో పెరుగుతూ,తన ఊర్లో తన వాడలో పొలాల్లో వాగు వంకల మధ్య, వెతల నుంచి ఆ పల్లె మనుషుల మధ్య వాళ్ళ జీవితాల నుంచి, సంస్కృతి, పండగల నుంచి అమ్మలక్కల, అవ్వయ్యల,మాటల నుంచి, కొట్లాటల నుంచి,తమవైన పాటల నుంచి, మాటల నుంచి వింటూ, వాటిలోని ధ్వనిని, అర్థాన్ని, లయని, మాండలికాన్ని, పలుకుబడులని, సంస్కృతిలోని పద్ధతులని, ఆచార వ్యవహారాలని పట్టుకుంటూ హృదయంలో పదిల పరుచుకుంది రాజీ. అలాగే రాజీ జీవితంలో జరిగిన ఇంకో అద్భుతం ఏంటంటే అమ్మ లచ్చవ్వ ఒక “స్టోరీ టెల్లర్” కావడం. జనుము చేసే పెరిక ఉత్పత్తి కులంలో పుట్టిన లచ్చవ్వ పగలంతా పొలాల్లో కష్టపడి అలిసి ఇంటికి చేరి ఇంటిపని, వంటపని పూర్తి చేసి అలిసిన లచ్చవ్వ పిల్లలకి కథలు చెప్పి నిద్ర పుచ్చడం మాత్రం మానలేదు. రాత్రుళ్లే కాదు రోజులో ఏదో ఒక పని చేస్తున్నప్పుడు కూడా తన చుట్టూ సీతాకోక చిలుకలా తిరుగాడే రాజీ అమ్మ లచ్చవ్వ చెప్పే మౌఖిక కథలు వింటూ అబ్బురంగా తనదైన ఊహాలోకం లోకి వెళ్ళిపోయి కథల్ని,పాత్రల్ని ఊహల్లో చూసి మురిసిపోయిన రాజి ఈ రోజు ఇలా తెలంగాణా గర్వ పడే అద్భుతమైన కథకురాలిగా మన ముందు నిలబడింది.

1960 – 70 ల కాలంలో తెలంగాణా గ్రామాల్లో భూస్వాములు పేద ఉత్పత్తి కులాల రైతుల, దళితుల మీద దారుణమైన దౌర్జన్యాలు, దాడులు, హత్యలు చేసారు. ఆదిలాబాద్ జిల్లాలో లక్సెట్టి పేట్ ,కరీంనగర్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో దొరల దౌర్జన్యాలు చెలరేగిపోయాయి. తన తల్లిదండ్రులు, బంధువులు అనుభవించిన కష్టాలు, తన పూర్వికులు అవ్వ తాతలు, తన గ్రామ ప్రజలు దొరల పెత్తనాల తోటి గ్రామంలో అనుభవించిన దౌర్జన్యాలతో పాటుగా కులమూ, పితృస్వామ్యమూ కలగలిసి గ్రామ స్త్రీలు భర్తలతో,(రాయేస్పరి కథ) దొరలతో అనుభవించిన లైంగిక ఆకృత్యాలు, వరకట్న హత్యలు,అత్తల పోరులో కోడళ్ళ పీడన, వేదన, ఆత్మహత్యలు,[అర్రాసు]దళితుల, పని వేతనాల, సెలవుల కోసం ప్రశ్నించిన రైతు కూలీల మీద,గ్రామంలోని అట్టడుగు వర్గ ప్రజల మీద ఆధిపత్య ,పీడక కులపు దొరల, వాళ్ళ చేలాల కులవివక్ష, అంటరానితనపు అవమానాలు, ఎదురు తిరిగి పోరాడి, దొరల కుత్తుకలు తెగ నరికి అడవిలో అన్నలలో కలిసిపొయిన తన తోటి గ్రామస్తుల ఉత్తేజపూరితమైన జీవితాలు{అగ్గిపూల దారి} {జీతగాడు} {భీమి} ఇవన్నీ కూడా రాజీ ఈ కథల లో రాసింది. అసమ సమాజపు వర్గ స్వభావాన్ని పట్టిచ్చే ప్రతి ఎలిమెంట్ ని కథల్లోకి చాలా చాకచక్యంగా సహజంగా తీసుకొచ్చింది. ఎక్కడా సిద్ధాంతాల జోలికి పోలేదు. మేధో ప్రదర్సన చేయలేదు. ఈ దోపిడీ చరిత్ర వెనకున్న సామాజిక ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక అంశాలని అత్యంత సహజంగా సంభాషణల్లో, సంఘటనల్లో పొందుపరిచింది.


రాజీ కన్నా (ఎడమ), లచ్చవ్య

‘అమ్మే గురువు’. అమ్మ చెప్పిన కథల్లో1960, 70 నాటి కాలంలో అదిలాబాదులోని మంచిర్యాలలో జన్నారంలో భూముల తగాదాలు దొరల పెత్తనం ఎక్కువై దాడులు ఎక్కువై, హత్యలు ఎక్కువై ఆ పెత్తనాలని ఆ పీడనని అనుభవించిన పీడిత కులాల జనం గురించి అమ్మ లచ్చవ్వ మాటల్లో రాజీకి ఎందుకు తమ పరిస్థితి, ఊర్లో చాలామంది అట్టడుగు వర్గాల కులాల ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఆమెకు మూలాలతో సహా అర్థం అయింది. ఆధిపత్య కులాల దొరల కాళ్ల కింద నలిగిన పీడిత కులాల కథలే రాజీ మనకి తనదైన తల్లి భాషలో దుఃఖంతో ,ఆగ్రహంతో కలిపి చెప్పింది. అమ్మ రాజి కి ఎలా మౌఖికంగా కథలు చెప్పిందో రాజీ కూడా మనకి మౌఖికంగా చెప్పినట్లు అనిపిస్త్జుంది. అంతగా చదువుతూ ఉన్నప్పుడు పాత్రలతో పాటు ప్రయాణిస్తాం,సంఘటనలు అంతగా కళ్ళ ముందు దృశ్యమానం అవుతాయి . బహుశ ఇది రాజీ కథ చెప్పడానికి ఎంచుకున్న పద్దతితో పాటుగా మాండలిక భాషకున్న శక్తి కావచ్చు.

