రవీంద్రుని ‘శ్యామ’ ‘ఆనంద సుధ’ పారే సెలయేరు...
x
శ్యామ బెంగాలీ కవితా సంపుటి కవర్ పేజీ

రవీంద్రుని ‘శ్యామ’ ‘ఆనంద సుధ’ పారే సెలయేరు...

విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర ‘శ్యామ’ తెలుగు అనువాదం సమీక్ష


‘శ్యామ’ అనే తెలుగు కవితా సంపుటి చదివాను. ఇది విశ్వకవి రవీంద్రుని కవితా ఖండికలకు తెలుగు అనువాదము. అనువాదకులైన కందిమళ్ళ శివ ప్రసాద్ గారు తేట తేట తెలుగులో తీయని అనువాదాన్ని అందించారు. అందుకు వారెంతైనా అభినందనీయులు.

రవీంద్రున్ని పూర్తిగా ఆవాహన చేసుకొని ఎంతో సాంద్రంగా అనువదించిన కవితా సంపుటి శ్యామ. ఇది స్వతంత్ర రచనలా సాగింది తప్ప ఎక్కడా కృతకత్వం లేదు. అదీ ఈ సంపుటిలోని ప్రత్యేకత. చదవడం ఆరంభిస్తే ఈ సంపుటి ఒక కృష్ణ బిళంలా మెల మెల్లగా తనలోకి లాగుకుపోతుంది. ప్రేమ, భక్తి, బాల్యము, జీవితం, ప్రకృతి, మతం, అమ్మ, ఏకాంతం, జ్ఞాపకాలు, విశాల విశ్వం, సుదాసు, కబీరు, రామదాసు, తధాగతుడు, బిచ్చగాడి కూతురు, విశ్వాత్మ మొదలైన అంశాలపై రవీంద్రుని దివ్య దర్శనం, తాత్వికత జమిలిగా కలగలిసి మన మనసులను లేపి ఆనంద సుధ అందిస్తాయి.

ఈ సంపుటి లోని 86 కవితా ఖండికలలో మూడొంతులు ప్రేమతత్వానికి సంబంధించినవే. ప్రేమ ఎంత ఆనందమయమో అంతే దుఃఖదాయిని కూడా. ఇలా ప్రేమలోని వైరుధ్యాలను విభిన్న వర్ణాలలో, విభిన్న వర్ణనలలో రవీంద్రుని హృదయం చేసిన పలవరింతలే ఈ కవితలు. “శ్యామ” అనే కవితా ఖండికలో ఈ ప్రేమతత్వం పరాకాష్టకి చేరుకుంటుంది. రసమయ హృదయం లోనుంచే రసోల్లాస ప్రేమతత్వం ఉద్భవిస్తుంది! అందుకు ఒక మంచి ఉదాహరణ ఈ “శ్యామ”. ఈ సంపుటి లోని పరిహారం అనే కవితలో ఒక చోట అంటాడు రవీంద్రుడు, “ఒక మహా కావ్యం రాయాలని కలలు గన్నాను ఒక నాడు/నీ చేతి గాజుల తాకిడితో వేయి పద్యాలుగా చిట్లింది నా కావ్యం/ శకలాలుగా నీ పాదాల చెంత వాలింది!” ఇంకొక ఖండికలో “తడి జల్లులు పడుతున్న సంజె వేళ/వడి వడిగా నా చెంతకు నడిచి రా ప్రియా! వచ్చి నా గదిలో చిన్న దీపం వెలిగించు/ఒంటరి నా బతుకులో వెలుగులను పంచు.” అని విన్నవిస్తాడు. ఒక దుఃఖపు పొర నిండిన గొంతుతో విశ్వాత్మను నిలదీస్తూ వేరొక చోట ఎలా పలుకుతున్నాడో చూడండి, “పూల దారులపై నీ పాద ముద్రలు పరిచినట్లుగా కనిపిస్తాయి/మునిమాపు వేళ కల్లా కనిపించకుండా మాయ మవుతాయి/నిరంతరంగా సాగే నీ కేళీ విలాసం నిలిచిపోతుందెందుకు తటాలున!”.

అణువణువున, కణం కణంన మనో దేహాల నిండా పవిత్ర ప్రేమ ప్రవహించే ప్రేమికుని స్వరం ఎలా ఉంటుందన్న దానికి జవాబుగా “నీవొక మబ్బుల గుంపువి” అనే రవీంద్రుని కవితా ఖండికను ఉదాహరణగా చూపించవచ్చు. “సాంధ్య వేళలో సాగే మబ్బుల గుంపువి నీవు/మధురమైన నా ఆలోచనల ప్రతిరూపానివి నీవు/బ్రతుకంతా నీ సామీప్యం కోసం తపించాను/ఆకాశం నిండా నీవే ఉండాలని కోరాను/సదా నీవు నాకే సొంతమవ్వాలనుకున్నాను/ నా హృదయం నుంచి స్రవించే రుధిరం/నీ పాదాలకు పారాణిగా మారుతుంది/నా కలల నిండా నీవే ఉన్నావు ప్రియతమా! విషంతో, మధువుతో కలగా పులగంగా/నీ పెదవుల మీద అందంగా రంగులు పూసాను/సంతాపాలను, సంతోషాలను రంగరించాను/నా ప్రాణమైన ప్రాణానివిగా, నా ఏలికగా/ఒంటరిగా నా జీవితాన్ని నడిపించు/నా ప్రేమ మోహిత తలపులతో/నీ కళ్ళకు కాటుక పూస్తాను/నా సమ్మోహన గీతంతో/నీ దేహాన్నంతా ఆప్యాయంగా తడుముతాను/మౌనంగా నా మొగసాల నిలిచిపోరాదా!నీవు నా దానవు, నీవు నా దానవు/బ్రతుకులో, చావులో సైతం/నాకు తోడుగా ఉండవా మరి!”

