’అద్రక్ కే పంజే’ సృష్టికర్త బబ్బన్ ఖాన్ కు నివాళి
x

’అద్రక్ కే పంజే’ సృష్టికర్త బబ్బన్ ఖాన్ కు నివాళి

కాసింత కన్నీరు, దోసెడు హాస్యం మిశ్రమంతో తయారయిన ‘అద్రక్ కే పంజే’ ఇప్పటికీ సజీవ నాటకమే....


"అద్రక్ కే పంజే" ( Adrak Ke Panje తెలుగు. అల్లం వేర్లు) అనే నాటకంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూపిన బబ్బన్ ఖాన్ (Babban Khan) 17.4.26 అర్ధరాత్రి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. కొంతకాలం క్రితమే ఈ నాటక ప్రదర్శన ఆపేసిన బబ్బన్ ఖాన్, ఇప్పుడు తాను కూడా నిష్క్రమించాడు.ప్రపంచ నాటక రంగాన్ని ఇంతగా ప్రభావితం చేసిన నాటకం మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు.

ఒక్క నాటకం ఒక సుదీర్ఘకాలం 60 దేశాల్లో ప్రేక్షకులను అలరించింది. ఎన్నో రికార్డులను సృష్టించింది. విషాదంతో కూడిన వ్యంగ్యోక్తులతో వినోదాన్ని వెదజల్లిన ఇలాంటి నాటకం చాలా అరదు.

1964 లో ఒక కప్పు టీ తాగడానికి 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఒక రాత్రి వీధి దీపం కింద ఏకబిగిన రాసిన ఈ నాటకం కొన్నివేల సార్లు దాదాపు 60 దేశాల్లో ప్రదర్శింపబడడం సాధారణమైన విషయం కాదు. ఓ మామూలు నాటకాన్ని అద్భుతంగా మార్చిన బబ్బన్ ఖాన్ ఒకప్పుడు పేదరికమే ఊపిరిగా బతికాడన్న సంగతి ఓ పట్టానా జీర్ణం చేసుకోలేం. ఈ నాటకం బొబ్బన్ ఖాన్ జీవితానికి ప్రతిరూపం. తమ వ్యక్తిగత జీవితాన్ని ఓ నాటకంగా మార్చి నటించిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్ళలో బబ్బన్ ఖాన్ ఒకడు. ఎంతో ఎత్తుకు ఎదిగినా కూడా అతి సామాన్యంగా తన జీవితాన్ని గడిపిన వాడు బబ్బన్ ఖాన్. నాటకం రాకముందు, రాసిన తర్వాత, బబ్బన్ ఖాన్ అతి సాధారణ జీవితాన్ని గడిపాడు.

ఈ నాటకం బబ్బన్ ఖాన్ జీవితానికి ప్రతిరూపం. చార్లీ చాప్లిన్ " విషాదంలో నుంచి హాస్యం" మార్కు హాస్యాన్ని అందించిన ఈ నాటకం ప్రపంచంలోని ప్రముఖ దేశాలన్నింటిలోనూ ప్రదర్శింపబడింది. దరిమిలా 27 భాషల్లోకి అనువాదింపబడింది. దానికోసం మొత్తంగా కంప్యుటరైజ్ చేయబడిన మొదటి నాటకం ఇదే. ఘోరంగా విఫలమైన దశ నుంచి కొంతమందే పైకి రాగలుగుతారు. అలా పైకి వచ్చిన జీవితాలన్నీ ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి. బబ్బన్ ఖాన్ జీవితం ఇందుకు మినహాయింపు కాదు.


పేదరికం వల్ల తల్లిని తప్ప అందరిని పోగొట్టుకున్న బబ్బన్ ఖాన్ ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోలేదు. ఆత్మీయులు దూరమైనా అందరిని నవ్విస్తూనే జీవితాన్ని గడిపాడు. ఒకరోజు హఠాత్తుగా తట్టిన ఐడియా, బబ్బన్ ఖాన్ జీవితంతో పాటు, ప్రపంచ నాటక రంగాన్ని కూడా ప్రభావితం చేసింది. ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ మీద ఇది ఒక గొప్ప సెటైర్.