భాషలోని మాధుర్యమే రాజి కథన శైలిగా మారిందని కూడా అనుకోవచ్చు.అమ్మ వెన్నెల రాత్రుళ్లు గోరుముద్దలు తినిపిస్తూ చెప్పిన కథలు కావని,తన తలలో పడ్డ పేన్లను తీసి శుభ్రపరచడానికి నూనె రాసి తల దువ్వుతుంటే తను ఏడవకుండా ఉండడానికి “ఏడవకు కత చెబుతా”అని బుదరకిస్తూ చెప్పిన కథలివి అంటుంది రాజీ.అమ్మ అద్భుతంగా కథలు చేప్పేదని, ఎంతంటే కథ వింటూన్న తాను ఆ కథలలో పూర్తిగా మునిగిపోయ ఆ పాత్రల తోటి కలిసి, ఎడ్చేదని, నవ్వేదని , ఆగ్రహ పడిపోయేదని అంటుంది. ఇంకా చూడండి లచ్చవ్వ ఏయే సందర్భాల్లో కథలు చెప్పలేదంటే ఆ సందర్భాలన్నీ పల్లె జీవితంలో ఇళ్ళల్లో అమ్మలు, నాయనలు, అక్కలు కలిసి సామూహికంగానో, వొంటరిగానో కొట్టేటప్పుడో మధ్యాహ్నాల్లో,సాయంత్రాల్లోనో చేసుకునేవి. ఎర్ర మిరపకాయల తొడిమెలు తీసుకుంటూనో, చింతగింజలు కొట్టేటప్పుడు, పప్పులు ఇసురుకుంటూనో, చెరుక్కుంటూ నో, పసుపు కొమ్ములు దంచేటప్పుడో, బతుకమ్మ పేరిచేటప్పుడో, ఏదన్న పండుగకి అప్పాలు చేసేటప్పుడో కదలకుంట, మసలకుంట, పిల్లలతో పనులు చేపించుకుంట చెప్పేదట లచ్చవ్వ. పని, పనికి ఒక కథ చెప్పేది అమ్మ. చెప్పిన కథలన్నీ పెద్ద కథలే. అలా అమ్మ చెప్పిన కథలు వినీ,వినీ, దోస్తులకి చెప్పీ, చెప్పీ తనకి కూడా అమ్మ లాగ కథలు చెప్పడం వచ్చేసింది అంటుంది రాజీ.

అమ్మ లచ్చవ్వకి ఇన్ని కథలు ఎట్లా తెలిశాయని రాజీకి బోలెడంత ఆశ్చర్యం! అదే అడిగింది అమ్మని.”నా చిన్నప్పుడు పనులకి పోయి అచ్చేది. ఇగ ఊర్లో బాగోతాలో, గోత్రాలోల్లో, వొగ్గు కథలో చెప్పేది. ఇగ ఆడికి వెయ్యి తెల్లారే దంక ఇనేది. పెద్ద మనుషులు పొలాల్లో పనులు చేసుకొంట చెప్పుకునే కథలు ఇనేది. ఇగో అట్లనో, ఇట్లనో ఇన్నయి యాది చేస్కుని నీకు చెబుతాన్న. ఇప్పుడయ్యేమి లెవ్వు. ఎవలింట్ల ఆల్లు తలుపులు మూసుకుంటర్రు, ఏడ గూడ బాగోతాలు, గోత్రాలు సింధుకతలు, వొగ్గుకతలు ఎవరు చెప్పిస్తలేరు. అసలవంటే ఏంటో గూడ ఇప్పుడు ఎవ్వలకు తెలువయి”అనేది లచ్చవ్వ బిడ్డ రాజీతో.అంతే కాదు రాజీ మనకి ఒక సలహా కూడా ఇస్తుంది.”ఈ సారి మీ ఊర్లల్లకి పోయినప్పుడు,మీ అవ్వలనూ, నాయనల్నో,ముసలవ్వలనూ, తాతలనూ కథలు చెప్పుమని అడుగుర్రి. సతాయించర్రి. ఖచ్చితంగా జోరుదార్గా సెప్తరు.” అంటుంది.ఎంత ధీమా రాజీకి? నిజంగా గ్రామాల్లో ఉన్న లోకం లోంచి వెళ్లిపోబోయే పాత తరం మనుషులని గ్రామం గురించి, మనుషుల గురించి, గ్రామ సంస్కృతి, చరిత్ర, పోరాటాల గురుంచి, భాష మాండలికాల పండగల గురుంచి, అన్నల గురించి అడిగితే ఎంత గొప్ప చారిత్ర, సామాజిక చరిత్ర రికార్డ్ అవుతుందో కదా! నిజానికి ఇలా పాత తరం మనుషుల నుంచి గత చరిత్రని రికార్డ్ చేయడం చాలా అవసరం కూడా.

