
ఎప్పటిలా ఆమె మాయం అయిపోయింది!
గీతాంజలి కవిత: ఇల్లోక రాజ్యాంగం -4
అవును!
నిశబ్దంగా ప్రతీ గడియా,
ప్రతీ రోజూ
ఆమె మాయం అవుతూ ఉంటుంది.
ఆమె అమ్మమ్మ,అమ్మ,
కోడలు,కూతురు ఎవరైనా కావచ్చు!
రోజూ కనిపించకుండా పోవడం ఆమెకొచ్చు అంతే!
**
ఆమె రోజూ కొంచెం కొంచెం
మాయమవుతున్న సంగతి కూడా ఎవరికీ తెలియదు !
ఆమెకు తెలుస్తూ ఉంటుంది!
‘మాయం అవకుండా ఏం చేయాల’
అని తండ్లాడుతూ ఉంటుంది!
**
ఆమెని వింటారు,కానీ పట్టించుకోరు!
ఆమెకేదో చెప్పీ చెప్పినట్లు చేస్తారు.
కానీ విడిగానే పెడతారు!
ఆమె మాట్లాడుతుంది,వాళ్ళు విననట్లు నటిస్తారు!
కనీసం మాట్లాడేటప్పుడు కూడా ఆమె మొఖంలో కి చూడరు !
గోడల్లోకో,పుస్తకాల్లోకో
టీవీ, ఫోనుల్లోకి చూస్తూ ఆమెకి స్పందిస్తూ ఉంటారు!
ఆమె కూడా ఒక వస్తువు వాళ్ళకి
బహుశా రోబోట్ కూడా కావచ్చు!
**
యుగాలుగా అతనివైపు నడుస్తూనే ఉంటుంది.
అయినా ఆమె అతనికి చేరదు!
లోకమంతటినీ కౌగలించుకునే అతను ఆమెతో కలవడు!
ఆమెను కలుపుకోడు!
**
ఇదంతా సన్నగా పారే పిల్ల కాలువలా మొదలవుతుంది!
ఆమెని గుర్తించే
కళ్ళని కోల్పోయిన గుడ్డివాళ్ళని
ఆమె ప్రేమిస్తూనే,చాకిరీ చేస్తూనే ఉంటుంది!
కాకపోతే వాళ్ళ నుంచి కోరుకోవడం మానేస్తుంది!
**
ఆమెతో ఎవరూ మాట్లాడరు
ఉష్,ఊరుకో అనడమో
చిరాగ్గా మొఖం తిప్పుకోవడమో,
కనుబొమలు ఎగరేసి
వంటింటి వైపు పొమ్మనడమో చేస్తుంటారు!
**
ఇక ఆమె మెల్లిగా మాట్లాడడం మానేస్తుంది!
ఆమెకి అన్నీ అర్థం అయిపోతూనే ఉంటాయి
అర్థం కానట్లే ఆమె నటిస్తూ ఉంటుంది!
మళ్ళీ మళ్ళీ వాళ్ళల్లో కలిసిపోవాలని,
వాళ్లను కలుపుకోవాలని
వ్యర్థంగా ఆశ పడుతూ ఉంటుంది!
చెదిరిపోతూ మళ్ళీ కుదురుకుంటూ ఉంటుంది.
ఇంట్లో,వొంట్లో
కనిపించీ కనిపించని వాటిని సర్దుకుంటూ ఉంటుంది!
**
కొన్నిసార్లు ఆశ చావని ఆమె,
వెన్నెల రాత్రుళ్లలో అతన్ని పట్టుకుని
ఏమో చెప్పాలనుకుంటుంది!
ఓహ్!ఎక్కువ ఆలోచించకు!
నీవన్నీ అనుమానాలే ఇహ పడుకో !
అంటాడు విసుగ్గా!
ఆమె అప్పుడు చీకట్లో చీకటిలా ముడుచుకు పోతుంది.
పెదాలకి మరింత మౌనాన్ని నేర్పిస్తుంది
బహుశా అతను ఆమె పెదవులకి వేసిన కుట్లకి
తానూ కొన్ని కుట్టుకుంటుంది!
