ఇల్లు లేని నాన్న!
x

ఇల్లు లేని నాన్న!

గీతాంజలి కవిత: ఇల్లొక రాజ్యాంగం -3


వెలుతురు విచ్చుకోక ముందే

నిదుర లేచిన గువ్వ పిట్ట

పిల్లల తిండి కోసం ఎగిరిపోయినట్టు

నాన్న నిశ్శబ్దంగా ఇల్లు వదులుతాడు.

తన కడుపులోకి అన్నం ముద్ద కూడా పంపడు.

అడుగుల చప్పుడు కూడా చేయడు!

నాన్న వెళ్ళిపోవడాన్ని

ఇల్లూ, అమ్మా మౌనంగా చూస్తుండి పోతారు!

నాన్నలాగే

పనిలోకి వెళ్లబోయే కొట్టంలో

ఆవు అంబా అంటూ వీడ్కోలు పలుకుతుంది!

***

పనిలోకి వెళ్లేటప్పుడు

దారిలో కిరాణా కొట్టు

నాన్నకి

ఇంట్లో ఖాళీ అయిన బియ్యం బస్తాని గుర్తు చేస్తుంది!

అంతే

వెంటనే నాన్న వంటింటి మూలలో

బియ్యం బస్తా అయిపోతాడు!

కాక పోతే ఆరుగంటలు ఎక్కువ పనిచేస్తాడు!

చేసిన అప్పు గుండెకి కొడవలై వేలాడుతూ ఉంటుంది !

వసారాలోని వాలు కుర్చీలో

హాయిగా కూర్చోవాలనుకుంటాడు.

పెరట్లో నులక మంచం మీద సేద తీరాలనుకుంటాడు. రెండూ దొరకవు!

ఇల్లు నాన్నకి వాకిలి తలుపులు చూపిస్తూ

చేయాల్సిన పనిని గుర్తు చేస్తుంటుంది!

నాన్న ఎప్పుడూ ఇంటి నుంచి

వీధిలోకి వెళ్లగొట్టబడుతూ ఉంటాడు!

నాన్నకి ఎంతకీ దొరకనిది తన ఇల్లే !

***

వచ్చేటప్పుడో , పోయేటప్పుడో

పుస్తకాల దుకాణంలో పిల్లాడికి కొనాల్సిన

కొత్త పుస్తకాలు నాన్నని ఆపేస్తాయి.

కానీ నాన్న సైకిల్

సెకండ్ హ్యాండ్ పుస్తకాల వీధిలోకి

బాధగా మళ్ళుతూ నీరసంగా బెల్ కొడుతుంది!

***

ఋతువులు కూడా

నాన్నని వెక్కిరిస్తూ ఉంటాయి!

వేసవి మామిడి పండ్లని,

చలి కాలపు మొక్కజొన్నలని, రేగుపళ్ల బుట్టనీ,

వర్షాకాలపు మిరపకాయ బజ్జీల బండిని,

లేత మాంసం అమ్మే రవూఫ్ కొట్టుని,

నవ నవలాడే కూరగాయల మండీని

నాన్న చూసీ చూడనట్లు వెళ్ళిపోతాడు!

అంతేనా! బొమ్మల దుకాణాన్ని,

రెపరెపలాడే సిలుకుబట్టల షాపుని,

నోరూరించే మిఠాయి కొట్టునీ,

నాన్న ఖంగారుగా

తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు!

***

నాన్న ఇంటికి ఖాళీగా వచ్చాడనుకుంటారు పిల్లలు!

కొనలేని పళ్ళు మిఠాయిలు, బొమ్మలు పుస్తకాలు

నాన్న గుండెల్లో ఎప్పటికైనా

కొనాల్సిన జాబితాలో ఉన్నాయని వాళ్ళకేం తెలుసు?

కట్టాల్సిన పిల్లల ఫీజు,

ఇంటి అద్దెకి, చెమటతో చొక్కా చర్మంలోకి

ఇంకేంత వరకూ పని చేసే నాన్నకే ఎరుక!

మొఖం చెల్లని నాన్నందుకే ఇంట్లో ఉండడు!

ఇల్లు కూడా నాన్ననేమీ ఉంచుకోదు!

నాన్నకి అందుకే ఇల్లు లేదు!

***

నమ్మిన భూమి,ఊరు

అందని పంటతో,

తనని పక్కూరిలో రైతు కూలీగా,

పట్నంలో కార్మికుడిగా

మార్చిన నమ్మకద్రోహం

నాన్నని నిద్రపోనివ్వదు!

***

అప్పులతో వడ్డీలతో

నాన్న ఒక లెక్కల పుస్తకం అయిపోతాడు!

ఇల్లు తరిమితే

పొలం వైపు వెళ్లే నాన్న ఎంతకీ తిరిగిరాడు!

పొలం పక్కనే ఉన్న

పాడుబడ్డ అనాథ ఇల్లు

నాన్నని నిద్ర పుచ్చుతుంది.

~

ఇంటిపనులతో అమ్మని బంధించిన ఇల్లు

నాన్నకీ సంకెళ్ళు వేస్తుంది.

ఎప్పుడైనా ఓదారుస్తుంది.

కానీ బాధ్యతల ముళ్ళతో గుచ్చుతుంది.

నాన్న కట్టిన ఇల్లే నాన్నని

తరచూ వీధిలోకి వెళ్లగొడుతూ ఉంటుంది!

నాన్నని తలదాచుకో నివ్వదు.

అరగంట పడుకోనివ్వదు!

ఇల్లంటే ,నాన్నకి నిద్రని దూరం చేసేది!

ఇల్లు దయలేనిది!

ఇల్లు నొప్పినిచ్చేది!

ఇల్లు నాన్నని నీడే లేని అనాధని చేస్తుంది.

అందుకే నాన్నకి ఇల్లు లేదు!

Read More
Next Story