****

ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ రచయితలు. గాయకులు కూడా ఉన్నారు. కవులు ఉన్నారు. ముందు తరం నాయకుల పోరాటాల గురించి ఎప్పటికప్పుడు రాసిన వాళ్ళు ఉన్నారు. ప్రముఖ గీత రచయిత, కవి గూడ అంజయ్య గారిది ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్ గ్రామం. 2017 లో మరణించిన గూడ అంజయ్య నలభై ఏళ్ల పాటు, ఎన్నో కథలు, పాటలు రాసారు. ఆయన రాసిన “ఊరు మనదిరా” పాట పదహారు భాషల్లోకి అనువాదమయ్యింది. గూడ అంజయ్య తెలంగాణా సాంస్కృతిక ఉద్యమ యోధుడు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో విప్లవోద్యమ నిర్మాణం జరుగుతున్న సమయంలో పీడిత జన విముక్తి కోసం, శ్రామిక రాజ్య స్థాపన కోసం అరుణోదయ సాంస్కృతిక సంస్థని స్థాపించి, ప్రజానాట్య కళా మండలితో పాటు రాష్ట్రమంతటా తిరుగుతూ, ఉద్యమ బాటని ఎంచున్నారు అంజయ్య. తెలంగాణ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారు. 1975 లో ఎమర్జెన్సీ సమయంలో తెలంగాణా నినాదంతో ముందుకు వెళ్ళడంతో ఆయన్ని అరెస్ట్ చేసారు. గూడ అంజయ్య ముఖ్యమైన రచనలు పొలిమేర నవల, దళిత కథలు కథా సంపుటి. పాటలు: నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, జరా బద్రం కొడుకో, కొడుకో కొమరన్న, ఊరు మనదిరా ఈ వాడ మనదిర, రాజిగా ఓరి రాజిగా, అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగానోనికి తోటి పాలోనివా? లాంటి ఎన్నో అద్భుతమైన సాహిత్యాన్ని రచించారు. గూడ అంజయ్య అద్భుతమైన స్థానిక ఆదిలాబాదు భాష మాండలికాన్ని ఉపయోగించారు. గూడ అంజయ్య తరువాత ఆదిలాబాదు నుంచి అంత గొప్పగా స్థానిక భాషా మాండలికంలో రాజీ కన్నా రాసిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. వీరితో పాటు

వసంత రావు దేశ్పాండే, తుమ్మల దేవరావు, బి.మురళీధర్, దప్పూరి శ్రిధరాచార్యులు, ఫణి కుమార్, శ్రిదర్ రావు దేశ్పాండే {తెలంగాణా ఉద్యమ ,జలవనరుల వ్యాసకర్త}, సదాశివ{ఉర్దూ సాహిత్యాన్ని,సంగీత విశేషాలని రాసిన రచయిత}, సంపత్ కుమార్, నాగుల రాధేశ్యాం, డాక్టర్ జే.పి.వైద్య., డాక్టర్.చమన్ సింగ్, వెంకట్ కిషన్ ఇట్యాల{ధరణి,గరం కోటు,అల్ప పీడన ద్రోణి కథల్లో ఆదిలాబాద్ జీవన స్థితిని కథా వస్తువులు తీసుకుని రాసిన కథలు} ఆదిలాబాద్ కి చెందిన కవులు రచయతలు. ఆదిలాబాద్ నుంచి రచయిత్రులు చాల తక్కువ. గోపిని భాగ్యలక్ష్మి[బాగీరధి,జంగుబాయి], డి.అనురాధ, నిర్మల్ నుంచి శ్రీదేవి గారు{ఆశువుగా పద్యాలు అల్లడంలో నేర్పరి.వందదాక పద్యాలు రాసారు}, సిరిమల్లె రూప. రాజీ మాత్రం ఇప్పటి ఇరవైవ శతాబ్దపు తరం ఆదిలాబాద్ ఆధునిక పల్లె పరిమళాలను మరవని రచయిత్రి. 1960 వరకు గ్రామాల్లో జరిగిన పంట పొలాల తగాదాలు, భూస్వాములు దళితుల్ని చేసిన హత్యా కాండలు, కుల వివక్ష , అణిచివేత, 1970 ల నాటి ఆదిలాబాద్ సామాజిక చరిత్రని తన కథల్లో అమ్మ చెప్పిన కథల సాయంతో రాసే ప్రయత్నం చేసింది రాజీ. అమ్మ చెప్పిన కథల్ని, తను చూసిన కథల్ని రాసే ప్రయత్నం చేసింది.

***

ఈ కథలు చదువుతున్నప్పుడు స్థానిక ఆదిలాబాద్ భాషా సౌందర్యానికి ముగ్డులవుతూనే కథల్లోని వస్తువుకు సంబంధించిన వాస్తవిక సంఘటనలకి హృదయం చలించిపోవడం అనుభూతిలోకి వస్తుంది. వస్తువు ఆలోచింపచేస్తుంది. తెలంగాణ గ్రామాల్లో కనిపించే భూస్వామ్య దోపిడి, దౌర్జన్యాలు, కుల వివక్ష వెట్టిచాకిరీ, శ్రమ లైంగిక దోపిడీ, చితికి పోతున్న బాల్యం అంతా ఈ కథలలో చూస్తాం.

గోదావరి లోయ, ఆదిలాబాద్ ఆదివాసి గిరిజన మైదాన ప్రాంతాలకు చెందిన వాతావరణం, భాష అత్యంత సహజంగా నిండిన కథలు ఇవి. ఆదివాసీల అటవీ భూములు,ఇతర సహజమైన అటవీ వనరులపై దొరల, మార్కెట్ దోపిడీ, ఆధిపత్యాలను ఎదిరించే ఆదివాసీలపై దొరలు చేసే దౌర్జన్యాలను, హత్యలను, రోజు వారి గిరిజనుల స్థానిక సమస్యలను బయటి లోకానికి చెప్పే బాధ్యతని గిరిజనుల వైపు నుంచి రాజీ తీసుకుంది.

***

కథల విషయానికి వస్తే ప్రతి కథ శ్రామిక, పీడిత ప్రజల దోపిడీ అణిచివేతలని, ఆధిపత్య కులాల వర్గాల పెత్తందారుల చేతుల్లో గ్రామాల్లోని పీడిత కులాలు అనుభవించే అణిచివేత, అవమానాలని, ఘర్షణలను ఎదురు నిలిచి పోరాడే తనాన్ని,దానికోసం అన్నల సాయం తీసుకోవడాన్ని, కుటుంబాల్లో సమాజంలో స్త్రీలని అణిచివేసే బ్రాహ్మణీయ ఆధిపత్య పితృస్వామ్య భావజాలాన్ని ప్రశ్నించడమే ప్రధాన వస్తువులుగా కనిపిస్తుంది. వంద లోటు అవమానం, జీతగాడు అగ్గిపూల దారి, పూలుగు, రాటిబాయ, భీమి, అర్రాసు కథలు అన్నీ ఈ వస్తువుల సారాంశాన్ని అత్యంత ప్రతిభావంతంగా చెప్పిన కథలు.