**
తాను చెప్పాలనుకున్నది ఏంటి?
తానూ ఒక మనిషినేనని కదా?
ఆశ చావని ఆమె అరచేతుల్లో
తన గుండెను పట్టుకుని
అతని ముందు నిలబడి
దీనంగా అతనికి చూపిస్తుంది!
అదేంటో చెప్పమంటుంది!
కానీ భర్త ఆమె రొమ్ములని,
గర్భసంచిని,యోనిని మాత్రమే గుర్తుపడతాడు!
పిల్లలు ఆమె చేతులని,కాళ్ళని గుర్తు పడతారు!
**
ఆమె విలువ వంటింట్లోకి
వంటల్లోకి,
పడక గదిలోకి, శృంగారంలోకి
కుదించబడుతుంది!
ఆమె ఒక కంచంగానో,మంచంగానో
మారిపోతుంది
వస్తువైపోతుంది!
**
ఇక ఆమెకి అలసట మిగులుతుంది!
ఆమె తనేంటో కూడా తాను మరిచి పోతుంది.
అద్దం ఆమెకి వేరెవరినో చూపిస్తుంది!
ఆమె అస్తిత్వం ఇంట్లో వాళ్ళ కళ్ళల్లో,
చూపుల్లో బంతాట ఆడుకుంటుంది!
తననితాను ఇల్లంతా వెతుక్కుంటుంది.
ఎంతకీ తనకి తాను దొరకదు!
**
ఆశ చావని ఆమె భర్త హృదయంలో తడిమి తడిమి చూస్తుంది!
ఉహూ అక్కడా దొరకదు!
రోజూ సేవలు చేసే అత్తమామల్లో ,
పిల్లల్లో దేవులాడుతుంది!
అయినా ఆమె ఆచూకి ఆమెకి దొరకదు!
తనను తాను కోల్పోయిన ఆమె ఇక అలసిపోతుంది!
**
చివరికి ఆమె కళ్ళు కూడా ఆమెని ఆమెకి చూపించవు!
తనను తాను వెతుక్కుంటున్న ఆమెకి
ఎక్కడ చూసినా భర్తా,పిల్లలు,అత్తమామలేకనిస్తుంటారు!
**
ఆమె గాభరా చూస్తూ
భర్త నువ్వు కనిపించక పోవడం ఏంటి?
నువ్వు వంటింటివి!
నువ్వు పడక గదివి!
నువ్వు భార్యవి,నువ్వు అమ్మవి
అంటూ వికటాట్ట హాసం చేస్తాడు.
ఇంట్లో ఏదో ఒక మూల ఉంటావులే ఫో అంటాడు!
ఆమె భయంతో నిలువెల్లా వణికిపోతుంది!
దడ దడ లాడే గుండెతో,
కంపించిపోయే పాదాలతో
ఆమె ఇల్లంతా వెతుక్కుంటుంది.
కనీసం తన దేహంలో
ఏదో ఒక భాగమన్నా కనిపించక పోదా అని!
కానీ తనని మొత్తంగా వాళ్ళు తీసేసుకున్నారని
ఆమెకెప్పుడో తెలిసి పోయింది!
లేదు, లేదు నేను మనిషిని కదా,
నాది ఫలానా పేరు కదా అని
ఆమె వాళ్ళ మీద కళ్ళెర్ర చేస్తుంది!
**
చాలా సార్లు తన వైపు అభావంగా,
వస్తువుని చూసినట్లు చూసే వాళ్ళని చూస్తూ
ఆమె కన్నీరు మున్నీరైపోతుంది!
తను కనిపించకపోతే,ఆమెనే వచ్చేస్తుందిలే
అని కనీసం వెతుక్కోని వాళ్ళని చూసి
ఆమె కలవరపడిపోతుంది!
**
అమ్మ నాన్నలు కూడా నువ్వెప్పుడో పరాయిదానివైపోయావు
నువ్వు అక్కడి మనిషివి ఫో అంటారు!
అన్న మొఖం తిప్పేసుకుంటాడు!