1965 లో రవీంద్రభారతిలో మొదట ప్రదర్శింపబడిన ఈ నాటకంలోని ముఖ్య అంశాలు: నాటి సమాజానికి సంబంధించిన ఆ పరిస్థితులే కొనసాగడంతో నాటకం సజీవంగా నిలిచిపోయింది. అల్లం వేర్లలా ఎటుపడితే అటు పెరిగే కుటుంబమే ఈ నాటకం సెంట్రల్ పాయింట్. ఒక బీద గుమాస్తా, భార్య, నలుగురు పిల్లలు, ఇతర పాత్రలతో ఈ నాటకం రెండు గంటల పాటు నడుస్తుంది. ఆది నుంచి అంతం దాకా మొత్తం వ్యంగ్య బాణాలే ఉంటాయి. ప్రేక్షకులకు నవ్వి నవ్వి కంట్లో నీళ్లు వస్తాయి. ఈ నాటకం సెట్ వేయడానికి అరగంట, తీయడానికి పావుగంట పడుతుంది. ఈ నాటకంలో ఆయన భార్య గా నిజజీవితంలో ఆయన భార్య శైల ఖాన్ నటించింది. మొదట్లో వారి పిల్లలు నాటకంలో కూడా పిల్లలు.

ఈ నాటకం వెనుక ఉన్న జీవితం నాటకం అద్భుత విజయానికి వెనుకున్న కృషి పట్టుదల అందరికీ స్ఫూర్తిని ఇస్తాయి. ఏకబిగిన రెండున్నర గంటలసేపు రాశాడు కానీ, ఈ నాటకాన్ని ఎలా ప్రదర్శించాలో అతనికి తెలియదు. రంగస్థలం అనుభవం బొత్తిగా లేదు. ఒకవేళ ఉన్నా చేతిలో చిల్లిగవలేదు. అయితే మొదటిసారి సెప్టెంబర్ 22, 1965 లో రవీంద్రభారతిలో మొదటి ప్రదర్శన ఇచ్చాడు. ఘోరంగా విఫలమైంది. మళ్లీ రెండోసారి కూడా నాటకాన్ని వేస్తానంటే, అతని మిత్రులు వారించారు.

అయినా సరే మరోసారి వేద్దాం అనుకున్నాడు. రెండోసారి వేయటానికి తల్లి తన మంగళసూత్రాన్ని ఇచ్చింది. అది కొంచెం విజయవంతమైంది. మిగతాది చరిత్ర. దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి ఎంతోమంది నటులు, ఇందిరాగాంధీ లాంటి దేశ నాయకులు ఈ నాటకాన్ని చూసి మనసారా నవ్వుకున్నారు. క్వీన్ ఎలిజిబెత్, ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా లాంటివారు ఈ నాటకాన్ని ఎంజాయ్ చేశారు.

వన్ మెన్ షో నాటకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిన ఈ నాటకం, లండన్ లోని ఒక ప్రముఖ థియేటర్లో కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చి షేక్స్పియర్ నాటకాలతో పోటీ పడింది. ఈ నాటకంలో లాగానే విషాదం ఏంటంటే, ఇది మన దేశంలో చాలా తక్కువ సార్లు ప్రదర్శింపబడింది.

పేదరికానికి కుటుంబం మొత్తం బలైపోయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న బబ్బన్ ఖాన్ మాటల్లోనే చెప్పాలంటే " నాటకం విజయవంతం అవుతుందని నాకు తెలుసు. అయితే ఎలా అన్నది మాత్రం తెలియలేదు. అయితే నేను మాత్రం పట్టుదలతో ప్రయత్నించాను. ఈ నాటకం ప్రదర్శించిన ప్రతిసారి నాకు నా గత జీవితం గుర్తుకొస్తుంది. నేను ఈ నాటకం వేయడం లేదు. కేవలం బతుకుతున్నాను" జీవితంలో విషాదాన్ని హాస్యాన్ని కలిపి అందించిన " విజయం వెనక కూడా విషాదమూ, హాస్యమూ ఉన్నాయి. వాటన్నిటికన్నా జీవితంలో కష్టాలు ఎదురైనా కూడా నవ్వుతూనే ఉండాలని గొప్ప సూత్రమూ ఉంది"

ఎవరైనా సరే ఈ నాటకాన్ని ఒక్కసారైనా చూడడం మనం బబ్బన్ ఖాన్ కి ఇచ్చే నివాళి!

కోసమెరుపు:

హైదరాబాదులో మొదటి ప్రదర్శన ఇచ్చిన బబ్బన్ ఖాన్, తన నాటకం చివరి ప్రదర్శన (11.2.2001) కూడా హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఇవ్వడం విశేషం.

Read More
Next Story