అర్రాసు కథలో పెట్టుబడి మార్కెట్ మాయాజాలంలో పడి స్వంత మేన కోడల్ని వరకట్నం కోసం వేధించే అత్త, కోడలి ఆత్మహత్యకు కారణమైన అత్త, అన్యాయంగా చనిపోయిన కోడలు, కోడల్ని చంపినందుకు గ్రామ ప్రజల ముందు అత్తను అర్రాసుకి అంటే వేలానికి పెట్టి వూర్లో ఎవరినైనా కొనుక్కోమనే శిక్ష వేస్తాడు గ్రామ నాయకుడు. ఇలా అత్తా, కోడలు ఇద్దరూ పితృస్వామ్యానికి, కర్కశ మైన పురుష కేంద్రంగా ఉండే సాంస్కృతిక ఆచారాలకు ఒకేసారి ఎలా బలి అవుతారో చర్చిస్తుంది. అంతగా వేధించిన అత్త కూడా చివర్లో ఎలా కులాచారానికి బలవబోతుందో చెబుతూ ఆమె మీద కూడా పాఠకుల్లో సానుభూతి కలిగించేట్లు రాయడం రచయిత్రి తీసుకున్న ఎత్తుగడ , ఫ్యూడల్ వ్యవస్థ మూలాలని, మనుషులని కమ్ముకుని మృగాలుగా మార్చిన మార్కెట్ ధోరణిని అర్థం చేసుకున్న తీరు అబ్బురపరుస్థాయి. కథనాన్ని అత్యంత ఉత్ఖంట భరితంగా ముఖ్యంగా కోడలి తండ్రి బిడ్డ చనిపోయిందని తెలీకుండా వెతుక్కుంటూ అల్లుడింటికి వచ్చి కన్నీటితో భయంతో వాకబు చేసిన తీరు, దొరికిన బిడ్డ శవాన్ని కచ్చులంలో కన్నీటితో వూరికి తీసుకెళ్ళి దహనం చేసిన తీరు, కోడలి శవాన్ని తీసుకుని అర్థరాత్రి బండిమీద ఊరి చివరి వాగులో ముంచెయ్యడానికి పరుగు పెట్టించే తీరు, ఆ భీకరమైన చావు కళ నిండిన రాత్ర్హి, శవాన్ని తీసుకెడుతున్న అత్త, భర్త,మామల ఆందోళన, భయాలతో కూడిన మానసిక స్థితి చిత్రించిన కథా వాతావరణం రాజీ చూపించిన నైపుణ్యం చాలా గొప్పది. “భీమి” కథలో తన భార్య చేతుల్లోంచి కంచాన్ని అందుకున్నందుకు కోపంతో చితక్కొడతాడు పటేలు. తరువాత మైసడిని చంపించిన పటేలు మైసని కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయడం, వూరి వాళ్ళతో దేవుడనిపించుకోవడం ఒక ఐరనీ .

”జీతగాడు” కథలో ఐదేళ్లు దొర పొలానికి గొడ్డు చాకిరి చేసిన జీతగాడు శుంగు వారం రోజులు జ్వరమొచ్చి ఇంట్లో ఉంటే, కనీస మానవత్వం మరిచిపొయి “నీకు జోరమొస్తే నీ పెండ్లాన్ని తోలాల్సింది” అంటాడు. వారం రోజుల జీతం తీసేసుకుంటాడు. ఆదివారం సెలవు కావాలిసిందే అని కొత్తగ వచ్చిన చైతన్యంతో శుంగు చేసిన డిమాండుని దొర నిర్లక్ష్యంగా తిరస్కరించడమే కాదు. నీ భార్యతో పని చేయించు కావాల్సింది అన్న శుంగు ని చెప్పుతో చావ చితక్కొడతాడు. స్నేహితుడు దర్శి దగ్గర బాధ వెళ్ళ పోసుకున్న శుంగుకి హితబోధ చేస్తాడు దర్శి. ”ఆళ్ళు ఏం చేసినా ఆల్లదే ఒప్పు, మనది తప్పైతదిర. ఎందుకంటే మనం లేనోల్లం. పొద్దుగాల్ల లెత్తే కైకిలి గంబడి జేసుకునేతోల్లం పటెల్ల కాడ. ఏమన్నా అడగాల్నంటే మనం సదువుకోలేదు సుత. సదువులు పైసలు, భూములు, జాగాలు, మనసులు అన్నీ ఆల్లకే ఉన్నయ్. ఎనుకటి సంది ఆల్లు మనలను ఇట్లనే ఉంచుతర్రు కాళ్ళకింద సేప్పుల్లెక్క . ఇప్పుడు మనం ఏం చెప్పినా నడువదిర” అంటాడు నిస్సహాయంగా.

అడవిలో సంపద, చదువు అంతా భూస్వాముల చేతుల్లో ఎలా ఉందో, ఎలా తమ పీడిత కులాల ప్రజలు నిస్సహాయులు అయ్యారో అన్న ఆర్ధిక రాజకీయ సూత్రాన్ని చెప్పకనే చెబుతాడు. కానీ కాలం తీర్పు చెబుతుంది. శుంగు అనుకోకుండా అడవిలోకి తునికి పండ్ల కోసం వెళ్ళినప్పుడు అక్కడ అన్నలను చూస్తాడు. మాట్లాడతాడు. ఒకరోజు గ్రామంలో ఊరికి అంతగా తెలీని వాళ్ళు వచ్చి దొర కాలు విరగ్గోడతారు. అప్పటికే శుంగు అన్నలలో కలిసిపొయి ఉంటాడు. ఇలా గ్రామాల్లో దొరల దౌర్జన్యాలకి బలి అయ్యి చట్టంతో న్యాయం దొరకని యువకులు ఎలా అన్నలలో కలిసారో అత్యంత సహజంగా చెప్పింది రాజి. ఇలాంటివే కొన్నిఆణిముత్యాల్లాంటి కథలున్నాయి పుస్తకంలో. అగ్గిపూల దారి అదే కోవలోది. ఈ కథలో దొరల చేతుల్లో దారుణమైన లైంగిక అత్యాచారాలకు లోనైన దళిత స్త్రీల ఆత్మహత్యల తరువాత ఆ దొరల హత్య జరుగుతుంది అన్నలతో. ఆడ మొదలైన ఎరుపు అగ్గి మంట{నక్సల్ బరి},ఎన్నో ఊర్లకి పాకింది.ఎంతో మంది దొరలని గడీల్ల నుంచి తరిమింది అ ఏర్రేరని అగ్గి. అంటూ ముగిస్తుంది రాజీ కథని.