పుట్టిల్లు రావద్దు రావద్దంటూ
మొఖం మీదే భళ్ళుమని తలుపేసుకుంది!
**
బాల్య స్నేహితురాలిని అడుగుతుంది!
చూడు వీళ్లెవ్వరూ నన్ను గుర్తే పట్టట్లేదు.
నువ్వైనా రా! చూడూ! బాల్యపు ఆటలాడుకుందాం!
పాటలు పాడుకుందాం!
ఊర్లో అందరినీ పేరు పేరునా పలకరిద్దాం అంటుంది
బోలెడంత ఆశని కళ్ళంతా నింపుకుని!
నువ్వెవరు?
నేను కూడా నన్ను నేను మరిచిపోయా!
ఊరికి రా! ఇద్దరం కలిసి
ఒకరి నొకరం వెతుక్కుందాం అంది ఆ స్నేహితురాలు కాస్తా!
అప్పటికే ఆ స్నేహితురాలి మొఖం కాస్త మారిపోయి ఉంది.
ఆమె హతాసైంది!
ఆమెలో చివరి ఆశ ఎండిపోయింది!
**
ఆమె ఒక మనిషిగా కాదు
ఇంటి పనిగా మారిపోతుంది!
ఇల్లు ఆమెని పనుల్లోకి కుదిస్తుంది!
అమ్మ,కోడలు,భార్య పాత్రల్లో కి ఆమెనో నమూనా మార్క్ గా
ఇంటి పనులకి
బ్రాండ్ అంబాసిడర్ గా మార్చి పడేసి మురిసిపోతుంది!
**
ఇక ఆమె ఇంట్లో ఉంటుంది కానీ
ఆమెను వాళ్ళు కలుపుకోలేని తనంలో విరిగిపోతూ ,
అతుక్కోబోతూ,నుజ్జు నుజ్జైపోతూ ఉంటుంది!
**
ఇంటి రంగస్థలంలో నాటకం పాతబడుతూ ఉంటుంది!
ఆమెకి తనకి తాను లోపలా,బయటా
మరింత ఖాళీ అయిపోతున్నట్లు తెలుస్తూ ఉంటుంది .
వంటింటి కత్తి ఆమెను
రోజూ కొంచెం,కొంచెం తరుగుతూ ఉంటుంది!
ఆమెను గాయపెడుతూ ఉంటుంది!
ఆమె మనసు ఏ శబ్దమూ చేయదు!
శబ్దం చేసినా వాళ్ళకి వినపడదు!
ఎందుకంటే వాళ్లెప్పుడూ ఆమెను వినరు.
ఆమె వైపు చూడరు!
ఆమె అలా అలా
ఇంటి మూలల్లోకి ఒరిగిపోతూ,
జరిగిపోతూ, తప్పుకుంటూ ఉంటుంది!
తగ్గిపోతూ ఉంటుంది!
చిన్నదైపోతూ ఉంటుంది!
**
ఆమె బతికుండీ,ఇంట్లో ఉండీ
ఎవరికీ కనపడకుండా పోయింది!
ఆమె అలా మెల్ల మెల్లగా
కరిగిపోతూ
అదృశ్యమవుతూ ఉంటుంది!
తనని తాను వెతుక్కొంటూ
-ఆమె అలసి సొలసి స్పృహ కోల్పోతూ ఉంటుంది!
~~
కడాకి ఒక రోజు,
ఆమె భూన బోంతరాళ్ళు పుట్టినప్పటి నుంచే
అమ్మా అమ్మమ్మల్లా తానూ మహా,
మహా వొంటరినని కనుక్కొని గుండె పగిలి
హఠాత్తుగా మాయం అయిపోతుంది!
ఆఖరికి ఇంటి గోడ మీద చిత్రపటమై పోయింది!
**
అప్పుడు కూడా ఆమె భార్యనే,అమ్మనే,కోడలే!
ఒంటరే!
మనిషి మాత్రం కాదు!
చివరాఖరికి స్మశానంలో
ఆమె సమాధి మీద మాత్రమే ఆమె పేరు చెక్కబడింది!
అదీ ఫలానా వాడి భార్యగా మాత్రమే!
Next Story