ఇక ప్రేమ ఎలా దుఃఖ దాయిని అవుతుందో రవీంద్రుని కలం నిక్కచ్చిగా చెబుతున్నది ఇలా... “ప్రేమలో పడితే సంతోషం కరువైపోతుంది/మరి ఆ ప్రేమకు ఫలితం ఏమౌతుంది? నీ ఒకరికి హృదయాన్ని అందిస్తావు/అటునుంచి అనురాగాన్ని ఆశిస్తావు/ఇది ఎంతటి తీరని కోరిక అవుతుందో తెలుసా/ప్రేమలో పడితే ఒక జ్వాల నీలో రగులుతుంది/ఎడారిలో ఎదురైయ్యే ఎండమావిలా/నిన్ను కవ్విస్తూ ఒక భ్రమలా మిగులుతుంది/దారి తప్పి దప్పికతో అలమటిస్తావు/మరొకరితో పనిలేకుండా జీవిస్తే ఆ బ్రతుకు ఇక దేనిని ఆశిస్తుంది?/ఈ లోకం నిండా అందం తాండవిస్తుంది/రంగులతో పాటలతో మురిపిస్తుంది/ప్రేమ రాకాసి మింగేస్తుంది/ఈ యవ్వనం, నీ సర్వస్వాన్ని దోచేస్తుంది/ ఈ లోకంలో ఇక నీకేది మిగలనివ్వడు/ఈ పొగమంచు లో ఎందుకు మునిగిపోతావు?” ప్రేమ పాశం, తదనంతర పర్యవసానం ఎలా వుంటుందో తన జీవిత అనుభవసారాన్నంతా రంగరించి చెప్పాడా అనిపిస్తుంది రవీంద్రుని ఈ క్రింది కవితను వింటే – “వేయి భాహువులను తెరచి ఎదురు చూస్తుంది/హాయిగా తన పరిష్వంగములో బందీ చేయాలని/ ప్రేమ అనే బంధం రా రమ్మని పిలుస్తుంది/ఎవరు ఈ చెరలో ఖైదీలవుతారో/ ఎప్పుడు,ఎక్కడ ఈ వలలో పడతారో/తెలియకుండానే కథ అంతా ముగుస్తుంది/అంతగా మిడిసి పడకు/నీకూ తప్పదు/ఏదో ఒక రోజు ఈ అనుభవం తారస పడుతుంది/ఈ సంతోష జగతిలో సరదా గా బ్రతకాలని నీవు కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు/అయితే ఒక రోజు మరొకరికి నిన్ను నీవే సమర్పించు కోవడం నిజంగా జరుగుతుంది/ఆనాడు నీలో సంతోషం ఆవిరైపోతుంది/వేదన మాత్రమే నీకు తప్పక మిగులుతుంది/ప్రేమ పిలుపు వినినంత మాత్రమే, నీవు సర్వం మరిచి ఆ దారిన వెల్లిపోతావు/శాశ్వతంగా బందీవై నిలిచి పోతావు.” ఇలా ప్రతి కవితా ఈ సంపుటిలో ఒక అత్యున్నత వ్యక్తీ కరణమే.

ఇక ఈ ఉత్కృష్టమైన కవితా సంపుటిలో మంజుల గానం, ఆశల విహాయసం, పూల తావి, కనుదోయి, వినిర్మల, గళ సీమ, జీవన కాసారం, మునిమాపు వేళ, మధురిమ, బ్రతుకు కేదారం, రాయంచ, నల్లంచిపిట్ట, విరిమాలలు, వాసంతపు హేల, ప్రేమ సమీరాలు, కదంబ ఛాయలు, యమునా సైకతాలు, మాళవికలు, వసంత యామిని, మనో జలధి, షివాళి పూలు, మౌనపు వరద, హరిత వర్ణపు హంగు, ప్రత్యూష గీతాలు, మంచు సోనలు, భుజ సీమ, కుర్వక కుసుమాలు, ఆశల మూటలు, ఏటి సోయగాలు, గానపు వెల్లువ, కాంచన మయ రవి కిరణాలు, సురభిల సుమాలు, వ్యాసాల జడి, రచనల సౌరు, అక్షరాల కీకారణ్యం, వలపు సుగంధాలు, ఆకాశపు బునుగు రంగు, వసంత రాతిరి, మధుర భాండం, తీపినగవు, అక్షర కన్య లాంటి అందమైన, మధురమైన పదాలు తారసిల్లి ఆయా సందర్భాలలో ఆయా భావనలను మరింత సౌందర్య వంతం చేయడమే గాక, పఠితమనసుపై మల్లెల పరిమళము లాంటి ఒక మత్తైన అనుభూతిని కలిగిస్తాయి.రవీంద్రుని లాంటి విశ్వకవి కవితా ఖండికలకి కందిమళ్ళ శివ ప్రసాద్ లాంటి సమర్ధుడైన అనువాదకుని చేతులమీదుగా తెలుగు నేల పై విరిసిన ఈ “శ్యామ” కవితా పుష్పాన్ని దాని సోయగాన్ని ఆఘ్రానించడం, ఆస్వాదించడం దానికదే ఒక మధుర భావన అవుతుంది. ఇక ఆలస్యమేల, ప్రతులకు జయ చాముండేశ్వరి పబ్లికేషన్స్, గుంటూరు సంప్రదించండి.




Read More
Next Story