“వంద నోటు అవమానం” కథలో హాస్టల్లో ఉండే పిల్లవాడు ఊరిలో అవ్వతో కలిసి శ్రమ చేసి వంద నోటు సంపాదిస్తే తిరిగి వచ్చాక టీచర్ అనుమానిస్తాడు. ఆ వంద నోటు ఆ పసివాడి నుంచి గుంజు కుంటాడు.ఒక బీద పిల్ల వాడి చేతికి శ్రమ చేస్తే నే ఆ వందో నోటు వచ్చిందంటే నమ్మడు ఆ టీచర్. వందనోటు గుంజుకోబడ్డప్పుడు ఆ పసివాడి మానసిక స్థితిని ఆర్తిగా చిత్రిస్తుంది రాజి దుఖం వస్తుంది.

***

ఇక రాజవ్వ ముచ్చట్ల్లో ఆరుకాలం కష్టం చేసే రైతులు, దొరల, మైదాన ప్రాంతపు మార్కెట్ దోపిడీకి గురయ్యే గిరిజనులు ఆదివాసీల గురించి, కార్మికుల గురించి ముచ్చట్లను చదువుతాము.శివరాత్రి రోజు లచ్చవ్వ గండ దీపం, జాగారపు దీపం, చేసిన నైవేద్యాన్ని వీధిలో పోయే జనానికి కూడా “రాయేసుని పలారముల్లో”అంటూ పిలిచి మరీ పెట్టటం గురించి ఎంత ముద్దుగా చెప్పిందో. గోండులు, దండారుల ప్రకృతి దేవతల గురించి, గుస్సాడి నాగోబా జాతరల గురించి చెబుతూ రెడ్ ఇండియన్స్ గురించి చదువుతున్నప్పుడు “అరె మా వూరి గోండుల గురించి ఇలానే ఉంది కదా” అనిపించిందంట రాజీకి. హైదరాబాద్ చార్మినార్ దగ్గరి నయాబ్ హోటల్ దగ్గర పొద్దున్నే చాయ్ తాగడానికి వెళ్లి పడ్డ తిప్పలని హాస్యంగా చెబుతుంది . ఇరవై ఏళ్ల క్రితం ఊర్లలో ఒకట్రెండు బుగ్గ దీపాలు తప్ప కరెంటు లేక గాంచు [కీ]సీసపు దీపాలు ఎట్లా వెలిగేవో, ఎట్లా కర్రెంటు తీగలు గుంజుకొని ,కరెంటు దొంగతనం చేసి బుగ్గ దీపాలు వెలిగించుకునేవారో, కడాకి కర్రెంటాఫీసు వాళ్ళు వచ్చినప్పుడు గ్రామస్థులు ఎన్నెన్ని తిప్పలు పడే వారో గమ్మత్తుగా చెబుతుంది.గాంచు సీసపు దీపాల రకాలు చూడండిక్కడ. టానిక్ కీసలు,పవ్వ కీసలు,నెత్తి కొబ్బరి నూనేయి డబ్బల రేకుయి,పైగా వాటిని పెద్ద వాళ్ళు ఎలా కిరోసిన్ పోసి జతనంగా వెలిగిస్తారో ముచ్చటగా చెబుతుంది. ఈ రాజవ్వ ముచ్చట్లలో తన బాల్యానుభావాలను పెనవేసుకొన్న ఇల్లాంటి అనేక ముద్ద బంతి పూల పరిమళాలలాంటి జ్ఞాపకాలు ఉన్నాయి.ప్రతీది అపురూపమే. ముగ్గుల ముచ్చట్లు, బూగలు, జున్ను,జున్ను చేసే తీరు, పండక్కి దేవునికి పలహారం చేసినంత పవిత్రంగా చేసే తీరు, పోశమ్మ దగ్గరికి జున్ను నైవేద్యంగా తీసుకుపోయి గొడ్డు గోదను జాగ్రత్తగా చూసుకొమ్మని మొక్కు కునే పద్ధతి చదువుతుంటే కొత్తగా అనిపించింది.

రకరకాల పెన్నులు ఒక్క దిక్కు పెన్నులు, రెండు దిక్కుల పెన్నులు, ఇంకు పెన్నులు, వాటి ఖరీదుతో సహా రాస్తుంది. కర్రేద్దు చనిపోయాక ఇంటిల్లిపాదీ పడ్డ దుఖం ముఖ్యంగా రాజీ నాన్న దుఖం గురించి చెబుతూ, ”రైతులకి ఏం బాధలు ఉంటై అని లెక్క కట్టే ముందు,అసలు లేని బాధ ఉండదు అని తెలుసుకోవాల మనం”అంటుంది చాలా సింపుల్గా వ్యవసాయాధారిత రైతుల జీవితాలను , పాడి పంటలను, పశురాలతో వాళ్ళకున్న హృదయ సంబంధితమైన అనుబంధాన్ని తేల్చి చెబుతుంది. తన నలుగురి తాతల తోడబుట్టిన ,వంద ఏళ్ళు బతికిన బుచ్చవ్వ మరణం గురుంచి ఒక ముఫై లైన్లలో ఎంతబాగా విశ్లేషించి చెప్పింది? బుచ్చవ్వ విడాకులు అయ్యాక రెండో పెళ్లి, పిల్లలు పెద్దయ్యాక కొడుకులతో, కోడల్లతో ముసలితనంలో గొడవలు, కాలు విరగ్గోట్టుకోవడం, వంద రూపాయల పెన్షన్ కోసం రాజీ ఊరికి వచ్చి తినేసి మెల్లిగా నడుచుకుంటూ ఊరెల్లిపోవడం చెబుతూ కుటుంబంలో ఇలా ఒక్కోరూ మరణిస్తున్నప్పుడు కుటుంబం గురించి తెలుసుకునే వయ్యిలో {పుస్తకం} పేజీలు చిరిగిపోయినట్లు అనిపిస్తుంది అంటుంది.

అలాగే పంచలోహ ఉంగరాలు చేసే, పంచాంగం చెప్పే ఊరి కంసాలి ఆగయ్య జీవితం గురించి అంతే ఆర్ద్రంగా చెబుతుంది. పంచాంగం చెప్పేటప్పుడు వాళ్ళ పరిస్థితి బాగాలేదని తెలిస్తే,”నీ రాశికి ఇప్పుడు బాగాలేదని” చెప్పేవాడట.బాగుందని తెలిస్తే మటుకు తెలివిగా,”నీ రాసికేందే డో కా లేదు.అడుగు వెడితే అడ్లు వండుతయ్, సేయేత్తే చెల్కలల్ల బంగారం పండుద్ది” అనేదంట.ఆగయ్య చెప్పే పద్యాలు, పురాణాల గురించి, కథ చెప్పమని బ్రతిమిలాడిన లచ్చవ్వ దగ్గర బెట్టు చూపించి, రూపాయి నోటు తీసుకుని ప్రమీలార్జునీయం కథ చెప్పడం, భార్య రుక్కమ్మ పోయాక అనాథ అయిన ఆగయ్య మరణం వరకు,పల్లె జీవితాల్లోని మనుషుల జనన మరణాల వరకు సాగే ఇరుగుపొరుగు, కష్ట నష్టాల,సుఖ దుఖాల సంఘ జీవితం గురించి తన జ్ఞాపకాలను పంచుకుంది. అలాగే లచ్చవ్వ ఊరినుంచి వడ్లు వచ్చే టైంకి ప్రతి ఏడూ కత్తెర్ల బీరయ్య రావడం, ఇరవై రోజులు లచ్చవ్వ ఇంట్లోనే ఉంటూ బర్లకు, దుడ్లకి వాటికి కత్తెర గాయం కాకుండా, అవి తనని తన్నకుండా బూరు కత్తిరించడం, ప్రతిగా బర్రెకు కుంచెడు, దుడ్డకు అధ్దేడు, వడ్లు, వడ్లు లేని వాళ్ళ దగ్గర పైసలు తీసుకునేవాడు. అన్నీ సావుకారి దగ్గర అమ్ముకుని పైసలు తీసుకుని అక్కడ పని అయ్యాక ఊరికి పోయే వాడు. అతను కూడా నాలుగేళ్ల క్రితం చనిపోయాడని లచ్చవ్వ ద్వారా తెలుసుకుని బాధపడుతుంది రాజి. మంగలి వృత్తుల్లో ఇలాంటి పనులు కూడా ఉంటుందని మొదటి సారి తెలిసింది.

రాయేస్పరి కథ కన్నీళ్లు పెట్టిస్తుంది. దళితుల కులం లో పుట్టిన అందమైన తెల్లని మేని చాయతో మెరిసిపోయే రాయేస్పరిని పని చేసి వచ్చే దారిలో ఎవరో పాడుచేస్తే భర్త వదిలిపెడతాడు. ఆమెకి మతి భ్రమించి వీధుల్లో తిరుగుతుంది ఉరి వాళ్ళు బిచ్చం వేస్తే తింటుంది. మాసిన చిరిగిపోయిన బట్టలతో ఉండే రాఎస్పరిని కన్న తల్లిదండ్రులు అన్న దమ్ములు కూడా పట్టించుకోరు. కానీ అదే వూరిలో మానవత్వం మూర్తీభవించిన ఎముల రాయక్క మాత్రం బ్రతిమిలాడి, గద్ధరించి స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి కొత్త కంచం ఇచ్చి పంపించేది. రాయేస్పరి ఒక రోజు తూఫానులా కురిసిన వర్షంలో తడిసి జ్వరం వచ్చి చచ్చేపోతుంది. లైంగిక అత్యాచారం చేసిన నేరస్తుడని వదిలేసి, శీలమంటూ, పవిత్రతని స్త్రీ దేహానికి అంటగట్టిన కరడు గట్టిన స్వార్థ పితృస్వామ్య వ్యవస్థలో కన్న పేగుని దిక్కు లేకుండా వదిలేసిన కన్నవాళ్ళ, అత్తవారి కర్కశత్వానికి బలైపోయింది అమాయకమైన రాయేస్పరి. వూరి పెద్దలు సరిగా వ్యవహరించి భర్తకి బుద్ధి చెప్పి నేరస్తుడిని శిక్షంచి ఉంటె జీవిత కాలపు శోకం తప్పేది కదా రాయేస్పరికి అని బాధ పడుతుంది రాజీ. దళిత కులం లో పుట్టిన పాపానికి రాయేస్పరికి న్యాయం జరగలేదని వాపోతుంది అప్పటి పరిస్థితే కాదు, ఇప్పుడూ దళిత స్త్రీల పరిస్థితి గ్రామాల్లో ఇలానే ఉంది. లైంగిక అత్యాచారపు న్యాయం కులాన్ని బట్టి మారడం కొత్తేమీ కాదు. ఆ తేడాని స్పష్టంగా చెబుతుంది రాజీ.

అలాగే తాగుబోతు భర్తతో కష్టాలు పడ్డా అన్నిటినీ ఎదిరించి అప్పులు తీసుకుని , కూరగాయలు అమ్మి, స్వంత ఇల్లు కట్టిన రాణక్క విజయ గాథ, భూమి లేని కూలి పనిచేస్తూ అది కూడా లేన్నాడు అడవికి వెల్లి వెదురు బొంగులు తెచ్చి తడకలు అమ్ముకునే కుటుంబంలో ,కరెంటు కూడా లేని ఇంట్లో పుట్టిన తట్రగూడెం తట్ర పోశవ్వ, రాజీకి జూనియర్ . తొమ్మిదో క్లాసులో మాత్రమే సైకిలు మీద బడికి పోగలిగింది. అన్నేళ్ళూ కాలి నడకన మాత్రమే బడికి పోయేది. ఆ పోశవ్వ ఇప్పుడు ఎలా ఉందో చదువు కొనసాగించిందో లేదో తెలీదు.

ఆదివాసీల్ని కనీసం మనుషులుగా కూడా చూడని రాజ్యం వాళ్ళని హింసించి,బెదిరించి, భయభ్రాంతులని చేసి వాళ్ళ స్వస్థలాల నుంచి పరాయీకరణకి గురిచేసి,తరిమేసి, వాళ్ళ గూడాలని, గ్రామాల్ని, అడవులని, వనరులని, భూములని పెట్టుబడి దారులకి ధార పోస్తున్న రాజ్యానికి పోసవ్వకి వాళ్ళ నాన్న కొనిచ్చిన సైకిల్, ఆమె చదువు, తండాకి కరెంట్ లేకపోవడం పెద్ద విలువైనదిగా కనిపించదు. నాట్ల ముచ్చట్లు.ఇళ్ళు కప్పుడు, పుస్కలయ్య గుట్ట, రాయేషుని జోగి, దసరా ముచ్చట్లు ,దీపావళి, సలికాలం ముచ్చట్లు, కొత్త సంవత్సరం ముచ్చట్లు, పండుగలు పుకార్లు ఒహ్హ్ వేటికవి అద్భుతంగా చెప్పిన రాజీ కున్న అద్భుతమైన బాల్య జ్ఞాపకాలు!

****

ఇక రాజీ అర్రాసు కథల పుస్తకంలో వాడిన స్థానిక భాష మాండలికాల గురించి. తెలంగాణ మాండలిక భాష మీద మాండలిక పదకోశాన్ని నలిమెల భాస్కర్ రాసారు. అలాగే ఆదిలాబాద్ కి చెందిన మడిపెల్లి బధ్రయ్య మన భాష, మన యాస అనే పుస్తకం పదివేల పదాల డిక్షనరీ రూపొందించారు..ఇక రాజీ అర్రాసు పుస్తకం దానికదే ఆదిలాబాద్, మంచిర్యాల మండలం, దండేపల్లి గ్రామపు భాషా పదకోశం అంటాను నేను. అంతగా కొత్త, బహుశః పాత పదాలని పరిచయం చేసింది రాజీ. నిజంగా ఈ పుస్తకం స్థానిక భాషా మాండలికానికి సంబంధించి ఒక అద్భుతం ! ఎవరైనా ఆదిలాబాద్ భాష మాండలికాన్ని తెలుసుకోవాలంటే అర్రాసు పుస్తకాన్ని చదవాలి. అసలు అర్రాసు పుస్తకాన్ని యూనివర్సిటీల్లో భాష మాండలిక విభాగంలో టెక్స్ట్ బుక్ గా పెట్టాలి.

రాజీ వాడిన స్థానిక ఆదిలాబాద్ భాషా మాండలిక పదాలు :

***

అర్రాసు-వేలం, అమ్మకానికి పెట్టటం /నాలెకు-భూమికి/కైకిలి -కూలి /సలః చేసిండు-సలహా,ఆలోచన చేయడం /సంపతి-ఆస్తి /పూలుగు-మూలుగు /కుప్పైతుర్రు-పోగవుతున్నారు /అచ్చుడు-వచ్చుడు /జివుణం-ప్రాణం/పడవాట్లు-డుమ్మా /తాతీలు-సెలవు/పసివిల్ల-పసిపిల్ల /ఇషారం-తెలుసుకొని/ఎగేత్తుండు-రెచ్చగొట్టడం/గలుమకు-గడపకి/బొచ్చే గుద్దుకోవడం -చాతీ పైన కొట్టుకోవడం /మతలావండడం-కబురంధడం./కచ్చులాల బాట-తారు రోడ్డు/పగటిలి-మధ్యాహ్నం /కొంచవో-తీసుకొనిపో /బొమ్మానట్టు-/మాల్లెం-/గంజులు-గిన్నెలు/మస్కులనే-పొద్దున్నే/దేచ్చుటానికి- /పోద్దికన్నాలు-మధ్యాహ్నం పూట అన్నాలు/మాల్లెం-గుంపు/అల్లీల్లచ్చి -అందరూవచ్చి/నపరో మాట -ఏదోఒక మాట/అటిటన-చివరకి,అటుఇటు అంటూ /గజ్జజనికేది -గజ గజా వణికేది/ పింజం పింజం అనడం- భయం అవడం/ఇగెట్ల అని -ఇంకా ఎట్లా అని/ తేవడానికి/మందోటకు-మామిడి తోటకి/మల్లెపోల్లు-/పోద్దంగుడు-సాయంత్రం/ఎక్కన్నన్న-ఎక్కడన్నా/జేపజేప-త్వర త్వరగా /కుతికపట్టు-మేడలో వేసుకునే గొలుసు నెక్లెస్ /దండెకడాలు-గజ్జెలు/గెదిమిర్రు-తరిమారు/పెయినం-పో యినాం/మిర్పకాయేర-మిరప కాయలు తుంచేపని/పున్జులు -పుంజు కోళ్ళు/మక్క,జొన్న గడ్క-మక్క,జొన్న రవ్వలతో చేసే జావ/గడ్కి-గడికి/సుర వొయ్యెది-కూడా పోయేది/పొల్లా-పిల్లా/పాణం నేరివడితే-బాగుండకపోతే/ఇర్స్క -విరుచుకు ముత్తెవన్నికాయలు -కొన్నన్ని కాయలు /పదేళ్ల పబ్బతి ప్బట్టి ఏడ్సుడు-గుక్కపట్టి ఏడవడం/వొమ్ముంటురు-పొమ్మంటున్నారు /దౌడపొంట-చెంప మీద/సరిస్న్డు-వేసిండు/జెప్తన్నవార-చెప్తున్నావార /ఆళ్ళైంది-సమయం అయింది/అధ్దంటద్ధన్నరు-వద్దంటే వద్దన్నరు/పదిగల-పది సంఖ్య/బొమ్మానట్టేడిసిండు-గుక్క పట్టి ఏడవడం/నపరోటి-చెరొకటి,తలా ఒకటి /కుచ్చింది-గుచ్చినది/జెప్పనేసుకొని-తొందరగా వేసుకొని/మాజ్జేల్నే-మధ్యలోనే/నాయిన్నాను-నాన్నను/విలుత్తండు-పిలుస్తున్నడు./మొత్తుంకుంట-మొత్తుకుంటూ /శిన్నకాకచ్చిండు-చిన్న బాబాయి/లవుపీర్తి-చాలా ప్రేమ/ఎద్టంది-ఏడుస్తుంది/ మనకెయ్యి-మనవైపు /వండి త్తరు-పండిస్తరు/తక్కో,ఎక్కో-తక్కువ ,ఎక్కువ/రుశుంటుండే-రుచి ఉంటుండే/దివ్వెల పండుగ-దీపావళి/బగ్గనే-బాగానే/ కచ్చులం-ఎడ్ల బండి/ఇరగ కట్టం-చాలా శ్రమ పడడం/జేస్న-చేసినా/మర్రవడి-తిరగబడి/ఇసం లేని-చెడు బుద్ధి లేని,మంచితనం నిండిన/ఆకాషి పండుగ-తెలంగాణా ప్రాంతాల్లో అల్లుళ్లకు మాంశాహార విందు ఇచే పండుగ/పెత్రమాస-మరణించిన పిత్రుదేవతలని పూజించే పండుగ/అర్సుకోవడం-చూసుకోవడం/నాల్గోద్డులు-నాలుగురోజులు/కౌసుకూర-మాంసం కూర/జిమ్మలు-కాలువలో పట్టిన చేపలు /కల్లు ఆడుకం-నెలంతా ఇంటికి కళ్ళు పోయించే పద్ధతి./అడ్డెడు,తవ్వెడు/సాకినాలు-మురుకులు/పైనంగాంగ-బయలు దేరాక /మల్క,/నెత్తిలనే మిత్పరిచ్చుకుని -మధనపడి /ఇగ జూసి,ఆగ జూసి-ఎదురు చూసి ఎదురు చూసి/ఎ సార్గం -ఎలా చేసినా /సాయిమానులకి-అరుగు మీదికి/గులిగింది-గొణిగింది/పోదంగంగ-సాయంత్రం పూట/నాల్కే ఋషి గొడ్తలేదేటు పాడై-నాలుక రుచి పోయింది /నోరు సై గోడ్తది కావచ్చు-నోటికీ రుచి వస్తుందేమో/ఇడిషింది-విడిచింది /సీత వల్క పండ్లు-సీతాఫలాలు/

****

ఇవి మచ్చుక్కి మాత్రమే.ఇంకా కొన్ని వందల పదాలు ఉన్నాయి.రాయాలనుకుంటే కానీ అదే ఒక పుస్తకం అవుతుంది చదివి తెలుసుకోవాల్సిందే.నిజంగానే ఇది ఆదిలాబాద్ ప్రాంతపు భాష మాండలికాన్ని తెలియ జేసే పదకోశం అంటే డిక్షనరీ లా పనికొస్తుంది.చదివి చూడండి.చదివేటప్పుడు ఒక వంద పేజీల ఖాళీ నోటు బుక్కుని కలాన్ని దగ్గర పెట్టుకోండి. ప్రతీ పెజీలో పదాలు, నుడికారాలు, నానుడులు రాసుకుంటూ పొండి. పుస్తకం ముగిసేలోగా మీ చేతిలో ఒక మంచి భాషా మాండలిక పదకోశం తయారై ఉంటుంది.ఎవరికైనా అర్రాసుని, డిక్షనరిని కానుకగా ఇవ్వండి .

***

ఇంత అద్భుతనమైన పుస్తకం వేసి, అంత కంటే అత్యద్భుతమైన రచయిత్రి రాజీ కన్నాని పరిచయం చేసిన బోధి ఫౌండేషన్ బంగారు బ్రంహం గారికి అభినందనలు. రాజీకి బోలెడంత ప్రేమలు . చదువుతున్నంత సేపూ మధువంత మైకాన్ని, మల్లెలంత పరిమళాల్ని అనుభూతినిచ్చిన కథలు రాసిన రాజీ కన్నా చేతులని కళ్ళ కద్దుకుంటున్నాను. రాజీతో ఈ కథలు రాయించిన అమ్మ లచ్చవ్వకు నా కౌగిలింతలు. చివరగా రాజీ కన్నా ఈ పుస్తకంలో నీకు కథలు చెప్పి ప్రేరణనిచ్చిన అమ్మ లచ్చవ్వ బొమ్మ వేస్తే బాగుండేది. మలి ముద్రణలో నా ఆశ తీరుస్తావని నమ్ముతున్నాను. ”తెలంగాణా సాహిత్యానికి కొత్త దర్వాజా, భవిష్యత్తులో పెద్ధర్వాజా” కాబోతున్న రాజీ కన్నాకి బోలెడన్ని శుభాకాంక్షలు. నీ మీద తెలంగాణా సాహిత్య లోకం చాల ఆశలు పెట్టుకోబోతుంది. నువ్వు ఆ బాధ్యతను నేరవేర్చబోతున్నావు డియర్ రాజీ కన్నా !

***

Read More
Next Story